కడిమిచెట్టు

రక్షణను రచించిన భద్రమహిళ అగాథా క్రిస్టీ

డిసెంబర్ 2014

‘జనముద్దు’ సాహిత్యాన్నీ తతిమా కళారూపాలనీ   మొహం చిట్లించి చూడటం మేధావులకు ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైనది. అందరికన్నా తాము ఎక్కువ అనే భావన వారి ఉనికికి అత్యవసరమైన సంగతి. జ్ఞానం ఉన్నవారి జనాభా తక్కువ కనుక ఎక్కువమందికి నచ్చేదానిలో ఖచ్చితంగా గొప్ప ఉండదనే ఆ నమ్మకానికి ఎదురు వాదన- నిజం చెప్పాలంటే , ఏమీ లేదు.

ప్రేమలూ కన్నీళ్ళూ రాసినవారికే అంతంతమాత్రం గౌరవం ఉంటుంటే నేరపరిశోధన రాసినవారి సంగతి చెప్పాలా ?  కాని , కనీసం కొందరి గురించి మాట్లాడేటప్పుడు- ఇదంతా అప్రస్తుతం. ఏ భేషజమూ లేకుండా తనను తానొక వినోదకారిణిగా మాత్రమే చెప్పుకున్నవారు అగాథా క్రిస్టీ. అయితే,  ఆమె రాసినదాన్ని ఇష్టంగా చదివేవారిలో ’ తెలివిగలవారు ‘ చాలా మందే ఉన్నారు. సాధారణ ప్రమాణాల ప్రకారం చూసినా  కూడా  ఆమె ప్రతిపాదించి పోషించిన విలువలేవీ ’  ప్రధాన స్రవంతి  ‘ లో వాటికి తీసిపోవని వారు వాదిస్తారు .  అందులో ఇమడకపోవటం వల్ల ఆమెకి వచ్చిన లోటేమీ లేదు . అయినా కూడా ,  ‘ కాదు ‘ అని ముందే పెదవి విరవకుండా   ఉండగలిగితే – పట్టించుకోవలసిన  విషయాలు కొన్ని ఉన్నాయనే   అనుకుంటున్నాను .

లిటరరీ ఫిక్షన్, genre ఫిక్షన్ ల మధ్య గీత 19 వ శతాబ్దం చివరలో స్పష్టమైంది. 1918 తర్వాత ఆ వర్గీకరణ బాగా బిగిసిపోయింది. ” కొంతమంది కోసం, కొన్ని విషయాలు మాత్రమే  చెప్పే ” సాహిత్యంగా genre fiction  కి నిర్వచనం వచ్చేసింది. ఆ కొందరూ ఎందరో అయినా కూడా అది ‘ అంత మాత్రమే ‘  అయింది. అయినంతమాత్రాన  ఆగక లిటరరీ ఫిక్షన్ కన్న అది ఎన్నో రెట్లు తక్కువ అన్న రూఢి కూడా అయిపోయింది. అయోమయాన్నో కల్లోలాన్నో కరువుతీరా వివరించటం ఘనమైన సంగతి అయింది .  ” అరే, పాతవాళ్ళు అలా చెప్పలేదు కదా ” అంటే ” ఆ పాతవాటిని క్లాసిక్ లు అంటున్నాము కదా , చాలదూ  ? ” అని జవాబు వచ్చింది. [ కొత్తగా క్లాసిక్ లు వచ్చే దారి మూయబడింది, కనీసం అలా అనిపించింది. ఒక రచన క్లాసిక్ అయేందుకు అతి ముఖ్యమైన అంశం- కాలపరీక్ష - జరిగే తీరుతుంది, ఫలితాలు రానే వస్తాయి ]

ఏతావతా చదువరి మనసుకి ఏమాత్రం స్థిమితాన్ని కలిగించే నేరాన్ని రచయిత చేసి ఉన్నా ఆ రచనకు తక్కువ విలువ కట్టబడింది.

రచయిత సంస్కారం, అధ్యయనం,  వ్యక్తీకరించే శక్తి మాత్రమే  రచనని నిర్ణయిస్తాయి…ఎవరికోసం, ఎందరికోసం రాశారనేది కాదు. మీడియోకర్ మనుషులు ఉన్నట్లుగానే  మీడియోకర్ సాహిత్యమూ  ఎప్పుడూ ఉంటుంది .  అయితే, ఎంత మీడియోకర్ ఆశావాద , పలాయనవాద సాహిత్యం అయినా -ఎంతో గొప్పదనిపించుకున్న నిరాశావాదపు ‘ సీరియస్ ‘  సాహిత్యం కన్న న్యాయమైనదని నేను నమ్ముతాను.  Holoquist  అన్న విమర్శకులు ఇలా అన్నారని తెలిసి ఆశ్చర్యం వేసింది – ” డిటెక్టివ్ సాహిత్యం లోది కృతక హింస -  ఆధునికానంతర నవలలోది నిజమైన హింస. ఎందుకంటే అక్కడ చదువరి విశ్వాసాలు ధ్వంసం చేయబడతాయి ” .  ప్రేమ, శాంతి, అమాయకత్వం శాశ్వతమైన విలువలని అంగీకరిస్తే- మనుషుల మధ్యన హింస, సంఘర్షణ మాత్రమే ఉన్నాయని చెప్పదలచిన ఏ రచనలోనైనా వైరుధ్యం ఉన్నట్లే  .  కాగా, కాలంతో రాగల [ మంచి ] మార్పుని   సాహిత్యం తిరస్కరించ రాదు . ఆశ కి కాలం గడవటం అవసరం, నిరాశకి stagnation  అవసరం.

రెండు ప్రపంచయుద్ధాల నడిమి కాలం ‘ నేరపరిశోధనా సాహిత్యపు స్వర్ణయుగం ‘ అని చెబుతారు. అంతకన్న చాలా ముందరే Edgar Allen Poe  [1841] , Wilkie Collins  [1868]  ల కథలు, నవలలు వచ్చాయి. ఆ విభాగం లో మొట్టమొదట వినబడే పేరు – Sherlock Holmes సృష్టి 1886 నాటికే జరిగింది.  అయినా ,  ఆ కాలపు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు  అటువంటి కథలు విరివిగా  రావటం వెనుక ఉన్నాయి.    అదొక పలాయనవాదమని అనే విమర్శకులు ఉన్నారు  . ఆ మాట  పూర్తిగా సత్యం కాదు. ఉత్పాతం నుంచి కోలుకుంటున్నవారికి ధైర్యం చెప్పటం అవసరం. మొదటిప్రపంచయుద్ధం తర్వాత చాలా పోయింది, కాని  మొత్తం  పోలేదనే భద్రతని ఆ డిటెక్టివ్ నవలలు ఇచ్చాయి.  ఒక తీవ్రమైన నేరాన్ని సృష్టించి దాన్ని పరిష్కరించటం – నేరస్థుడిని పట్టుకుని శిక్షించటం – అది సాధ్యమేననే విశ్వాసాన్ని చదువరికి కలిగిస్తాయి. ‘ ప్రపంచం లో చెడు ఉంది, కాని దాన్ని అంతం చేయగలగటమూ ఉంది ‘ అని తీర్మానించటం అవుతుంది. ఆ న్యాయపరిరక్షణ  లో చుట్టుపక్కలవారంతా ఒకరికొకరు సాయం చేసుకోవటం ద్వారా దగ్గరవుతారు.  మొత్తం చెడునంతా ఒక ముద్ద చేసి నాశనం చేయటం రావణాసురుడి దిష్టి బొమ్మ తగలబెట్టటం వంటిది, దయ్యాన్ని వదిలించటం వంటిది. కథ ముగిసేసరికి మునుపటి వాతావరణం నెలకొంటుంది. [Reversion to pristine innocence ]

వాస్తవ జీవితం లో సాధ్యం కావనిపించే సంఘటనలను, పరిష్కారాలను చిత్రించటం పలాయనవాదం అనుకొనే ముందర JRR Tolkien అన్న మాటలు ఒకసారి వినవలసి ఉంది.  ‘’ “Fantasy is escapist, and that is its glory. If a soldier is imprisioned by the enemy, don’t we consider it his duty to escape?. . .If we value the freedom of mind and soul, if we’re partisans of liberty, then it’s our plain duty to escape, and to take as many people with us as we can!”

 

పలాయనం అన్నమాటని విడుదల గా మార్చవలసిఉంది.

స్థూలంగా చూస్తే ఆమె, ఇంకొందరు బ్రిటిష్ సాహిత్యకారులు సాంప్రదాయికమైన మిస్టరీలు రాశారు. వాటిని ‘ సౌకర్యవంతమైన ‘ [cozy  ] మిస్టరీలు అనటమూ ఉంది. ఆ రచనకి కొన్ని నియమాలు[ retrospective  గా ] ఏర్పడినాయి కూడా. అపరాధి పాత్ర నవల మొదటిలోనే రావాలి, డిటెక్టివ్ కనుగొనటం కాకతాళీయంగా గాని, వివరించలేని intuition వల్లగానీ జరగకూడదు, డిటెక్టివ్ ఎట్టి పరిస్థితిలోనూ నేరం చేయకూడదు- ఇటువంటివి. డిటెక్టివ్ సహాయకుడు సగటు పాఠకుడి కంటె కొంచెం [కొంచేమే ]  తెలివితక్కువగా ఉండాలి అన్న నియమం కూడా ఉండటం నవ్వు తెప్పిస్తుంది. అవును, వినోదింపజేయటం ఆ  genre ప్రధాన కర్తవ్యం కనుక, నవ్వు కూడా రావచ్చు- తప్పు లేదు. పాఠకుల ఏ నమ్మకాలనూ బద్దలుకొట్టటం ఈ సాహిత్యం చేసే పని కాదు. సాంప్రదాయికమైన మిస్టరీ ల పైన విమర్శలు ఇవి- అవి యథాతథ వాదసాహిత్యం  – ఉన్న స్థితిని మార్చాలని చెప్పవు. నేరం పూర్తిగా వ్యక్తిగతమైనదని అంటాయి. వాటిలో  ఒక వ్యక్తి దుష్టుడై నేరం చేస్తాడు, అస్తవ్యస్తమైన సాంఘికస్థితివల్ల కాదు.  అవి కలిగించే భద్రతాభావన ఒక అభాస. ఒక నిర్ధిష్టమైన కాలపరిమితిలోపల నేరం జరగటం, శిక్ష పడటం- అంతా అయిపోతుంది-  ఇది నిజజీవితం లో అయేపని కాదు. ఒకవేళ అయినా శాశ్వతమైన  ఉపకారమేమీ జరగదు.

వీటన్నిటిగురించీఅవుననీ కాదనీ ఎంతైనా వాదించవచ్చు. ఇంతమాత్రం అంటున్నాను -బృహత్ప్రయోజనాలను సాధించగల సాహిత్యం   కావాలని అనుకోవటం మెచ్చదగినదే, కాని అటువంటిది మాత్రమే  రావాలని, మరింకేదీ వద్దని  అనుకోవటం మాత్రం కాదు.  మానవ హృదయం లో లాగే సమాజమస్తిష్కం లోనూ వంద పొరలు, వేయి మెలికలు- అన్నిటికీ  appeal చేయటం ఒకేరకపు సాహిత్యం వల్ల  కాదు.

వాస్తవజీవితం లో నిబంధనలను అతిక్రమించటం మనం తరచుగా చేస్తామా ? చేసిన సంఘటనలను సమర్థిస్తామా ? అసలు ఆ నిబంధనలు ‘ అంత  ‘ చెడ్డవా ? !” నిజజీవితం లో జవాబు లేనితనాన్ని ఎంతవరకు భరించగలమో ఆలోచిస్తే , సాహిత్యం లో జవాబులు ఇవ్వటం ఎంతవరకూ తప్పుపట్టదగినదో తెలుస్తుంది.

అమెరికన్స్ ఎక్కువగా రాసిన Hard boliled మిస్టరీలు వీటికి భిన్నమైనవి. Raymond Chandler  ఆమె సమకాలికులు ఆ విభాగం లో. పశుత్వం, క్రూరత్వం – వీటికి  అక్కడ  పూర్తిగా అనుమతి ఉంది. శాశ్వతమైన నష్టం, విషాదం, సంభవిస్తూ ఉంటాయి  . ఆయన ఒకచోట ఇలా అంటారు –  ” సాంప్రదాయికమైన మిస్టరీ లో నేరం ఎవరు చేశారు అని తేలటమే ముఖ్యం, తక్కిన విషయాలేవీ లెక్కలోకి రావు. [నేను రాసే ] బ్లాక్ మాస్క్ పద్ధతిలో సన్నివేశాలు ప్లాట్ ని అధిగమిస్తాయి. చివర ఏమిటో తెలియకపోయినా ఆనందించగలిగేదే మంచి మిస్టరీ. హంతకుడెవరో తెలిసిపోయాక సినిమాని తర్వాతివారు ఇంకెందుకు చూస్తారని ఒక హాలీవుడ్ నిర్మాత నాతో అన్నారు. కావచ్చు, అతను సరైన మిస్టరీ గురించి మాట్లాడటం లేదు ”

విడ్డూరం ఏమిటంటే అగాథా క్రిస్టీ కి అవతలి శిబిరం నుంచి వచ్చిన ఈ మాటలు ఆమెకి పూర్తిగా వర్తిస్తాయి. ముగింపు కోసమా ఆమె నవలలూ నాటకాలూ మళ్ళీ మళ్ళీ చదవటం, చూడటం ?

అప్పుడు  అపరాధపరిశోధనా రచనలు చేసిన చాలామందికి ఇవాళ చారిత్రక ప్రాధాన్యం మాత్రమే ఉంది. అగాథా క్రిస్టీ అలా కాదు.  బైబిల్, షేక్ స్పియర్ సాహిత్యం తర్వాతి స్థానంలో  , పుస్తకప్రతుల పరంగా ఆమె సాహిత్యం ఉంటుంది.  103 భాషలలోకి అనువాదం అయింది [ ఇది బైబిల్ కన్న 14 భాషలు ఎక్కువ. వాటిలో నాకు తెలిసి   మలయాళం, తమిళం, హిందీ, మరాఠీ, పంజాబీ ఉన్నాయి.] 1948 లో పెంగ్విన్ ప్రచురణలనుంచి ఒకేరోజు ఆమె రాసిన పది పుస్తకాలు- పదిలక్షల ప్రతులు ముద్రించబడినాయి [ పెంగ్విన్ మిలియన్ ] . ‘Peril at the end house  ’ అమెరికన్ కాపీలను ఒకదానిపైన ఒకటి పేర్చితే చంద్ర  మండలం వరకూ వెళతాయి. ఆమె డిటెక్టివ్  Hercule Poirot చివరి నవల ‘ Curtain ‘లో మరణించినప్పుడు Newyork Times మొదటి పేజీలో  శ్రద్ధాంజలి ప్రకటించింది. ఒక కాల్పనిక పాత్రకి అటువంటిది జరగటం అదే మొదలు. నవలాకారిణిగానూ నాటకకర్త గానూ ఇంచుమించుగా సమానమైన విజయం సాధించినవారు ఆమె. 1952 లో మొదలైన ‘ Mouse Trap ‘ ప్రదర్శన ఇంకా కొనసాగుతూనే ఉంది [ మధ్యలో నాటకశాలను మార్చినా ]  , ఆ నాటకానికి ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ ఉంది.  ఇవన్నీ ఆమె కి ఉన్న విపరీతమైన ప్రజాదరణను చెబుతాయి. అవును, ప్రజాదరణ పొందినది అంతా మంచిదీ గొప్పదీకానక్కరలేదు -ప్రజాదరణ ఉన్నంత మాత్రాన ఒక విషయం విలువ లేనిదీ అవనక్కరలేదు.

 

విద్యావంతమైన మధ్యతరగతి కుటుంబం లో పుట్టి పెరగటం ఆమె అభిప్రాయాలను నిర్దేశించింది. E.Nesbit రాసిన అద్భుత కథలు, తర్వాత Lewis Caroll రచనలు ఇష్టంగా చదివేవారు.Gaston Leroux  రాసినThe mystery of yellow room  డిటెక్టివ్ నవల పట్ల ఆసక్తిని పెంచింది. చాలా మంచి బాల్యాన్ని గడిపానని ఆమె చెప్పుకునేవారు. ఆ భద్రత ఆమెను జీవితాంతమూ కాపాడిందనిపిస్తుంది.  అర్థగణితం ఆమెకి ఇష్టమైన పాఠ్యాంశం. నవలలన్నిట్లోనూ ఆ ‘ లెక్క ‘ కనిపిస్తుంది. మొదటిప్రపంచయుద్ధపు కాలంలో ఔషధశాస్త్రం లో శిక్షణ తీసుకున్నారు. ఆ పరిజ్ఞానమూ ఆమె రాసినదానిలో ఉంటుంది- ముఖ్యంగా రకరకాలైన విషాల గురించి. మరొకరిలాగా వ్యవహరించటం, తనలోనే ఉన్నదాన్ని మరొకలాగా ప్రదర్శించటం -  ఇవి ఆమె సాహిత్యం లో ప్రముఖంగా ఉంటాయి. తన కంటే పదేళ్ళు పెద్దదైన అక్క మాడ్జ్ ,”  తనలా నటిస్తున్న మనిషిలాగా నటించటం ” చిన్నతనం లో ఒకవిధమైన సమ్మోహాన్ని కలిగించేది  . తర్వాతి రోజులలో  తన సమకాలీనురాలైన రచయిత్రి Elizabeth Bowens  రచనని ఇష్టపడేవారు. Ms Bowens నేరపరిశోధన గురించి రాయకపోయినా, ఆమె సాహిత్యలక్షణం ఇది -  జీవితానికి అమర్చిన మూత తీస్తే  ఏమవుతుందో చెప్పటం. ఆ కుతూహలం ఒకవిధంగా నిజనిర్ధారణ, అగాథా క్రిస్టీ రాసినది దానిగురించే. ఏది నిజం అన్న విషయం లో ఆమెకి అయోమయం లేదు. ఇక్కడే ఆమె conservative అనిపిస్తారు. నిజమే, ఆమె పూర్తిగా ‘ కుడివైపే ‘ ఉన్నారు. కానిఒకటి కన్న ఎక్కువ నిజాలని అంగీకరించటమూ కనిపిస్తుంది. ఆమె దృష్టిలో అవి దృక్కోణాలు, వేటికవి సత్యం. కొన్ని  నవలలలో అపరాధి  కి శిక్షపడకపోవటమూ ఉంటుంది . సాంఘికనియమాల ను అతిక్రమించటాన్ని సమర్థించరు, అయితే వాటి కంటె విడిగా కూడా  తన వైయక్తిక న్యాయం [ భారతీయంగా చెప్పాలంటే దాన్ని ' ధర్మం ' అనవచ్చు ] ఉంటుంది, అక్కడ. ఆమె మాస్టర్ పీస్ గా చెప్పుకునే ‘And there were none ‘  దీనికి మంచి ఉదాహరణ.

తప్పకుండా అది నేరమని నమ్మినప్పుడు  మాత్రం,  నేరస్థుల పట్ల ఆమె అభిప్రాయాలు కటువైనవి. వారి  మనస్తత్వాన్ని చికిత్సతో సరిచేయవచ్చుననే అప్పటి వైద్యుల వాదనను మొదలంటా విమర్శించారు. తీవ్రమైన నేరాలు చేసినవారిని ఔషధాల పరీక్షలో వాడుకోవాలని తన ఆత్మకథ  లో ఆమె   సూచించటం shocking  గా ఉంటుంది.  ఆవిధంగానైనా వారివల్ల సమాజానికి ఉపయోగం జరుగుతుందని. పశ్చాత్తాపం, పాపప్రక్షాళన వంటి క్రైస్తవ సూత్రాలకి విరుద్ధంగా ఆమె సమర్ధించే శిక్ష తూర్పుదేశాల న్యాయాన్ని పోలిఉంటుంది.

అగాథా క్రిస్టీ- Power and illusion అనే విస్తృతమైన పరిశీలన చేసిన R.A.York ఇలా అంటారు- ” సాహిత్యం,సర్వత్రా కాదుపోనీ, ప్రధానంగా – సంఘటనలకీ సందర్భాలకీ ఎక్కువ చేసిన అర్థాన్ని [exaggerated significance ] ఇస్తుంది. చాలాసార్లు చదువరికి తెలియనివీ అంతుబట్టనివీ కూడా సాహిత్యం లోకి వస్తాయి.  చదువరి అటువంటప్పుడు ఏం చేయగల రో అన్నదానితో కూడా అక్కడ నిమిత్తం లేకపోవచ్చు . ఎటువంటి తీక్షణమైన సందర్భాలనైనా అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఒకటి ఉంది. ” ఇది ఇలాగే జరుగుతుంది , ఇదివరలో జరిగింది ” అని తెలుసుకోవటం అది. మానవసంబంధాలు, స్పందనలు -  ఆ నేపథ్యంలో  ఇంకొంచెం మెరుగుగా ఉంటాయి.   జీవితపు అనంతత్వం లోంచి, వైపరీత్యం లోంచి- ఒక  అంతస్సూత్రాన్ని రాబట్టటం  డిటెక్టివ్ నవల చేయగలదు. సాధారణత్వం నుంచి ప్రత్యేకతకీ,  నైతికత నుంచి కళాత్మకత కీ ప్రయాణించటం మామూలు నవలలో ఎంత సాధ్యమో   డిటెక్టివ్ నవల లో కూడా అంతే సాధ్యం ” . కాస్త ఎక్కువగా, ఇంకాస్త గజిబిజి గా అనిపించినా  ఆయన అన్నదానిలో నిజం ఉందని నాకు అనిపిస్తుంది.

York ఇంకా అంటారు – ” ఒప్పుదల సాహిత్యానికీ ప్రశ్నించే సాహిత్యానికీ విభజనరేఖ అంత స్పష్టమైనది కాదు ‘’

క్రిస్టీ పాత్రలు అహంకారం తో ఉండవు గానీ,   శక్తివంతంగా ఉంటాయి . Larger than life  పాత్రల మీద ఆమెకి గౌరవం. ఆమె మనలాగా లేని, మనకు అర్థం కాని- మనుషుల గురించి ఎక్కువే రాశారు.  ఇంకొంచెం చురుకుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగితే జీవితం ఎలా ఉండగలదో కూడా  చెబుతారు.

ఆమె నవల ఒక మానసికక్రీడ. ఇందులో రచయిత్రి,  చదువరి ఇద్దరూ గెలుస్తారు. చదివేందుకు సిద్ధపడినప్పుడే  మోసపోయే అంగీకారం ఉంటుంది. ఆ మోసం చేయబడటమే చదువరి గెలుపు.  ఆమె రాసినవి నూటికి తొంభైతొమ్మిది శాతం rewarding mysteries.

అగాథా క్రిస్టీ రచన ప్రారంభించేనాటికి Sherlock Holmes  కి చాలా ప్రసిద్ధి ఉంది.  [ Sir Arthur Connan Doyle  ఆ తర్వాత పదిహేనేళ్ళు జీవించారు ] Watson వంటి సహాయకుడిగా  Hastings ని సృష్టించినా, Holmes ఏది అవునో అది కానివాడిగా తన డిటెక్టివ్ ని రూపొందించారు ఆమె. ఆ వైరుధ్యం కొంత తమాషాగా ఉంటుంది కూడా. Holmes  యువకుడు, సన్నగా పొడుగ్గా ఉంటాడు. క్రిస్టీ సృష్టించిన Poirot  మధ్యవయసు దాటినవాడు, పొట్టిగా బట్టతలతో కాస్త బొద్దుగా ఉంటాడు. Holmes  భౌతికమైన ఆధారాలను వెతుకుతాడు. Poirot వాలుకుర్చీలో కూర్చుని ‘  మెదడు లోని బూడిదరంగు కణాలకి ‘ పనిపెడతాడు.  వేరు  వేరు విషయాలలో  అపారమైన పరిజ్ఞానం,అనంతమైన మేధాశక్తి  , వీటితోబాటు కాస్త అతిశయం, పద్ధతిగా కనిపించటం పట్ల ఎక్కువ పట్టింపు- కూడా ఉంటాయి  అతనిలో. అయితే   పూర్తిగా ‘ సత్పురుషుడు ‘ – చివరి నవల లో న్యాయాన్ని కాపాడేందుకు ఎందాకా వెళ్ళగలడో రాస్తారు .

నేరపరిశోధన రెండు విధాలు. ఒకటి చెదురుగా ఉన్న జిగ్-సా పజిల్ ముక్కలని ఒక పద్ధతిలో అమర్చి పూర్తి రూపాన్ని తీసుకురావటం. రెండోది పురావస్తుపరిశోధన వంటిది. ఒక చిన్న ఆధారం తో మొత్తం పరిస్థితిని అంచనాకట్టి కూర్చటం. నేరం జరిగిపోయి చాలాకాలం అయిపోయాక ఈ పద్ధతి మాత్రమే పాటించవలసి ఉంటుంది. రెండు రకాలుగానూ Poirot  నెగ్గుకువస్తుంటాడు.Poirot  కనిపించే మొదటినవల ‘ Mysterious affair at Styles ‘  1916 లో, తన ఇరవై ఆరవ ఏట రాశారు.  అతను 1975 లో పుస్తకం లో చనిపోతే క్రిస్టీ 1976 లో మరణించారు.

మానవస్వభావం, ప్రవర్తన – ఇవి అన్నిచోట్లా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయని క్రిస్టీ నమ్ముతారు. ఒకప్పుడు అలా జరిగింది కనుక మళ్ళీ అలా జరిగే అవకాశం ఉంది అన్నది ఆమె theme . ఆ రెండు సందర్భాలలో పోలిక పట్టటం తో సగం పని అయిపోతూ ఉంటుంది. ఇలా చే యగల వ్యక్తి Miss Marple .[  ఇద్దరు ప్రసిద్ధులైన డిటెక్టివ్ లని సృష్టించిన ఘనత కూడా క్రిస్టీ దే ]. Miss Marple  మొదటి నవలలోనే వృద్ధురాలుగా దర్శనమిస్తుంది. రచయిత్రి అమ్మమ్మ ఈ పాత్రకి నమూనా అంటారు .  చిన్న పల్లెటూరు St. Mary Mead  లో జరిగేవే కొద్ది మార్పులతో అన్నిచోట్లా జరుగుతాయని ఆమె నమ్మకం. Poirot  కంటే ఈమె కి అపనమ్మకం ఎక్కువ , తానొక సినిక్ నని  ఒప్పుకుంటుంది. అయితే ఆ అనుమానంలో అనారోగ్యం లేదు, అనారోగ్యాన్ని గుర్తించటం ఉంది.

Tomy and Tuppence అనే డిటెక్టివ్ దంపతులనీ Parker Pyne అనే మరొక పరిశోధకుడినీ కూడా ఆమె సృష్టించారు. తనకి తనే పారడీ గా Ariadine Oliver ని తయారు చేశారు. Mrs Oliver  వేషభాషలు, రూపురేఖలు క్రిస్టీవి లాగానే ఉంటాయి. ఇద్దరూ తీరికవేళల్లో ఆపిల్ పళ్ళు తింటూ ఉంటారు.  డిటెక్టివ్ పుస్తకాలు రాయటమే తెలుసుగానీ నిజమైన పరిశోధన అంటే తెలియదని తనని తనే వెక్కిరించుకుంటారు క్రిస్టీ.  Poirot దయ వల్ల Mrs Oliver  చిక్కుల్లోంచి గ ట్టెక్కుతూ ఉంటుంది.

ఆమె పూర్తిగా భద్రమహిళ [ lady ]. తన విశ్వాసాలనీ ఆలోచనాధోరణినీ రాసినదానిలోకి తెచ్చారు. తెలియనిదానిపట్ల, ఇష్టంలేనిదాని పట్ల -  అనాసక్తి కొన్నిచోట్ల  కనిపిస్తుంది, కొన్నిచోట్ల  అసహనమూ కనిపిస్తుంది. సాంఘికంగా ఆమె సంప్రదాయవాది. విడి విడిగా మనుషుల గురించి చెప్పేటప్పుడు మటుకు లోచూపు, వైశాల్యం ఉంటాయి [ముఖ్యంగా Mary Westmaacott పేరుతో రాసిన   నవలలలో ] . ఇదొక వైరుధ్యం గా తోస్తుంది… ఆమె పెరిగిన, జీవించిన కాలం అటువంటిది. అయితే మర్యాదస్తులకీ గౌరవనీయులకీ మధ్య తేడా ఆమెకి స్పష్టంగా తెలుసు.

తనకు పూర్తిగా  అర్థమైన వాటి గురించే రాశారు. నలభై యేళ్ళు దాటాక మధ్యప్రాచ్యదేశాలలోనూ ఈజిప్ట్ లోనూ కొంతకాలం గడిపారు- అక్కడి నేపథ్యం అప్పటి నవలలో ఉంటుంది. అయితే ఏ మనిషినీ యథాతథంగా పుస్తకం లోకి దించటం తన వల్ల అవదని ఆమె చెబుతారు. మొదటి భర్త ఆర్చిబాల్డ్ క్రిస్టీ పట్టు పట్టటం వల్ల The man in brown suit లో ఆయన వంటి పాత్రను సృష్టించాననీ కానీ అది అట్టే దూరం సాగలేదనీ అంటారు.

సంభాషణలు క్లుప్తంగా సహజంగా ఉంటాయి.  పాత్రలు మాట్లాడిన చాలా మాటలకి ఒక ప్రాముఖ్యం ఉంటుంది, ఆ తర్వాత జరిగేదానిలో.  చిన్న చిన్న వివరాలను గమనిస్తూ రాయటం ఆమె ప్రత్యేకత. రాసేది అపరాధశోధన కనుక అది అవసరం కూడా.  కాని అంతకుమించిన వాతావరణ కల్పన చాలా సాధికారంగా ఆమె రచనలో ఉంటుంది. ఆ దృశ్యం లోకి చదువరి వెళ్ళి తీరతారు,  పాతకాలపు ఇంగ్లీష్ పల్లెటూళ్ళలో -  ఆ ఇళ్ళలో జీవిస్తారు. ఇంగ్లీష్ పల్లెటూరి వాతావరణం లో నిశ్చింతని ఆమె అమూల్యంగా, అత్యవసరం గా చూశారు. ఆ కాలం గడిచిపోయి మరి తిరిగిరాదని తెలిశాక కూడా ఆమె రచనలు చదవటం అదే సురక్షితత్వాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆమె సాహిత్యం ఆకర్షణీయంగా ఉండటానికి ఇదొక ముఖ్యకారణంగా చెబుతారు. ఆ వాతావరణం అలా ఎప్పుడూ లేదని   [అంతా ప్రశాంతంగా ఉంటే హత్య ఎందుకు జరుగుతుంది ?] వాదించేవారూ ఉన్నారు. కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పటి ఫాంటసీ నవలలో alternate reality, alternate worlds- ఆనందింపచేసే పద్ధతిలోనైనా తీసుకోవచ్చు. ఆమె రియలిస్ట్ రచయిత్రి కాదుకద, దోషం లేదు..

ఆమె వచనం చాలా స్పష్టంగా, సూటిగా ఉంటుంది. అన్ని భాషలలో అనువాదం వీలవటానికి ఆ సరళత్వం కారణం. శైలి ప్రవహిస్తుంది. మధ్య మధ్యలో అర్థవంతమైన మంచి పదాలు, కాస్త పెద్దవే వాడతారు. పదసంపద పెరిగేందుకు ఆమె రాసినవి చదవమని కొందరు పిల్లలకి సూచించాను, ఫలితం వచ్చింది కూడా. ఆమె రచనలలో చాలాభాగం పన్నెండు నుంచి పద్దెనిమిదేళ్ళ పిల్లలు కూడా నిక్షేపంగా చదవదగినవి .  నావరకు నాకు ఇంగ్లీష్ కాస్తయినా పద్ధతిగా రాయగలిగేందుకు ఆమె తోడ్పడ్డారు.

పాత్ర చిత్రణ చాలా ప్రతిభావంతంగా ఉంటుంది. ఒక పాత్ర ప్రవేశించాక దాదాపుగా ఎటువంటి అసంగతాలూ కనిపించవు. దేని ప్రాముఖ్యం ఎంత ఉండాలో కొలిచినట్లు అంతే ఉంటుంది. సన్నివేశాల అల్లికలో ఆమె శిల్పి. కథ జరిగే పరిసరాలు చాలాసార్లు ఆ మూడ్ కి తగినట్లే ఉంటాయి. అవును, stylization.  నాటకీయత [దాని సరైన అర్థంలో ] ఉట్టిపడుతూఉంటుంది కనుకే చాలా నవలలను ఆమే స్వయంగా నాటకాలుగా మలచారు. విడిగా నాటకాలు కూడా రాశారు, అటువంటి కొన్నిటిని Charles Osborne వంటి వారు మళ్ళీ నవలలుగా  తీసుకొచ్చారు.

సరైన పదచిత్రాలను సరైన ఎడం తో వాడారనీ అవి చదువరిని ఒక విధమైన హిప్నోసిస్ లోకి తీసుకుపోతాయనీ ప్రయోగాలు చేసి తేల్చారు. వినేందుకు వింతగా తోచినా- శబ్దానికి, మాటకి ఉన్న శక్తి ఈ దేశం లో పుట్టినవారికి కొత్త విషయం కాదు. నవల ప్రారంభం లో ఒకలాగా, ఉత్సుకత పెరుగుతూ ఉన్నప్పుడు మరొకలాగా, ముగింపులో ఇంకొకలాగా -ఒక అధ్యాయం లో పదాల సంఖ్య మారుతుంద నీ,   అందువల్ల చదువరి ఆసక్తి తగ్గకుండా ఉంటుందనీ NLP కి సంబంధించిన పరిశోధనలో తెలి సింది .చాలా తెలివైనవారూ నూటికి నూటయాభై పాళ్ళు ఇంగితజ్ఞానం ఉన్నవారూ కనుక అలా కుదిరి ఉండవచ్చు.

తను స్వయంగా మంచి చదువరి కనుక ఇటువైపునుంచి ఊహించి రాసిఉండవచ్చు. ఇటువంటిది ఒకటి 4.50 from Paddington అనే నవలలో ఉంటుంది. ఒక మృతదేహం ఎక్కడ ఉండి  ఉంటుందో కనుక్కోవటం లో తను హంతకుడినైతే  ఎక్కడ దాస్తానో ఊహించానని Miss Marple చెప్పుకుంటుంది. అసలు మెరుపు ఆ తర్వాత ఉంటుంది – ” ఈ సంగతి కొత్తదేమీ కాదు. మార్క్ ట్వేన్ ఒక పుస్తకం లో రాశారు, తప్పిపోయిన గుర్రాన్ని వెతకటం లో నేనే గుర్రాన్నైతే ఎక్కడికి వెళతానూ అని ఆలోచిస్తారు ఆయన ”  అని  ఆమె అంటుంది.

Dorothy L Sayers వంటి తక్కినవారి రచనలలోలాగా ‘ హత్య ‘ నవల ప్రారంభం లోనే జరిగిపోయి, హంతకుడిని వెతకటమే కథ అన్నట్లుగా ఉండదు. పాత్రల ప్రవర్తన వల్ల,  వారి మధ్య సంఘర్షణ వల్ల -  దురాశో, ద్వేషమో మరొకటో మొదలవటం, పరిసరాలలో, వాతావరణం లో ఆ ‘ కీడు ‘ ధ్వనించటం – ఇదంతా జరుగుతుంది. హంతకులు అనుమానించదగిన పాత్రలలోనూ అసలు సంబంధం లేదనిపించేవారిలోనూ- రెండు రకాలుగానూ ఉంటారు. ముగింపు ముందు రాసుకుని వెనక్కి వచ్చి కథ అల్లేవారని అంటారు . ఇవ్వవలసిన ఆధారాలని ఆమె తప్పకుండా ఇస్తారు. చదువరి సరిగ్గా ఊహిస్తారో లేదో వారి  అంచనాలనుబట్టి ఉంటుంది. నావంటివారికి ఊహించటమే ఇష్టం ఉండదు, ఆమె కి లోబడిపోవటమే హాయిగా  అనిపిస్తుంది. Dylan Thomas వంటి కవి , సగం ఆక్షేపణ గానే అయినా అన్నారు- “Poetry is not the most important thing in life… I’d much rather lie in a hot bath reading Agatha Christie and sucking sweets.”

హత్య-  చావు తోనూ దానిని అంటిఉండే శోకం తోనూ ముడిపడినది అయినా కూడా, ఆమె నవలలలో చావు భయాన్ని కలిగించదు. ‘ అంతే కదా ‘ అనిపిస్తుంది. అది అగౌరవం కాదు, అంగీకారం. హింస చాలా తక్కువ మోతాదులోనే ఉంటుంది. రచయిత్రి, చదువరి కూడా కొంత దూరం నుంచే గమనిస్తున్నట్లు ఉంటుంది.  ఆమె రాసిన ఏదీ ‘ దుర్భరంగా ‘ ఉండదు.

సుఖంగా గడిచిన వ్యక్తిగత జీవితం లో – ఇష్టపడి పెళ్ళాడిన మొదటి భర్త మరొక స్త్రీ ప్రేమలో పడి విడాకులు అడగటం ఆమెకి పెద్ద అఘాతం. స్వభావరీత్యా సిగ్గరి అయిన ఆమె పక్కవారి సానుభూతికి దూరంగా పదిరోజులపాటు అదృశ్యమయారు.  ’’Dogs are wise. They crawl away into a quiet corner and do not rejoin the world until they are whole once more ‘’  అని ఒక నవలలో అంటారు. అయితే గొప్ప జీవనలాలస ఉంది ఆమెలో. ” నాకు జీవించటం ఇష్టం. ఘోరమైన, దుర్భరమైన దిగులుతో కుమిలిపోయిన రోజులు ఉన్నాయి, కాని వాటన్నిటిలోనుంచీ- జీవించి ఉండటం అన్నదే గొప్పసంగతి అని తెలుసుకున్నాను ” అనీ అంటారు. త్వరలోనే తేరుకుని విదేశాలు పర్యటించి మరొకరిని పెళ్ళాడి జీవితాంతం అతనితోనే సంతోషంగా ఉన్నారు. అయితే అంతకు ముందు, ఆ తర్వాత – రచనలో భేదం- సూక్ష్మంగా చూస్తే, కనిపిస్తుంది. సహజంగానే తర్వాతి రచనలో అవిశ్వాసం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ రెండో వివాహం జరిగిన 1930 నుంచే Mary Westmacott పేరుతో డిటెక్టివ్ కాని నవలలు ఆరు రాశారు. మొదటిదైనAbsent in the spring  చేదుగా ఉంటుంది. Kate Chopin నవల The Awakening  ని గుర్తు చేస్తుంది . మామూలుగా రాసే పద్ధతిలో తన క్రుంగుదల ని, అయోమయాన్ని  చెప్పే అవకాశం లేక కొంత- అప్పటి ధోరణిలో  సీరియస్ సాహిత్యాన్ని రచించటం తనవల్లా అవుతుందని తనకి తాను చెప్పుకోవటం కోసం కొంత- ఆ నవలలు రాసిఉంటారనిపిస్తుంది. వాటిలో అస్తిత్వపు వెతుకులాట, పరాయి కావటం – ఇవన్నీ ఉంటాయి. Edith Wharton ,  Somerset Maugham  ల  ఛాయలు కనిపిస్తాయి.  ఆ నవలలేవీ ఎక్కువ విజయం సాధించలేదు, ఆమె పేరుతో నిలిచి ఉన్నాయి అంతే . కాని చక్కని పనితనంతో ఉంటాయి, చదవదగినవి.

66 మిస్టరీ నవలలు,153  కథలు, పదిహేడు నాటకాలు , నాలుగు రేడియో నాటకాలు, ఒక టెలివిజన్ నాటకం రాశారు . విపులంగా రాసుకున్న ఆత్మకథ, పురావస్తుశాస్త్రజ్ఞుడైన రెండవ భర్తతో చేసిన పర్యటన  అనుభవాలతో రాసిన’ Come, tell me how you live ‘ – ఆపకుండా చదివిస్తాయి.

ఆమె రచనలలో జాతివివక్ష ఉంటుందనే అభియోగం ఉంది.  సగటు బ్రిటిష్ పౌరులకి ఉండేటంతగా  ఆ లక్షణం ఆమెలో ఉన్నమాట నిజమే. అయితే ప్రాథమికంగా ఆమెలో తగినంత మానవత్వం ఉంది. ఇతరజాతుల ప్రసక్తి వచ్చినప్పుడు ఆ విషయమూ కనిపిస్తుంది.  స్త్రీవాది కారు.  స్త్రీలకి ఉపాధి ఉండితీరాలని ఆమె నమ్మలేదు.   కాని చదువుకున్న, సమర్థులైన స్త్రీపాత్రలను సృష్టించారు. పురుషపాత్రలకన్న స్త్రీపాత్రలే ఎక్కువ క్రియాశీలత్వం తో ఉంటాయి. బ్రిటిష్ సమాజం లోని వర్గ వ్యవస్థను ఆమె గౌరవించినమాటా నిజమే. అయితే ఇక్కడ తలచుకోవలసినదేమిటంటే- పాతది అంతా చెడ్డదే కాదు. బ్రిటిష్ సభ్యత క్షీణించటం తో ఒక ‘ విలక్షణమైన సంస్కృతి ‘ నశించింది. కొన్ని మర్యాదలు, కొన్ని గోప్యతలు, కొంత సౌజన్యం – ఇవన్నీ పోయాయి. దానికి చింతించినవారిలో ఆమె ఉన్నారు.

కొన్ని నవలలలో నర్సరీ rhymes  నీ, చాలా చోట్ల బైబిల్ నీ షేక్ స్పియర్, డికెన్స్ , టెనిసన్,టి.ఎస్.ఇలియట్, స్టీవెన్ సన్  లనీ కోట్ చేస్తారు.[ మరొకరి వాక్యాలను ఉదహరించటం ఆ స్థితిని సాధారణీకరించటం లో పనికివస్తుంది, తద్వారా పాఠకుడికి వేదన తగ్గుతుంది.  ] ఆమె రచనలో Botticelli, AlmaTadema, Leighton, Waterhouse  వంటి చిత్రకారుల ప్రసక్తి వస్తూ ఉంటుంది. Wagener ఓపెరాలు ఉంటాయి. Chippendale, Heppelwhite వంటి ఫర్నీచర్ కళాకారులు కనిపిస్తారు. అప్పటి ఇంగ్లండ్ మధ్యతరగతి జీవితచిహ్నాలు అవన్నీ.  తెలియవలసిన విషయాలు కొన్ని ఒక వ్యక్తికి తెలియకపోతే అతను నిజంగా అతను కాదనీ అదొక  impersonation అనీ తేల్చేందుకు ఇటువంటివి వాడుతుంటారు కూడా.ఆమె  మంచి అధిక్షేప హాస్యం రాయగలరు. ప్రసిద్ధ హాస్య రచయిత పి.జి ఓడ్ హౌస్ తో సత్సంబంధాలు ఉండేవి. ఒకరి నవలలలో మరొకరి ప్రస్తావన ఉండటం సరదాగా ఉంటుంది. ఆమె తన నవలల పేర్లనీ పాత్రలనీ వేరే నవలలలో చెప్పుకోవటం ఉంది.[  పాత సినిమా లలో ' ఇతనెవరో అచ్చం హీరో నాగేశ్వరరావులా ఉన్నాడే '' అన్నట్లు అన్నమాట ] సరిపడా ఆత్మవిశ్వాసానికి అది గుర్తు.

“Who cares who killed Roger Acroyd  ?” [ Murder of Roger Acroyd , క్రిస్టీ నవలలలో ఒకదాని పేరు ] అని డిటెక్టివ్ సాహిత్యం ఏ మాత్రమూ నచ్చని Edmund Wilson  అనే  విమర్శకులు గొంతు చించుకున్నారు. ‘’ So many, so many ‘’ అని పాఠకులు సమాధానం చెబుతూనే ఉన్నారు . పుస్తకాలు తిరిగి తిరిగి ముద్రించబడుతూనే ఉన్నాయి . నాటకాలుగా, సినిమాలుగా, టివి సీరీస్ లుగా ఆ రచనలకి వైభవం ఆమె గతించిన ఈ నలభైయేళ్ళలో తగ్గలేదు.

అగాథా  అవార్డ్ 1989 లో నెలకొల్పబడింది. ఆమె పద్ధతిలో రాసే మిస్టరీ నవలలకి- సాధారణ, తరుణవయస్కుల, చారిత్రక విభాగాలలో బహుమతులు ఇస్తారు. నియమాలు ఇవి- బట్టబయలు శృంగారం ,  బీభత్స  మైన హింస ఉండకూడదు, హింస చేసి ఒకరు సంతోషించినట్లు రాయకూడదు. [ఇటువంటివి ఉంటే మాకు వద్దనే స్పష్టమైన జ్ఞానం వారికి ఉన్నట్లుంది. ] 2010 లో జపాన్ లోకూడా  తమ దేశానికి అగాథా క్రిస్టీ అవార్డ్ పెట్టుకున్నారట.

ఇంతకూ ఆమె పనిచేసింది  క్లిష్టమైన విభాగం లో, సంక్షుభిత కాలం లో . యుద్ధాలతో తల్లకిందులవుతున్న ప్రపంచం లో – హత్య, దానికిముందూ వెనకా ఉండే అరిషడ్వర్గాలు- వీటి మధ్య చదువరికి ఒక పజిల్ ని కల్పించాలి,  పట్టి లాగుతూ కథ చెప్పాలి, నిజం తెలిసినప్పుడు తనే తెలుసుకున్నంత ఆనందాన్ని కలిగించాలి.  ఆఖర్న ‘  పర్వాలేదు, బతకచ్చు  ‘ అనే ధీమాని ఇవ్వాలి . అక్కడితో అంతా అయిపోయిందా ? అయిపోదని అందరికీ తెలుసు. ప్రపంచం అనిశ్చితమనీ  ఆ తర్వాతా ఆ మనుషులకి కష్టాలు రావచ్చనీ ఎవరికి తెలియదు ? ఆ చదివిన రెండు వందల పేజీలు మనకేమి ఇస్తాయో మనకి నిజంగా తెలియదా ?

**** (*) ****