ముఖాముఖం

కవిత్వం నాకు ‘నక్స్ వామికా’ లాంటిది! -మమత

డిసెంబర్ 2014

 

 

ప్పుడెప్పుడో చదువుకుంటున్న రోజుల్లో ‘వార్త’ లో సతీష్ చందర్ అందమైన ‘ఇంట్రొ’తో ఒకే సారి రెండు మూడు పద్యాలు అచ్చేసి, అరె ఎవరీ అమ్మాయి బాగా రాస్తుందే అనిపించుకుని, ‘దిశ పబ్లికేషన్స్’ వాళ్ల కోసం సత్యజిత్ రే కథలు ఓ పదింటిని అనువదించి, ఈ అమ్మాయి ఈ పని కూడా బాగా చేస్తుందే అనిపించుకుని, ఆ తరువాత చాన్నాళ్లు ఎక్కువగా కనిపించకపోయినా, కలం సన్యాసం చెయ్యలేదని… ఈలోగా, తన వాక్కు పదును దేరిందని, తన బాధ కవిత్వమయిందని ఇటీవలి పలు పద్యాలతో మనలో చాల మందిని ఒప్పించి, ఇప్పుడు ఎంచక్కా ఇస్మాయిల్ అవార్డు గ్రహీతల వరుసలో చేరిపోయిన కె. మమత ఇదిగో ఈ అమ్మాయే- కవిగా, భావుక హృదయం వున్న మనిషిగా ఆమె ఎవరో, ఏంటో ఆమె మాటల్లోనే…

 

 

Q: What is poetry to you? ఎప్పుడు రాస్తారు కవిత్వం. మీలో కవిత్వం పుట్టిందెప్పుడు? మీరు కవిత్వంలోకి పెరిగిందెలా? మధ్యల్లో ఎడమొహాలెప్పుడైనా ఉన్నాయా?

కవిత్వం నాకు ‘నక్స్ వామికా’ (హోమియోపతి మందు) లాంటిది. గుండె ఆనందంతో వుప్పొంగినప్పుడో, బాధతో గుక్కపట్టినప్పుడో తప్ప నేను కవిత్వం అల్లలేను. ఒక కవిత అలా రాసినప్పుడు, ఎన్నో రోజులు సంతోషంగా వుంటుంది, so much so that I can’t write another poem until I am hit again. బలవంతంగా రాసినవి చాలా పేలవంగా వుంటాయి.

నాకు చదవడం తెలిసిన తరువాత నా చిన్ని చంకలో పెట్టుకు తిరిగిన పుస్తకాలు హెచ్చార్కె ‘రస్తా’, శ్రీ శ్రీ ‘మహా ప్రస్థానం’. రస్తాలో నేను పుట్టబోతున్నాని తెలిసి జైల్లో వున్న ఇరవై నాలుగేళ్ళ హెచ్చార్కె రాసిన కవిత వుంది, “రా పాపా రా” అంటూ “బురదగుంటలో పడినా రంగులు మాసిపోవు సీతాకోకచిలుకకు” అని అంటాడు. నాలుగైదేళ్ళప్పుడే ఎవరైనా స్నేహితులు బాధ పెట్టినప్పుడు ఈ పదాల్ని గుర్తు చేసుకుని సాంత్వన పొందడం ఇంకా గుర్తుంది. ఇప్పటికీ ఆ పదాలు నాకు ధైర్యాన్నిస్తాయి. నా జీవితానికో పరమార్థం ఉందని నమ్ముతాను ఈ మాటల వల్ల. శ్రీ శ్రీ “చూడు చూడు నీడలు”, “బాటసారి” కవితలు చాలా ఇష్టం. నాలుగేళ్ళప్పుడు వేసవి సెలవుల్లో ‘విమోచన’ ఆఫీసుకు వెళ్ళినప్పుడు(జయ హెచ్చర్కేల ఇల్లే ‘విమోచన’ ఆఫీస్) మహాప్రస్థానంలో ని “కళా రవి” కవిత చదివాను. అందులో, “పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్” అని వుంటుంది. అప్పుడప్పుడే చదవడం నేర్చుకుంటున్నా, ఆ లైన్ను “పోతే పోనీ సతుల్ సుతుల్ పతుల్” అని చదివాను. అది విని జయ, హెచ్చార్కె “మమ్మిగాడు ఫెమినిస్ట్ అయిపోయింది” అని నవ్వడం ఇంకా గుర్తుంది. జయ, హెచ్చార్కె పార్టీ నుంచి విడిపోయిన తరువాత నన్ను హైదరాబాదుకు తెచ్చుకున్నారు. 89లో అనుకుంటా నన్ను బాగా కదిలించిన కవిత నేను జేజి అని పిలిచే కూలామె చెప్పింది. మా వూరికి వెళ్ళినప్పుడు అమ్మమ్మతో కలిసి పొలం పోవడం అలవాటు. ఆ రోజు కూలోల్లు కలుపు తీస్తున్నారు. ఒకామె ఏదో పాట ఎత్తుకుంది, పాట చివర్లో జేజి అందుకుని పూడుకుపోయిన గొంతుతో, “ఎంటివోడు ఓడిపోతే, రెండ్రూపాయలకు కిలో బియ్యం రాదు గదనే, బిడ్ల నోట్లల్ల మన్నే గదనే, ఎంత గష్టం జేస్న బతుకుల సీకట్లె గదనే” అని పాడింది. నాకు ఊహ తెలిసిన తరువాత నన్ను కదిలించిన మొదటి కవిత, హెచ్చార్కె నెలకు ఆరొందలు తెస్తే దాన్ని జయ కష్టపడి సర్దుతూ అడిగనప్పుడల్లా పళ్ళో, దీపావళికి బాణాసంచానో కొనిపెట్టలేదని అలిగిన సందర్భాలు గుర్తొచ్చి సిగ్గు పడేలా చేసిన కవిత.

కవిత్వంపై ఎడమొహం ఎప్పుడూ కలగలేదు. కొన్ని కవితలు రాసేప్పుడు ఎవరైనా మెచ్చుకుంటారో లేదో అని ఒక ఆలోచన వచ్చినప్పుడల్లా, అలాంటి ఆలోచన వచ్చినందుకు చిరాకుతో దాదాపు పూర్తి కావొచ్చిన కవితలను చెత్తబుట్టలో పడేసిన సందర్భాలున్నాయి. నా ట్వెంటీస్ లో చేసానాపని. ట్వెంటీస్ చివర పెళ్ళి తరువాత కలిగిన చేదు అనుభవాలు కవితల్లా బుర్రలో తిరుగుతూ వాటిని పేపరుపై పెట్టేలోపు మాయమయ్యేవి. అలా కొన్ని సంవత్సరాలు నాకోసం నేను రాసుకోవాలన్నా రాసుకోలేకపొయ్యాను. రాయలేకపోయినా ఎలాగోలా, మధ్య రాత్రి లేచో, ఆఫీస్ లంచ్ టైంలోనో చదివేదాన్ని.

ఆకురాలు కాలంలో ఒక రోజు లాన్ మీద పరుచుకున్న ఎండుటాకుల్ని ఎత్తిన తరువాత గడ్డి కట్ చేస్తున్నప్పుడు అనిపించింది, నాది కాని స్వప్నంలో జీవిస్తున్నానని, నా జీవితాన్ని నేనే కర్కశంగా నలిపేస్తున్నానని. అప్పటికే అనన్య నాన్నతో నాకు బాగా విభేదాలు పెరిగిపొయ్యాయి… ఇతనెవరు? నాకేమవుతాడు, నా పాపకేమవుతాడు అనిపించేంత. ఆ రోజు రాత్రి, గుండెలో నెప్పి. ఏకబిగిన ఒక కవిత రాసాను, “Primal Yarning” అని. రాస్తున్నంతసేపు గుండె పట్టెసినట్లు… కవిత పూర్తవగానే ఎంతో రిలీఫ్ అనిపించింది. ఎన్నో ఏళ్ళ తరువాత కంటినిండా నిద్ర పొయ్యాను. కొన్ని రోజుల్లోనే, పాపను తీసుకుని బయటకు వచ్చిన తరువాత 4 పద్యాలు ఇంగ్లీషులో, 9 తెలుగులో ఈ నాలుగేళ్ళలో రాసాను. అది కూడా ఈ రెండేళ్ళలోనే ఎక్కువ రాసాను.

Q: మీర్రాసిన కవితల్లో బాగా నచ్చినవి ఏవి? ఎందుకు?

1. స్వేచ్ఛ: ఏడేళ్ళ గ్యాప్ తరువాత కవిత రాయడం మొదలెట్టడానికి ముందు కొంచెం భయమేసింది. నేను కవిత రాయగలనా అని. పజ్జెనిమిదేళ్ళ క్రితం పదిహేనేళ్ళ నేను రాసిన ఈ కవిత నాకు ధైర్యం చెప్పింది. అందుకే ఇది నాకు అన్నిటికన్నా ఇష్టమైన కవిత.

2. రేణువులు: అతనిప్పుడు లేడని, ఇప్పుడున్న ఇతను అతను కాదని నాకు నేను గ్రహింపజేసుకోవడానికి రాసినది. ఈ కవిత రాసేనాటికి డివోర్స్ కు అప్లై చెయ్యలేదు. పాపకోసం అతనితో కలిసి వుండడానికి చేసే నా ప్రయత్నాలు హోప్లెస్ ప్రయత్నాలని తెలిసినా డినయల్ లో ఉండేదాన్ని. ఆ డినయల్ నుంచి బయట పడడానికి ఈ కవిత సహాయం చేసింది. నిజానికి ఈ కవితలోని ఇమేజరీస్ అన్నీ అతను నాకు ప్రపోస్ చేసినరోజువి. పెళ్ళయిన కొత్తలో ఈ ఇమేజరీస్ తో అందమైన ప్రేమ కవిత రాయడం మొదలెట్టాను. కానీ ఆ కవిత మొదటి వ్రాత పూర్తవకముందే నా కల వీగిపోవడం మొదలైంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ కవిత రాయలేకపొయ్యాను. అబద్దం రాయడానికి ప్రయత్నిస్తున్నానిపించేది.

3. ఓ వర్షం వెలిసిన సాయంత్రం: నేనే ఎందుకిలా అని ప్రశ్నించుకుంటూ, పాపకోసం అని కొద్దిసేపు, లోకంలో నాలా ఎంతమంది లేరు అని, నేను పెరిగిన వాతావరణాన్ని హేళన చేస్తున్నట్టు, అచ్చమైన అబలలా సెల్ఫ్ పిటీలో కూరుకుపోతూ గడిపిన సాయంత్రాలెన్నో, అలాంటి ఒక సాయంత్రం నా పాప ఇచ్చిన సమాధానం ఈ కవిత.

Q: “ఆవిరి ఏనుగు తొండమెత్తి కిరణాన్ని పిలవడం” వింతగా ఉందే? ఎలా వచ్చింది ఈ దృశ్యం?

ఈ దృశ్యం “ఎడబాటు” కవితలోది. నేను రాసే కవితల్లో చాలా వరకు ప్రత్యక్షంగా నా ముందు జరిగే సీనరీసే ఎక్కువ వుంటాయి. ఈ ఆవిరి ఏనుగు కూడా అంతే. ఇది నా వూహల్లోంచి పుట్టుకొచ్చిందేం కాదు. నాతో కలిసి మబ్బుల్తో బొమ్మలు చెయ్యడం నా పాపకు చాలా ఇష్టం. ఈ మధ్యనే మొదటిసారి పాపను అమ్మ దగ్గర వదిలి స్నేహితులతో కలిసి పొర్టోరికొ వెళ్ళాను. వెళ్ళానే గాని, పాపను చాల మిస్ చేసాను. వెళ్ళిన రెండవ రోజు సూర్యోదయం చూడ్డానికి సముద్రపు ఒడ్డుకు వెళ్ళాం. మా కళ్ళముందే చీకట్లు తొలగి వెలుగు రేఖలు పరుచుకుంటున్నప్పుడు సరిగ్గా సూర్యుడు సముద్రంలోంచి లేచెస్తున్న చోట మబ్బులు కనిపించాయి.. తొండమెత్తిన గున్న ఏనుగులా వున్నాయవి. కొంతసేపట్లో గున్న ఏనుగు నా పాపకు ఇష్టమైన సీతాకోకచిలుకైపోయింది.

Q: నల్లచేపపిల్ల కథ వెనక కథ మాకూ చెప్పండి.

నల్లచేప పిల్ల కథను “ఎడబాటు” కవితలో ప్రస్తావించాను. నల్ల చేప పిల్ల కథ చిన్నప్పుడు నాకు అత్యంత ఇష్టమైన కథల్లో ఒకటి. నా పాపకు కూడా ఈ కథ చాలా ఇష్టం. ఈ కథలో నల్ల చేపపిల్ల తానున్న చెరువు అవతల ఏముంటందో తెలుసుకోవాలనుకుంటుంది. ఇందుకోసం తానెంతో ప్రేమించే స్నేహితుల్ని, కుటుంబాన్ని వదిలి వెళ్ళాల్సి వచ్చినా కొత్త ప్రపంచంలో ఏముందో తెలుసుకోవలన్న ఆశతో తనకు ఎంతో తెలిసిన చెరువును వదలి, నదిలోకి వెళ్తుంది. చివరికి సముద్రాన్ని చేరుతుంది. ఈ మధ్యలో కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ఒక గూడకొంగ నోట్లోంచి, ఇంకో కొంగ పొట్టలోంచి బయట పడుతుంది. అయినా ముందుకే వెళుతుంది కానీ వెనక్కి వెళ్ళాలనుకోదు. ఆ చేప చేసిన ప్రయాణం రెక్లెస్ అనిపించదు. జీవితంలో తెలుసుకోవలసినవి, అనుభవించాల్సినవి ఎన్నో వున్నాయనిపిస్తుంది. It is okay to be scared, but be brave to take the risk to liberate self అని పాపకు చెప్పడానికి, నాకు నేను చెప్పుకోవడానికి చాలా ఉపయొగపడింది ఈ కథ.

Q: ఆకుల్లేని ఓక్ చెట్టు, మేపుల్ చెట్లు, సీగల్ పక్షి, డ్యాండలియన్ దూది.. ఇంకా? ఇంకా ఏమున్నాయి?

సీతాకోకచిలుకలు, నీలి ఈకల పిట్టలు, రెక్క తెగిన పక్షి పోరాటం, ఇంకా.. చిన్నారులు…ఇంకా .. ఇంకా..

Q: “బొండు మల్లెల మాటున ఊహలల్లుకున్న కొత్త పెళ్ళికొడుకులా?” పెళ్లికూతురెందుకు కాదు? మంచు కమ్మిన ఫర్ చెట్టు ఎందుకలా కనిపించింది?

దట్టంగా పడిన మంచు బరువుకి ఫర్ చెట్టు కొంచెం తలవాల్చినా మిగతా చెట్టంతా నిటారుగా నిలబడుతుంది. తెల్లని మంచులోంచి తొంగి చూస్తుంటాయి ఆకుపచ్చని ఫర్ చెట్టు ఆకులు. ఫర్ చెట్టును అలా చూసినప్పుడల్లా, నా చిన్నప్పుడు మా వూర్లో గుర్రమెక్కి మా ఇంటి మీదుగా ఊరేగింపుగా వెళ్ళిన ఒక ముస్లిం పెళ్ళి కొడుకు గుర్తొస్తాడు. అతని తలకట్టు నుంచి గుర్రం మేను మీదకు జాలు వారుతున్న మల్లె మాలలు, వాటిమధ్య మరువం ఆకులు గుర్తొస్తాయి. అన్ని మల్లెపూల నుంచి వచ్చే వాసన భరించలేక కిందపడకుండా ఏం ఇబ్బంది పడ్డాడో కానీ ఏవో కలల్లో తేలిపోతున్నట్లు అందంగా కనిపించాడు. అప్పటి మల్లెపూల వాసన మంచు కమ్మిన ఫర్ చెట్టునుంచి కమ్ముకొస్తుంది. ఇక పెళ్ళికూతురెందుకు కాదంటారా? తను ఇంకో కవితలో పెళ్ళి కొడుకు కోసం ఎదురు చూస్తోంది మరి.

Q: మీ రచనలు కాకుండా ఎప్పుడూ నచ్చేవి ఏవి, తెలుగులో, ఇతర భాషల్లో?

నెరూడ, బోర్హెస్, లోర్క, మయకొవెస్కి, పాస్టర్న్యాక్, విస్వావ షింబోర్స్క, పీటర్ ల ఫార్జ్ (‘The Ballad of Ira Hayes’ fame) , మహమౌద్ దర్విష్, మాయా ఆంజెలౌ, ల్యాంగ్స్టన్ హ్యూస్, ఖలిల్ జిబ్రన్ ల రచనలు ఇష్టం. మన తెలుగు లో అయితే, సరళమైన భాష లో రాసినవి ఎక్కువ ఇష్టపడతాను. ఏ యాసలొ వున్నా సరె :) . పేర్లు చెప్పను, as I will certainly miss someone, కాని 90ల్లో identity politics పై వచ్చిన కవితల్ని ఎక్కువ ఇష్ట పడేదాన్ని. రేవతీ దేవి “శిలాలోలిత” చాల ఇష్టం. ఇక ఇప్పుడు చాలా మంది చాల అద్భుతంగా రాస్తున్నరు.. ఇప్పుడు రాస్తున్న వాళ్ళల్లో నా ఫేవరెట్ రైటర్ కాశి రాజు! ఎందుకంటే, మా వూర్లో చలికాలంలో వేసుకునే చలిమంటలో నుంచి వచ్చె కమ్మని వాసనేస్తాయి అతని కవితలు/కథలు. నెత్తిన గోనెసంచి వేసుకుని మా మట్టి మిద్దెక్కి వర్షం చేసిన వందో పొటుకులో వరిగడ్డి కూరి ఒకవైపు వొరిగిన నిచ్చెన దిగి వస్తూ తనవైపు దిగులుగా చూస్తున్న నన్ను ఊరడించడానికి “మామ మామా మామా, ఏమె ఏమే భామా” అంటూ అల్లరి చేసే మా మామ కనిపిస్తాడు అతని రాసే పదాల్లో. I am biased, మట్టి వాసన, చెమట వాసన వేసే రచనలనే ఎక్కువ ఇష్ట పడతాను. పూల గురించి రాసిన పద్యాలు బాగుంటాయి, కాని గుర్తుండి పోవు నాకు.

ఈ మధ్య కాలంలో నన్ను ఇన్స్పైర్ చేసిన కవి తమ్మినేని యదుకుల భూషణ్. రచయితలుగా జయ, హెచ్చార్కేలను చూసినంత దగ్గరిగా భూషణ్ ని చూసాను. ఒక కవితని అనువాదం చెయ్యడానికి కూడా ఆయన తీసుకునే శ్రద్ద చూస్తే అబ్బురమనిపిస్తుంది. పిల్లల ప్లే డేట్ పేరిట నెలలో ఒక్కసారైన కలుస్తూ, ప్రతిసారి లిటరేచర్ కు సంబదించిన ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడం పరిపాటైపోయింది.

Q: హెచ్చార్కే కవిత్వం ఎలా అనిపిస్తుంది? కవిగా, నాన్నగా ఆయన ప్రభావం ఎంతవరకూ ఉంది మీ వ్యక్తిత్వం పై, కవిత్వం పై?

ఈ ప్రశ్నను కొంచెం ఎక్స్ ప్యాండ్ చేసుకుని జవాబిస్తాను.

“రేణువు రేణువులో వెదుక్కుంటున్నా, తడిసిందైనా తడవనిదైనా ఒక్క అగ్గిపుల్ల కోసం”… ఈ పదాలు హెచ్చార్కె 90ల్లో అబద్ధం లో రాసాడు. మొదటి డ్ర్యాఫ్ట్ నాకు చదివి వినిపించినప్పుడు కలిగిన ఉద్వేగం ప్రతిరోజు ఒక్కసారైన కదిపి వెల్తుంది.

ఇక 70 ల్లో నేను పుట్టబోతున్నానని తెలిసి రాసిన కవితలో అంటాడు, “బురదగుంటలో పడినా రంగులు మాసిపోవు సీతాకోకచిలుకకు”. బురద లో చాలా సార్లే పడ్డాను, బయటకు రావడానికి తన్నుకుంటున్నప్పుడు ప్రతిసారీ ఆ పదాలు నాకు ఆసరా ఇచ్చాయి. హెచ్చార్కేవి చాల పద్యాలు అర్థమవుతాయి. ఈ మధ్యకాలంలొ రాసినవి ఇంకా ఎక్కువ. కాని, there was a time when I didn’t understand him, especially in 90s. “ఇప్పటిదాకా బాగానే వున్నవు కదా అంతలోనే ఏమయ్యింది? ఏంటీ అర్థం కాని కవిత” అని అడిగేదాన్ని. ఆ రోజుల్లో జయ చాల active గా రాసేది – కథలు, కవిత్వం. ప్రతి కథ, కవిత నాకు అర్థమయ్యేది. చెప్పాల్సింది సూటిగా చెప్పినా, సరళమైన భాషలో చెప్పినా అది కవిత్వం కాగలదని జయ రచనల్నుంచి నేర్చుకున్నాను. ఇద్దరినుంచీ నేర్చుకున్నది, తపనతో రాయాలని. నా కవిత్వం పై ఇద్దరి ప్రభావం వుంది. కానీ నా శైలి వాళ్ళిద్దరితో పోలిస్తే వేరుగానే ఉంటుందనే అనుకుంటాను.

CPI ML పార్టీ లో హోల్ టైమర్స్ గా వున్నప్పుడు పదేళ్ళు వూర్లో అమ్మమ్మ దగ్గర పెరిగినప్పుడు, అన్ని రకాల పుస్తకాలు కొనిచ్చేవాళ్ళు. అవి చదివేసాక, వూర్లొ వాళ్ళతొ ట్రేడింగ్ చేసేదాన్ని. చివరికి సినిమా పత్రికలు కూడా చదివేదాన్ని. ఆ పదేళ్ళలో, నేను దేవుడికి పూజలు చేస్తున్నపుడు వొద్దు అనలేదు. అలాగే, కొన్ని దుర్మార్గాల్ని చూసి చూసి, ఇట్లాంటి లోకంలో దేవుడు వుండడానికి ఆస్కారం లేదు అని చెప్పినప్పుడు నా భుజం తట్టలేదు. వూర్లోని పేటలన్నీ నా ఆట స్థలాలే అని నాకు చెప్పలేదు, ఆ పేటల్లోని నా స్నేహితుల్ని చూసి నన్ను మెచ్చుకోలేదు. బేసికల్లీ, నాకు వాతావరణాన్ని కల్పించారు. నన్ను తన దగ్గర వుంచమని మా ఫ్యామిలి డాక్టర్(వినీలవ్వ అని పిలుస్తాను తనని) అడిగినా, వూరి వాతావరణాన్ని నేను స్వానుభవంతో తెలుసుకోవాలని నన్ను అమ్మమ్మ దగ్గరే వుంచారు. చిన్నప్పుడు బడికి వెళ్ళనని ఒకే ఒక్కసారి మొండికేశాను, అప్పుడు మా అమ్మమ్మ కంది రెమ్మ పట్టుకుని నా వెంట పడి, “మీ యమ్మా నాయన్లు కట్నమిచ్చి పెండ్లి జేచ్చారనుకోయింటివ్యా. కమ్యునిస్టులు తల్యా వాళ్ళు. కట్నాలియ్యరు. నువ్వు సదుకోవాల్సిందే. నీ పెండ్లి నువ్వు సేస్కోల, నీ పొట్ట నువ్వు నింపుకోవల” అని అంది.

వేసవి సెలవులకు విమోచన ఆఫీస్ కు వచ్చేదాన్ని. మల్లి మామ, సంపత్ మామ, గబ్బి మామ (మధుసూదన్ రాజ్ యాదవ్ – మామ తన స్కూటరులో నేను అడిగినంతసేపు తిప్పేవాడు. తను స్కూటరు నడుపుతుంటే హెడ్లైటు పట్టుకుని తన ముందు నుంచున్న నాకు రెక్కలొచ్చి ఎగిరిపోతున్నట్లనిపించేది. మా వూరివైపు స్కూటరును బగ్గీ అనేవాళ్ళు. నాకు నోరు తిరగక గబ్బి అనేదాన్ని.), స్వర్ణ (తన పేరు పిలవడానికి నోరు తిరగక హ్యాపీగ అమ్మ అని పిలిచేదాన్ని), అరుణోదయ రామారావు మామ, సుజాత, శేషు మామ, విమల, రత్నమాల, రంగవల్లి, వినయ్ మామ, కరుణ, మధుసూదన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శంకర్, నమ్ము, ప్రదీప్ మామ, అంబిక, కోల్ కోల్ మామ(నర్సా గౌడ్), నారాయణ స్వామి వెంకటయోగి లాంటి మిత్రులతో కళకళలాడుతుండేది విమోచన ఆఫీస్. పత్రిక ప్రింటు చేసే నాట్యకళ ప్రెస్ కు వెళితే అక్కడ నేరేడు చెట్టుకిందే నా మకాం. బుక్ బైండింగు కోసం ఉడకబెడుతున్న జిగురు నుంచి వచ్చే వాసన ఇంకా గుర్తు నాకు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో వీళ్ళందరూ 20స్ లేదా ఎర్లీ 30స్ ల్లో వున్న నవ యువతీ యువకులే. జనాలకోసం బతికిన వాళ్ళు, తమకోసం, తమ కుటుంబాల కోసమే కాక సమసమాజం కోసం కలలు కన్న వాళ్ళు. ఊరి వాతావరణం, సెలవులప్పుడు పార్టీ వాతావరణం నేను మొక్కగా వున్నపుడు, తొమ్మిదేళ్ళ లోపు కల్పించినవే. ఇప్పుడు అమెరికాలో వుంటున్నంత మాత్రాన జార్జి రెడ్డిపై ప్రేమను వదులుకోలేను.

Q: “ఒక వర్షం వెలిసిన సాయంత్రం” ఎన్నో ప్రశ్నలకి ఒక క్లుప్తమైన సమాధానం. ఒక కథలా, ఒక పూర్తి సందిగ్ధ జీవితంలోంచి పిండుకున్న స్పష్టతలా, ఏమైనా చెప్తారా ఆ కవిత గురించి, దాన్లో నీడలుగా కనపడే ఆధునిక యువతుల సందేహాల గురించి?

చాలా మంది అమ్మాయిలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగినా, గృహ హింసను భరిస్తున్నారు. పెళ్ళి కాక మునుపు అలాంటి అమ్మాయిలపై జాలి కంటె ఎక్కువ కోపం వుండేది. “You are the reason you are suffering” అని అరిచి చెప్పాలనిపించేది. గృహ హింస అంటే చేయి చేసుకోకుండానే వాతలు పెట్టొచ్చు. రోజువారి మనసుకు తగిలె చురకలు కంటికి కనిపించవు కానీ చాలా గాయపరుస్తాయి, సంవత్సరాల కొద్దీ మర్చిపోలేని నెప్పి కలిగిస్తాయి.

పాప అన్న మాటలు “ఎందుకలా వాళ్ళు, చూసినా చూడనట్టు, రెక్కలున్నా ముడుచుకుని..” నాకు ఎంతో సాంత్వననిచ్చాయి. “నేనే ఎందుకిలా, నాకే ఎందుకిలా” అని గింజు కుంటున్న నన్ను బురదలోంచి అమాంతంగా బయట పడేసిన మాటలు. పేరు కోసమో, ఎవరో నన్ను ఆకాశానికి ఎత్తెయ్యాలనో కాదు నా బాధ. ఇచ్చిన గౌరవాన్ని, ప్రేమను తిరిగి పొందాలనుకునే ఆశ. నా పనులు నేను చేసుకోగలిగే స్వాతంత్ర్యం కోసం పెనుగులాట.

పాపతో ఈ సంఘటన జరిగిన రెండేళ్ళకు ఈ కవిత రాయడానికి కారణం ఈ మధ్యనే కొంతమంది స్నేహితులు తమ అనుభవాలను నాతో పంచుకున్నారు. తమతోనే లేకపోయినా ఇండియాలో ఉంటూ వాళ్ళ జీవితాల్ని శాసించే అత్తలు, తమ అమ్మ చెప్పిన మాట వినమని చెప్పే భర్తలు. వెళ్ళిపోవాలనిపిస్తోంది అంటూ పిల్లలకోసమే వుండిపోయామని చెప్పారిద్దరూ.

కవిత చదివిన మరికొంతమంది స్నేహితులు కవితతో తామెంత రిలేట్ అవుతున్నామో చెబుతూ తమ అనుభవాలు పంచుకున్నారు.

Q: మీరు కవిత్వం రెండు దశల్లో రాశారు కదా? రెంటి మధ్య తేడాలేమున్నాయి? అన్నిట్లోనూ అంతర్గతమైన ఒక విషాదచ్ఛాయ ఉందనిపిస్తుంది కదా?

మొట్టమొదటి కవిత “స్వేచ్చ” పదిహేనేళ్ళప్పుడు రాసింది. ఇంటర్లో చేరిన కొన్ని నెలలకు PDSU వాళ్ళు వచ్చారు మా కాలేజికి. PDSUలో చేరుతాను అంటే జయ, హెచ్చార్కె సందేహించారు. అప్పటికి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ఐదారు సంవత్సరాలే అవుతోంది. చాలా మందికి వాళ్ళ మీద ఇంకా కోపం వుండింది. నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహించారు. “నేను మీ పర్మిషన్ అడగట్లేదు, ఇన్ ఫాం చేస్తున్నా” అని చెప్పి మీటింగుకు వెళ్ళాను. సభ ఎంటర్ కాకముందె ఎవరో “నువ్వు హెచ్చార్కె కూతురివి కదా. ఇంట్లో చెప్పే వచ్చావా?” అని వ్యంగ్యంగా అన్నారు. లోపలికి కూడా వెళ్ళకుండా వెనక్కి వచ్చేసాను. అప్పుడు రాసాను ఆ కవిత. తరువాత ఒకటీ రెండు కవితలు రాసాను కానీ, మరీ టీనేజి పిల్ల రాసినట్టు వుంటాయి. తరువాత ఎందుకో ఇంగ్లీషులోకి దిగాను. పెళ్ళి దాకా అప్పుడప్పుడు రాసేదాన్ని.

పెళ్ళి తరువాత కొన్నేళ్ళు గ్యాప్ వొచ్చింది. ఒక లైన్ మెదడులో పెట్టుకుని తిరిగాను దాదాపు రెండేళ్ళపాటు “some songs lay dying” అని. అది “Primal Yarning” అనే కవితలో వచ్చింది. I think I wrote more to relieve myself from hurt and sadness. సెల్ఫ్ పిటీలొ పడకుండా వుండేందుకు రాసుకున్నవి. “బురదలో పడ్డావురోయ్ మమ్మిగా” అని నన్ను నేను హెచ్చరించుకుని బయట పడడానికి రాసుకున్నవి. దాదాపు అన్ని కవితల్లో విషాద చ్ఛాయలు వున్నా, చాలా వరకు ఒక ఆశతో ముగుస్తాయి. అలా ముగిసిన ఒక కవితలో పంక్తులు, “నా కంటి చివరి తడిలో మెరిసాయి వేయి ఇంద్ర ధనుస్సులు” అంటే నాకు చాల ఇష్టం. ఇంతకీ ఆ భావం వచ్చే పదాలు తన నాలుగేళ్ళప్పుడు నా పాప అన్నది. ఒకరోజు బాగా ఏడ్చేసి, నేను కౌగిలించుకుని ముద్దివ్వగానే, కన్నీళ్ళు తుడుచుకుని “Mamatha, I have rainbows in my eyes. Sunrays are falling in my tears and making rainbows” అని అన్నది. సరే, నా కౌగిలి, ముద్దు ఖరీదు ఈ పదాలు అని ముడుపు పేరిట వాటిని దొంగిలించేసాను.

Q: కథలు రాస్తారా? చదువుతారా? ఎలాటివిష్టం?

ఇంతవరకు ఒక కథే రాసాను. దాన్ని వార్తలో 2006 లో ప్రచురించారు. ఆకథ శేషభాగం రాయాల్సి వుంది.
రీడర్ ను తన పరిసరాల్నుంచి ఇంకో జీవితంలోకి లాక్కెళ్ళగలిగే కథలన్నీ ఇష్టమే నాకు.

Q: మంచి కవితకు మీ నిర్వచనం?
కవితైనా, కథైనా పెయింటింగ్, స్కల్ప్టింగ్ లాంటి కళేఅని నమ్ముతాను. కాదేదీ కవితకనర్హం … కానీ కవితా వస్తువు ఎలాంటి ఆర్భాటాలు అవసరం లేకుండా మనస్సులోకి సూటిగా దూసుకెళ్ళగలగాలి. అలాగే కన్నీళ్ళు కార్చకుండా కన్నీళ్ళ గురించి రాయకూడదు. నీలి ఈకల పిట్టను చూడకుండా దాని ఈకల మెరుపు గురించి రాయకూడదు. అలా రాసిన కవితల్లో ఇంటెగ్రిటి వుండదు.

వాకిలి: ఇస్మాయిల్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా మీకు మరొక్కసారి అభినందనలు. ఆల్ ద బెస్ట్!

**** (*) ****

మమత రచనలు మరికొన్ని ఇక్కడ చదవండి:
ఎడబాటు (కవిత) – ఈమాట
మంచుపూల వాన (కవిత) – తానా పత్రిక
వెళ్ళిపోయింది (కవిత) కినిగే పత్రిక
ఎండమావి (కవిత) – సారంగా పత్రిక
మరో మొనాలిసా (కవిత) – సారంగ పత్రిక
A Downy Spear