కడిమిచెట్టు

ఉత్తరసీతాచరితం- హృదయాహ్లాదిని కుందమాల

జనవరి 2015

మల్లెపూలదండ చల్లటి ఉపశమనాన్ని ఇస్తుంది- ఆ ప్రేమికులతోబాటు, వారి విరహం దహించే మన మనసులకి కూడా… తాత్కాలికంగా కాదు, ఎప్పటికీ. దయలేని మనుషుల వలన పడిన అన్ని ఇడుములూ ఈ ముగింపులో విచ్చిపోతాయి. అమ్మా నాన్నా కలుసుకోవటమే – కుశలవులకి లాగే మనకీ , రాజ్యాభిషేకం.

ఉత్తరకాండ చివరలో సీత విరక్త అయి తల్లి దగ్గరికి వెళ్ళిపోవటం, ఎంత కాదనుకున్నా , విషాదాంతమే- మనుష్యలోకపు కథగా చదువుతున్నప్పుడు . మానవాతీతమైన భాష్యాలు ఎన్ని వెతకబోయినా, ఆ మర్యాదా పురుషోత్తముడి చరిత్ర పురుషార్థాని కి కూడా సంబంధించినది కాదా?

అసలు వాల్మీకి రచన యుద్ధకాండ వరకేననీ, తర్వాతి కథ చాలా కాలం తర్వా త చేర్చబడిందనీ బలమైన వాదనలు ఉన్నాయి. అవి ఎంత తీవ్రమైనవంటే- సీతారాముల ఆ యాతన – ఆత్మ హింస ను సమర్థించే జైనానికీ సంసార విసర్జనను బోధించే బౌద్ధానికీ అనుగుణంగా, ఆ మతాలు ప్రారంభమైన అనంతరం సీతారాములని అలాగ యాతన పెడుతూ ఉత్తరకాండను చేర్చారని అనే వారున్నారు. జీసస్ క్రైస్ట్ మానవుల కోసం శిలువ మీద మరణించినట్లు శ్రీరాముడు ప్రజల కోసం భార్యను వదిలి జీవన్మృతుడవటాన్ని – క్రైస్తవం ప్రవేశించిన తర్వాత రామాయణం లో ప్రక్షిప్తం చేశారనీ ఉంది. కొందరు శ్రీ వైష్ణవుల ఇళ్ళలో రామాయణ పారాయణమంటే కేవలం బాలకాండను పఠించటం.ఆనంద స్వరూపుడైన పరమాత్ముని అవతారాన్ని కల్యాణాంతంగా మాత్రమే వారు గ్రహిస్తారు. భారతీయ కావ్యశాస్త్రాల దృష్టితో చూస్తే శోకం తో ఏ కృతీ ముగియదు. ఇతిహాసమైన మహాభారతం శాంత రసం లో పర్యవసిస్తుంది. శ్రీరామ పట్టాభిషేకం తో కాక మరొకలాగా రామాయణం అంతమవటం, [ కేవలం ] కావ్యగతబుద్ధులైనవారికి , కనీసం – కొంగున కట్టుకున్న నిప్పు. ఆ నిష్కారుణ్యాన్ని భరించలేక రాముడిని దూరం పెట్టుకున్నవారున్నారు.

ఏది సత్యం, ఏది అవాల్మీకం అన్న విచికిత్సను పక్కన ఉంచితే- ఆ కథ అలాగ సౌఖ్యంగా పరిణమించటాన్ని తమ హృదయం లో దర్శించి నాటకాన్ని సృజించిన కవులు ఇద్దరు. ఒకరు ప్రసిడ్ఢులైన భవభూతి. ఆ ఉత్తరరామచరితం కరుణరసప్రధానమయి కూడా సుఖాంతమైన నాటకం. అక్కడ రాముడు భగవంతుడు, ఆయన చర్య అనివార్యం .అందులోని సీతారాముల అనురాగాన్నీ అవిభాజ్యతనూ భారతీయులంతా ఎప్పటికీ స్మరించుకుంటారు.

అయితే అటువంటి ముగింపును మొదట ఊహించినది భవభూతి కారు. ప్రసిద్ధిలో రెండవవారైనా ఆ కల్పనను తొలుత అక్షరాలలో పెట్టినది దిజ్ఞాగుడు. ఆయన కురిపించిన కరుణ అందరిమీదా…తుడిచిన కన్నీరు మనందరిదీ. ఆయన సృజించిన సీత – భర్త పైన ఆరాధన తోబాటు అనురక్తి కలిగిన ఇల్లాలు.’ సీత – [కుందమాల ] ‘ అన్న అపురూపమైనవ్యాసం రాసిన విశ్వనాథ -”…. ఆమె రామచంద్రుని యందు శృంగార ప్రవృత్తి తప్ప మఱొకండెఱుగదు ” అంటారు. ఆమె బెంబేలు పడనిది, తన మీద తనకు ప్రత్యయం చెడనిది. వేదన పడదని కాదు, దానిని భరించుకోగలిగినది. అన్నింటి కన్నా మించి- తామిద్దరూ తప్పక కలుసుకుంటారనే ఆశా విశ్వాసమూ అంతరాంతరాలలో ఉన్నది. ఆ ఎడబాటు ఎంత మాత్రమూ సహజంగా ఉండదు, కనుక అంతరించవలసినదే- ఆమెకి. తన పాతివ్రత్యాన్ని తిరిగి ప్రకటించుకొమ్మంటే అలిగి భూమిలోకి వెళ్ళిపోదు, ఆమెకు రాముడితో కలిసి ఉండటం పరమావధి.

కుశలవులు ఎంతమాత్రమూ ఉద్ధతులు కారు, తండ్రి అని తెలియకపోయినా, మహారాజుతో యుద్ధమాడరు , వారు సీత పుత్రులు.

రాముడు అవతారపురుషుడని నాందీ శ్లోకాలలో చెప్పి ఉన్నా, నాటకంలో ఆయనను మానవాతీతుడుగా చిత్రించరు. తన ప్రాధాన్యాలను నిర్వచించుకోలేని మహారాజు ఆయన ఇక్కడ. తన కాఠిన్యానికి తానే నలిగిపోయే జీవుడు.
ఉత్తరరామచరితం లో రాముడు ప్రధానం. కుందమాలలో సీత ప్రధానం .

ఈ దిజ్ఞాగుడు కాళిదాసుకు సమకాలికుడనే ఆధారం మేఘసందేశం [పూర్వ మేఘం- పధ్నాలుగవ శ్లోకం ] లో ఉందని పండితులు చెబుతారు. ఆ శ్లోకం ఇది -

“ఓ మేఘమా, నువు ఈ పర్వతం మీదినుంచి కదులుతుంటే – పవనుడు పర్వతశిఖరాన్ని పెకలించి తీసుకుపోతున్నాడా అని సిద్ధ స్త్రీలు చకితలై, ముఖాలు పైకెత్తి అమాయకంగా చూస్తారు. దానితో ఉత్సాహంవస్తుంది నీకు . సరస నిచుళాలున్న (తడిసిన నేల ప్రబ్బలి చెట్లున్న) ఈ చోటినుంచి నువు ఉత్తరం వైపుకి వెళ్ళే దారిలో – దిగ్గజాల లావుపాటి తొండాల విదిలింపులను తప్పించుకొని ఎగిరిపో”

దీనిలో దాగి ఉన్న అర్థం- “సరస నిచుళుడి (రసికుడైననిచుళుడు, కాళిదాసుకు సఖుడు) నివాసం నువు వెళ్ళేదారిలో ఉంది. అతన్ని దర్శించు. అక్కడ దిజ్ఞా గుడనే మహాపండితుడు, కాళిదాసుకు ప్రత్యర్థి, ఉన్నాడు- అతని లావుపాటి చేతి [హస్తం అన్న మాటకు తొండం, చేయి అని రెండు అర్థాలూ ఉన్నాయి ] విదిలింపులను [ నువు కాళిదాసుకు దగ్గర కనుక నిన్నూ ఆక్షేపిస్తాడు ] తప్పించుకు వెళ్ళు” ఈ విషయాన్ని కాళిదాస వ్యాఖ్యాత మల్లినాథసూరి ధృవపరిచారట.

కాళిదాస శాకుంతలం లో బాలుడైన భరతుని చేతి నుంచి కిందపడిన రక్షను తల్లిదండ్రులు కాక మరెవరు తాకినా అది పామయి కాటువేస్తుందని అన్నట్లే , కుందమాలలో అయోధ్యాసిం హాసనం మీద రఘువంశీయులు కానివారెవరు కూర్చున్నా వారి తల వ్రక్కలవుతుందని చెప్పబడుతుంది . ఇది ఒక పోలిక, కాళిదాసు రచన తో . అధవా దిజ్ఞాగుని పద్ధతి ఎక్కువ సూటిగా ఉంటుంది. భవభూతి లాగా దీర్ఘమైన వర్ణనలు కూడా ఆయన చేయరు, కథానుగుణమైనవి , అదీ క్లుప్తంగానే తప్ప. అన్వయం సులువుగా ఉంటుంది. ఇలాగ సరళంగా రచించినంత మాత్రాన తక్కిన ప్రసిద్ధ నాటక కర్తల ముందు తేలిపోరు. ఆ పాత్రలు ఎంతో సజీవంగా ఉంటాయి , ఆ ఉదాత్తత అతి సహజంగా ఉంటుంది. కథనం ఎత్తు మీదే నడిచినా, పాఠకులకు చాలా దగ్గరగా వస్తుంది . దిజ్ఞాగుని వాక్కు ఎంత స్పష్టంగా, నిండుగా- ఉంటుందంటే, ఈ నాటకం లోని కొన్ని శ్లోకాలు, కొన్ని శ్లోకాల పాదాలు- సుభాషితాలుగా నిలిచి ఉన్నాయి. ఆయన శైలి ప్రసన్నమూ గంభీరమూ అని అనువదించిన బులుసు వెంకటేశ్వర్లు గారు అంటారు. గొప్ప మాట అది.

తాను కాంచీపురం సమీపం లోని సిం హ వక్త్రపురానికి [అరారాలపురం ] చెందినవాడినని చెప్పుకున్నారు. భదంత ధీరనాగుడన్న నామాంతరం గల దిజ్ఞాగుడు బౌద్ధ పండితుడనే ధృఢమైన నమ్మకం ఉంది. ఎన్నో బౌద్ధ గ్రంథాల కర్త కూడా. తార్కిక చక్రవర్తి . బౌద్ధుడయి రామకథను ఎందుకు రచించారు ? ప్రారంభం లో గణేశ, జటాజూట- స్తుతులు ఎందుకు చేశారు ? ఈ ప్రశ్నలకు పెద్దలు చెప్పే సమాధానాలు ఇలా ఉన్నాయి – ఈయన కొంతకాలం పిమ్మట బౌద్ధం వదిలి వేదధర్మం లోకి వచ్చిఉంటారు. లేదా, మొదట హీనయాన బౌద్ధుడు, ఆ తర్వాత మహాయానం లోకి వచ్చారు. [ రెండవ సంప్రదాయం శ్రీరాముడిని బుద్ధుని అవతారంగా స్వీకరించింది ] కుమారదాసు అనే బౌద్ధపండితుడు జానకీహరణం అనే కావ్యాన్ని రచించి ఉండటాన్ని దృష్టాంతంగా చూపుతారు. ఇక్కడ విశ్వనాథ తన వ్యాసం లో అన్న మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు.

“దిజ్ఞాగుని గురించి యొక్కమాట. బౌద్ధులు పూర్వము మన దేశమునందు విజృంభించిరి. నేటి సర్వసమత్వమతమువలె నాడు బౌద్ధమతము కూడ మన ధర్మములను కుళ్ళగించినది. కాని బౌద్ధులు మన వేదాంతములు తలక్రిందులు చేయుటకు బ్రయత్నించిరిగాని సారస్వతము జోలికి రాలేదు. దీనికి మహాతార్కికుడై సనాతనధర్మమునకు గొప్ప ప్రత్యర్థియైన దిజ్ఞాగుని ‘ కుందమాల ‘ సాక్షి. ఎన్ని బౌద్ధమతసూత్రములున్నను, తేజోవంతములైన నాటకములను- రసపర్యవసాయులై ,,మనవారు గూడ దిరస్కరించలేదు. ఇందుకు ‘ నాగానందము ‘ నిదర్శనము. మతమేదియైనను జాతికి రసబుద్ధి పోలేదు. నేటికి దేశమున రసబుద్ధి యొత్తిగిలినది”

ఏ కారణం చేతనో, చాలాకాలం మరుగున పడిన ఈ రసవంతమైన నాటకాన్ని మానవల్లి రామకృష్ణకవి గారు పరిష్కరించి ప్రచురించారు. తెలుగు లోకి నాలుగు అనువాదాలు వచ్చాయి. ఆ నలుగురు అనువాదకులు- కాలక్రమంలో వడ్డాది సుబ్బరాయకవి గారు, గట్టి లక్ష్మీనరసిం హ శాస్త్రి గారు, బులుసు వెంకటేశ్వర్లు గారు , వేదం వెంకటకృష్ణశర్మగారు.

నాటకపు నాందిలో లో చేసిన జటాజూట స్తుతి లో శివజటాజూటాన్ని- పరిపక్వమై, జ్వాలలాగా పైగి ఎగసి ఉపశమించిన తపోధనుని తపస్సు గానూ , గంగానది మీదినుంచి వీచే గాలితెరలతోనూ పన్నగాలతోనూ విలసిల్లే వల్మీకంగానూ , చల్లని చక్కని చంద్రుడి నిత్యమైన ఉదయంగానూ, బాలసూర్యుడి ని పోలిన అరుణకాంతి నివాసంగానూ, పోల్చి చెబుతారు. కథ అంతా ఈ వర్ణనలో ధ్వనిస్తుంది. తీవ్రమైన ధర్మాచరణా తపస్సు, భగ్గున ఎగసే వియోగ జ్వాల- దాని ఉపశమనం- గంగాతీరంలో , వాల్మీకాశ్రమం లో. ఆపైన సూర్యచద్రుల లాగా వెలిగే బాలకుల ఆగమనం – అంతా స్ఫురిస్తుంది. ఈ నాటకమంతా శివేచ్ఛకు నమస్కరిస్తుంది.

ప్రారంభం లో, లక్ష్మణుడు సీతను అడవిలో దిగవిడిచే ఘట్టం లో- గంగాతరంగ శీకర వాయువుల స్పర్శను సీత కన్నతల్లి చేయి తాకినట్లుందని అనుకుంటుంది. నాటకం అంతా ఇంచుమించుగా , వీలైనప్పుడల్లా , ఉపశాంతి మీదే నడుస్తుంది – కష్టాన్ని మాత్రమేనొక్కి చెప్పకుండా.

రాముడు సీతను పరిత్యజించిన మాట చెప్పలేని లక్ష్మణుడు “సరస్వతీదేవి నా నోరు కట్టి వేసింది” అంటాడు. ఆ వార్త అంత అపశబ్ద భూయిష్టం అన్నమాట. తెలుసుకున్న సీత అంటుంది, స్పృహ కోల్పోతూ – “దశరథ మహారాజా ! నువ్వు ఇప్పుడు మరణించినట్లయింది” అంటుంది – [ఆయనే ఉంటే పెద్దవాడుగా రాముడిని వారించి ఉండేవాడు కదా, ఈ అధర్మకృత్యం ఆయన స్మృతికి అపచారం కదా ! దశరథుడు తీసుకోలేని ఆ బాధ్యతను ఆయన స్నేహితుడైన వాల్మీకి తీసుకున్నట్లు చివరలో వస్తుంది.]

ఆయనకేమైనా చెబుతావా అని లక్ష్మణుడు మళ్ళీ మళ్ళీ అడిగితే, ముందు అంటుంది-

“ఆ నిష్ఠురుడికి నా సందేశం , లక్ష్మణుడి బలవంతం చేత ఇస్తున్నాను అంతే- దురదృష్టవంతురాలిని, నా గురించి వ్యధపడుతూ శరీరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ధర్మాన్ని అతిక్రమించవద్దు, పరిపాలనను ఆటంకపరచుకోవద్దు”…అంటూనే, తనకు తెలియని నిష్ఠూరమేమైనా తన మాటలలో ధ్వనించిందా అన్న అనుమానం తో – “నేను జనపాలుడినేమైనా [రాముడు అనదు, ఆర్యపుత్రుడనదు, రాజు అంటోంది ] నిందించానా?” అని లక్ష్మణుడిని అడుగుతుంది.

“అమ్మా, నీకు ఆమాత్రం అధికారం ఉంది” అని మాత్రం అంటాడు లక్ష్మణుడు.[ కి మేతావత్యపిన ప్రభవతి దేవీ]

అప్పటి సీత మాటలు దిజ్ఞాగుడు కాక మరి ఎవరూ రాయలేదు.

“ఏవమపి మమ వచనా ద్విజ్ఞాపయితవ్యః సా తపోవనవాసినీ సర్వధా సీమంత నిహితే నాంజలినా యద్యహం నిర్గుణా చిరపరిచితేపివా అనాథేతి వా సీతేతి వా స్మరణ మాత్రకేణానుగృహీత వ్యేతి”

[ ఇవి నా మాటలుగా విన్నవించు. ఆ తపోవనవాసిని పాపిటలో దోసిలి ఉంచి నమస్కరిస్తూ చెప్పుకుంటోంది. తాను నిర్గుణ అయినప్పటికీ [ గుణం లేనిదని, గుణాతీత అని కూడా ] , చిరపరిచితను అని అయినా, అనాథను అని అయినా…కనీసం సీతని అని అయినా తలచుకొమ్మను. ఆ మాత్రపు అనుగ్రహం నా పైన చూపవచ్చును ]

సీతారాముల మధ్యన ఉన్న బంధానికి గుణాలతో సంబంధం లేదు. ఇదే భావాన్ని రాముడితో అయిదో అంకం లో కవి పలికిస్తారు

“ఇక నేను ఉండనుగా, ఆయన బాగోగులు నువ్వొక్కడివే చూసుకోవాలి” – సీతాలక్ష్మణులిద్దరికీ రాముడి క్షేమం గురించే ఆలోచన.

దిక్పాలకులకూ అరణ్యానికీ పర్వతాలకూ గంగానదికీ ఆమెను అప్పగించి- “ఈ ఘోరం చేసేందుకేనా, ఆంజనేయుడు నన్ను ఆ మూర్ఛనుంచి తేర్చి బ్రతికించినది?” అని వాపోతూ నిష్క్రమిస్తాడు లక్ష్మణుడు.

వాల్మీకి సీతను రక్షించి తీసుకువెళుతూ “ఉత్తములైన పుత్రులను కంటావు, భర్తను మళ్ళీ కలుసుకుంటావు” అని వాల్మీకి దీవిస్తాడు. మొదటి దీవెన వాల్మీకమే, రెండవది దిజ్ఞాగం.

“నేను సుఖంగా ప్రసవిస్తే నీకు రోజూ ఒక కుందమాలను అల్లి సమర్పించుకుంటాను” అని గంగకు మొక్కుకుంటుంది సీత. ఇటువంటి మొక్కునే వాల్మీకి రామాయణం లో వనవాసానికి రామలక్ష్మణులతో గంగ దాటి వెళ్ళే సీత మొక్కుతుంది. తాము క్షేమంగా తిరిగివస్తే నైవేద్యం పెడతానని.

ఆ తర్వాత వచ్చే ప్రవేశికలో కుశలవుల జననం చెప్పబడుతుంది. వారిద్దరూ ‘రామశ్యాములు’ [ రామునివలె నల్లనివారు ]. లేడిపిల్లతో పరుగులుపెడుతూ, సిం హపు పిల్లలతో ఉట్టుట్టి యుద్ధాలు చేస్తూ, మునిపత్నుల ముద్దులు కుడుస్తూ పెద్దవారవుతున్నారు. వాల్మీకి వారికి రామాయణ గానం నేర్పుతున్నాడు. నైమిశారణ్యంలో శ్రీ రామచద్రుడు యజ్ఞం చేయ తలపెట్టాడు. ఋషులందరినీ భార్యలతో కలిసి రమ్మని ఆహ్వానం.[ ఇలా ' సపత్నీకులై ' ఋషులను రమ్మన్నారనటం లో ఆయనా ఆ యజ్ఞ సంకల్పఫలంగా సపత్నీకుడు కాబోయే సూచన ఉంది ] వాల్మీకి మహర్షికీ పిలుపు వచ్చింది.

రెండవ అంకం లో సీత సాలవృక్షం కింద ఒంటరిగా కూర్చొని ఆలోచనామగ్న అయిఉంటుంది.

ఆమె అనుకుంటూ ఉంది “పార్వతీపరమేశ్వరుల పక్కనే సీతారాములనూ శాశ్వత ప్రేమాసక్తులుగా చెప్పి ఉన్నారే..ఇదేమిటి, ఇలా అయింది ! ఏ తప్పూ చేయకుండానే ఆయనకు ఇంత దూరంగా ఉన్నాను….ఎన్నాళ్ళు ఇలాగ ? ఒకరికి ఇద్దరుయోగ్యులైన కుమారులు జన్మించారు, వాల్మీకి మహర్షి కన్నబిడ్డ లాగా ఆదరిస్తున్నారు, చాలదా ? ఈ తపోవనంలో నేను ఇలా [విరహిణినై ]నిట్టూరుస్తూ కూర్చోకూడదు.కాని నావల్ల అవటం లేదు. అయోధ్యాప్రజల నుంచి అమితమైన గౌరవాన్ని పొందీ అపనిందనూ భరించవలసి వచ్చింది. పోనీ ప్రాణత్యాగం చేస్తే…అది మంచిదేనా ? నా అవమానం నిలిచిపోదా ? ప్రియసఖి వేదవతి తో మాట్లాడనేలేదు”

కొంతకాలం పాటు ఎక్కడికో వెళ్ళి ఉన్న వేదవతి వస్తుంది.

“సీత..ఎంత చిక్కిపోయింది..ఎలా పాలిపోయింది…” అని బాధ పడుతూ సమీపించి
“కుశలవులకు కుశలమే కదా ?” అని అడుగుతుంది.

“వనవాసోచితంగా” అని అర్థోక్తిలో ఆగుతుంది సీత. అడవుల పాలైన రాజకుమారులు ఎలా ఉంటారో అలాగే ఉన్నారని.[ కుశలం అంటే దర్భలను సేకరించే సామర్థ్యం అని ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది ]

“మరి నువ్వు ? ఎలా ఉన్నావు ?”

సీత తన జడ చూపుతుంది. “ఇది ఎలా ఉంది?” అని అడుగుతుంది. మారీచాశ్రమం లో శకుంతల లాగా ఆమె ఘృతైకవేణి. ఆ ఒంటిజడ దీర్ఘవిరహానికి చిహ్నం.
వేదవతి నొచ్చుకుని , “నీ మీద అపేక్ష లేని ఆ నిరనుక్రోశుడికోసం అమావాస్య ముందరి చంద్రలేఖలాగా క్షీణించిపోతావెందుకు?” అని అడుగుతుంది.

సీత- “ఆయన నిరనుక్రోశుడా?”

“నిన్ను పరిత్యజించలేదా మరి ?”

” నేను పరిత్యక్తనా ? ”

” కాదా ? ”

” శరీరంతో అవునేమో, హృదయం తో కాదు ”

” అతని పరకీయమైన హృదయం నీకెలా తెలుసు ?”

” ఆయన హృదయం నాకు పరాయిదేమిటి ? ”

” ఏమి విడని అనురాగం ! ”

” ఆయనది మాత్రం వీడిన అనురాగమా ? నాకోసమే కదా, సముద్రం మీద సేతువు నిర్మించాడు ?”

” పిచ్చిదానా, అది క్షత్రియధర్మంగా చేసిన పని ”

” ఇంకొక విషయం ఉంది చూడు ”

” ఏమిటి ? ”

” నన్ను గాక వేరెవరినీ ఎప్పటికి వక్షానికి హత్తుకోడు కదా …

ఎప్పటికైనా కుశలవుల తండ్రి నాకు కనిపిస్తారా ? ”

***

యజ్ఞనిమిత్తమై వాల్మీకాశ్రమం ఉన్న నైమిశారణ్యానికి రాముడు రానేవస్తాడు. ఆ అడవిలో అడుగుపెడుతూనే సీతను త్యజించిన శోకం హెచ్చవుతుంది. వెళ్ళవలసిన దారి వదిలి వికలుడయి సంచరిస్తుంటాడు. సీతకు చెప్పినట్లే లక్ష్మణుడు ఇప్పుడు అన్నగారికీ గంగాతరంగ శీతల స్పర్శను అనుభవించమని చెబుతాడు. నది మీదినుంచి వీచే గాలి ఆయనకీ అదే సాంత్వన ఇస్తుంది. మల్లెపూలమాల ఒకటి అలలమీద తేలుతూ వచ్చి రాముడి పాదాలకు చుట్టుకుంటుంది. ఒక్కసారిగా ఒళ్ళు జలదరిస్తుంది. ఆ అల్లిక పరిచయమైనదిలాగా ఉందని లక్ష్మణుడితో అంటాడు. లక్ష్మణుడికి మాత్రం సీత ధ్యాస లేకుండా ఉందా ? అయినా, ” ఎవరిది ? ” అని అడుగుతాడు.

” ఇంకెవరిది ? ” అని మాత్రం అనగలుగుతాడు రాముడు.

” అయితే ఈ నది నడకను అనుసరించి వెనక్కువెళదామా ? ”

” ఈ సృష్టిలో పోలికలు ఉంటూనే ఉంటాయి…మనకంత అదృష్టమెక్కడిది ? ఇక్కడెక్కడుంటుంది సీత ? అయినా అలాగే…ఈ మాల చాలా ప్రీతికరంగా ఉన్నా, గంగాదేవికి అర్పించినది కదా, వదిలివేస్తాను ”[ దేవతాప్రసాదంగా స్వీకరించకూడదా ? వదిలివేయటం ఎంత సులువో, ఎంతగా ధర్మభ్రాంతిని ఇస్తుందో- ఆయనకి…]

నడుస్తూ ఉండగా నది ఒడ్డున ఇసుకలో స్త్రీ పాద చిహ్నాలు. లక్ష్మణుడికి అనుమానం వస్తుంది. సీతాదేవి పాదాలు కదా, బాగా తెలిసినవి. రాముడూ గుర్తు పడతాడు.

అటువైపునుంచి సీత పూలు కోసేందుకు వస్తుంది. రామలక్ష్మణులు వెంబడించిన అడుగుజాడలు ఆగిపోతాయి. రాముడికి దుఃఖం వస్తుంది. బాధగా ” వత్సా ! ” అంటాడు లక్ష్మణుడిని. సీతకి వినిపిస్తుంది. ఉలిక్కిపడుతుంది. శరీరం పులకరిస్తుంది. మరొకరి కంఠధ్వని తనను వివశను చేయదు …అటువైపు చూడకుండా ఉండగలిగేందుకు ప్రయత్నిస్తుంది- ఓడిపోతుంది. పొదమాటునుంచి చూసి ” కనులపండుగయినందుకు గాఢమైన సంతోషం…ఇంతకాలపు ఎడబాటుకి గొప్ప దుఃఖం…ఆయన చిక్కిపోయాడని ఉద్వేగం….నిర్దయుడు కదా , నాకెందుకు అని గట్టి పట్టుదల…చిరపరిచితుడని అంతులేని అనురాగం… చూడగగినవాడని, సౌందర్యవంతుడని ఉత్కంఠ…భర్త అని గౌరవం…కుశలవుల తండ్రి అని , నా కుటుంబపు యజమాని అని మన్నన…..నా మీద పడ్డ అపవాదుకు లజ్జ….ఈయనను చూసి నాకేమి అనిపిస్తోందో నాకే తెలియటం లేదు కదా ” అనుకుంటుంది. ఇన్నిటిలో పట్టుదల, లజ్జ మాత్రమే అస్వాదుభావనలు…తక్కినవన్నీ కలిపి ఆమె ప్రేమ తీవ్రత. .. ఆమె దిజ్ఞాగుని సీత.

రాముడికి దండకారణ్యం లోని వనవాసం జ్ఞాపకం వస్తుంది. అందులో తలచుకోవలసినది ఏమున్నదని లక్ష్మణుడు అంటాడు. ” ఏముందని అంటావేమిటి ? ఎన్ని లేవు !! సుకుమారమైన ఆమె చేయిపట్టుకొని , ఇష్టంగా మాట్లాడుకుంటూ, సాయంకాలాలు నది ఒడ్డున తిరిగినది గుర్తొస్తోంది. మా పాదాల ఒత్తిడికి ఇసుకలోంచి నీరు ఊరుతుండేది అప్పుడు ”…ఆశ పడుతున్నాడు రాముడు, ఈ విరహం లోనుంచీ రాగం రారాదా అని.‘’ నన్ను చేపట్టి ఆమె ఏమి సుఖపడింది ? ముందు వనవాసం, ఆపైన అశోకవనవాసం, ఇప్పుడు ఈ ప్రవాసం …జానకీ, ఎక్కడున్నావు ? ” – అక్రోశిస్తాడు రాముడు. ఆయన బాధ చూడలేక ” ఇక్కడే ఉన్నాను ” అంటుంది సీత, అగుపడదామనుకుంటుంది, ఊహూ, వద్దని నిష్క్రమిస్తుంది. వాల్మీకి మహర్షి తపోప్రభావం తో ఆ నదీతీరంలో [స్నానం కోసం రాగల ] స్త్రీలెవరూ పురుషులకి కనిపించకుండా , మాటలు వినిపించకుండా ఉండేట్లు చేసిఉంటాడు. అందువలన- సీత , పరిసరాలలోనే ఉన్నా, కనిపించని రామలక్ష్మణులు ఆశ్రమానికి చేరుతారు.

రామాయణ గానాన్ని వినేందుకు వచ్చిన అప్సర, తిలోత్తమ- సీతను రాముడు గుర్తుంచుకున్నాడో లేదో పరీక్షించుదామని సీత రూపాన్ని ధరించాలనుకుంటుంది. ఒక మునికన్యతో ఆమాటలు అంటూ ఉండగారాముడి విదూషకుడు వింటాడు .విన్నాడని తెలిసి తిలోత్తమ ఆ ప్రయత్నాన్ని విరమిస్తుంది

చలిగా అనిపించి- సీత , వనవాసకాలం లో వనదేవత మాయావతి ఇచ్చి ఉన్న ఉత్తరీయాన్ని ధరిస్తుంది. అది వెన్నెలలాగా తెల్లనైన, సుగంధభరితమైన దివ్యోత్తరీయం . సీతారాములిద్దరికీ దానితో అనుబంధం ఉంది. అక్కడే ఉన్న ఆయనను కలుసుకోలేక వేదన పడు తూ రాజహంసల జంటను తిలకించి తృప్తి పడుతూ ఉంటుంది . ఆ హంసమిథునం ఎడబాటు ఎరగదు .రాముడూ ఆ కొలను దగ్గరకే వస్తాడు. సీత నీడ ను గుర్తిస్తాడు. నీడ కు వాల్మీకి కల్పించిన మాయ వర్తించదు. ” ఇదేమిటి, నన్ను పలకరించదు, బింబం లేని ప్రతిబింబం ఎలా సాధ్యం ? ” అని ఆశ్చర్యం తో ఆ నీడనే పట్టుకోబోతాడు రాముడు. తను ఆయనకు కనిపించటం లేదని అప్పటికి అర్థమవుతుంది ఆమెకి. నీడ కనబడకుండా దూరంగా వెళుతుంది. నీడ కూడా మాయమయిన అఘాతం తో రాముడు మూర్ఛ పోతాడు. సీత ప్రాణం కొట్టుకుపోతుంది. ఎవరేమైనా అనుకోనిమ్మని , ఆయనే తెప్పరిల్లి ఆజ్ఞమీరినందుకు నిందిస్తే నిందించనిమ్మని…వెళ్ళి కౌగలించుకుంటుంది. వెంటనే ఆయనకు స్పృహ వస్తుంది. దేహమంతా గగుర్పొడుస్తుంది. విడివడిన ఆమెను వెళ్ళిపోకు, ప్రసన్నవు కమ్మని వేడుకుంటాడు.

ఆమె అంటుంది ” నేనెప్పుడూ ప్రసన్ననే, నీ ప్రసన్నతే నాకు కావలసినది ” అని. ఆమె కనిపించనట్లే మాటలూ వినిపించవు. గుండె అవిసి మళ్ళీ ఆయన మూర్ఛ పోతాడు. ఆమె ఉత్తరీయం తో విసురుతుంది, తిరిగి లేస్తూ, ఆ చెంగు ఆయన పట్టుకుంటాడు. సందేహం లేదు, ఆమెదే. ఎక్కడ ఆమె ? కనబడదు. కళ్ళలో నీటి వల్ల చూపు మసకబారిందేమోనని ఉత్తరీయం తో ఆయన కళ్ళు తుడుచుకుంటాడు. ” పరకీయను, నా ఉత్తరీయం తో నువ్వు అలా చేయరాదు కద ” అని ఆమె ఉత్తరీయాన్ని వదిలివేస్తుంది. పూర్తిగా దాన్ని ధరించి, ఆమెను దగ్గరగా తీసుకున్నట్లే తృప్తి పడి , రెండు ఉత్తరీయాలు ధరించి ఉంటే చూసినవారేమనుకుంటారోనని, గాలిలోకి ఎగరవేస్తాడు. ఆమె మహాప్రసాదంగా అందుకుంటుంది.

జనం ఏమనుకుంటారోననే నిరంతరమైన అనుమానం రాముడిలో ఇక్కడా పనిచేస్తున్నట్లే. ఎందుకో తెలియకపోయినా సీత ను గుర్తు చే స్తూ ఉన్న ఆ ఉత్తరీయాన్ని ఆయన దాచుకోవచ్చు కదా. సీత ప్రేమావేశానికి మాత్రం ఏదీ అడ్డురాదు. గాలిలోకి ఎగిరిన ఉత్తరీయం మాయమవటాన్ని రాముడు చూసి అది ఏదో సిద్ధుల మాయ అనీ ఆమెను ఎవరో దాస్తున్నారనీ అనుకుంటాడు.

” కనిపించు, సీతా ! గడిచిన రోజులు గుర్తు లేవా నీకు ? అప్పుడు అరణ్యంలో పుష్పాలు కోసి ఉత్తరీయపు చెంగులో నింపుకుంటున్నావు. నేను ఇలాగే దాన్ని లాగాను, పూలు నేలరాలాయి, జ్ఞాపకం లేదూ ? ”
ఇక్కడ సీత స్పందించిన తీరులో ఆమె ప్రణయినీత్వం పూర్తిగా ఉట్టిపడుతుంది. ఆ ఉత్తరీయం ద్వారా మళ్ళీ దగ్గరైన ఆయన స్పర్శ అందుకు ప్రేరేపించిందనుకోవచ్చు. ఏమైనా- ఆ దుర్భర వియోగం లేనట్లే, ఆయన చేసినదేదో అల్పపు దోషమైనట్లే, ఆ దూరం అదొక నెయ్యపుకినుక గానే ఆమెకి అనిపిస్తుంది.
నవ్వుతూ అంటుంది -” సాహసికుడా, అందుకే కదా నాకు దూరమైనావు ”

ఈమె దిజ్ఞాగుని సీత.

అప్పుడు అక్కడికి రాముడి చెలికాడు, విదూషకుడు కౌశికుడు వస్తాడు. తిలోత్తమ సీత రూపం లో రాముడికి కనిపించాలనుకుంటోందని విన్నానని చెబుతాడు. తిలోత్తమ నిజానికి , ఇతను విన్నాడనే అందుకు పూనుకోదు. జరిగినదంతా ఆ మాయ అవునా అని అనుమానం వస్తుంది రాముడికి.

” హృదయానికి ఆహ్లాదం ఇచ్చే మల్లె దండను సీత అల్లినట్లే తిలోత్తమ అల్లిఉండవచ్చు. ఇసుకలో సీత పాద చిహ్నాలనూ కల్పించి ఉండవచ్చు. నీటిలో నీడనూ చూపించి ఉండవచ్చు. కాని, తృప్తాత్మ అయిన సీతలాగా అలా నాకు వీచగలదా ? ‘’ . లేదనే ఆయన తలపు. తెగని ఆయన ఆలోచనను గమనించి , కౌశికుడు అడుగుతాడు – ” సీతను తలచుకుంటున్నావా ? ”

” అవును ”

” ఆమె సుగుణాలనా, దోషాలనా ? ”

‘’ వేటినీ కాదు’’

” రెండూ కాక మరేమి ఉంటాయి ?”

” సామాన్యుల ప్రేమకు గుణదోషాల విచారణ , సీతారాముల ప్రేమ కు ఉండదు.

దుఃఖే సుఖేష్వ ప్యపరిచ్ఛదత్వా
దసూచ్య మాసీ చ్చిర మాత్మనీవ
తస్యాం స్థితో దోషగుణానపేక్షో
నిర్వ్యాజసిద్ధో మమ భావబంధః

[సుఖమునందు దుఃఖమునందు సువ్యక్తమై చెప్పనక్కరలేనిదై (ఆమె ) ఆత్మయందున్నది. దోషమునకు గాని గుణమునకు గాని సంబంధములేని కారణరహితమైన యొక భావబంధము నాకామె యందున్నది ]

” నన్ను మోసగించకు నీ మాటలతో. ఆమె లేకుండా నీకు కాలక్షేపం అవటం లేదూ ? అవుతోందిగా ? ” విదూషకుడు పదునుగా ఎత్తిపొడుస్తాడు.
ఎప్పుడూ విప్పని మనసును ఇప్పుడు మిత్రుడి దగ్గర బయటపెడుతున్నాడు రాముడు. చెప్పలేక చెప్పుకుంటున్నాడు.

” అనురాగం మానసస్థం. వెలుపలి కర్కశత్వం కనిపించి పోతుంది…లోపల ఆర్ద్రత ఉన్నదయ్యా, ఉన్నది. నా ప్రేమభావనలు తామరతూడులోని దారాలంత సూక్ష్మమైనవి, సుకుమారమైనవి. పూజ్యమైనవి ”
విదూషకుడు , బడబానలం దాచుకున్నసముద్రం వంటి మిత్రుడిని చూసి, ఆ అగ్ని సోకిన మంచుబిందువు లాగా ఆవిరవుతున్నానని , సీత ను తలచుకుని ఏడుస్తాడు….పేదగుండెవాడు ,అతనికి ఆమె మీద అంత అభిమానం.

అక్కడికి లవకుశులు వస్తారు. కుశుడు కొంత దుడుకువాడు. అందుకని, వాళ్ళు బయలుదేరేప్పుడు లవుడిని సీత ఎడంగా పిలిచి, కౌగలించుకుని ముద్దాడి, రాజుకు నమస్కరించి కుశలమడగమని చెప్పి పంపుతుంది. రఘువంశీయులు ఎవరికీ నమస్కరించరని ఆమె ఇదివరలో పిల్లలకు చెప్పిఉంది. ఆ మాటే పట్టుకుని కుశుడు రాముడితో అగౌరవంగా ప్రవర్తిస్తాడేమోనని ఆమె భయం. వారిద్దరినీ చూస్తూ ఉన్నవారికి, రాముడితో సహా, రాముడి బాల్యరూపం స్ఫురిస్తుంది. నమస్కరిస్తారు, బ్రాహ్మణ నమస్కారమని క్షత్రియుడైన రాముడు స్వీకరించడు. కౌగలించుకుని ఆసనం మీద తనపక్కన కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళు సిగ్గుపడిపోతారు. విదూషకుడు రఘువంశానికి చెందనివారు ఆ సిం హాసనం అధిష్టించరాదని, ప్రమాదం కలుగుతుందని జ్ఞాపకం చేస్తాడు. పిల్లలకి ఏమీ కాలేదు, అయినా ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, నేల పైన కూర్చోనీయక.

తండ్రి పేరు ‘ నిరనుక్రోశుడు ‘[నిర్దయుడు ] అని చెబుతారు. వాళ్ళు అల్లరి చేసినప్పుడు అమ్మ, ‘ నిరనుక్రోశుని బిడ్డలారా, చాపల్యం వదలండి ” అని మందలిస్తుంది కనుక ఆయన పేరు అదే అని.
రావలసినవారంతా వస్తారు. రామాయణగానం మొదలవుతుంది. కైకేయి దశరథుడిని వరమడిగే సందర్భాన్ని దాటించి చెప్పమంటాడు రాముడు, ఆమె నొచ్చుకుంటుందని. ఆప్తుల వేదన పట్ల ఆయనకు అంత అక్కర. సీతాపరిత్యాగం తో కుశలవుల గానం ముగుస్తుంది. తర్వాతి కథ ఏమైందో వారికి తెలియదు, రాముడికి అవేదన.పుత్రులతో సహారామపత్నికి భద్రమని వాల్మీకి కబురు పెడతాడు. ఒకదానితో ఒకటి పొసగించుకోగా సత్యం అర్థమై ఒకరినొకరు కౌగలించుకుని మూర్ఛ పోతారు.ఆ మూర్ఛ ఎంతకూ విడదు. శ్వాస మాత్రం ఆడుతూ ఉంటుంది. వార్త తెలిసి సీతతో వాల్మీకి వస్తాడు.
సీత అడుగుతుంది, ” రాఘవులు సజీవులేనా ? ”

వాల్మీకి – ” అవును, సమీపించమ్మా ”

” ఆయన నాకు ఆ ఆజ్ఞ ఇవ్వలేదు కదా ”

” నేను అనుమతి ఇస్తున్నాను ” వాల్మీకి నొక్కి చెబుతాడు. [ నాటకమంతా, ముఖ్యంగా చివరి అంకం లో- వాల్మీకి సర్వాధికారిగా కనిపిస్తాడు.తపోధనుడుగా, పెద్దవాడుగా, బుద్ధిగరపవలసినవాడుగా వాల్మీకి కథను ఒక కొలిక్కి తీసుకువస్తాడు. అసలు కథ లో ఎవరైనా ఇలా న్యాయం చేసిఉండకూడదా అని కవి భావించి ఉండవచ్చు]
ఆమె వింటుంది, కాని విలపిస్తుంది.

ఆమె లాలించగా కుశలవులు లేస్తారు. వాల్మీకి ఉపచరిస్తే రాముడూ కళ్ళు తెరుస్తాడు.

కుశలవులు ప్రణామం చేసి ,రాముడినే చూస్తూ ఉంటారు.

సీత అడుగుతుంది – ” ఏషయో యువాభ్యా మేవం ప్రేక్షితః ‘’ [ఎవరురా ఆయన ? అలా చూస్తున్నారు ? ]

తమ కు చాలా ప్రియమైనవారిని బిడ్డలు చూస్తూ ఉంటే, అది ఎవరో వారి నోటనే చెప్పించే ముచ్చట ఇళ్ళలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదే పద్ధతిలో, ఎవరో చెప్పించుకుని వినేందుకు , విని ఆనందించేందుకు- సీత వాళ్ళను అడుగుతోంది. విశ్వనాథ ఇక్కడ సీత గృహిణీత్వం ప్రకాశిస్తోందని అంటారు. రాముడు అది ఆమె ఉదాసీనత అనుకుంటాడు, ఖిన్నుడవుతాడు

” రావణవధ అనంతరం ఈ మహాదేవి పవిత్రతను అగ్నిదేవుడు నిరూపించి ఉండలేదా ? నీకు సరిపోలేదా ? మళ్ళీ అనుమానం ఏమిటి ? ” అని వాల్మీకి రాముడిని కోపంగా అడుగుతాడు. రాముడు ఆయన పాదాల మీద పడతాడు. వాల్మీకి శాంతించడు. ఆయనకు కావలసింది సీతా పరిగ్రహణం కాని తనను గౌరవించటం కాదు.

వాల్మీకి పరమప్రాకృతుడు ఒకనాడు…అందుకే అంటాడు ” జానపదుల మనసులకి అనురాగం వికాసాన్నీ, సుఖాన్నీ, సంతోషాన్ని ఇస్తుంది. రాజుల హృదయాలలో అదే అనురాగం మలినమైపోతుంది. ఇసక నేలలో పంటలు పండవు. కుశలవులను స్వీకరించు, నేను వెళతాను ” – వెనుదిరగబోతాడు. రాముడు వారిస్తాడు. వాల్మీకి, ఇక తప్పక, సీతను తన పవిత్రతను తిరిగి నిరూపించి చెప్పు కొమ్మ ని అడుగుతాడు.సీత లోకాలనూ లోకేశులనూ దిక్పాలులనూ మహర్షులనూ సంబోధిస్తుంది.

సృష్టి అంతా ఒక్కసారి నిశ్చలమూ నిశ్శబ్దమూ అయిపోతుంది.

సీత భూదేవిని సాక్ష్యం కోరుతుంది. గొప్ప సం రంభం తో ఆవిడ వస్తుంది, సీత అడిగినట్లే ఆమె పునీత అని అందరికీ ఉద్ఘాటిస్తుంది.

” చాలా ? నమ్మారా ” అని అడుగుతుంది, భూదేవి, అందరినీ, స్వయంగా.

” సీతను గ్రహించు ”- వాల్మీకి ఆదేశిస్తాడు.

రాముడు- ” లక్ష్మణుడా, నమస్కరించు ”

” అమ్మా, పాపిని, చంపదగినవాడిని, ప్రణమిల్లుతున్నాను ”

సీత అతన్ని సమాదరించి దీవిస్తుంది. వాల్మీకి రాముడిని తిరిగి ఆజ్ఞాపిస్తాడు.
ఆయన తడబాటుతో, సంకోచం తో – ఇంటికి వెళదాం రమ్మని అడుగుతాడు. ఆమె మన్నిస్తుంది.

రాజ్యాధికారం మీద రాముడికి విరక్తి పుట్టిందా అనిపిస్తుంది. అక్కడికక్కడ కుశుడికి రాజ్యాభిషేకమూ లవుడికి యౌవరాజ్యాభిషేకమూ వాల్మీకితో జరిపిస్తాడు.. తనూ లక్ష్మణుడూ వారికి సహాయకులుగా మాత్రమే ఉంటామని ప్రకటిస్తాడు.

కుందమాల రాగరంజితమై ముకుందమాల అయింది.

 

(చి.డాక్టర్ కౌటిల్య చౌదరి కి కృతజ్ఞతలు)

**** (*) ****