కవిత్వం

సశేషం

మార్చి 2015

చ్చిపుచ్చుకోవడానికి మాటలేమీ లేనప్పుడు
ఒకరిలో ఒకరు నింపబడటం ప్రారంభమవుతుంది

ఇనుప స్తంభాలకు హృదయాలను అతికించడం
బోర్లించిన పాత్రను దాహాన్ని తీర్చమనడం ఒక్కటే

మనసు ఒక చుక్కగా ఆగాల్సినపుడు
కామా పెడుతూ కొత్త అక్షరాలు నేర్వాల్సిందే

హేతువులేమీ దొరకని పరిశోధనను
ఒక ప్రశ్నను పాతిపెట్టి మరలా మొదలు పెట్టాలి

***

మంచు శిల్పాలు అరచేతులలో నిర్దయగా కరిగిపోయినా
అకస్మాత్తుగా పడిన వర్షానికి గొడుగులా తడుస్తున్నా
ఒక వికసించిన ఉదయంలోకి నెట్టబడక తప్పదు

చించేసిన కాగితాలతో మాటలు ఎగిరిపోవడం
లోపటి అరలలో బాల్యాన్ని పదే పదే తడుముకోవడం
నవ్వడం, ఏడ్వడం అన్నీ జీవించడానికి వెతుక్కునే కారణాలు

***

చివరికి శ్వాసించడమూ ఆగిపోదు
జ్ఞాపకాలను మోసుకుంటూ ఎవరో కొనసాగిస్తారు

 

**** (*) ****