వ్యాసాలు

ది మారినర్: హ్యుగొ హామిల్టన్

నవంబర్ 2014

డబ్లిన్ థియటర్ ఫెస్టివల్ లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ నాటక కంపెనీల నాటకాలెన్నో ప్రదర్శించబడతాయి. ఈ ఏడాది 25 సెప్టంబర్ నుండి 11 అక్టోబర్ వరకూ ఈ థియేటర్ ఫెస్టివల్ జరిగింది. అందులో భాగంగా నేను చూసిన “ది మారినర్” అనే నాటకం గురించి నా ఆలోచనలు పంచుకోవాలని ఈ వ్యాసం రాస్తున్నాను.

డబ్లిన్ – ఒక కల్చరల్ హబ్:  డబ్లిన్ నగరం నేను చూసిన తక్కిన యూరోపియన్ సిటీల్లా చూడగ్గానే అబ్బురపోయేంత అందంగా అనిపించలేదు. ఎక్కడపడితే అక్కడ ఆగిపోయి, ఫోటోలు దిగాలని అనిపించలేదు. చాలా మామూలుగా అనిపిస్తుంది, ఆ వీధుల్లో తిరుగుతుంటే! కానీ, కంటికి కనిపించే వాటిని పక్కకు పెట్టి, మనసు పెట్టి డబ్లిన్‍ను చూస్తే, మనసుకి, మేధకి నచ్చేవి, మెచ్చేవి ఎన్నో కనిపిస్తాయి. వీధుల పేర్లు, వంతెనల పేర్లు సాహిత్యానికి, నాటక రంగానికి సంబంధించిన పేర్లతో ఉంటాయి.

మన ఊర్లల్లో, పట్టణాలలో విడుదల కానున్న, అప్పుడే విడుదలైన సినిమా పోస్టర్లు గోడలకి ఎలా అంటించబడి ఉంటాయో, ఇప్పటికీ, అక్కడ విడుదల అవ్వనున్న, ప్రస్తుతం ఆడుతున్న నాటకాల పోస్టర్లు అంటించి ఉంటాయి.

ఆబే థియటర్, గెయిటీ థియటర్,  ఓ-రెయిల్లీ థియటర్, గేట్ థియేటర్లు ఈనాటివి కావు. అవి దశాబ్దాలనుండి ఐరిష్ సాంస్కృతిక జీవనానికి ప్రతీకలుగా ఉన్నాయి.

 

ది మారినర్ – నాటకం:

కథ: (ఈ నాటకంలోని కథను పూర్తిగా చెప్తున్నాను. నాటకం చూసే ఉద్దేశ్యం ఉన్నవారు, దీన్ని చదవకండి.)

మొదటి ప్రపంచ యుద్ధం నాటికి ఐర్లాండ్ బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది. ఆనాటి యువకులు “ఎంపైర్” కోసం ఆర్మీ, నేవీలలో పనిచేసేవాళ్ళు. ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరఫున పాల్గొన్నారు. అలా యుద్ధానికి వెళ్ళిన ఒకానొక నేవీ సైనికుడిని నేవీవాళ్ళే ఇంటికి తీసుకొచ్చి దిగబెడతారు. అతడికి సంబంధించిన రెండు కాగితాలను ఇచ్చి, తలకి పెద్ద గాయమైన అతడిని అతడి భార్యకు అప్పజెప్పి, వెళ్ళిపోతారు.

అతడి తల్లికి ఏమీ అర్థం కాదు. ఉన్నట్టుండి కొడుకు ఇంటికి ఎందుకు తిరిగి వచ్చేశాడో, అతడిని ఉద్యోగం నుండి ఎందుకు తీసేశారో, అతడు ఏమీ ఎందుకు మాట్లాడకపోతున్నాడో, అసలు ఈ వివరాలేవీ కనుక్కోకుండా కోడలు ఆ తీసుకొచ్చినవారిని ఎలా వెళ్ళనిచ్చిందో ఏమీ అర్థం కాదు. కోడలికి మాత్రం భర్తను మళ్ళీ కళ్ళముందు చూసుకోవటం మహాసంబరంగా ఉంటుంది. అతడి ప్రస్తుత పరిస్థితి – ఏమీ మాట్లాడకపోవడం, ఎంత అడిగినా ఏమీ చెప్పకపోవటం, మాటిమాటికీ భుజాల నుండి దేన్నో విసిరికొడుతున్నట్టు చేతులు ఆడించడం, తల్లిని, భార్యని గుర్తుపట్టకపోవటం – గురించి ఆమెకి కొంచెం దిగులుగా ఉన్నా, మనిషి తన కళ్ళముందే ఉన్నందుకు సంతోషిస్తుంటుంది.

తల్లిని మాత్రం ఈ గందరగోళమంతా తీవ్రంగా బాధపెడుతుంది. అసలు కొడుకుని ఉద్యోగంలో నుండి ఎందుకు తీసేశారో కనుక్కొని రమ్మని కోడలని ఆఫీసర్ దగ్గరకు పంపిస్తుంది. ఆమె తిరిగొచ్చి, ఇతగాడు, ఒకానొక పూట ఓడ ఏదో తీరాన్న ఉండగా, దిగి, ఊరిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగిరాలేదు, తన విధులనుండి తప్పించుకున్నాడు అన్న ఆఫీసర్ కథనాన్ని అత్తగారికి చెబుతుంది. తల్లి ఒప్పుకోదు. తన కొడుకు ఎన్నడూ అలా చేయడని, ఏదో కుట్ర వల్ల ఇదంతా జరిగిందని ఆమె నమ్మకం.

అత్తగారు ఇంట్లో లేనప్పుడు, అతడి మానసిక స్థితి ఇంకా బాగుపడకపోయినా, భార్య అతడికి శారీరికంగా దగ్గరవ్వడానికి చూస్తుంది. ఈ సంగతి అత్తగారికి తెల్సినప్పుడు, చిరాకుపడిపోతుంది. “అసలు ఇతడు నీ భర్తే అన్న నమ్మకం ఏంటి?” అని నిలదీస్తుంది. “నా భర్తను నేను గుర్తుపట్టగలను” అంటుంది భార్య. “మీ పెళ్ళైన ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే అతడు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ పదేళ్ళ తరువాత ఇప్పుడే రావడం.” అని అత్త గుర్తుచేస్తుంది. మాటల్లో పెట్టలేని బలమైన భావం ఏదో అతడు తన భర్తే అని చెప్తున్నట్టు భార్యకి అనిపిస్తుంది. ఎంత నమ్ముదామని ప్రయత్నించినా తల్లికి అతడు తన కొడుకు కాదేమోనన్న భయం వెంటాడుతూనే ఉంటుంది.

ఇంతలో, అతడు మెల్లిమెల్లిగా కోలుకున్నట్టు కనిపిస్తాడు. ముక్కలుముక్కలుగా మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంటాడు. వీళ్ళు అడుగుతున్నదానికి సంబంధం లేకుండా, అతడు చెప్పాలనుకుంటున్నవన్నీ అర్థంపర్థం లేకుండా చెప్పుకుంటూ పోతాడు. ఆ ముక్కలను పట్టుకొని, వీళ్ళు ఊహించుకున్నవి కొంచెం కలిపి, తల్లీ-భార్య ఏవేవో కథలు అల్లుకుంటారు. అసలేం జరిగిందో తెల్సుకోడానికి తంటాలు పడుతుంటారు.

ఇంతలో అత్తాకోడళ్ళ మధ్య అభిప్రాయబేధాలు పెద్దవైపోతాయి. అతడు తన భర్తే, అందులో అనుమానించాల్సిందేమీ లేదంటుంది కోడలు. “లేదూ, అతడు నా కొడుకే కాదు. నేవీవారి నౌక ఐరిష్ సముద్రంలో మునిగిపోయినప్పుడు, నా కొడుకును చంపేసి, అతడి యూనిఫాం వేసుకొని ఇతడెవడో నా ఇంటికి వచ్చాడు.” అని వాదిస్తుంది అత్త. ఆ ఊర్లో పేరొందిన రచయిత్రి, ఆమె లాయర్ తమ్ముడి సాయం తీసుకుందామంటుంది కోడలు. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకులైన వాళ్ళంటే అత్తగారికి గిట్టదు. ఆమె న్యాయంకోసం కోర్టుకెక్కుతుంది.

వాదోపవాదాలు అయ్యాక, ఇంటికొచ్చాక, కొడుకుగా ఇంటిలో ఉన్న మనిషిని నిలదీస్తుంది తల్లి, “ఎందుకు చంపావ్ నా కొడుకుని?” అంటూ?  అతడి తలకున్న కట్టుని విప్పడానికి ప్రయత్నిస్తుంది. తనకి హాని కలిగిస్తుందన్న భయంతో అతడు పక్కనే ఉన్న కుర్చీతో ఆమె తల బద్దలు కొడతాడు.

కాసేపటికి భార్య ఇంటికి వస్తుంది. ఆమెను చూడగానే, పెళ్ళైన రోజున జరిగిన సంఘటలన్నీ పూసగుచ్చినట్టు చెప్తాడు. అతడికి గతమంతా గుర్తు వచ్చిందన్న సంబరాన్ని అత్తగారికి చెబుదామని చూస్తే ఆమె శవమై ఉంటుంది.

అతడి మానసిక స్థితి బాలేదంటూ చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్తుంది కోర్టు. ఆమె ఒంటరైపోతుంది.

 

కథనం:

కథ ఇంత gruesomeగా ఉన్నప్పుడు కథనం కూడా అలానే ఉంటుందనుకున్నాను. కానీ, గమ్మత్తుగా ఇందులో బోలెడంత హాస్యాన్ని జొప్పించగలిగారు. అయితే, అది బలవంతాన పెట్టినట్టు కాకుండా, సహజంగా ఉండేట్టు చూసుకోవడంలో సఫలమయ్యారు. అత్తాకోడళ్ళ మధ్య సహజంగా ఉండే frictionను హాస్యానికి వాడుకున్నారు. ఆయా పాత్రలు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తూ, వాపోయే మోనోలాగ్స్ ఎంతగా గుండెలను పిండేస్తాయో, అలానే వాళ్ళిద్దరూ ఎదురెదురు పడి, ఈ సమస్యను చర్చించుకునేటప్పుడు అంతే లైట్‍గా ఉంటుంది.

పైగా, ఈ అత్తాకోడళ్ళు అంతగా చదువుకోని వాళ్ళు. దిగువ మధ్యతరగతికి చెందినవారు. వాళ్ళకి నేవి గురించి, దాని పనితీరుల గురించి కొంత తెల్సు. చాలా తెలీదు. ఇద్దరూ అమాయకులు. దానితో వాళ్ళ మధ్య సంభాషణలు చాలా హాస్యస్ఫోరకంగా ఉంటాయి. ముఖ్యంగా, అతడు మాట్లాడే ముక్క, ముక్కలను తీసుకొని వీళ్ళు వీళ్ళ సొంత కథలు అల్లుకునేటప్పుడు.

కథను నడపడానికి సంభాషణలను వాడుకున్నంత గొప్పగా, మోనోలాగ్స్ ని కూడా వాడుకున్నారు. అందుకనే ఇది కామెడిగా తేలిపోకుండా, ట్రాజడిగా బలంగా తాకుతుంది, చివరకి.

 

సంభాషణలు:

అసలు ఫిక్షన్ ఎందుకు చదవాలి? ఎందుకు చూడాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేలాంటి సంభాషణలు ఈ కథలో ఉన్నాయి.

ఈ కథను ఒక వార్తాకథనంలా చదువుకుంటే, ఒక సైనికుడికి యుద్ధంలో మతిపోతుంది. అతడు ఇంటికొచ్చాక, ఇంటివాళ్ళకి అతడు నిజమో, కాదో అంతుబట్టదు. ఒకానొక రోజు, మతిస్థిమితం లేని కొడుకు తల్లిని చంపేస్తాడు.

కానీ దీన్నే ఫిక్షన్‍లో చెప్పడం వల్ల మానవాళిని వేధించే కొన్ని ప్రశ్నలు దొరుకుతాయి. వాటి సమాధాలను ఫిక్షన్ చూపించదు. కానీ, సమాధానాలు ఉండాలంటే, ముందు ప్రశ్నలు ఉండాలిగా.

ఇందులో తల్లి ఓ చోట వాపోతుంది ఇలా:

“నా కొడుకు గొప్ప ఈతగాడు. ఎందుకు గాడు? నేనే దగ్గరుండి నేర్పించాను ఈదడం. ఎన్ని ఈతల పోటీలలో గెలవలేదని? కానీ, వాళ్ళు (నేవీ వాళ్ళు) “నువ్వు బాగా ఈదగలవా?” అని కాదు కదా, అడగాల్సింది. దానికి సమాధానం ఎటూ “అవున”నే!  వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు – నువ్వు చిమ్మచీకటైన సముద్రంలో, నీ చుట్టూ శవాలు తేలుతుంటే, వాటిని తప్పించుకొని ఈదగలవా?  గడ్డకట్టుకొని పోయేంతటి చల్లటి నీళ్ళల్లో, ఎంత దూరానికి తీరమనేది కనిపించకుండా ఉన్నప్పుడు కూడా ఈదగలవా? తిండితిప్పలు లేక, తాగటానికి నీరు లేక, ఒంట్లో శక్తంతా ఆవిరైపోతుంటే ఈదగలవా? ఇవి కదా, వాణ్ణి అడగాల్సిన ప్రశ్నలు.”

ఇంకో చోట రచయిత్రిని కలిసాక, భార్య అనుకుంట, అంటుంది: Nobody wants a war that returns home. ఆ ఒక్క మాటలో, సైనికులు, వారి కుటుంబాలు చూసే నరకంలాంటి జీవితాల గురించి చెప్పకనే చెప్తుంది. చరిత్రకెప్పుడూ, ఏ నాయకులు ఏ ఉపన్యాసాలు ఇచ్చారు? ఏ సంతకాలు చేశారు? ఎవరితో యుద్ధాలు చేశారు? అన్నవే కావాలి. సాహిత్యానికి మాత్రం ఆ ఉపన్యాసాలు, సంతకాలు, యుధ్ధాల వల్ల మామూలు మనుషులు ఏమైపోయారో అన్నదే కావాలి.

 

నటీనటులు:

ముగ్గురే నటీనటులు ఇందులో. తల్లిగా ఓ పెద్ద వయస్కురాలు. భార్యగా యువతి. గాయపడ్డ సైనికుడిగా ఒక యువకుడు. ముగ్గురూ బాగా చేశారు. నాకు మాత్రం భార్య పాత్ర చేసిన నటి బాగా నచ్చింది. ఆమె అమాయకత్వం, గడసరితనం రెండూ కొట్టొచ్చినట్టు చేసింది. ముఖ్యంగా, ఇంగ్లీషును ఒక తమాషా విధంగా పలికింది.

 

సంగీతం:

సంగీతం బాగా కుదిరింది. ముఖ్యంగా, అత్తాకోడళ్ళిద్దరూ ఇంకా వాదోపదాలు చేసుకుంటుండగానే, అతడికి తన గతం బలంగా గుర్తుకు రావడాన్ని సూచిస్తూ వాడిన బూట్ల చప్పుడు, డ్రమ్ముల హోరు బాగా కుదిరింది. అతడి గతాన్ని ఫ్లాష్‌బాక్ లో చూపించే వీలు లేక, కేవలం అతడి ముఖకవళికలతో చెప్పే ప్రయత్నానికి సంగీతం బాగా ఉపయోగపడింది.

 

ముగింపు:

ఈ నాటకానికి ముగింపు కొంచెం వేరుగా ఉండాల్సింది. అప్పుడే కోర్టు సీను, అప్పుడే అతడు తల్లిని చంపటం అంతా గందరగోళంగా ఉంటుంది. అనవసరమనిపిస్తుంది. నాటకం మొత్తం చాలా మామూలుగా నడుస్తూ, చివరికి మాత్రం మరీ డ్రమటిక్‍గా అయిపోతుంది.

 

మరిన్ని వివరాలు:

ఇది ప్రముఖ ఐరిష్ రచయిత, హ్యుగో హామిల్టన్ రచన. ఆయన తాతగారి జీవితం నుండి ప్రభావితమై, ఈ కథ రాసారట.

1928లో ప్రారంభించబడ్డ గేట్ థియటర్‌లో ఈ నాటకం ప్రదర్శించబడింది. దాదాపు గంటన్నర నిడివి. హోరున వాన పడుతున్నా, హాల్ అంతా నిండింది. ఫోటోలు తీయనివ్వలేదు. కనీసం, ఫోన్లు ఆన్ లో ఉంచడానికి కూడా అనుమతివ్వలేదు.

ఒక మంచి నాటకం చూసిన అనుభూతి కలిగింది ఇది చూశాక.