కథ

నడక

ఫిబ్రవరి 2015

డుస్తున్నాను.

సముద్రపు అలలు నా ఆవేదనలాగే ఘోషిస్తున్నాయి.

రోజూ ఆరింటికి మొదలౌతుంది, నా నడక. నా ఆవేదన. నా జీవితం. గత ఏడేళ్ళుగా ఇంతే.

ఎంతో మంది నాతో నడుస్తారు. నన్ను చూస్తారు. ఎంతోమందిని నేను చూస్తాను. కొంతమంది ముఖలు నాకు గుర్తుంటాయి. కానీ ఎవ్వరూ నన్నుపట్టించుకోరు. ఒక్కరయినా పలకరింపుగా నవ్వరు. బహుశా వయసు ఆంతర్యం అయ్యుండచ్చు. నా వయస్సు అరవై తొమ్మిది.

ఎక్కువగా తారస పడే వారిలో, ఒక యాభై యేళ్ళ మీసాలాయన. ఈయన చాలా పొడుగ్గా, బలిష్టంగా వుంటాడు. చాలా హుందాగా నడుస్తాడు. చూట్టానికిబాగుంటాడు. ఓ పాతికేళ్ళ పొడుగు జుట్టమ్మాయి. అందంగా వుండదు. కానీ కురూపికయినా కురులు అందం అంటారు. ఆ కురులు తెచ్చిన అందమే ఆమెది. ఓ నలభై పైచిలుకున్న లావావిడ. ఈ విడని చూస్తే వాళ్ళాయన మీద జాలేస్తుంది. ఇంత స్తూలకాయాన్ని ఆయన ఎలా భరిస్తున్నాడో. ఆయనపోరు పడలేకే ఈవిడ ఇలా చమటలు కక్కుకుంటూ హడావిడిగా నడుస్తోందేమో. ఓ ఇరవైలోపే వున్న ఓ కుర్రాడు. జాగింగ్ చేస్తాడు. బహుశా యే క్రికెట్టోఆడతాడు కాబోలు. ఇక ఓ అరవై ఏళ్ళ బక్కాయన. ఈయనని చూస్తే నాకు నవ్వొస్తుంది. ఎందుకు వాకింగ్ చేస్తున్నాడో అని. లేక చేసి చేసి ఇలాఅయ్యిపోయాడా. వీళ్ళ పేర్లు తెలియవు. ఈ అయిదుగురు రోజూ కలుస్తూంటారు. కాదు, కనిపిస్తూంటారు. అంటే, నేను చూస్తూంటాను. వాళ్ళు చూస్తారోలేదో నాకు తెలియదు. నా అంచనాలని బట్టి చూస్తే, చూడరు. అందుకే వారంటే నాకు కోపం. సుబ్బు మాత్రం నవ్వే వాడు. సుబ్బు జాగింగ్ చేసేవాడు.పాతిక లోపే వయసు. అప్పుడప్పుడు రొప్పుతూ ఆగి ‘తాతగారూ స్పీడు పెంచండి ‘ అనే వాడు. గట్టిగా నవ్వి వెళ్ళిపోయేవాడు. అలాగే వెళ్ళిపోయాడు.యాక్సిడెంట్లో. ఇది జరిగి రెండు సంవత్శరాలయ్యింది. ఆ మధ్యన ఓ ఇద్దరు అమ్మాయిలు, కాలేజీలో చదువుకునే వారు అనుకుంటా, వాళ్ళు అంతే జాగింగ్ చేయటానికి వచ్చేవారు. ‘హాయ్ ‘ అనేవారు. ఇప్పుడు రావట్లేదు. కారణం తెలీదు.

వీళ్ళు మాత్రం అప్పుటినుంచీ వస్తున్నవాళ్ళే. మొదట్లో వాళ్ళని చూసి, నేనే పలకరింపుగా నవ్వాలని అనుకునే వాడిని. కానీ వాళ్ళ చూపు నా చూపు కలిసేవి కావు. కలిపేవారు కాదు. గత ఏడేళ్ళుగా ఇలా నడుస్తూనే వున్నాను.

నాకంటూ ఎవ్వరు లేరు. లేని వారు వుండకుండా పోయారు. వున్నవారు లేకుండా పోయారు. వదిలేసి. లేనిది నా భార్య. కాలం చేసి ఏడేళ్ళయ్యింది.వున్న వారు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ అమెరికాలో వుంటారు. ఇద్దరూ లేనట్టే. ఇక్కడకు రారు. అక్కడకి రానీయరు. జబ్బులు వస్తే తగ్గించుకోటానికి,డబ్బు మాత్రం పంపిస్తారు. సొంత ఇల్లుంది. కాస్త పెన్షను వస్తుంది. నేను వెనకేసుకున్నది కొంత వుంది. ఆర్ధికంగా భోగం. హార్ధికంగా రోగం. ఓ సారి బైపాస్చేసారు. మరో సారి అయితే బైపాస్ చేసేస్తారు.

జీవితం మా విచిత్రమయ్యింది. ఇది ఒక ప్యాకేజి. అన్ని వుంటాయి. ఆనందం, బాధ, సంతోషం, వ్యధ, కోపం, విసుగు, చిరాకు, తెలివి, మూర్ఖత్వం అన్నీవెరసి జీవితమవుతుంది. అయితే అన్నీ ఒకే పాళ్ళలో వుండవు. అందరికి ఒకే పాళ్ళలో వుండవు. నాకు బాధ, వ్యధ కాస్త ఎక్కువ పడ్డాయి. జీవితంలోమనకి కావలసిన ప్యాకేజీ ఎందుకు దొరకదు. అలా వుంటే మనకి కావలసినవి కోరుకోవచ్చు. నేనయితే భాగ్యాన్ని కోరుకుంటాను. ఇంకేమీ వద్దు. భాగ్యం నా భార్య.

రోజూ ఆరింటికి లేస్తాను. మెళుకువ వచ్చేస్తుంది. అది పచ్చి అబద్దం. నిజానికి నిద్ర పట్టదు. ఇక తెల్లరే సరికి ఎక్కడ జీవితం తెల్లరి పోతుందో అన్నభయంతో మా వాళ్ళు వుదయాన్నే నిర్ధారించు కోటానికి ఫోను చేస్తారు. నేనింకా బతికే వున్నానా లేదా అని. కాసిని మంచి కబుర్లు చెబుతారు. వారికిమంచివి. నాకు కాదేమో. మందులు వేసుకోండి. తరచు డాక్టరుకి చూపించుకోండి అని. లేకపోతే లక్షలు కర్చవుతాయి వాళ్ళకి. ఇక్కడికి రావటానికి.

నా జాగ్రత్తలో నేనుంటాను. ఓ పని మనిషి కం వంట మనిషిని పెట్టుకున్నాను. పేరు దయమ్మ. దయగలదే. నమ్మకమయినది. నేను ఏడింటికి తిరిగివెళ్ళే సరికి వస్తుంది. ఓ సారి ముందే వస్తుంది. తన దగ్గర ఓ తాళంచెవి వుంది. రాగానే కాస్త కాఫీ పెడుతుంది. ఏ ఇడ్లీలో తెచ్చిస్తుంది. తిని మందులేసుకుంటాను. మళ్ళీ పదకొండింటి కొచ్చి కాస్త వంట చేసి పెడుతుంది. తినగలుగుతాను అని అనను, తింటున్నాను. నాకు ఇష్టమయిన గుమ్మడి కాయ కూర కూడా చేసిందో మారు. నా పుట్టిన రోజు జనవరి పద్నాలుగున పరవాన్నం చేస్తుంది. పాపం, చేయటం రాదు. నాకూ రుచితెలియటం లేదు.
నాకున్న బాధంతా ఎవ్వరూ పట్టించుకోరు అని
నేనంటే ఒక్కరికి ఆసక్తి లేదు. భాగ్యం అంటూండేది. ఆడది మొగాడులేకుండా బతక గలదు. మొగాడు ఆడది లేకుండా బతకలేడు అని. ఒంటరితనం ఓ శాపం.

పక్కింట్లో రిటైర్ అయ్యిన ఓ పోలీసాయన ఉ౦టాడు. వారింట్లో నలుగురే వుంటారు. కానీ వారికన్న ఎక్కువ కుక్కలుంటాయి. పదవిలో వున్నప్పుడు బాగా సంపాదించినట్టున్నాడు. ప్రహారీ గోడ చాలా ఎత్తుగా వుంటుంది. నాకు కుక్కలంటేపడదు. కరుస్తాయని కాదు. చూసి అరుస్తాయని. అందుకే ఆయనని పట్టించుకోను. ఆయనా నన్ను పట్టించుకోడు. ఓ పెద్ద కార్లో లోపలి పోర్టికోలోనే ఎక్కి బయటకి వెళ్తాడు.

ఇటు పక్కన, వెనుక ఖాళీ స్థలం. ఏదో వివాదంలో వుంది. అందుకే నేను ఇంటి లోపల నుంచి గట్టిగా అరిచినా ఒక్కరికీ వినిపించదు. ఇక స్నేహితులు కానీ హితులు కానీ లేరు.

ఉన్న ఒక్క బావమరిది కూడా వాళ్ళ అక్క దగ్గరకి వెళ్ళిపోయాడు. నడుస్తున్నాను. అటు జీవితంలోనూ, ఇటు ఇసుకలోనూ. అదుగో ఆ అమ్మాయే పొడుగు జడ అమ్మాయి. పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆగాను. ఇవాళయినా చూసి నవ్వుతుందేమో చూద్దాం. దగ్గరకి వస్తోంది. కళ్ళు కలిపే దూరం. నన్ను దాటివెళ్ళిపోయింది. చూడలేదు. మళ్ళీ కాళ్ళు ఈడుస్తూ నడక మొదలెట్టాను. కాస్త నడిచాకా ఆ మీసాలాయన ఎదురయ్యాడు. తనూ చూడలేదు. లావుపాటావిడ వస్తోంది వెనకే. సల్వార్ వేసుకుని, కాళ్ళకి రీబాక్ షూస్ వేసుకుని గబ గబానడుస్తూ, ఆయాసపడుతూ నడుస్తోంది. నన్ను దాటి వెళ్ళి పోయింది. ఆరూ యాభై అయ్యింది. ఇక వెనక్కి తిరిగాను. పది నిమిషాలు పడుతుంది ఇంటికి.

ఏడుంబావుకి దయమ్మ వచ్చింది. కాఫీ కలిపిచ్చింది. తాగుతూ, ఆనాటి పేపరు చదువుతున్నాను. ‘ఇయాల ఆ ఇడ్లీ బండోడు ఎట్టలేదండి. ఆ పైకి బజార్లోకెల్లి టిఫినీ అట్టుకురానా౦డీ ‘ అడిగింది. ‘వద్దులే. ఇవాళ ఎందుకో తినాలని లేదు ‘అన్నాను. ‘భలే వారండీ పంతులుగారూ. తినకపోతే బిళ్ళలేలా ఏసుకుంటారేటి. లగెత్తుకెల్లట్టుకొచెస్తాను ‘ అంది, బయటకి వెళ్తూనే. ‘ఇదిగో. ఆగు. నువ్వు ఓ ప్లేటు తెచ్చుకో ‘ అన్నాను. ‘నాకొద్దండి బాబు. ఇడ్డేన్లు నాకు పడవు.’ అనేసి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.

ఎందుకో తినాలని అనిపించట్లేదు. నలతగా ఉన్నట్లుంది. ఇవాళ మా పెద్దాడికి అలా చెప్పేసరికి బెంబేలెత్తిపోయాడు. మరో పావుగంటలో దయమ్మ వచ్చి ప్లేటులో ఇడ్లీ, కారప్పొడి వేసి, ఓ గ్లాసుతో నీళ్ళట్టుకొచ్చి పెట్టింది. ‘ఏడినీళ్ళు కాగాయండి.తినేసి, మందు బిళ్ళలేసుకుని, ఓ పదిమిషాలాగి స్నానం చెయ్యండి ‘ అని చెప్పి, వెళ్ళ బోతూ ఆగి ‘నేను ఇయాళ మధ్యాన్నం, ఓ రెండ్రోజులకి పాడేరెళ్ళొస్తానండి. మా అయ్యకి సుస్తి చేసిందట ‘ అంది. ‘సరే వెళ్ళు. త్వరగా వచ్చెయ్యి ‘ అన్నాను.ప్లేటు చేతిలోకి తీసుకుంటూ. రెండ్రోజులు చెయ్యి కాల్చుకోవాలి. తప్పదు. అనుకుంటూ సగం ఇడ్లీ తిన్నాను. ఇక సయించలేదు. కింద పెట్టేసి గదిలోకెళ్ళి మంచం మీద పడుకున్నాను.

మెడ మీద చెయ్యి పెట్టి చూసుకున్నాను. జొరం ఏమయినా వుందేమోనని. చిన్నప్పుడు జొరం వస్తే చాలా అపురూపం చేసేవారు. లంఖణం చేయించే వారు. మా బామ్మ మాత్రం కాఫీలో బోల్డు పంచదార వేసి ఇచ్చేది. నాకు కాఫీ తాగేసాకా,గ్లాసులో మిగిలిన పంచదార వేలితో తీసుకుని తినటం అంటే ఇష్టం. ఓ సారి హొటెల్లో అలానే వేలితో గ్లాసులోంచి పంచదార తింటూంటే, సర్వరు ఓ రెండు నిమిషాలు చూసి ‘బాబూ పర్లేదు. ఆ గ్లాసు ఇంటికట్టుకెళ్ళి, తినేసాకా తెచ్చి పెట్టు ‘అన్నాడు. అంతే దాంతో అలా తినటం మానేసాను. బాగ్యం కూడా నా కాఫీలో ఎక్కువ పంచదారే వేసేది. దయమ్మ మాత్రం వెయ్యదు. ‘మీకు వొంట్లో అంతా షుగరే వుంది. ఇక కాఫీలో ఎందుకు ‘ అంటుంది.

ఒళ్ళు వేడిగా లేదు. ఒళ్ళు నొప్పులే. కాస్సేపు పడుకుంటే సద్దుకుంటుంది. ఇప్పుడు డాక్టరు దొరకడు. సాయంత్రం వస్తాడు. అందుకే కాస్త నడుము వాల్చాను. నిద్ర పట్టేసింది.

‘అయ్యగారు. లేస్తారా? ఒకటింబావయ్యింది’ అనేసరికి లేచాను.

‘నువ్వెళ్ళలేదా’ అడిగాను, ఎదురుగా దయమ్మని చూసి.

‘నాలుగింటి బస్సుకి వెళ్తాను ‘ అని టేబుల్ మీద, ఓ ప్లేట్లో భోజనం వడ్డించింది. కాస్త బానే వుంది. దొండకాయ వేపుడు,పప్పు పులుసు, పెరుగు. బానే తిన్నాను. చెయ్యి తుడుచుకుంటూ ‘డబ్బులేమయినా కావాలా ‘ అడిగాను.

‘వద్దండి. నా కాడున్నాయి ‘ అంది, ప్లేట్ తీస్తూ. గిన్నెలు కడిగేసింది. తలుపులేసి, వెళ్తూ ‘ ఎల్లుండీయేలకి వచ్చేస్తాన౦డి. మందులు జార్తగా ఏసుకోండి ‘ అని చెప్పి వెళ్ళిపోయింది.

రెండయ్యింది. కాసేపు టీవీ పెట్టాను. ఏదో పాత సినిమా వస్తోంది. పేరు గుర్తులేదు. ఓ అరగంట తరువాత మళ్ళీ కాస్సేపు నడుము వాల్చాను. నాలుగున్నరకి మెళుకువ వచ్చింది. కాస్త జొరం తగిలివుంటుంది అని చూసాను. వందకి తక్కువగా వుంది. పర్లేదనుకున్నాను. కాసేపు బయట కుర్చీ వేసుకుని కూర్చున్నాను. ఆరయ్యింది. ఎవరయినా వస్తే బాగుండును. ఏదయినా మాట్లాడచ్చు.

పొద్దున్న పేపరు వాడొస్తాడు. పేపరు త్వరగా రావట్లేదు అని వాడితో మాట కలుపుదామంటే, నేను వాకింగుకెళ్ళొచ్చేలోపు పేపరు పడేసుంటుంది. ఇక పాలవాడు నేను వాకింగుకెళ్ళక ముందే పాల ప్యాకెట్లు పడేసి పోతాడు. ఇక వాకింగు చేస్తుంటే వాళ్ళెవ్వరూ పలకరించరు సరికదా, చూడను కూడా చూడరు.

ఇంటికొచ్చాకా దయమ్మ వుంటుంది. దాని పనేదో దానిదే. అడిగితే సమధానం చెబుతుంది.

అయినా దాంతో మాట్లాడే విషయాలు ఏముంటాయి కనుక. దాని మొగుడు వదిలేసి ఇంకో దానితో పారి పోయాడు. ఒక కూతురు. పదిహేనేళ్ళకే పెళ్ళి చేసేసింది. దానికో ఇద్దరు పిల్లలు. ఇది ఒక్కత్తే వుంటుంది ఇక్కడ. వీళ్ళు తప్ప నా రోజువారీ జీవితంలో ఫోను ద్వారా వచ్చేది నా కొడుకులు మాత్రమే.

సడనుగా నాకు ఏదయినా జరిగితే? ఎందుకో నాకు నా నడక ఆగిపోతుందేమో అని అనిపిస్తోంది. నా నడకే నా జీవితం. నడవాలని కూడా లేదు. నడవలేక. ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాను. కాస్త చలిగా వుంది. చీకటి పడినట్టు కూడాతెలియలేదు. టైము ఎనిమిదిన్నరయ్యింది. లేచి లోపలికొచ్చాను. కాస్త వొళ్ళు నొప్పులగా వుంది. పొద్దున్న మిగిలినవి ఫ్రిడ్జిలో పెట్టింది. లేచి తిందామనుకున్నాను. కళ్ళు తిరుగుతున్నట్టయ్యింది. అలాగే పడుకున్నాను. కాస్సేపు అలానే పడుకున్నాను.

పదయ్యింది. గోడ గడియారం గంటలు కొడుతోంది. నెమ్మదిగా లేచాను. బానే వుంది. ఫ్రిడ్జి తీసి, పొద్దున్నవి తీసుకుని టేబుల్ మీద పెట్టుకున్నాను. చలి బాగా వేస్తోంది. కొంచం తిన్నాను. ఇక తినలేక వదిలేసాను.

అలాగే వచ్చి మంచం మీదపడుకున్నాను. నిద్ర పట్టలేదు. గుర్తొచ్చింది. మందులు వేసుకోలేదు. కాస్త ఇబ్బంది గానే వుంది. అయినా లేచాను. ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద మందులు అందుకుని వేసుకున్నాను.

నెమ్మదిగా వెనక్కి మంచం వైపు నడిచాను. కాలు మడత పడిందో, కళ్ళు తిరిగాయో తెలియదు. అక్కడే దభేల్న కూల బడిపోయాను. తల నేలకి తగిలినట్టుంది. నొప్పి పెడుతోంది. అంతే తరువాత తెలియదు. కళ్ళు మూసుకు పోయాయి.

కళ్ళు తెరిచాను. మగతగా వుంది. కళ్ళు తెరవటానికి రావట్లేదు. మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నాను. కొంత సేపయ్యాకా మళ్ళీ తెరవటానికి ప్రయత్నించాను. కష్టం మీద తెరుచుకున్నాయి. గదిలో వెలుగు బానే వుంది. బాగా తెల్లరిపోయినట్టుంది. ఇంకా నా కళ్ళు పరిసరాలకి అలవాటు పడలేదు.

నాకోటి తెలుస్తోంది. అది నా గది కాదు. ఎదురుగా నా భాగ్యం ఫొటో లెదు. ఇంకా ఏవో కొత్త గొంతులు వినిపిస్తున్నాయి. కళ్ళు బాగా తెరచి చూసాను. ‘ఎలా వుంది బాబయ్ గారూ ‘ కొత్త పిలుపు. పాత ముఖమే. నలభై పైబడ్డ లావావిడ. ఆవిడ వెనుకే మీసాలాయన. ఇటు పక్క జ్యూసుతో పొడుగు జడ అమ్మాయి. ‘కాస్త జ్యూసు తాగండి ‘ అంది. నా తల కింద ఎవరో చెయ్యిపెట్టి లేపుతున్నట్టనిపించింది. నెమ్మదిగా వెనక్కి తిరిగాను. బక్కాయన. ఆ అమ్మాయి నా నోటికి గ్లాసు ఆనించింది. నేను కాస్త జ్యూసు తాగాను. గదిలోపలికి ఆ కుర్రాడు వచ్చాడు. ‘అక్కా. ఇవిగో డాక్టరు రాసిన మందులు ‘ అని ఓ పాకెట్ పక్కన టేబుల్ మీద పెట్టాడు. నా కేసి చూసాడు ‘వైరల్ ఫీవర్ ‘ అన్నాడు నవ్వుతూ. ‘నాల్రోజుల్లో తగ్గిపోతుంది.మళ్ళీ మీ నడక సాగించచ్చు ‘ అన్నాడు.

‘మీరెలావచ్చారు ‘ అడిగాను.

‘మీరు నిన్న వాకింగుకి రాక పోతే, ఎందుకు రాలేదా అని అనుకుంటూ ఆలోచిస్తున్నాము. నేనూ ఈవిడ.

అప్పుడే ఈయన మాకు కలిసి మీరు ఇంట్లో పడిపోయారని చెప్పారు. వెంటనే ఇదిగో ఈ అమ్మాయి, వాళ్ళ తమ్ముడు వచ్చారు. ఈఅమ్మాయి డాక్టరు. వెంటనే మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ఈ హాస్పిటలికి తీసుకొచ్చాము. దయమ్మ వీళ్ళ ఇంట్లో పని చేస్తుంది ‘ అని చెప్పాడు మీసాలాయన. అందరికీ ఓ నమస్కారం పెట్టాను. అందరూ నా చేతులు పట్టుకుని ‘మీరు మాకు దణ్ణంపెట్టకూడదు. దీవించాలి ‘ అన్నారు. ఎదురుగా దయమ్మ నిలుచుంది, దూరంగా. తన కేసి చూసి చేత్తో రమ్మని పిలిచాను. కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. ‘నువ్వు ఊరెళ్ళలేదా ‘ అడిగాను. లేదని తలూపింది. తన చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను. నా కళ్ళలోంచి కూడా నాలుగు చుక్కలు తన్ను కొచ్చాయి.

నాలుగు రోజుల తరువాత ఇంటికెళ్ళిపోయాను. కోలుకోవటానికి మరో రెండు వారాలు పట్టింది. రోజూ ఎవరో ఒకరు వచ్చి పరామర్సిస్తూనే వున్నారు. నా కొడుకులు మాత్రం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. నేను కోలుకున్నానని తెలిసి భయపడ్డారు. మళ్ళీ ఎప్పుడో ఏదో జరుగుతుంది అని. మళ్ళీ అప్పుడు కూడా ఇలానే
టెన్షన్ పడాలని. పూర్తిగా కోలుకున్నాను.

నడుస్తున్నాను.

అవే అలలు. అదే నడక. అదే జీవితం. కానీ కొంత మార్పు వచ్చింది.

‘తాతగారూ ఎలా వున్నారు. మళ్ళీ నడుస్తున్నారు.’ వెనకనుంచి డాక్టర్ అపర్ణ. అమ్మాయి అందంగా వుంది. ఆ అమ్మయి జడ కూడా బాగుంది. వెనకే తన తమ్ముడు నికిత్. జాగింగ్ చేస్తూ వెళ్లిపోయారు.

మరి కాస్త నడిచాను. ‘ఎలా వుంది బాబయ్యగారు? ఇంకొన్ని రోజులు ఆగలేక పోయారా. ఇంకా నీరసంగా ఉన్నట్టుంది ‘ అంది వైదేహి, నవ్వుతూ పలకరించి వెళ్లిపోతూ. ఇప్పుడు అంత లావుగా కనిపించట్లేదు. వాళ్ళాయన ఎంత మంచి వాడో.ఇంత లావుగా వున్నా ఈవిడని భరిస్తున్నాడు.

‘గుడ్ మార్నింగ్. లుకింగ్ గుడ్. బాగా రికవర్ అయ్యారు. మీ రికవరీ సిస్టం బాగుంది ‘ అన్నాడు బ్రిగేడియర్ బలరాం. షేక్ హాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.

‘అన్నగారూ. కుశలమేనా? వదినగారు ఎలా వున్నారు? ఇక మీ ఆరోగ్యానికి ఢోకా లేదు ‘ అని వెళ్ళిపోతూ, ‘ఈ వయసులో మీకు దయమ్మ తోడవ్వటం నాకు చాలా ఆనందంగా వుంది ‘ అన్నాడు ముందుకు సాగిపోతూ.

నేనూ ఆగలేదు. ముందుకు సాగుతున్నాను.

నా నడక కొంచం మారింది. గమ్యం మారలేదు.

అందుకే..

నడుస్తున్నాను.

**** (*) ****

(కథాగ్రూపు, సాయి అఖిలేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్వహించిన కథలపోటీల్లో ప్రత్యేక ప్రశంస పొందిన కథ)


రచయిత పరిచయం :
పొన్నాడ విజయ్ కుమార్ వృత్తిరీత్య ఈవెంట్స్ మరియు కాంపైన్స్ మేనేజిమెంటులో వున్నారు. గత మూడేళ్ళుగా కథలు రాస్తున్నారు. ఇప్పటికి పదహారు కథలు రాసారు. అందులో నాలుగు కథలకి స్వాతి పత్రికలో బహుమతులు వచ్చాయి. ప్రతిష్టాత్మకమయిన అనీల్ అవార్డ్ 2014 తో సహా… విజయ్ కుమార్ కథలు స్వాతి వార, మాస పత్రిక, తెలుగు వెలుగు, నవ్యలో ప్రచురితమయ్యాయి. ఇవేకాక, గత రెండేళ్ళల్లో, ఈనాడులో అరవై దాకా పొలిటికల్ సటైర్స్ రాసారు.



6 Responses to నడక

  1. sammeta umadevi
    February 4, 2015 at 7:47 pm

    కంగ్రాట్స్ విజయ కుమార్ గారు .. నడక, నడక చాల బాగా కుదిరింది

    • V V Bharadwaja
      February 4, 2015 at 8:18 pm

      గుడ్ ఈవెనింగ్ సర్,

      ద్రుస్యమానంగా వుంది మీ కథ. కథ నడత కుతూహలంగా వుంది. చాల బాగా సూట్ అయింది కథ పేరు నడక. ఉస్తుకథ ఉరకలేసిన్హి కథ నడత లో, అందువల్ల
      ఉస్తహమ్ వేసింది నడక కహతా చదవడానికి. హృద్యంగా వుంది ముగింపు. ఉల్లాసంగా నడిచేరు దయమ్మ దయతో, బ్రిగెదిఎర్ వాక్యాలు కథకు కథనం కల్పించింది, ఉల్లాసంగా ఉస్తహంగ నడక సాగింది. చాలాబాగుంది కథ నడక.

  2. సునీత
    February 4, 2015 at 10:24 pm

    చాలా బాగుంది సర్

  3. Usha rani
    February 5, 2015 at 5:03 pm

    మీ కథ చాలా బావుంది విజయకుమార్ గారూ ..జీవన గమనాన్ని ‘నడక’ లో చక్కగా తెలియజేసారు ..నడకనూ , జీవితాన్ని కొన్ని సంఘటనలు బాగా ప్రభావితం చేస్తాయి ..మీరు ఆవిషయాన్ని బాగా ప్రెజెంట్ చేసారు .

  4. chandu
    February 9, 2015 at 2:55 pm

    నైస్ స్టొరీ

  5. Dr. Vijaya Babu,Koganti
    February 15, 2015 at 9:05 am

    ఒంటరితనం లోని ఆవేదన, పట్టించుకోనివాళ్ళు ఉన్నట్లుండి పట్టించుకుని పరామర్శ చేస్తే ఉండే ఆనందం గతి , గమ్యం మారని జీవితపు నడక…. చాలా బాగుంది. అభినందనలు .

Leave a Reply to sammeta umadevi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)