కవిత్వం

నువ్వు నా యోగివే!

జనవరి 2013

కలకలం…
గులకరాయి చుట్టూ తరంగం కాదు తరంగాలు..
తరంగాల్లో ఒక చలనం
చలనమే తరంగమా
చలనం ఆ తరంగానిదా… రాయిదా… ఆ రాతిని మోసుకొచ్చిన గాలిదా..
గాలిలో నిశ్శబ్దం రాయి దృశ్యం తరంగం ఒక ప్రతిబింబం
శ్వాసలోనూ గాలే గుండెలో ఎప్పుడూ గులకరాళ్ళే.. తెరలు తెరలుగా భావ తరంగాలే

ఉలికిపాటైన అనుభవాలూ..
నిశ్శబ్దాన్ని చెల్లాచెదురు చేసుకుంటూ
నిశ్శబ్దాన్నే వెతుక్కుంటూ

ఘడియఘడియనూ మరనివ్వని లోకంలో అలౌకికత్వం అనుభవించగలవా…
అయితే నువ్వు నా యోగివే నాలోని యోగత్వానివే
చెట్టాపట్టాలేసుకు తిరుగుదాం అనంతాన్ని అరచేతిలో బంతల్లే ఆడుకుంటూ!