కవిత్వం

ఎప్పటికప్పుడు…

నవంబర్ 2014

ఎప్పటికప్పుడు కొత్త గానే ఉంటుంది
నునులేత ఆకు మెరుపు చెక్కిళ్ళలా
వడితిరుగుతూ తొంగి చూసే తడి’ నీటితెర
చటుక్కున జారిపడే వేసవి తొలి చినుకులా
కనుకొలుకుల్లో మొలవడం కొత్తగానే ఉంటుంది

ఒక్క ఇదేనా !
ఏమూలను౦డి ఏమూలకు కొలిచినా
ఏమనసు లోతుల్లో క్షీర సముద్రాలు చిలికినా
ప్రతి మాటా అప్పుడప్పుడే వికసించే చురకత్తి మొగ్గలా కొత్తగానే కదా ఉండేది.
నీది కాని ప్రతిదీ నీకు కావాలనే అనిపిస్తుంది.
ఆనందాలూ విలాసాలూ హద్దులుగా నాటుకు
నీదనుకున్న ప్రతి నేలా బంగారం పండే మాగాణీ కావాలనే అనిపిస్తుంది
ఎక్కడికక్కడ ఏ మూల తవ్వుకున్న నిధులూ నిక్షేపలూ నీకే సొ౦త’మవాలని ఉంటుంది.

నీళ్ళి౦కి పోతున్న నది ఒడ్డున
పడిగాపులు పడుతూ పచ్చని పైరు నాటుకున్నట్టు
నిశ్శబ్దాని మరిగించి మిరియాల కాషాయం లా
సంవేదన పడిశానికి మందులా
కళ్ళుమూసుకు మింగేసినా
జ్వరపడిన ప్రతిసారీ
పసిపాపై మారాం చేసే మనసు కొత్తగానే కదా.

ఎంత పాతబడిన గాయమైనా
మళ్ళీ మళ్ళీ ముళ్ళకంప తలపుల్లో
కొత్తగా రేగి రేగి
పోగొట్టుకున్న అమూల్యాలను కలల్లోనూ వెతుక్కున్నట్టు
వెక్కిళ్ళు పెడుతూనే ఉంటుంది.

చుట్ట చుట్టుకు పడుకుని
ఎన్ని వెలుగులను మింగేసిన
కొ౦డచిలువ పడమరో
మళ్ళీ తూర్పు వాకిట
కొత్త సూర్యుడిని ప్రసవి౦చినట్టు
ఎన్ని విషా’దాలో నిరంతరం అస్తమిస్తూ
ఉదయానికి ఆశలను ప్రసాదిస్తాయి

కడుపు నిండిన క్షణాలు
కనురెప్పలపై పవళించి
విశ్రమి౦చినా
మళ్ళీ ఆకలి కేకలు
అలారంలా మళ్ళీ మళ్ళీ మోగి
మస్తిష్కంలో సైరన్ లై మేల్కొలుపుతాయి

జాతరలో తప్పిపోయిన పాపాయిలా
తిరుగుతున్నప్పుడు
కొత్తమోహాలని౦డా జాలి మెత్తదనం చూపుల చివరే ఆగి లోలోతుల గాఢత
బేరీజుల తరాజుపై రాబందవు అవుతు౦ది

ఎప్పటికప్పుడు
ఈ సంశయాల బూచిని దాచేస్తూనే ఉంటాను
అమాయికపు మొహం తొడుక్కుని
ఆషాఢమేఘాన్ని అవుతూనే పోతాను