కవిత్వం

మసాజ్ పార్లర్

జనవరి 2013

స్వర్గానికీ…నరకానికీ మధ్యన
సరసాల చెఱశాల మసాజ్ పార్లర్.
ఐశ్వర్యపు విలాసాలకీ
దారిద్ర్యపు విలాపాలకీ నడుమ
వ్రేలాడే రూపాయిల వంతెన అది.

నగరం నడిబొడ్డున..
ముసుగేసుకున్న మయసభ
కలల అలల చుట్టూ వలపుల వలలు
అల్లే దళారీల సాలెగూడు
లోపలికి తొంగి చూడకు
కీచకుడి కాళ్ళు పడుతూ కనబడొచ్చు ద్రౌపది
రావణుడి తలలు రాస్తూ నిలబడొచ్చు సీత

ఇక్కడి కుంతీ కుమారి చెవిలో
ముని చెప్పిన మంత్రం …రూపాయిల సంపాదన
పాతివ్రత్యాన్ని నిప్పుల గుండం లో త్రోసి
పొట్ట చేత పట్టుకు పరిగెత్తే పడతే పెట్టుబడి
పరువుని దాచేసి గుట్టుగా పరుపెక్కాలట పరువం
మదన తాపాన్ని మర్ధనాలతో తీర్చుతూ
వ్యర్ధాల్లో కలిసిపోతుంది అర్ధాకాశం

సంపాదనెంతో లెక్క తెలిసినా
పోగొట్టుకున్నదేమిటో తెలీని అమాయకత్వం
అప్పు తీర్చలేని నాన్న అమ్మకానికి పెట్టిన
పరువం ఒకటీ..
తాళి కట్టిన భర్త తాకట్టు పెట్టిన తలరాత ఒకటీ
మాయ మాటల వేటలో మనసు మారిన తనువులూ..
కళాశాల విద్యార్ధినుల కాశుల కక్కుర్తిలో
సాగే రహస్య కామకలాపాలూ
మిస్సయిన మైనర్ బాలికల డ్రెస్ మార్చే అడ్రెస్ ఇది.

శరేరమంటే ఇక్కడ అలసిపోయే ఆటస్థలం
కాకుంటే గాయపడే యుద్ధ క్షేత్రం
విషాన్ని చిమ్మే వికృత ప్రయోగాల రసాయనశాల
వాడుకుని బాడుగ చెల్లించే ఆకలి అద్దె కొంప
రత్నాలని రాశులుగా పోసి
అంగళ్ళలో అమ్మిన నా దేశంలో…
అంగాంగాలనీ అమ్మకానికి పెట్టే కసాయితనం
గుట్టుగా క్రమ్ముకుంటోంది.
నరాలని మీటుతూ ..కండరాలని నలుపుతూ
నాగరికత దేహం మీద నూనె జిడ్డులా ప్రాకుతోందది.
ఇది కన్నె కలల భలిపీటం
యవ్వన పొంగుల రంగుల రాట్నం
చర్మాన్ని మాంసానికి చుట్టి
చూపుల కత్తులకి గుచ్చే మానవ కభేళా!
మీడియా మూడో నేత్రం తెరచినప్పుడో
ఖాకీల ముడుపులలెక్క దక్కనప్పుడో
ముసుగేసి తీసుకు పోతోన్న
ముక్కు పచ్చలారని బాలిక చెవిలో
ఓ ముక్క చెప్పాలని ఉంది
మానవ దేహాన్ని వర్తకం సరుకు చేసిన
కిరాతకుల మత్తొదిల్చే మసాజ్ లో..
బాలికే.. కాళికగా మారాలని !
గుట్టు రట్టు చేస్తూ..పార్లర్ల పని పట్టాలని!!

 



5 Responses to మసాజ్ పార్లర్

  1. వాసుదేవ్
    January 19, 2013 at 5:58 am

    సూపర్..ఓ విజిలేసాను వినిబడిందా నాగేశ్వర్ర్వారుగారూ.. your word play isjust excellent

    • Krishnaveni
      January 29, 2013 at 3:16 am

      Thank you..sound…resound echo..malla..malla vinabadutondi

    • GVSNrao
      January 29, 2013 at 3:17 am

      thank you sir

  2. Krishnaveni
    January 19, 2013 at 7:33 am

    శరేరమంటే ఇక్కడ అలసిపోయే ఆటస్థలం
    కాకుంటే గాయపడే యుద్ధ క్షేత్రం
    విషాన్ని చిమ్మే వికృత ప్రయోగాల రసాయనశాల
    వాడుకుని బాడుగ చెల్లించే ఆకలి అద్దె కొంప
    kavitvam velluvayyindi congrats nageswarraogaru

  3. Krishnaveni
    January 19, 2013 at 7:35 am

    manchi abhivyakti unna kavita congrats

Leave a Reply to Krishnaveni Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)