చెట్ల ఆకులు
కాలం రెక్కల్లా కదులుతున్నాయి
కొమ్మల సందుల్లోంచి
గతం గాలి వీస్తున్నది.
కొండలు
ఆకాశానికి రాసే ప్రేమలేఖల్లా
మేఘాలు సాగుతున్నాయి.
ఆ పొగమంచును
ఎవరైనా ఊదేస్తే బాగుండును
ప్రేయసిని తొలిసారి కలిసిన
అపురూపమైన శిలావేదిక కనిపించేది.
చెడ్డీలోంచి ప్యాంట్లలోకి వస్తున్న
నునులేత ప్రాయంలో
ప్రతీ తలుపూ
ఒ పిలుపులాగే ఉండేది
ఇవాళ
యవ్వనం వెనుకకు జరుగుతూ
సంధ్య సౌభాగ్యం ముందుకొస్తున్నది.
ఆమె జ్ఞాపకాలు
ఫ్లవర్ వాజ్ లోని పువ్వుల్లా
విప్పారుతున్నాయి
ఉజ్వలంగా వెలిగే కళ్ళకింద
కాలం నల్లని గీతలు గీస్తున్నది.
అద్దానికి ముద్దొచ్చే క్రాఫ్ ముంగురులు
ఒక్కొక్క మెట్టే దిగుతున్న
కాలం అడుగుల్లా ఉన్నాయి.
ఉద్వేగ గీతాలు
మంద్రస్వరంలోకి మారుతున్నాయి.
కాలమా! చిన్నబుచ్చుకోకు
నన్ను ఓదార్చే ప్రయత్నం చెయ్యకు
నీకు తెలియని రహస్యమొకటి
నాకు తెలిసింది
నేను ప్రేమించింది ప్రేయసిని కాదు
నాలోని ప్రేమని.
కాలం ఆడుగు లో కలిచి పో కుండ ప్రీమను కాపాడుకోవడం ఎంతో గొప్ప
చక్కని కవిత.
తెలుగు లో ఒక ఆన్లైన్ పత్రిక వుందని నాకు ఇప్పుడే telsindi. సత్యప్రకాష్ గారికి ధన్య వాదాలు