ప్రత్యేకం

ఒక గుండుబాబు కథ!

జనవరి 2015

రణ్యంలో దుందుభి మోత మారుమోగింది. సన్నగా రివటలా ఉన్న గురువుగారు దర్పంగా కొలువులోకి వేంచేశారు. అవటానికి పొడుగ్గా ఉన్నా ఆ గురువు పేరు మాత్రం చిన్నమయ్య. ఆ చిన్నమయ్య తో బాటు వరుసగా శిష్యులూ వచ్చారు.

దుందుభీ హై జయా
దుంధురా హై గురూ
ఉగ్రా, పగ్రా, దద్ధోలకా, కుడ్యాసురా …

అటెండెన్సు పూర్తయ్యాక వ్యాకరణపాఠం మొదలెట్టాడు గురువు. “సుప్తిజంతమ్ పదమ్” సంస్కృతంలో పదమంటే సుప్ (noun), తిజ్ (verb) ల సమాహారం. అందులో సుప్ లో అకారాంత పుల్లింగ శబ్ద రూపపు సుప్ విభక్తి ప్రత్యయాలను పలికించాడు.

సు ఔ జస్ (రామః రామౌ రామాః)
అం అఔ చస్ (రామం రామౌ రామాన్)
ఇన భ్యాం భిస్ (రామేణ రామాభ్యాం రామైః)
య భ్యాం భ్యస్ (రామాయ రామాభ్యం రామేభ్యః)

కొలువులో ఉన్న లంబుజంబూలనే శిష్యరాక్షసపరమాణువులకు ఈ శబ్దాలు కొరుకుడుపడలేదు. వారిని గురువు అదుపులో పెట్టబోయాడు. అసలే రాక్షసులు. పైగా ఘటోత్కచులవారి కొలువులో ఉన్నారు. వాళ్ళూ తగ్గలేదు. గురువు చుట్టూ చేరి నానాఅల్లరీ మొదలెట్టారు.

ఇంతలో గంభీరమైన ధ్వని. పక్కనే ఉన్న ఘటం భీకరంగా మోగింది. ఆపైన ఓ విచిత్రాకారము, ఓ గంభీరమైన పద్యమూ ఒకదాని వెంట మరొకటి వచ్చేయి.

సీ ||

అష్టదిక్కుంభికుంభాగ్రాల పై మన
కుంభధ్వజము గ్రాల కూడ వలదె,
గగనపాతాళలోకాలలోని సమస్త
భూతకోటులు నాకె మ్రొక్కవలదె,
ఏ దేశమైన నా ఆదేశముద్రపడి
సంభ్రమాశ్చర్యాల జరుగవలదె,
హై హై ఘటోత్కచ! జైహే ఘటోత్కచ!
యని దేవగురుడె కొండాడవలదె,

గీ ||

ఏనె యీ ఉర్వినెల్ల శాసించవలదె
ఏనె యైశ్వర్యమెల్ల సాధించవలదె,
ఏనె మన బంధుహితులకు ఘనతలన్ని
కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదె!

ఆతడు పాడిన తేటగీతిలో మూడవపాదంలో యతిభంగం! అవును మరి యతులకూ, రాక్షసులకూ చుక్కెదురు కదా!

***

ఓస్, మాయాబజారు సినిమా అని ఇప్పటికే మీరు గుర్తుపట్టేశారని తెలుసు. తెలుగు సినిమాలలో పౌరాణిక విలన్లలో మొట్టమొదటిసారి ప్రేక్షకుడి చేత ఈలలు వేయించిన నటుడు మన సామర్లకోట వేంకట రంగారావు అనబడే ఎస్వీఆర్ గారు. ఇన్ని యేళ్ళయినా సరికొత్తగా కనబడిన ఆ ఘట్టంలో ఆయన ఆహార్యం ఇదీ.

గమనించవలసిందేమంటే పౌరాణిక ఘటోత్కచుడు “ఉత్కచం ఘటం యస్య సః” అంటే – తల బోర్లించిన కుండలా, హాలీవుడ్ నటుడు యూల్ బ్రిన్నర్ లా లేదా అధమపక్షం అమ్రేష్ పురిలా ఉండాలి. కానీ ఈ ముఖ్యమైన సంగతిని ఇటు మాయాబజారు డైరెక్టరు గారే కాక ప్రాచీన కవులూ అంతగా పట్టించుకున్నట్టు లేరు.

ఘటోత్కచుడు మహాభారతపాత్ర కాబట్టి తెలుగు మహాభారతమూ, వ్యాసులవారి వర్ణనా, ఇటు నాటకసాహిత్యంలో భాసుని ఘటోత్కచ వివరణలనూ కూసింత పరిశీలించి, పరిశోధించి ఘటోత్కచం పై ఈకలు పీకుదాం. ఏవంటారూ?

***

నరవరుఁడైన భీమువలనం బ్రభవించె హిడింబకున్ సుతుం
డురుతరభీమరూపుఁడు ఘటోత్కచనాముఁడు విస్ఫురద్భయం
కరవదనంబు శంకునిభకర్ణములున్ వికృతాక్షులుం బయో
ధరవర వర్ణమున్ వికటదారుణదంష్ట్రలు నొప్పుచుండఁగన్.

(ఆదిపర్వం 1-143-27)

విస్ఫురత్ భయంకరవదనంబు విశేషంగా ప్రకాశించే భయంకరమైన ముఖము, శంకువువంటి చెవులు, వికృతమైన కన్నులు, కారుమేఘంలా ఒళ్ళు, గొగ్గిరిగా, దారుణంగా ఉన్న కోరలు ఇదీ ఆయన అవతారం. ఇదంతా కాక భీముని సుతుడు ఉరుతరభీమరూపుడు అంటే మహాభీకరుడు తండ్రిని మించిన కొడుకు!

కొడుకో కూతురో పుట్టగానే పేరు పెట్టడం కోసం ఈ రోజుల్లో తల్లిదండ్రుల్లాగా “సరీసృప్”, “భయానక్”, “ముష్టీశ్వర్”, “దిగ్భ్రాంత్” లాంటి వరైటీ పేర్లను వెతుక్కునే సాంప్రదాయం ఆ రోజుల్లో లేదు. చూస్తూనే అతని రూపానికి తగ్గట్టు పేరెట్టెయ్యడమే. మనబాబుకు పుట్టగానే బోడిగుండు నిగనిగలాడుతున్నది. చూడగానే రెండవ ఆలోచన లేక ఘటోత్కచుడని పేరెట్టేశారు!

“గుండూ” అని ముద్దు పేరయితే బావుంటుంది కానీ అసలు పేరే అలా పెట్టి భీముడు, హిడింబీ అతనికి అన్యాయం చేశారు.

ఆ అబ్బాయి అలా పువ్వు పుట్టగనే పరిమళించి అటుపై కాయగా కూడా మారినట్టుగా మనవాడు వెంటనే పెరిగి పెద్దవాడైపోయి ఆనేకాస్త్రశస్త్రకుశలుడై, రాక్షసగణాన్ని వెంటేసుకుని పెద్దలకు నమస్కరించి భీమునికి యుద్దంలో సహాయపడగలనని మాట ఇచ్చి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయేడు.

ప్రధానపాత్రలకు న్యాయం చేకూర్చే రంధిలో మన గుండు బాబుకు పసితనాన్ని, ముద్దుముచ్చట్లనూ లేకుండా చేశారు మన నన్నయ గారు.

ఈ మధ్యకాలంలో ఘటోత్కచునిపై చిన్నపిల్లల ఏనిమేషన్ చలనచిత్రం ఒకటి వచ్చింది. బాలఘటోత్కచుడు “అంగళిక మంగళిడ డంగళిక” అంటూ మాయలు చేసిన ఆ చిత్రం పిల్లలను బాగా ఆకర్షించింది. ఇలాగయినా ఇప్పటి తరం ఆ ఘటోత్కచుని ముద్దుముచ్చట్లను తీర్చింది.

చిన్న మాట. ఇందాకట్నుంచీ “మన” గుండు బాబు అంటున్నాను. అలా అనడానికి కారణం ఉందండోయ్. ఘటోత్కచుని భార్య పేరు అహిళావతి. ఈమె నాగకన్య. నాగులంటే ఆంధ్రులని ప్రతీతి. అది నిజమని మనలో మనం ఫిక్సయితే ఘటోత్కచుడు తెలుగు వారి అల్లుడుగా కలిపేసుకోవచ్చు.

ఇప్పుడు మన మాయాబజారు ఘటోత్కచుల వారి కిరీటం చూడండి. నాగముద్ర గమనించారుగా! మనవాడు భార్యను అలా నెత్తిన పెట్టుకుని చూసుకునేంత మంచివాడు. అదన్నమాట! ఆ అహిళావతి అందచందాల గురించి మనకు తెలీదు. పోనీలెండి ఏదో గంతకు తగ్గ బొంత. ఈ దంపతులకొక కొడుకు. వాడి పేరు బార్బరీకుడు.

తిరిగి కవులవిషయానికి వద్దాం. తెలుగు వారై ఉండీ మన నన్నయ్య గారు అలా మన తెలుగు అల్లుడికి అన్యాయం చేశారు. వ్యాసభగవానుడు కొంచెం మెరుగు.

ప్రజజ్ఞే రాక్షసీ పుత్రం భీమసేనాత్ మహాబలమ్
విరూపాక్షం మహావక్త్రం శంకుకర్ణం విభీషణమ్ ||
భీమనాదం సుతామ్రోష్టం తీక్ష్ణదంష్ట్రం మహాబలమ్
మహేష్వాసం మహావీర్యం మహాసత్త్వం మహాభుజమ్ ||
మహాజవం మహాకాయం మహామాయమరిందమమ్
దీర్ఘఘోణం మహోరస్కం వికటోద్వద్ధపిండికమ్ ||

పెద్ద పెద్ద కళ్ళూ, తీక్ష్ణమైన కోరలు, శంకువుల్లా చెవులూ, బలమూ, పెద్ద పెద్ద భుజాలూ, అందమైన ఎర్రని పెదవి, మహాసత్వుడు, మహావీరుడు, బండ గొంతువాడూ, బండ శరీరమూ, బండ ముక్కూ ఇలా ఒక ఫ్లో లో మంచీ చెడు లక్షణాలన్నీ కలిపి చెప్పేశారు.

(మనలో మాట. అరిందమః అరిన్ దమయతీతి అరిన్దమః అంటే శత్రువులను జయించెడువాడు. అప్పుడే పుట్టిన పిల్లవాడికి శత్రువులేమిటి? జయించడమేమిటి? ఇది ఫ్యూడల్ పచ్చిభావజాలప్రతీక. ఈ సాకుతో వ్యాసులవారిని కసితీరా తిట్టుకునే అవకాశం మార్క్సిస్టులకు కలుగుగాక)

ఒక విషయానికి మనం నిజంగా కే వీ రెడ్డిగారిని మెచ్చుకోవాలి. ఎస్వీరంగారావు గారి ఆహార్యం డిసైడ్ చేసేప్పుడు కోరలూ, అవీ లేకుండా ఎంచక్కా అందగాడుగా, అదే సమయంలో భీతావహుడుగా తీర్చిదిద్దారు. నన్నయ్య గారి హీరోలా కారుమేఘంలా చేయక దబ్బపండు ఛాయలో మెరిసే ఎస్వీ యారు గారిని పెట్టేరు. ఘటోత్కచుని తల్లి రాక్షసి కాబట్టి నల్లగా కారుమేఘంలాంటి శరీరమని కవులు చెప్పేరు. తద్విరుద్ధంగా మాయాబజారు ఘటోత్కచునిది తండ్రి పోలిక. “ఛాంగురే బంగారు రాజా” అన్నట్టున తండ్రి రంగులో మనవాడినీ తీర్చిదిద్దారు. కిరీటం వెనకాల చిత్రమైన జుత్తు పెట్టేరు. తెలుగు “వాడి” స్టయిలుకు ప్రతిరూపంగా మీసమూ పెట్టేరు.

ఇక “బోర్లించిన కుండ” గారి భోజనాదికాల గురించి కూడా రెడ్డి గారు చాలా పట్టించుకుని విందుభోజనం లాంటి పాటను తెలుగువాళ్ళకంకితం చేశారు. ఇక్కడ ఒక్క గోంగూరను మినహాయించి, ఆ మినహాయించడాన్ని సినిమాలో మరొక్క పాత్రద్వారా ఎత్తి చూపిన సరసులు కేవీ రెడ్డి గారు.

మరోసారి మనం ఘటోత్కచుల వారి వర్ణనల కెళ్ళిపోదారి.

***

భాసకవి మధ్యమ వ్యాయోగం అనే ఏకాంకికలో ఘటోత్కచుని వర్ణిస్తాడు.

ఆ మధ్యమవ్యాయోగంలో మన ఘటోత్కచుని కథాకమామీషు ఇది. అదొక చీమలు, కాకులు దూరగలిగిన కారడవి. ఆ అడవికి అడ్డం పడి ఒక బ్రాహ్మడు, బ్రాహ్మణి, ముగ్గురు పిల్లలూ ఓ రోజు పొద్దున్నే పొరుగూరు వెళుతున్నారు. అంతలో ఒక భయంకరాకారం వారికి ఎదురయ్యింది. ఆ ఆకారం ఎలా ఉందో మొదట బ్రాహ్మడన్నాడు.

***

భోః కోऽను ఖల్వేషః (ఓ, ఎవడు వీడు?)

తరుణరవికరప్రకీర్ణకేశః భృకుటిపుటోజ్జ్వలపింగలాయతాక్షః
సతడిదివ ఘనః సకంఠసూత్రః యుగనిధనే ప్రతిమాకృతిః హరస్య ||

బాలభాస్కరుని కిరణాల్లా ఎర్రగా వ్యాపించిన కేశాలూ, కనుబొమలక్రింద వెలుగుతున్నట్టున్న ఎర్రటి కళ్ళూ, మేఘానికి మెరుపు ఉన్నట్టుగా మెడకు బంగారు నగ, ప్రళయంలో హరునిలా ప్రతిమాకృతి వీటిని కలిగినవాడు. ఎవడు వీడు?

(మొత్తానికి ఈయన వర్ణన శివునిపోలికలో ఉంది. ఈశ్వరునికి కూడా విశాలంగా అలలు అలలుగా ఎగిసే కేశాలేను. చివర్లో ఎలానూ మూర్తీభవించిన హరుడనేశాడు. బ్రాహ్మడు వయసులో పెద్దాయన కాబట్టి ఈ వర్ణనలో భయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.)

బోడిగుండును పట్టుకుని తరుణరవికరప్రకీ….ర్ణకేశః – నిడుపాటిశిరోజాలవాడు అనడం ఎంతబావుందో చూశారా? అదే అమ్మాయి అయితే “బాబ్డ్ హెయిర్ బిబ్బోకవతి” అన్నట్టుగా కృతకంగా ఉండేది.

బోడిగుండు వాడిని నిడుపాటిశిరోజాలవాడు అనటం క్రింద మరో గొప్ప రహస్యం దాగుండే అవకాశం ఉంది. అధర్వణవేదం తాలూకు ఒకానొక పణసలో “హెయిర్ ఇంప్లాంటేషన్” తాలూకు రహస్యం దాగుండి ఉండవచ్చునని తదజ్ఞుల భోగట్టా. బహుశా భాసకవికి ఆ విద్య తెలిసి ఉండవచ్చు. ఘటోత్కచుడికి ఆ విద్య ద్వారా తలపై వెంట్రుకలు నాటారని భాసకవి సూచిస్తూ ఉండే అవకాశం కొట్టిపారెయ్యలేనిది.

***

బ్రాహ్మని మొదటి కొడుకు వర్ణన ఇది.

కో ను ఖల్వేషః ?

గ్రహయుగళనిభాక్షః పీనవిస్తీర్ణవక్షః
కనకకపిలకేశః పీతకౌశేయవాసః |
తిమిరనివహవర్ణః పాండరోద్వృత్త దంష్ట్రః
నవ ఇవ జలగర్భో లీయమానేందులేఖః||

ఎవడితడు? వీడు రెండుకళ్ళూ రెండు గ్రహాల్లా ఉన్నాయి. విశాలవక్షము, బంగరు రంగు జుత్తూ, పట్టు పీతాంబరాలూ, చీకట్లా నల్లటి శరీరం, తెల్లగా పొడుచుకువచ్చిన దంతాలూ, కొత్తగా ఏర్పడిన మేఘం వెనుక దాగిన చంద్రలేఖలా ఉన్నాడు.

రెండుకళ్ళూ రెండు గ్రహాలు (సూర్యచంద్రులు), పట్టుపీతాంబరాలూ, నల్లటి మేఘం లాంటి శరీరం ఇవన్నీ విష్ణుమూర్తి లక్షణాలు.

మేఘం వెనుక దాగిన చంద్రుడు ఈ వర్ణన ఊహించుకోవలసిందే.

ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఏమంటే ఈ ఘటోత్కచుడు భీమహిడింబల సుతుడు. భీముడు చంద్రవంశపు రాజు. హిడింబి తిమిరానికి లేదా మేఘానికి ప్రతీక. ఈ ఘటోత్కచుడు మేఘం వెనుక చంద్రలేఖ అట! మొత్తానికి బ్రాహ్మని పెద్దబ్బాయికి మంచి కవి అయ్యే లక్షణాలున్నాయి.

(ఈ వర్ణనలో భయమూ, ఆసక్తీ కనిపిస్తున్నాయి. ఇంకా జీవితంలోకి అడుగుపెడుతున్న వాడి ప్రవర్తనకు తగిన వర్ణన లక్షణం ఇదీ!)

***

రెండవకొడుకు:

కలభదశనదంష్ట్రః లాంగలాకారనాసః
కరివరకరబాహుర్నీలజీమూతవర్ణః |
హుతహుతవహదీప్తః యః స్థితో భాతి భీమః
త్రిపురపురనిహన్తుః శంకరం ఏవ రోషః ||

ఏనుగు కొమ్ముల్లాంటి కోరలూ, కోటేరు ముక్కూ, ఏనుగు తొండంలా నల్లటి నిడుపాటి చేతులూ, హవిస్సును స్వీకరిస్తున్నట్టు మెరుస్తున్నాడు. భీమునిలా ఉన్నాడు.

త్రిపురాలను దహిస్తున్న శంకరునిలా రోషంగా ఉన్నాడు.

(వీడిది ఆసక్తి. ఏనుగు కొమ్ములూ, కోటేరూ, ఏనుగు తొండమూ, అమ్మ నిద్రపుచ్చడానికి చెప్పిన కథల్లోంచి ఏరుకున్న ఉపమానాలూ… భయం పొడసూపుతూంది. )

***

చివరివాడు:

భోస్తాత! కోను ఖల్వయమస్మాన్ పీడయతి| (ఓ నాన్నా, ఎవరితడు, మనల్నిలా సతాయిస్తున్నాడు?)

వజ్రపాతోऽచలేంద్రాణాం శ్యేనః సర్వపతస్త్రిణామ్ |
మృగేంద్రో మృగసంఘానాం మృత్యుః పురుషవిగ్రహః ||

పర్వతాలపై వజ్రపాతంలా, డేగ పక్షులపై పడ్డట్టుగా, జింకలగుంపుపై సింహం పడ్డట్టుగా, చావు రూపమైనట్టుగా ఉన్నాడు.

(చివరి వాడి శ్లోకం సంక్షిప్తంగా ఉంది. భయం అన్న భావన కంటే సమస్య అన్న భావన కనిపిస్తున్నది. పురాణకథలూ, జంతుపక్షులకథలతో ఉపమానాలల్లాడు. అతకంటే ఎక్కువగా విష్ణువనో, రుద్రుడనో చెప్పట్లేదు.)

***

చూశారుగా. ఘటోత్కచునికి భాసకవి ఎంత న్యాయం చేకూర్చాడో. ఈ ఘటోత్కచుని “అమ్మ” మాటకు ఎదురు చెప్పని వాడిగా భాసకవి తీర్చిదిద్దుతాడు. నాటకం చివర్న మనవాడు అమ్మనూ నాన్ననూ ఎన్నో యేళ్ళ తర్వాత తిరిగి కలుపుతాడు. వ్యాయోగం అంటే విశిష్టమైన కలయిక అని అర్థం.

ఆ ఘటోత్కచుడు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడన్నది భాసుని నాటకం చదివి తెలుసుకోవలసిందే.

భాసుని మరొకనాటకమైన దూతఘటోత్కచంలో ఘటోత్కచుడు పాండవుల దూత. అభిమన్యుడు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుని సందేశాన్ని దుర్యోధనునికి వినిపించడానికి కౌరవసభకు ఒక్కడే వెళ్ళి సందేశం వినిపిస్తాడు.

ఆ సందర్భంలో దుర్యోధనుడు ఘటోత్కచుణ్ణి రాక్షసుడివని ఈసడిస్తే ఘటోత్కచుడంటాడు. “మేము ఆకారానికి రాక్షసులమైనా నీ అంత క్రూరులము అధర్మవర్తనులము కాము. ఏ రాక్షసుడూ సోదరుడున్న ఇంటికి నిప్పు పెట్టడు. ఏ రాక్షసుడూ పుత్రసమానుణ్ణి అధర్మయుధ్ధంలో చంపడు. ఏ రాక్షసుడూ పరస్త్రీని స్పృశించడు. మేము జాతికి మాత్రమే రాక్షసులము”

మహాభారతయుద్ధంలో మన తెలుగింటి అల్లుడైన ఘటోత్కచుడుచివరకు కౌరవులకు చుక్కలు చూపించి చివర్న యుద్ధంలో కర్ణుని చేతిలో శక్తి అన్న ఆయుధానికి గురై మరణించాడు.

ఘటోత్కచుని మరణానికి అందరూ దుఃఖిస్తే శ్రీకృష్ణుడు సంతోషిస్తాడట. ఎందుకంటే అర్జునునికై ప్రత్యేకించిన “శక్తి” ఆయుధం వ్యర్థమయ్యిందని, యజ్జాలను ధ్వంసం చేసే దుర్మార్గవర్తనుడైన ఘటోత్కచుడు మరణించడం మంచిదేననీ శ్రీకృష్ణుల వారంటారు.

ఇవి పురాణకథలని సరిపెట్టుకున్నా, ఏదో మూల శ్రీకృష్ణుడు సంతోషపడటం …. ఊహూ…

ఎక్కడో గుచ్చుతోంది.
ఘటోత్కచుడు కృష్ణభక్తుడు కాడూ?
భాసుని ప్రకారం గొప్ప దూత కాడూ?
మాతృభక్తిపరాయణుడు కాడూ?
అర్జున ఫల్గుణ పార్థ భీభత్స బాబాయ్ కోసం ప్రాణాలు అర్పించిన వాడు కాడూ?
నేటి వెండితెర కథనం ప్రకారం శశిరేఖపెళ్ళి జరిపించిన వాడు కాడూ?

ఏదో, తన ఆప్తునికి దుఃఖాన్ని పోగొట్టి కర్తవ్యంలో పడెయ్యటం కోసం కృష్ణుడు అబద్ధం చెప్పాడంతే. అలా ఆయన ఎన్ని అబద్ధాలాళ్ళేదూ?

అంతా మాయ.

చిరంజీవ చిరంజీవ సుఖీభవసుఖీభవ
చిన చేపను పెనుచేప చినమాయను పెనుమాయ
అది స్వాహా ఇది స్వాహా..

అంతే కదా మరీ.

**** (*) ****