కవిత్వం

స్వప్న దారీ జీవితమే జీవనం… వనం…

ఆగస్ట్ 2014

నిజంగానే
స్వప్నాలు లేని ప్రయాణాలు ఉండనే ఉండవు

జీవితాన్ని
స్వప్న దూరాలలో మాత్రమే
కొలవడం సాధ్యమని తెలిశాక కూడా
స్వప్నాలు లేకుండా ఎలా ఉంటాయి?

మనిషి త్రోవలని ఎన్నిసార్లు తడిమినా
మిణుకు మిణుకు మిణుగురుల్లా
స్వప్నాలు ఆశగా కనిపిస్తూనే ఉంటాయి

ఒక్కోసారి
కొన్ని స్వప్నాలు కిందనపడి రాలిపోవచ్చును
మరికొన్ని అమాంతంగా పగిలి ముక్కలైపోవచ్చును
చేతికంతనంత దూరాలకు చెల్లాచెదురైపోవచ్చును
అంత మాత్రం చేత కొత్తవి మొలకెత్తడం మానేయకూడదు.

స్వప్నాల సేధ్యం లో ప్రతినిత్యం
మనిషి
ఆరితేరి పోవాలి
మైమరచి పోవాలి

మొక్క మొక్కకూ ప్రయాణిస్తూ
నీరు పోసినట్టూ, ఎరువు వేసినట్టూ
చీడపీడలని పరికించి పారద్రోలినట్టూ

స్వప్న స్వప్నానికి మధ్య
మనిషి నిరంతర ప్రయాణం సాగిపోతుండాలి
ఆకుపచ్చని పత్రహరితాలు లిఖించే
కిరణజన్య సం-యోగ క్రియలలా
స్వప్నాలు మనిషిని పునరుజ్జీవింప జేస్తూనే ఉండాలి.

 

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

Painting: జావేద్