కవిత్వం

వీడ్కోలు తర్వాతి నువ్వు

డిసెంబర్ 2014

నీకొక వీడ్కోలు పద్యం ఒప్పచెప్పేసి
స్థిమితంగా కూర్చుంటాను

చూస్తూ చూస్తూన్న శూన్యంలో నుంచి నిన్ను పోలిన ఓ ఆశ తొంగి చూస్తుంది
మరుక్షణమే ఏదో ఒక వాక్యం నీ కోసం మళ్ళీ మొలకెత్తుతుంది
దూరాల ఎడారిలోనూ పదునైన ముళ్ళ మధ్యలో
కొన్ని సుకుమారమైన పూలు పూస్తాయి

అప్పుడు నీకూ నీ తలపుకీ మధ్య తేడాని కూడా తెలుసుకోలేను
సత్యానికీ స్వప్నానికీ మధ్య ఏ గీతలూ గీయలేను
నే చూస్తున్న అది నువ్వో నేనో ఖచ్చితంగా వేరుచేయలేనప్పుడు
ఉప స్పృహ మరోసారి హెచ్చరిస్తుంది
నీ నుంచి విడివడటమూ, నీతో ముడిపడటమూ రెండూ విఫలయత్నాలే అని

అయినా సరే, నీవెళ్ళిన దారి వైపు
కొన్ని నిర్జీవమైన, నిర్మానుష్యమైన కాలాలలో యేళ్ళ తరబడి ప్రయాణించాక తెలుస్తుంది
ఎండ మావులు త్రాగీ బ్రతకవచ్చని, ఆశ అంటే ఇదేనేమో అని!

ఆవరించిన అనిశ్చితి లోతుల్లో మెరుస్తూన్న
చరమాంకంలో చూసుకుంటాను
నా ఊపిరి మీద నీవు చేసిన చెరపలేని ప్రియమైన సంతకాన్ని
మొదటి మలుపులో విసిరేసి చిరిదాకా వెదుక్కున్న నా జీవన పరమార్ధాన్ని!

Painting: Mirage by JasonEngle