కవిత్వం

ఓ మూడు…

అక్టోబర్ 2014

1. రహస్యం

దేహాలు పెనవేసుకున్నపుడు
ఒకర్నొకరు గెలిచామని
అనుకోవడం తప్ప ఏముంది?

అంటుకట్టకుండా
తీగలు కలిస్తే ఏం లాభం

నువ్వు నాలో నేను నీలో
పూలు పూసేది ఇంకెప్పుడు?

***

ఒక్కసారైనా ఇలా కలుద్దాం.
దేహాల లోపల దాగున్న వివస్త్ర
శరీరాలను దాహం తీర్చుకోమని
ఒకరిలోకి ఒకర్ని ఒంపుకుందాం.

నగ్నమైన నీ మనసే కదూ
నన్నింతగా మోహపరిచేది?

***

మనసులు పెనవేసుకున్నపుడు
కొంత వెన్నెల పుడుతుంది
సరిగ్గా మన జీవితానికి సరిపడేంత.


2. నీ కోసం

మనసెలా ఉందని నిన్నడిగి
ఏమీ రాయలేను నేనిపుడు

నువ్వెపుడూ
ఎర్రని అక్షరాలన్నీ దాచేసి
తెల్లని కాగితాన్నే చూపిస్తావు

మనసులు చదివేంతగా
మనమెప్పుడు మాట్లాడుకున్నాం?

మన ప్రపంచాలు వేరు
మన ప్రయాణాలు ఒకటే
రెండిటిలోనూ చచ్చింది మనమే

***

మనమిప్పుడు తీరాలం
తాకి పోయే కెరటాలు ఈ ప్రేమలు

ఉప్పునీటి దేహాలు మనవి
కడగమని ఎవరిని అడగాలి?
ఈ లోకమే సంద్రమయినపుడు

అప్పుడప్పుడూ
ఒకరి ఒడిలో ఒకరు వర్షిద్దాం
ఆ క్షణం కడగబడిన ముత్యాలం మనం

***

ఇక నీతో నా గాయాన్ని
నాతో నీ గాయాన్ని
పూడ్చుకొని బ్రతకడమే మిగిలింది

ఇక రాయడం మొదలుపెడతాను
నవ్విన నీ మనసు రాల్చిన మాటలతో

నిజానికి
నిన్ను అడిగి రాస్తుంది నేనేనేమో కదూ


3. వృత్తం

నేను భూమి
వాడు సూర్యుడు

వాడి చుట్టూ తిరుగుతూ
నా చుట్టూ నేను గీసుకుంటున్న వృత్తమిది

***

బిందువులు పేర్చడం కాదు
వాటిని కలపడమే గీయడం కదా

లో లోపల వెతుకులాడుతూ
ఒక్కొక్కటిగా పోగేసుకుంటున్నాను

***

ఎర్రటి మనిషిని ఇప్పటికీ చూడనే లేదు

బానిసలు శవాలు

దేహం నుండి మనసును
ఎవరు విడిపించాలి

****

చచ్చిన మనిషికి సంతాప సందేశమే
నా ప్రయాణం

నేను ఆగిన చోట
నన్నూ వాడితో పూడ్చిపెట్టండి

కొనసాగించడం తప్ప
ఈ వృత్తం పూర్తికాదు