కథ

మేమూ, అమ్మలమయ్యాము

జనవరి 2015

రోజు దీపావళి అమావాస్య! వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఎంతో సంబరంగా జరుపుకొనే పండగ. రంగు రంగుల మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వల కాంతులతో అంతటా వెలుగే వెలుగు. ఈ వెలుగును చూడలేక చీకటికే భయంవేసి పారిపోయింది. గోదారి ఒడ్డున ఆనుకొని ఉన్న సన్నపాటి సందులో, ఓ పాతకాలపు మేడ మీద చిన్న వాటాలో ఉ౦టున్న సావిత్రి ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటూ కిటికీ లోంచి చూస్తూ…
“ఒసే! రాణీ! రోజూ లోకమంతా నిద్రపోవడానికి రాత్రికోసం ఎదురుచూస్తుంటే మనం బతకడంకోసం ఎదురుచూస్తాం, కాని ఈ ఒక్క రోజు మాత్రం అందరూ మేలుకొంటారు. తెల్లవార్లూ టపాకాయల మోత వినిపిస్తూనే వుంటుంది. ఈ దీపావళి పండగ చిన్నప్పడు ఎంతబావుండేదో! నాన్న ఏదో రకంగా కొంచమైనా టపాకాయలు కొని ఇచ్చేవాడు. నేనూ, తమ్ముడు కాల్చుకుంటూవుంటే అమ్మ ఎంత మురిపెంగా చూసుకొనేదో! నాన్న యాక్సిడెంట్లో పోవడం, అమ్మా, తమ్ముడు విషజ్వరాల బారినపడి చనిపోవడంతో నన్ను ఈ కంపెనీలోకి పారిజాతం తీసుకొచ్చి పడేసింది” అని నవ్వింది.

ఆ నవ్వులోని విషాదాన్ని ఒక్క రాణి మాత్రమే చూడగలిగింది. తక్కిన వాళ్ళు అదేదో జోక్ అనుకొని విరగబడి నవ్వారు. వెంటనే రాణి వాళ్ళతో “ఎందుకే అందరూ అంత విరగబడుతున్నారు? ఏం, అది నిజంకాదా? ఏం బతుకే మనది, వాడిన పూలలాగా, విసిరేసిన ఆకుల్లాగా ఎవడుపడితేవాడు” అని దుఃఖంతో ఎగశ్వాస వచ్చి గొంతు లోంచి మాట బయటకు రాలేదు.

వెంటనే సావిత్రి “పోనీలే రాణీ, వాళ్ళకు మాత్రం ఏమంత తెలుసనీ, ఏదో సరదాగా మాట్లాడుతున్నానని అనుకొని నవ్వారు”

“అది కాదు సావిత్రక్కా! ఏదైనా అద్భుతం జరిగి ఆ దేవుడు మనల్ని ఈ రొంపినించి బయటపడేస్తే ఎంత బావుంటుందో కదా!”

ఇంకా ఏదో అనబోతుంటే సావిత్రి వారిస్తూ “రాణీ! పగటికలలు కనడం మానేయి. పారిజాతానికి తెలిస్తే ఈ ఉన్న నీడ కూడా పోయి రోడ్డున పడతాం. మనకి అంత అదృష్టం కూడానా!” అని చెప్పి, మళ్ళీ తనే “ఈ కార్తీకమాసం అంతా మన రాజమండ్రీ, గోదావరి కూడా కళకళలాడిపోతూ వుంటాయి. రేపటినుంచి కార్తీక స్నానాలు మొదలవుతాయి. గోదావరిని చూస్తూవుంటే మా అమ్మ గుర్తుకొస్తోంది. అచ్చు అమ్మలా అన్నీకడుపులో దాచుకొంటుంది” అని దీర్ఘంగా నిట్టూర్చింది.

“అవును అక్కా” అంటూ రాణి, సీత, లక్ష్మి మొదలైన వాళ్ళు వంతపాడారు.

అలా కిటికీ లోంచి గోదావరిని చూడటం సావిత్రికి ఎంతోఇష్టం. అందుకే కొత్త ఇంటికి మారటానికి కూడా ఇష్టపడటంలేదు. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ గోదావరిని చూస్తూ తనలో తనే ఎన్నోచెప్పుకుంటుంది.

ప్రతి ఏడాదీ కార్తీకమాసం నెల్లాళ్ళు గోదావరిలో స్నానం చెయ్యడం సావిత్రికి అలవాటు. తెల్లారగట్లే లేచిన సావిత్రి, రాణి తోడు రాగా ఇద్దరూ కలిసి గోదావరి స్నానానికి వెళ్లారు. ఇంటినుంచి పట్టుకెళ్లిన వత్తులు, నూనె, హారతి కర్పూరం, అగరొత్తులు వున్న బుట్టను అక్కడే వున్న ఒక సాధువును చూస్తూ వుండమని చెప్పి, ఇద్దరూ నదిలో దిగారు. చల్లటి నీళ్లను తాకేసరికి వణుకు మొదలయింది. ఒక్కసారి “శివశివా” అంటూ దేవుడిని తలచుకొని ఇద్దరు చేతులు పట్టుకొని ముక్కు మూసుకొని మూడుసార్లు మునకేసారు.

మొదటి రోజు కావటంతో చాలా మందే వున్నారు. స్నానం కానిచ్చుకొని ఇద్దరూ మెట్లెక్కి గోదావరి మాత విగ్రహం పక్కనే వున్న ఆడవాళ్ళు దుస్తులు మార్చుకొనే గదుల వైపుకి వెళ్లారు, వాళ్ళు అటువైపు వెళ్ళడం చూసిన కానిస్టేబులు కనకరాజు “ ఓరిని, వీళ్ళు పారిజాతం కంపెనీ లో వాళ్ళు కదా!” అనుకొంటూ దగ్గరగా వెళ్లి వాళ్ళే అని నిర్ధారణ చేసికొని “ఏంటే? మీరు ఇక్కడ కూడా బేరాలు మొదలు పెట్టేసేరా?” అంటూ లాఠీని అడ్డం పెడుతూ వాళ్ళని హేళన చేసాడు.

దానికి సావిత్రి దెబ్బతిన్న కుందేలు పిల్లలా బెదురుగా చూస్తూ “అదేంటి కనకరాజుగారు అలా అంటారు? ఇవ్వాళ నుంచి కార్తికమాసం కదా! ఈ నెల రోజులు గోదార్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని గుళ్ళో పూజారి గోరు చెప్పారు కదండీ, అందుకని పొద్దున్నే వచ్చామండి” అని అమాయకంగా అంది.“అద్గది అలా చెప్పండి! చేసేవి అన్నీ చీకటితప్పులు, వాటిని ఇలా గోదారి స్నానాలతో కడిగేసుకుని పుణ్యం మూటకట్టుకుంటారన్నమాట! అమ్మమ్మా..ఎంత జాణలే మీరు? దేవుడికే ఎసరు పెట్టేస్తారే? థూ!” అని బూతులుతిడుతూ “వెళ్ళండి వెళ్ళండి అసలు మీ లాంటి వాళ్ళ వల్లే ప్రపంచ౦ ఇలా తయారయింది” అంటూ లాఠీని వాళ్ళమీద కదిలిస్తూ అక్కడనుంచి వెళ్లి పోయాడు.
ఆ మాటలు విన్న సావిత్రి, రాణి కళ్ళనీళ్ళపర్యంతం అయ్యారు.

“పొద్దున్నే వీడితో మాటలు పడ్డాం! మన లాంటి వాళ్ళకు గుడికి వెళ్ళే హక్కు కూడా లేదా? మనకి బతకడానికి వేరే దారి లేక ఈ రొంపిలో ఉన్నాము గాని ఇష్టమై రాలేదు కదా! అయినా, వీళ్లు ఏం పాపం చెయ్యలేదా? అన్ని పుణ్యాలే చేశారా? ఈ కనకరాజు గురించి ఊర్లో అందరూ ఎలా చెప్పు కుంటారని, మొదటి పెళ్ళాన్ని ఈయనే చంపాడనీ, పోలీసు ఉద్యోగంలో వున్నాడు కాబట్టి వాళ్ళ కాళ్ళూ వీళ్ళ కాళ్ళూ పట్టుకొని తన మీదకి కేసు రాకుండా చూసుకొన్నాడనీ, తెగ ఇదిగా మాట్లాడుకుంటారు, అలాంటిది,వీడి వెనకాల ఇంత చరిత్ర పెట్టుకొని మనల్ని అంటాడా? ఏం కట్టుకున్న దానిని చంపటం మహా పాపం కాదా? వీడి లాంటి వాళ్ళని వదిలేసి ప్రపంచ౦ మనలాంటి వాళ్ళని ఎందుకు ఆడి పోసుకుంటుందో” అని ఉక్రోషంగా అంది రాణి.

“పోనిలే వదిలెయ్యి రాణి! అంతా ఆ దేవుడే చూసుకొంటాడు. వాడి పాపమే వాడిని కొడుతుంది” అని సావిత్రి అంది.

కానిస్టేబులు కనకరాజు వీళ్ళిద్దరినీ గదమాయించడం కొంచెం దూరంగా నించుని వున్న ఓ 60 – 65 ఏళ్ళు వయసు కలిగిన పెద్దాయన చూస్తూనే వున్నాడు. కొంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తూ మౌనంగా అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

ప్రతిరోజు క్రమం తప్పకుండా తెల్లారగట్లే వచ్చి స్నానాలు చేసి గోదావరిలో కార్తికదీపాలు వదిలేవారు. తమకు ఈ జీవితంనుంచి విముక్తి కావాలని ఆ శివుడిని వేడుకొనే వారు. ఇలా వీళ్ళిద్దరూ రోజూ ఆ రేవుకి వచ్చినప్పుడు ఆ పెద్దాయన వీళ్ళని చూడటం సావిత్రి, రాణి కూడా గమనించారు. అతనిని చూస్తే తమలాంటి వాళ్ళదగ్గరకు వచ్చే మనిషిలా అనిపించలేదు. ఆయన స్ఫురద్రూపి, ఆజానుబాహుడు, దబ్బపండు ఛాయలోవున్నాడు. చూస్తేనే చెయ్యెత్తి దండం పెట్టాలి అనేటట్టు వున్నాడు. కాని తమని ఎందుకు అలా చూస్తున్నాడో వాళ్ళకి అర్ధం కాలేదు. ఆయన చూపులో కాని శారీరక బాష లో గాని ఏ మాత్రం అసభ్యత కనిపించలేదు. పైగా, ఆయన చూసే చూపులో కరుణనీ, ఆర్ద్రతని సావిత్రి గమనించింది.

ఆ రోజు కార్తికపౌర్ణమి. ఆ పవిత్రమైన రోజున జనసందోహం ఎక్కువగా వుంటుంది కాబట్టి దర్శనం తొందరగా అవదు అనే భయంతో ముందే వచ్చారు. ఇంతలో వాళ్ళకి మళ్ళీ ఆ కానిస్టేబులు కనకరాజు కనిపించాడు. “అబ్బా! అక్కా! మళ్ళీ వీడి పాలన పడ్డామా, ఇంతే సంగతులు” అంది రాణి.

“ఇవాళ మనలని ఏమన్నా అనాలి ఇక్కడే వాడి అంతు చూద్దాం!”కరకుగా అంది సావిత్రి.

కొంచెం దూరంలో స్నానంచేసి మెట్లు ఎక్కి పైకి వస్తున్న ఆ పెద్దాయన వీళ్ళ మాటలు విని “అమ్మా ముందు మీరు వెళ్లి స్నానం చేసి ఆ దేవుడి దర్శనం చేసుకొని రండి”అన్నాడు.

గంభీరంగా వినిపించిన ఆ గొంతు ఇద్దరినీ కూడా మారు మాట్లాడకుండా నది వైపు వెళ్ళేలా చేసింది.వాళ్ళిద్దరూ స్నానం చేసి దర్శనం చేసుకొని వచ్చేవరకు ఆయన ఆ గోదావరి మాత విగ్రహం దగ్గరే వున్నాడు. గుడినుంచి బయటకు వస్తున్న వాళ్ళిద్దర్నీ చూసి ఆయన వాళ్ళ దగ్గరగా వెళ్లి “అమ్మా! ఇలా రండి. ఈ మెట్ల మీద కూర్చోండి” అనగానే ఇద్దరు మొహమొహాలు చూసుకొన్నారు.

మళ్ళీ ఆయనే “ అమ్మా! భయపడకండి! నాకు మీ గురుంచి అంతా తెలుసు. మిమ్మల్ని నేను కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నాను. ఆ గుళ్ళో పూజారిగారు మీ గురుంచి మీ మంచితనం గురుంచి కూడా చెప్పారు. ఒక మారు ఆ పోలీసాయన మీతో మాట్లాడింది కూడా విన్నాను. అది లోక నైజం. మీరు బాధపడకండి. మీరు ఒప్పుకొంటే మీకు నచ్చని ఈ జీవితాన్ని వదిలేసి తల్లి ప్రేమను పంచే భాద్యత గల జీవనం సాగించగలరా? అదీ మీకు ఇష్టమైతేనే! ఇందులో ఏ మాత్రం బలవంతం లేదు. దానికి ముందు నా గురించి మీకు విపులంగా చెపుతాను. నేను ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాను. బాగా చదువుకొన్నాను, పెళ్లిచేసుకొన్నాను, విదేశానికి వెళ్ళాను. అక్కడే ఇద్దరు మగపిల్లలుకూడా పుట్టారు. అలా నా జీవితం పూల నావలా సాగిపోతుండగా మన దేశానికి వచ్చిన నా భార్య యుక్తవయస్సు వచ్చిన నా పిల్లలిద్దరూ కూడా అప్పుడు జరిగిన మతోన్మాదుల మారణహోమంలో మరణించారు. అది యెంత దారుణంగా అంటే వాళ్ళ శరీరాలని కూడా గుర్తు పట్టలేనంతగా . ఆ పరిస్థితి పగవారికి కూడా రాకూడదు. అయినవాళ్ళని అందరిని ఒక్కసారే పోగొట్టుకొన్న దురదృష్టవంతుడిని. ఆ విధంగా జీవచ్ఛవంలా పడివున్న నాకు ఒక మహాను భావుడు ధైర్యం చెప్పి “ఇలాంటప్పుడే గుండెనిబ్బరంగా వుండాలి! చూడు చాలా మంది నీకంటే దయనీయమైన పరిస్థితి లో వున్నారు. వాళ్ళందరికి చేయూతనివ్వు . అదే నీకు శాంతి కలిగిస్తుందని” చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలకి నిజంగానే నా మనసు శాంతించింది.

నా లాగా ఎంతో మంది వున్నారు. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలని కోల్పోయిన తల్లిదండ్రులు. అదిగో అప్పుడు వచ్చింది నాకు ఒక ఆలోచన . అదే ‘అమ్మఒడి’ని స్థాపించడం. అందుకే విదేశంలో వున్న నా ఆస్తులన్నీ కూడా అమ్మేసి, డబ్బు చేసుకొని ఇక్కడికే వచ్చాను. ఇది నా స్వంత ఊరు. ఇక్కడ నాకు ఒక పెద్ద ఇల్లు కూడా వుంది. ఆ ఇంటినే ఇప్పడు ‘అమ్మఒడి’ గా మార్చాను. ఈ ఊరిలోవున్న పేరుమోసిన డాక్టర్లు, ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా నాకు చేయూత నిచ్చారు. ఇంకా ఈ లోకంలో మంచి, మానవత్వంవున్నాయనిపించింది. ఈ మహత్తర కార్యంలో ఆ మానవతా మూర్తులు తమ పూర్తి సహాయ సహకారాలను అందించారు. అయితే నా దగ్గర చిన్నచిన్న పిల్లలు చాలా మంది వున్నారు. వాళ్ళకి అమ్మ కావాలి, వాళ్ళకోసం అమ్మల్ని దత్తత తీసుకోవాలని నిశ్చయించుకొన్నాము. అంటే ఆ పిల్లలకి జీవితాంతం అమ్మగా వుండటానికి ఇష్టపడే వాళ్ళని తీసుకొందామని అనుకొన్నాను. ఇదిగో! ఈ గోదావరి మాత సాక్షిగా నాకు మీరు కనిపించారు. చెప్పండమ్మా! ఆ అనాధ పిల్లలికి తల్లులవుతారా? ఆ చిన్నారి జీవితాలలో వెలుగు నింపుతారా? మీకు పూర్తిగా రక్షణ కలిపిస్తాను. మీ గురుంచి ప్లీడరుగారి తో కూడా మాట్లాడతాను. మీరు ఎవరికీ భయపడనక్కరలేదు. మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతకొచ్చు. ఆలోచించి నాకుచెప్పండి” అని “అమ్మా! నా పేరు విశ్వనాధం. ఇది నా కార్డ్. ఇందులో నా ఫోన్ నం, అడ్రస్ అన్ని వున్నాయి. మీరు నాకు ఎప్పుడైనా సరే ఫోన్ చెయ్యచ్చు ‘అమ్మఒడి’ మీకోసం ఎప్పుడూ తెరిచే వుంటుంది” అని చెప్పి అతను వెళ్ళిపోయాడు.

సావిత్రి, రాణి ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకి వచ్చారు. విశ్వనాధం చెప్పిన మాటలు మళ్ళి ఒక్కసారి మననం చేసుకొన్నారు.

“నేను ఆ రోజునే అన్నాను కదా అక్కా!,ఏ దేవుడో మనల్ని ఆ రొంపి నుంచి బయట పడేస్తాడని,అలాగే జరిగింది.”

“అవునే రాణి! నిజంగా ఇది అద్భుతమే! ఆ విశ్వనాధం గారు మనపాలిట దేవుడే, అడగకుండానే మన కు ఇంత మంచి వరాన్ని ప్రసాదించారు”. అని భక్తిగా తలచుకున్నారు.

వాళ్ళ మనో నేత్రాలకి “తాము కనకుండానే అమ్మతనంలోని మాధుర్యాన్ని చూపించే అమాయకమైన చిన్నారులు అమ్మా! అమ్మా!’ అని పిలుస్తున్నట్లుగా అనిపిస్తోంది. “మేమూ అమ్మల మయ్యాము’ అని ఈ లోకం లో తలెత్తుకుని గర్వంగా బతకొచ్చు.ఆ పసికందుల కళ్ళలో కనిపించేబోయే ఆనందాన్ని, వాళ్ళు గోదావరిలో వదిలిన కార్తికదీపాలతో పోల్చుకుంటున్నారు. చీకటిని చీల్చుకొంటూ ముందుకు సాగిపోతుంటే ఆ దీప కాంతుల తళతళలూ, పున్నమి చంద్రుని వెన్నెల కిరణాలతో పోటి పడుతూ వారిరువురికి ఆశాకిరణాలుగా మారి, ఆనందబాష్పాలై వారి కళ్ళలో మెరిసాయి.

ఆ మెరుపుల్లో తాము కోరుకొంటున్న సుస్థిరమైన, గౌరవప్రదమైన అందమైన జీవితచిత్రం కదలాడింది.

**** (*) ****


పరిచయం:
హైదరాబాదులో నివాసం. సాహిత్యమంటే ఇష్టం. 2010 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఉద్యోగం నుంచి బయటపడ్డాను. అప్పటి నుంచి కధలు రాయాలనే అభిలాష తో రాసిన తొలి కధ “కృష్ణం వందే జగద్గురుం” కౌముది లో ప్రచురిచతమైంది. ఇప్పటి దాక దాదాపుగా పదిహేను కధలు రాసాను. నా కధలు ఆంధ్రభూమి, తెలుగువెలుగు, కౌముది, సారంగ, ఆంధ్రప్రభ.కాం, గో తెలుగు.కాం (హాస్యకధలపోటిలో ప్రధమ బహుమతి వచ్చింది) మాలిక.ఆర్గ్ లో , అచ్చంగా తెలుగు.కాం వంటి వివిధ పత్రికలలో వచ్చాయి. అప్పుడప్పుడు కవితలు కూడా రాస్తుంటాను. నాలో కలిగిన భావాలని నలుగురితో పంచుకోవాలన్న తపనే నన్నుమౌస్ పట్టేలా చేసింది. ఫేస్ బుక్ లో కథల పోటీ పెట్టిన కథాగ్రూపు, సాయిఅఖిలేష్ ప్రొడక్షన్స్ కి మరియు కథను ప్రచురిస్తున్న వాకిలి సంపాదకులకు కృతజ్ఞతలు.



21 Responses to మేమూ, అమ్మలమయ్యాము

  1. G.S.Lakshmi
    January 2, 2015 at 10:08 am

    బురదలో కూడా కలువపువ్వు వికసించే అవకాశ ముందని చాలా బాగా చెప్పారు మణీ.. అభినందనలు..

    • మణి వడ్లమాని
      January 2, 2015 at 10:19 am

      ధన్యవాదాలు లక్ష్మి గారు

  2. lakshmi
    January 2, 2015 at 3:30 pm

    చీకటిని చీల్చి ప్రకాసానిచ్చే దీపం లా ఇలాంటి అభాగ్యలకీ , వారి జీవితాలకి వెలుగు రేఖ ని చూపించే మహనీయులు కూడా ఉంటారన్న ఆశావాదాన్ని పెంపొందించేలా వ్రాశారు మణి . మీకు నా అభినందనలు మణి గారు

  3. మైథిలి అబ్బరాజు
    January 2, 2015 at 6:24 pm

    బావుంది మణి గారూ..చక్కని పరిష్కారం కదా

  4. January 2, 2015 at 8:53 pm

    Chaalaa baaga rasaru Mani garu.

  5. Padmavathi
    January 2, 2015 at 9:30 pm

    స్టోరీ చాలా బాగుంది. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది అన్న మెసేజ్ ఉంది కధ లో.

  6. Vijaya Karra
    January 2, 2015 at 11:44 pm

    బావుంది మణి! ఓ మంచి పరిష్కారాన్ని చూపించారు.

  7. మణి వడ్లమాని
    January 2, 2015 at 11:58 pm

    నా కధ నచ్చినందుకు ధన్యవాదాలు మైథిలీ గారు,ప్రసునగారు అండ్ పద్మా

  8. మణి వడ్లమాని
    January 2, 2015 at 11:59 pm

    లక్ష్మి గారు నాకధ నచ్చినందుకు ధన్యవాదాలు

  9. ఆర్.దమయంతి
    January 3, 2015 at 12:02 pm

    మణి!
    ముందుగా మీకు నా అభినందనలు.
    విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నందుకు.
    అసలు ఆడపిల్ల కి ఎలాటి అపవిత్రత అంటదు.
    నా దృష్టిలో ఆమె జన్మే అతి పవిత్రమైనది.
    పాపులు మునిగినంత మాత్రాన పావని గంగ మలినమౌతుందా? గోదావరి కలుషితమౌతుందా?
    మీ కథలో ఆ స్త్రీలయినా అంతే. – అని నా అభిప్రాయం.
    అమ్ముడుపోయిన ఆ శరీరాన్ని అమ్మ గా మార్చుకునే ఒక అపురూపమైన అవకాశం వారికి దొరకడం ఎంతైనా హర్షణీయం.
    ఇలా పుణ్యం కట్టుకున్న కథావైనం చాలా హృద్యం గా అనిపించింది.
    మీరు మరిన్ని పోటీ కథల విజేతలు కావాలని
    ఆశిస్తూ..ఆశీర్వదిస్తూ..
    ప్రేమతో
    మీ
    సోదరి.

  10. January 3, 2015 at 1:57 pm

    మీ కథ చాలాబాగుంది మణివడ్లమాని వదినగారు…మున్ముందు మీరింకా మంచి కథలు రాసి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.

    • మణి వడ్లమాని
      January 3, 2015 at 10:29 pm

      ధన్యవాదాలు భాగ్యశ్రీ గారు

  11. January 5, 2015 at 2:13 pm

    చాలా బాగా రాశావు మణీ. అభినందనలు.

  12. Sai Padma
    January 5, 2015 at 8:14 pm

    చాలా బాగుంది మణి గారూ .. పరిష్కారం దిశగా నడిపారు కథ ని

  13. mani Vadlamani
    January 5, 2015 at 11:39 pm

    థాంక్ యు Bhanu Mati గారు అండ్ Sai Padma

  14. Anasuya Kanneganti
    January 7, 2015 at 8:15 pm

    హాయ్ మణి..కధలో నాకు కొన్ని చిన్న చిన్న సందేహాలు వచ్చాయి ..సావిత్రి పాత కాలపు ఇంటిలో ఉంటుందన్నావు ..గోదావరిని చూస్తూ ఉండచ్చని ఇల్లు మారటం లేదు అన్నావు..పారి జాతం కంపెని మనుష్యులు అన్నావు ..పారి జాతం వింటే ఈ గూడూ ఉండదన్నావు ..ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తే బాగుండేది..జనరల్ గా కంపెనీ మనుష్యులు అంటే వాళ్లకి అంత స్వేచ్చ ఉంటుందా ? అనేది ఒక ప్రశ్న ..ఎందుకంటే పారిజాతానికి తెలిస్తే ఈ ఉన్న నీడ కోడా లేకుండా రోడ్డున పడతాం ” అనుకుంటారు వాళ్ళల్లో వాళ్ళు వాళ్ల మాటల్లో .అలాంటప్పుడు వాళ్ల మీద నిఘా ఉండి ఉండాలి ..కదా ..పైగా వాళ్ళు రోజు గోదారి స్నానానికి వెళ్లి , గుళ్ళో పళ్ళు ఇచ్చేంత స్వేచ్చ ఉన్నప్పుడు , వాళ్ళు ఏదో అద్భుతం జరగాలని , తాము ఈ రొంపి నుంచి బయట పడాలని కోరుకుంటారు వాళ్ల మాటల్లో ..వాళ్ల మీద ఏమాత్రమూ నిఘా లేకపోవటంతో ..వాళ్ళు గుడికి, స్నానానికి రాగలిగినప్పుడు ..వాళ్ళు ఎవరో వచ్చి తమని బయటికి లాగుతారని ఎదురు చూసే అవసరం ఏముంది..తాము చేస్తున్న వ్రత్తిని వాళ్ళు రొంపిగా భావిస్తున్నప్పుడు బయటికి రాగలిగిన స్వేచ్చ వాళ్ళకి ఉంది కదా..?

  15. Sivakumara Sarma
    January 17, 2015 at 8:51 pm

    సమస్య(లు), పరిష్కారం, సందేశం – ఈ మూడింటినీ మేళవించిన కథ ఇది. సమస్యలు: 1) వేశ్యా జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వద్దామనుకునేవాళ్లకి జీవనోపాధి కల్పించడం, 2) అనాధలైన పిల్లలకి తల్లిబాధ్యతని తలకెత్తుకునే స్త్రీలని జతకూర్చడం. పరిష్కారం: అందుకు తగిన వనరులని సమకూర్చడం. సందేశం – అందరూ ఇలాంటి సమాజదోహద కార్యక్రమానికి చేయూత నివ్వాలనడం.
    అయితే, మంచిపనిని ఎవరు మొదలుపెట్టినా దానికి చేయూత నివ్వచ్చు గానీ, పరిష్కారం విదేశాన్నుండీ వచ్చి స్వదేశంలో కుటుంబాన్ని పోగొట్టుకున్న వ్యక్తిద్వారా మొదలుపెట్టడంతో, రెండు సందేహాలు కలుగుతాయి: 1) సమాజంలో అందరూ మంచిపనిని ఇంకొకళ్ళు – ముఖ్యంగా విదేశాన్నుండీ వచ్చినవాళ్లు – మొదలుపెట్టాలని చూస్తున్నారని రచయిత్రి చెప్పాలని అనుకుంటున్నారా? 2) విదేశాన్నుంచీ వచ్చినవాళ్లు గూడా అంత విధి వైపరీత్యానికి గురవుతే గానీ ఎవరూ ఇలాంటి కార్యక్రమాలని చేపట్టరన్నఅభిప్రాయాన్ని ఈ కథ వ్యక్తం చేస్తోందా?
    “ఆయన స్ఫురద్రూపి, ఆజానుబాహుడు, దబ్బపండు ఛాయలోవున్నాడు.” అన్న వాక్యం యద్దనపూడి సులోచనారాణిగారి హీరోల వర్ణనని గుర్తుకు తెచ్చింది. అయితే, ఆమె హీరోలు ఇరవయ్యోపడిలోనో ముఫ్ఫయ్యోపడిలోనో వున్నవాళ్ళు. ఇక్కడేమో అరవయ్యేళ్ళ వ్యక్తి. ఆ వర్ణన అవసరం లేదు గదా!
    “నా లాగా ఎంతో మంది వున్నారు. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలని కోల్పోయిన తల్లిదండ్రులు.” కథ అంతా అమ్మ ఒడిగూర్చి వున్నప్పుడు విశ్వనాధంగారిలాంటి మిగిలిన తండ్రుల ప్రసక్తి కథలో అపరిష్కృతంగా మిగిలిపోయింది.

  16. January 21, 2015 at 11:16 am

    మణి గారూ ..
    కథ కొంచం ఆదర్శవంతం గా ఉంది , ఇలాంటి పరి్ష్కారాలు అందరికీ దొరకవు కదా ..
    దమయంతి గారు చెప్పినట్టు ..స్త్రీలకి ఏ పాపం అంటదు అని నేనూ నమ్ముతాను ..
    ఈ వ్యవస్థ లో ఎందరో ఇలాంటి మహిళలు ?
    చదివించే కథ ..

    వసంత లక్ష్మి ..

  17. January 21, 2015 at 11:56 am

    గోదావరి నదిలో పూజలు చేస్తే , వారికి పరిష్కారం దొరికింది అని చూపడం ..కొంచం అతిశయోక్తి లా ఉంది ..నాకైతే ..
    స్త్రీల శరీరం తో వ్యాపారం చేసే వారు ..ఈ వ్యవస్థ కి చీడ పురుగులు ..వీరు ఏదో పాపం చేసుకుని ,ఈ వృత్తి లోకి రాలేదు ..
    పెట్టుబడ్ లేని వ్యాపారం అని ..ఆడవారు ఈ పనికి తెగిస్తారు ,చాలా సార్లు , తమ ప్రమేయం లేని చిక్కుల లో చిక్కుకుని ..
    ఇంత సులభం గా వారికి పరిష్కారం కుదిరుతుందా ?
    కొంచం ఆలోచించండి ..మణీ ..ఒక్కరి మంచితనం వల్ల దొరికే పరిష్కారం ,సమస్య కి జవాబు చూపించదు ..
    సార్వజనీకమైన పరిష్కారం ఉండాలి ..
    కథ రాసి ,ఈ ఆలోచనలు రేకెత్తించి నందుకు ..అభినందనలు ..మణీ ..మీకు ..
    వసంత లక్ష్మి

  18. padma
    March 22, 2015 at 2:41 pm

    మాడం,
    మీరు రాసిన కథ చదువుకోవడానికి బాగుంటుంది. కానీ, వాస్తవంగా కాదు. ఎంత మంది నిర్భాగినులు ఇందులో కుల్లిపోతున్నారో? అందులో లేనివాళ్ళు అహా ఒహో అనుకోవడానికి బాగుంటుంది ఈ కథ అంటే. క్షమించండి.

    • మణి వడ్లమాని
      June 1, 2015 at 11:17 pm

      పద్మగారు, ముందుగ నా కధ చదువుకోవడానికి బాగుందని అన్నందుకు ధన్యవాదాలు. కొడుకును(తండ్రి ఎవరో తెలియదు) స్కూల్ కి పంపడానికి శరీరాన్ని తాకట్టు పెట్టి చదివించిన తల్లుల ను చూసాను. ఒక వాస్తవ కధని ,కొద్ది మార్పులతో రాసాను. ఊరు,సంస్థ ,మనుష్యుల పేర్లు చెప్పడం యెంత మాత్రం ఉచితం కాదు.అన్నసూత్రానికి కట్టుబడి ఉన్నాను..

Leave a Reply to lakshmi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)