ఆనవాలు

Abstract నుంచి concrete కి ఈ ముగ్గురి ప్రయాణం!

ఫిబ్రవరి 2013

 1

1981 - రేవతీ దేవి కవిత్వ పుస్తకమూ, నాకు పదహారేళ్లూ వొక్క సారే వచ్చాయి!

ఇవి రెండూ వొక్క సారే జరగడం యాదృచ్ఛికమే కానీ, ఆ యాదృచ్చికత ఆ తరవాతి అనేక అనుభవాలకు మొదలుగా మారడం మాత్రం ఆశ్చర్యంగా వుంటుంది. కానీ, అలాంటి వొక యాదృచ్చికతకి కొనసాగింపు వూరికే జరగదు, ముఖ్యంగా కవిత్వం విషయంలో! ఆ పదహారేళ్ళ వయసు దాటిన తరవాత నా పాతికల్లోనూ, నా ముప్పయిల్లోనూ, నలభయిల్లోనూ ఎన్ని సార్లు రేవతీదేవి కవిత్వం చదివానో లెక్కలేదు. కానీ, చదివిన ప్రతిసారి నా పదహారేళ్ళప్పటి ఆ పఠన అనుభవమే పునరుక్తి అయినట్టుగా అనిపించింది నాకు!

ఎందుకు రేవతీదేవి నా మనసులో ఇంత గాఢంగా నిలిచిపోయింది?

కవిత్వం మన మీద ప్రభావం చూపించడానికి కేవలం కవిత్వ కారణాలే పనిచేయవు. మన వ్యక్తిగత జీవితమూ, బయటి అనుభవాల్ని మన సొంతం చేసుకోగలిగిన తనమూ – ఈ రెండూ బలంగా కవిత్వాన్ని మనకు సన్నిహితం చేస్తాయి. అందుకే, ప్రతి పఠన అనుభవమూ మన జీవన సందర్భం వల్ల పూర్ణవలయం అవుతుంది.

ఆ పదహారేళ్ళప్పుడు రేవతీదేవి కవిత్వం చదవడం వొక్కటే కాదు, నా వ్యక్తిగత జీవితంలో ఇంకా చాలా జరిగాయి. సాహిత్య పత్రిక పెట్టాలని నాన్నగారు పెట్టిన ప్రెస్ దివాళా తీసింది, వ్యాపారం చేయలేని ఆయన నిజాయితీ వల్ల  మేము లక్షలకొద్దీ అప్పుల్లోకూరుకుపోయాం. ఏడాది కిందటే పెళ్ళయిన అక్కయ్య అత్తారింటి బాధలు పడలేక ఇల్లు చేరింది, ఆ పెళ్లికయిన అప్పు కూడా  తీరకుండానే! దీంతో ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ తిరిగే అమ్మ ముఖమ్మీద ఆ నవ్వు చెరిగిపోయింది. నిరంతరం వచ్చీ పోయే సాహిత్య మిత్రుల మధ్య సంతోషంగా కవిత్వ కబుర్లు చెప్పుకుంటూ వుండిన నాన్నగారు సాహిత్యానికి నెమ్మదిగా దూరం జరగడం మొదలయ్యింది. వీటన్నిటి మధ్యా, బయటి విషాదాలు కొన్ని –‘నీకు ఆడ పేరు భలే పెట్టార్లే…అఫ్సర్ ఏక్ లడ్కీ హై!” అంటూ ఎప్పుడూ నన్ను ఆట పట్టిస్తూ నవ్వుతూ తుళ్లుతూ మా ఇంట వొక కెరటంలా రివ్వు రివ్వున తిరుగాడిన అనీస్ అనే మా పొరుగింటి అమ్మాయి వున్నట్టుండి ప్రాణం తీసేసుకుంది. ఇప్పటికీ తెలీదు అనీస్ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో! ఇలా అనేక దుఖాల మధ్య చిక్కుకొని  మా ఇల్లు వొక విధంగా శేషేంద్ర శర్మ ఏదో పాటలో రాసినట్టు ‘విఫలమయిన కోర్కెలు వేలాడే గుమ్మంలో..” అన్నట్టే కనిపించేది. వొక ఏడాది పాటు  ప్రతి మనిషీ వొక failure symbol లాగా కనిపించే వాళ్ళు.  ‘పదహారేళ్ళకు ఆ ప్రాయం చేసే చిలిపి పనులేమీ’ నా అనుభవంలో కనీసం వూహించనయినా వూహించే స్థితి లేదు.  ఇంత చీకటిని తట్టుకోలేక, వొక్క చిరునవ్వు దీపం కూడా వెలిగించలేక కాలేజీ నించి రాగానే నేను వొక పుస్తకం పట్టుకుని మా వీధి చివరి నరసింహ స్వామి కొండ (రోజూ రెండు వందల మెట్లు ఎక్కడం/ దిగడం)  ఎక్కి వో చెట్టు కింద కూర్చొని పుస్తకం చదువుతూనో, ఏదో ఆలోచిస్తూనో గడిపేవాణ్ణి. ఎవరినీ కలవాలనిపించేదీ కాదు.

ఆ స్థితిలో నా మనసు మూలమూలల్ని వెలిగించింది రేవతీదేవి కవిత్వం. కనీసం వొక ఏడాది పాటు ఆమె కవిత్వం చదువుతూ, మననం చేసుకుంటూనే గడిపేశాను. కవిత్వం వొక థెరపీ అయితే, వొక catharsis అయితే, మన నిట్టూర్పులు వినే వొక నేస్తం అయితే, మనతో మనమే మాట్లాడుకుని, ధైర్యం చెప్పుకునే ఆత్మీయ హస్తమయితే అలాంటి పనులన్నీ ఆ దశలో రేవతీదేవి కవిత్వం నాకు చేసి పెట్టింది.

అన్నిటికంటే ముఖ్యంగా, అసలు కవిత్వంలో abstractness ని concrete గా ఎలా చెప్పాలో నాకు రేవతీదేవి వాక్యాలే నేర్పాయి. ఆ విధంగా నాలోపల గూడు కట్టుకుంటున్న వొక abstract దిగులు నించి అవి నన్ను విముక్తుణ్ణి చేశాయి. వొక కవి తన దగ్గిర వున్న పిడికెడు మాటలతో గుప్పెడు గుండె గుట్టు ఎలా చెప్పగలదో, అసలు మనసు చిత్రం గీస్తే అది ఎలా వుంటుందో నేర్పింది కూడా  ఆమె కవిత్వమే!

దిగులు
దిగులుదిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పేవీలుంటే
దిగులెందుకు?

అన్న ఎరుక నాలో కలిగించి చాలా అనుభవాలు భాషలో వొదగవు అని ముమ్మాటికీ చెప్పే కవిత్వం ఆమెది. వొక అనుభవాన్ని కాన్వాస్ మీద రంగులుగానో, అక్షరాలుగానో పరుస్తున్నప్పుడు ఆ కాన్వాస్, ఈ అక్షరాలూ రెండూ ఎంత పరిమితమయిన ప్రపంచాలో మనకి ఇట్టే తెలిసిపోతుంది. రేవతీదేవి మాటల్లో :

తన అక్షరాలు
అవటానికి
అవీ ఆ మురికి నిఘంటువులోవే గానీ
అదేమిటో వాటి రూపే మారిపోతుంది
తన పెదాల మీంచీ చేతుల్లోంచీ జారే సరికి…

తన అక్షరాలు పదబంధాలు
తేనెలా మంచులా వెన్నెలలా
అవసరమైతే అగ్నిశూలాల్లా
తన అక్షరాల పదబంధాలు
తనలాగానే.

జీవితంలో రెండు రకాల అనుభవాలు వుంటాయని నాకు అనిపిస్తుంది. వొకటి: కొలమానాలు వుండేది (measurable facet of experience), రెండు: కొలమానాలు లేనిది( immeasurable facet of experience ). కొలమానాలు వున్న అనుభవం చెప్తున్నప్పుడు అది concrete గా వుంటుంది. కొలమానాలు లేని అనుభవం చెప్తున్నప్పుడు అది abstract గా వుండక తప్పదు. రేవతీదేవి కవిత్వంలో ఈ రెండీటీ మధ్య వొక సందిగ్ధ ప్రయాణం కనిపిస్తుంది. ఆ రెండీటీ మధ్య వంతెన కట్టుకుంటూ రేవతీ దేవి abstract-concrete-abstract అనే triangle లోంచి కవిత్వాన్ని చదివే అలవాటు చేసింది నా మటుకు నాకు!

2

మళ్ళీ ఇన్నేళ్ల తరవాత ఇప్పుడు ఆ పరస్పర విరుద్ధ కోణాల మధ్య సమతూకం సాధిస్తున్న కవిత్వాన్ని వింటున్నాం. ఇలాంటి కవిత్వ శిల్ప సామర్ధ్యం సాధించిన కవయిత్రులలో ఇద్దరి గురించి ఈ సారి మాట్లాడుతున్నాను.

ఈ కవయిత్రుల గురించి మాట్లాడుతున్న ఈ క్షణాన ఎప్పుడో 1979లో కవిత్వం రాసి, చాలా మౌనంగా, ఎలాంటి చడీ చప్పుడూ లేకుండా అభివ్యక్తి స్వేచ్చకి రెక్కల్నిచ్చి వెళ్ళిపోయిన  రేవతీదేవిని తలచుకోకుండా వుండలేకపోయాను. ఈ ఇద్దరు కవులు రేవతీదేవిని చదివి వుండకపోవచ్చు. వీళ్ళ ఇప్పటి కవిత్వ శైలి మీద రేవతీదేవి ప్రభావం ప్రత్యక్షంగా ఏమీ వుండకపోవచ్చు. కానీ, ఈ ఇద్దరి వాక్యాల నిర్మాణమూ, అభివ్యక్తి ధారలో రేవతీదేవి వొక అంతర్ గంగా ప్రవాహం.

పొగమంచుని తాకిన
పొద్దుటెండలోని మెత్తదనం

నల్లని వర్షపు రాత్రులలో
తడితడిగా మునకలేసిన మోహాలు
తుంపులు తుంపుల జ్ఞాపకాలూ
గాఢమైన దిగుళ్ళూ

మనసు పట్టక.. దేహపు అంచుల్ని దాటేసి
నింపాదిగా ప్రవహించే భావాలెన్నో!
తెల్సిన అక్షరాలు మాత్రం గుప్పెడే!!

ఈ వాక్యాలు నేరుగా రేవతీదేవికి కొనసాగింపు లాగానే అనిపించాయి మొదటి సారి చదివినప్పుడు- ఈ కవిత చదివిన తరవాతనే నాకు ‘నిషిగంధ’ నిజంగా పరిచయమయింది. ఈ కవిత తరవాత ఆమె ఇతర కవితల్ని వెతుక్కుంటూ వెళ్లినప్పుడు, ఆమె బ్లాగు(‘మానస వీణ’) నాకు కొత్త కవిత్వ స్వరాన్ని వినిపించింది.  నిషిగంధ (కిరణ్మయి యలమంచిలి) నిజానికి వొక abstract painter తన  కవిత్వంలో! ఈ అనుభూతికి ఆకారం ఇవ్వలేము అనుకున్న abstract వస్తువుని తీసుకుని, దానికి వొక concrete రూపం తొడిగే పదచిత్రకారిణి నిషిగంధ. పైన ఉదాహరించిన పంక్తుల్ని చదివినప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది మనకు! వొక ప్రతిభావంతురాలయిన చిత్రకారిణి తన రంగుల చిటికెన వేలు మనకిచ్చి వొక అనుభవ మహారణ్యంలోకి దారితప్పకుండా నడిపించుకు వెళ్తున్నట్టు కవిత అంతా అలవోకగా నడిపిస్తుంది నిషిగంధ. మచ్చుకి వొకటి:

ఆకాశదీపాలన్నీ వెలిగాక

నీ ఆనవాలేదో
తలుపు తోసుకుంటూ చుట్టుముడుతుంది..

కళ్ళూ కళ్ళూ కలవగానే
సిద్ధంగా ఉన్న సగం నవ్వు
పెదవులపైకి జారుతుంది…
అలసట జతగా తెచ్చుకున్న అసహనం
మాటల్ని ముక్కలు చేసి విసిరేస్తోంది..

ఈ కవిత చదువుతున్నప్పుడు దాన్ని వెంటనే నేనొక పెయింటింగ్ లోకి  తర్జుమా చేసుకున్నా. నిషిగంధ బ్లాగులో మొత్తం కవిత్వమే వుంటే ఎంత బాగుణ్ణు అనిపించేలా వొక్క రోజులో ఆమె కవితలన్నీ చదివేశాను. వొక్క వాక్యంలో ఆమె కవిత్వ విజయాన్ని గురించి చెప్పాలంటే: ప్రతి కవితలోనూ వొక కొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తూనే, తన/మన మనసులోని అవ్యక్త భావాలకు ఫ్రేమ్ కట్టే ప్రయత్నం చేస్తుంది నిషిగంధ. వొక ఇంప్రెషనిస్ట్ చిత్రశిల్ప రహస్యం ఇది.

కవిత్వం మన బౌద్ధికమయిన జ్నానానికి అతీతంగా ప్రయాణిస్తుంది.  మేధస్సుకి భిన్నమయిన intuition కవిత్వ వాక్యాల్ని ముందుకు నడిపిస్తుంది. Kenneth Burke అంటాడొక చోట: the poem is something extra, something by nature beyond the reach of a purely critical rationale; hence, in the intuiting of it, there is always something which the critical treatment cannot equal. నిషిగంధ గీసిన ఈ చిత్రాల్ని చదివేటప్పుడు మనలోపలి ఆ intuitive power పెరుగుతుంది. ఆమె కవితల చివరి వాక్యాలన్నీ – దాదాపు అన్నీ – ఆ intuitive power ని కాపాడుకోవలసిన అవసరాన్ని మనకి చెప్తాయి.

ఉద్వేగం వున్న చోటనే కాదు, కాస్త లోతయిన భావాలు సంచరించే చోట కూడా abstractness వుంటుంది. నిషిగంధ కవిత్వం వొక impression ని మనసులో  తడి అడుగు జాడలా ముద్రపడేట్టుగా చెప్తే, జయశ్రీ నాయుడు కవిత్వం అదే ఉద్వేగాన్ని ఇంకా కొన్ని మెట్లు పైకి ఎక్కించి, ఆ ఉద్వేగాన్ని వొక sublime power గా మారుస్తుంది.  అలా కొన్ని మెట్లు ఎక్కి మాట్లాడినప్పుడు ఆ దూరం వల్ల  కవిత్వంలో minute details జారిపోతాయి. అయినా సరే,  జయశ్రీ కవిత్వం చదవడం మొదలెట్టాక మనం ఇంకో అనుభవ లోకంలో కళ్ళు తెరుచుకుంటాం. Details ని దాటి వెళ్ళే వొక విహంగావలోకనంలా వుంటుంది జయశ్రీ కవిత్వం చదవడం! జీవితం విలువని అతిపదిలంగా చెప్పాలన్న తపన ఆమె వాక్యాల్లో కనిపిస్తుంది. వొక్క మాటలో చెప్పాలంటే ఉన్నతీకరించబడిన ఉద్వేగం జయశ్రీ కవిత్వం.

రోజులెన్నో వస్తుంటాయి వెళ్తుంటాయి…
జీవితాన్ని మలుపు తిప్పే ఘడియల్ని యే రోజు మోసుకొస్తుందో

యే రూపం ఆ నవ్వుల్ని ఎదురు తెస్తుందో..
చెరిపేసి పాతను కొత్తదనపు కౌగిలి అవుతుందో..

ఆ రోజు వరకూ తెలీదు..
కరగని మంచు కూడా అరనిమిషంలో ఆవిరయ్యే
ఆర్ద్రతల్ని అద్దే తోడవుతుందని

కలల వరకూ వెంటొచ్చి
గుండెకు గీతాన్నిచ్చి
గుప్పిట్లో వెలుగై ఇమిడిపోతుంది…

ఇక రొజులై క్షణాలూ
జ్ఞాపకాల జాజులూ
కళ్ళకు సీతాకోక చిలుకల పాటలూ!

ఈ వాక్యాల వెనక వున్న వుద్వేగాన్ని మనం వూహించుకోవాల్సిందే కానీ, తన వ్యక్తీకరణలో ఆ వుద్వేగాన్ని రానివ్వకపోవడం జయశ్రీ బలమూ బలహీనత కూడా! అనేక అనుభూతుల సారం వడగట్టిన తరవాత పొదుపుగా వాడిన కొన్ని వాక్యాల సమూహం ఆమె ఈ కవిత్వం. ఇది ఇప్పుడు రాస్తున్న ఇతర కవులకు చాలా భిన్నమయిన దారి.  వొక అనుభూతి మీద దృష్టి నిలిపి, ఆ అనుభూతి చిత్రపటాన్ని ఉద్వేగ తీవ్రతతో విస్తరించి చెప్పడం ఇప్పటి ఎక్కువ మంది లో కనిపిస్తుంది.

కవయిత్రిగా జయశ్రీని నడిపించే శక్తి ఏమిటా అని ఆమె కవిత్వం అంతా చదివాక ఆలోచిస్తే, బుద్ధిజీవిగా, కవిగా  జయశ్రీ సంచరించే ప్రదేశాలే భిన్నమయినవని అనిపించింది. సహనంతో నిండిన వొక కరుణా, చిన్న అంశాన్ని కూడా వొక vision లోంచి చూసే అంతర్వీక్షణం, మహా పొదుపుగా వాడే మాటలూ… ఇదీ ఆ భిన్నమయిన కవిత్వ ప్రదేశం.

ప్రేమ నీరెండలా పరుచుకుంది..

 

ఇద్దరి మధ్యా నిశ్శబ్దంలో… ఒక్కర్నే చూశాం

 

—-

ఒక్కొక్క క్షణాన్నీ.. పేని
గుజ్జనగూడు కట్టాను..

యెలా కదిలి పోయాయో తెలీదు..
చూపుల మర్మాలూ..
మూగగా మాట్లాడిన స్పర్శలూ

వెన్నెల్లా మంద్రంగా కనిపించిన నీ ఆర్ద్రత..
దూరాన్నుండే కౌగిలించావు..

 

ఈ కవితలో వొక అనుభూతిని నిర్దిష్టమయిన పదచిత్రాలతో జయశ్రీ అల్లిన నిర్మాణ సంవిధానం ఆమెలోని ఉద్వేగ తీవ్రతని చెప్తూనే, ఆ ఉద్వేగాన్ని వాక్యాల్లో పొదిగే బాలన్సు ని చూపిస్తాయి. ఈ కవితలో ఇద్దరే పాత్రధారులు. కానీ, జయశ్రీ ఇతర కవితల్లో ‘నువ్వు’ ‘నేను’ అనే పాత్రలే కాకుండా, ఇతర పాత్రలు అనేకం వుంటాయి. ఆ మాటకొస్తే, సమూహం కూడా ఆమెకు వొక పాత్రే! సమూహంలోని భిన్న వ్యక్తిత్వాల వైవిధ్యాన్ని జయశ్రీ కవితలు ప్రతిబింబిస్తాయి. ఆమె కవిత్వం చదవగానే ఆలోచనల్లో, ఆవేశాల్లో మనలో ఇంత వైవిధ్యమూ, వైరుద్ధ్యమూ వున్నాయా అనిపిస్తాయి.  అంతే కాదు, మన లోపలి అనేక ‘నేను’లు పరిచయం అవుతాయి. చూడండి జయశ్రీ అంటున్న ఈ మాటలు:

తీరం ఎదురు చూసిన అలలా

వెన్నెల వెతుక్కున్న ఆకాశంలా

ఆత్మను నింపుకున్న దేహంలా

ఆ వెలుగు లో వేల నేనులు చూసుకున్నా

కవిత్వం మాత్రమే చదివే ఏకధ్రువ జీవులకు ఇది చెంపపెట్టు. జయశ్రీ రాస్తున్న ఈ వాక్యాలలో పెల్లుబుకుతున్న శక్తి ఆమె నిరంతర పఠనమూ, సునిశితమయిన ఆలోచనల మేలు కలయిక.

3

          మన గ్లాసులో వొంపుకున్నవే నీళ్ళు అనుకుంటాం చాలా సార్లు. కానీ, నదుల్లో, సముద్రాల్లో ప్రవహించే నీళ్ళనీ- కళ్ళల్లోంచి , ఆకాశంలోంచి రాలే నీళ్లని ఎట్లా నిర్వచించాలో మనకి భాష లేదు. జీవితానికి ఆ నీటి గుణమే వుంది. జీవితంలో ఎన్ని అనుభవాలు వాక్యంగా, వాచ్యంగా  చెప్పగలమో తెలీదు. అసలు ఎన్ని అనుభవాలకు వొక ఆకృతి వుందో తెలీదు. ఆ అనుభవాల నైరూప్యత మాత్రం మనల్ని ప్రశాంతంగా వుండనివ్వదు. రేవతీ దేవి నించి జయశ్రీ దాకా ఈ సంఘర్షణ అలాగే వుంది. రూపం లేదు కదా అని వాటి వునికిని కాదనలేం కదా! అలా కాదనలేని పరిస్థితిలో కవిత్వం రాసుకున్నారు రేవతీదేవి, నిషిగంధ, జయశ్రీ. నైరూప్య నిర్దిష్టతని తెలుగు కవితకి కానుకగా ఇచ్చిన రేవతీ దేవి మన మధ్యలో లేకపోవడం విషాదమే. ఆమె అడుగుల్లో తెలిసో తెలియకో అడుగులు పడిన నిషిగంధ, జయశ్రీలు   భవిష్యత్తులో గీయబోయే అక్షర చిత్రాల గురించి నాకు చాలా ఆసక్తి వుంది. వాళ్ళు ఏ కుంచెతో ఏ రంగులతో ఏ జీవన మహారణ్యంలో సంచరిస్తూ ఏ అనుభవాలని అక్షరాల్లోకి వొంపుతారో వినాలని వుంది.

ఈ ఇద్దరి కవిత్వాల మీది ప్రేమతోనే, అటు నిషిగంధకీ, ఇటు జయశ్రీకి చెరో మాట చెప్పి తీరాలి – కవిత్వంలో తాత్వికత తప్పదు, కానీ, తాత్విక భారం అనవసరం. అలాగే, కవిత్వంలో పదును అంటే సంస్కృత పదాల భారం కాదు.

ఇటీవలి జయశ్రీ రాసిన కొన్ని కవితలు ఆ తాత్విక భారంతో వంగిపోవడం చూస్తున్నాను. నా మటుకు నాకు – కవిత్వంలో తాత్వికత అనేది అంతర్ ప్రవాహం (undercurrent) గా వుంటేనే బాగుంటుంది. నిషిగంధ కవిత్వంలో కూడా ఇలాంటి వొక లోపం వుంది. గొప్ప ఉద్వేగాన్ని పదునుగా చెప్పాలి అనుకున్నప్పుడు నిషిగంధ అక్కడ పదును అంటే బరువు అనేసుకొని వొక సంస్కృత పదం వాడేస్తుంది. అయితే, ఏది సంస్కృత పదం, ఏది తెలుగు పదం అనే స్పృహ వుండడం కూడా అవసరమే. మరీ అవసరమయితే తప్ప సంస్కృత పదం వాడకూడదు అన్న ఎరుక వుంటే బాగుంటుంది.

కచ్చితంగా ఇది తెలుసుకోవడం కోసమే మనం మళ్ళీ రేవతీదేవిని చదవాలి.