కవిత్వం

నిశ్శబ్దాంకురం

జనవరి 2015

లోన… ఉడికేదంతా ఉడుకనిద్దాం
తెర్లేదాన్నంతా తెర్లనిద్దాం
చిట్లి శిలగా మారేదాన్ని మారనిద్దాం!
చేతనావర్తన జాలుగా జారుతూ
ప్రాణ సారాన్ని అద్దుకుంటూ
గబ్బెడు నెత్తుటి కబుర్లుగానో
దోసెడు ఆనందపు జల్లులుగానో
ఉత్తేజితమై కురుస్తూ
మౌనంగా మూసివున్న మూకుడ్ని
పై కెగతన్నుతూ
భావనా యుతభాషగా పొంగిపొర్లుతూ
వొ అనుభవ సారాన్ని మనదైనముద్రగా
బయటకు తెచ్చే అంతరంగ ఉద్దీపకంగా!…
నేటి ధ్వంస యానంలో
కన్నీటి ప్రయాణంలో
చేరాల్సిన తీరాల్ని పసిగడుతూ
జీవించేందుకు మిగిలించేదేదో చెబుతూ
ఏకాకితనాన్ని సామూహికం చేస్తూ
వ్యవస్థీకృత చాదస్తపు బందిఖానాను బద్దలుకొడుతూ
నిస్సందేహపు విత్తులోంచి పోటమరించే
నిశ్శబ్ద వికసిత అంకురమే ‘కవిత్వం’