ఫస్ట్ పర్సన్

చదువొక్కటే నా కాలక్షేపం

జనవరి 2013

కారా మాస్టారుగా చిరపరిచితులు కాళీపట్నం రామారావు గారు. తెలుగు కథకి పెద్ద దిక్కు. శారీరకంగా అలసిపోతున్న వయసులో కూడా పుస్తకం చదవకుండా/ కథ గురించి ఆలోచించకుండా ఇప్పటికీ వొక్క రోజు గడవదు ఆయనకి- ‘వాకిలి’ ఫస్ట్ పర్సన్ శీర్షిక కోసం మేం అడిగే అయిదారు రోజువారీ ప్రశ్నలకు ఆయన సమాధానాలివి. కారామాస్టారు మాట్లాడ్డమే పొదుపుగా, ఎడిట్ చేసినట్టుగా మాట్లాడతారు. క్లుప్తంగా ఇవీ ఆయన మాటలు.

 

కారా మాస్టారు గారితో ఫోన్ లో అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు:

ఇప్పటి దినచర్య: కథానిలయంనుండి దూరంగా చోడవరంలో వుంటున్నాను. వయసు 89. అందుచేత వెనకటి ఓపిక లేదు. ఒక కన్ను ఒక చేయి పని చేయదు. అయినా చదువుతున్నాను. కథానిలయం పనుల వత్తిడి వలన చాలా పుస్తకాలను చదవాలనుకున్నవి చదవలేక పోయా. ఆ పని ఇప్పుడు చేస్తున్న. మహా భారతం పూర్తయింది.

ఇప్పటి చదువు: మహాభారతం చదువుతున్నా పత్రికలలో వచ్చిన కథలు రెగ్యులర్ గా చదువుతున్నాను. అభిమానులు, కథా రచయితలు పంపిన కథా సంపుటాలు చవుతున్నాను. ఈ మధ్య చదివిన వాటిలో కన్నెగంటి చంద్ర కథల సంపుటి “మూడో ముద్రణ” impress చేసింది.

(కాళీపట్నం రామారావు)

ఇప్పటి కాలక్షేపం: చదువొక్కటే నా కాలక్షేపం. అలాగే నా దగ్గరకు వచ్చిన కథా రచయితలు అమ్మిపెట్టమన్న సంపుటాలు నన్ను చూడ వచ్చిన అభిమానులకు ఇస్తూ వుండడం.

కథ గూర్చి ఇప్పుడేమనుకుంటున్నారు.: తెలుగు కథ చాలా అభివృద్ధి చెందింది. కథకుల సంఖ్య బాగా పెరిగింది. బాగా రాస్తున్నారు. సంతృప్తికరంగా వుంది.

ఇటీవల వచ్చిన వాటిలో నచ్చిన కథ: ఒక కథంటూ చెప్పలేను, జ్నాపకశక్తి వుండడం లేదు. రెండు మూడేళ్ళలో వచ్చినవి గుర్తులేవు. ఈ మధ్యవి చెప్పగలను హైదరాబాదునుండి దళితుల సమస్యలపై రాస్తున్నఆయనా దళితుడే అనుకుంటా సతీష్ చందర్ కథలు నచ్చుతున్నాయి. కథ 2011 లో ఆయన తప్పు కథ వుంది.