కథ

పలకరింపు

మార్చి 2015

సూర్యారావు అడిగింది విని ఆశ్చర్యపోయాడు భాస్కర్‌. అదంత పెద్ద కోరికా? కాలానికి జవాబుదారీతనం లేదా? భాస్కర్‌ ఆలోచిస్తున్నాడు. గతం తాలూకు నీడలు కదిలాయి.

***

ఇదేమిటీ ? ఇక్కడ..ఇలా ఉంది? డీలాపడిపోయాడు భాస్కర్‌. చుట్టూ చూసి వెనుదిరిగిపోదామనుకున్నాడు.

తను టీ తాగేటప్పుడు అందరిలా కప్పు కుడిచేత్తో పట్టుకోడు. ఎన్నో పెదాల ఎంగిలి కిట్టదు. టీ చప్పరించలేడు. ఎడమచేత్తో కప్పు పట్టుకుని తాగుతాడు ఎప్పుడూ.చిన్నప్పట్నుంచీ అదే అలవాటు. ఇంట్లో కూడా తన కంచాన్ని ఎవర్నీ ముట్టుకోనీయడు. అలాంటిది అక్కడ అరిగిపోయి సొట్టలు పడి వంకర్లు తిరిగిన కంచాలు చూడగానే మతిపోయింది. అయినా ఎలా? గత్యంతరం లేదా? అక్కడొక పెద్దాయన ఉన్నాడు. ఎవర్నో బూతులు తిడుతున్నాడు.దగ్గరగా వెళ్ళాడు.

‘‘ నాకెప్పుడూ విస్తర్లోనే భోజనం వడ్డించాలి. కంచంలో తినను. ఇక్కడ చూస్తే అన్నీ కంచాలే కనబడుతున్నాయి.
మీరొప్పుకుంటే రోజూ ఇక్కడే తింటాను ’’ షరతు పెట్టాడు భాస్కర్‌.

విచిత్రంగా చూసాడు సూర్యారావు. ఇలాంటి వాళ్ళు ఎపుడూ తగల్లేదు.

‘‘ అరె…బాబూ, తప్పకుండా… ఒక్కసారి కొని పారేస్తే సరిపోతుంది కదా అని … కంచాలు. అలాగే …బాబూ, మీకు విస్తర్లోనే వడ్డిస్తాను, సరేనా? ఒరేయ్‌ మస్తాన్‌…అన్యం గార్డెన్సులో చెరువు దగ్గరకెళ్ళి అరటి ఆకు కోసుకురా… అయ్యగారికి..’’ అని వెంటనే పురమాయించాడు.

మస్తాన్‌ పరుగెట్టాడు. వాడు బయటి పనులంటే వెంటనే దూకుతాడు.

పాతకాలం నాటి చిల్ల పెంకుల ఇల్లు. ఒక పెడ వాలిపోయింది.గచ్చు తడిగా ఉంది. పెచ్చులుగా ఊడిపోయి గరుకుగా ఉంది. ఎప్పుడో వేసిన వెల్ల, మాసిన గోడలు, పల్లెల్లో తరాలు మారిన ఇల్లులా ఉంది. నల్లగా కమిలినట్లు బెంచీలు, చెక్క బల్లలు, అదో రకపు అన్నం వాసన, కమురు కంపు…. బాబోయ్‌… సర్దుకోవాలి.

వాకిట్లో నుయ్యి, గోళెం నిండా నీరు, నాచుకట్టిన చప్టా, రెండు కొబ్బరిచెట్లకు వైరుతో కట్టిన దండెం…దాని మీద చేతులు తుడుచుకోడానికి తువ్వాలు.

నిత్యం నీళ్ళలో నాని నాని ఒరిసిన చేతివేళ్ళతో పనికుర్రాడు. మురికిచీర మాటి మాటికీ కొంగుతో ముఖం తుడుచుకుంటూ గలా గలా మాట్లాడుతూ… ఆమె. పేరు రత్నం అట. అస్తమానం తిడుతుంటాడు. అరుస్తుంటాడు.ఎదురు తిరగదు. ఎదురు తిరిగి ఏమైనా అంటే బావుండును.పల్లెత్తు మాట అనదు. ఆవిడ లావుగా, నల్లగా నిగనిగలాడుతూ ముక్కెర పెట్టుకుని బాగానే ఉంటుంది. సూర్యారావు నోటిలోంచి వెలువడే బూతు పదాలకు ఆమె పడిపడి నవ్వుతుంది. ఏకరీతిగా సాగే కాలానికి విరామం… కాసింత వినోదం.

అపుడు యానాంలో తీరైన హొటల్లుండేవి కావు. రాత్రిళ్ళు బస కష్టంగా ఉండేది బయటినుండి వచ్చే వాళ్ళకు. పల్లె వాతావరణం. ముప్పై కిలోమీటర్ల దూరంలో కాకినాడ. యానాంలో వ్యాపారపరమైన రాయితీలు ఉండేవి.పరిశ్రమలు పెట్టేవారందరూ కాకినాడలో మకాం ఉండేవారు.వాళ్ళ సంగతి సరే. ఉద్యోగరీత్యా వచ్చినవాళ్ళు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. బ్రహ్మచారులైతే ఒక గది తీసుకుని సూర్యారావు హొటల్లో తినేవారు. కొత్తగా ఉద్యోగం వచ్చిన భాస్కర్‌ అలాంటివాడే.

అరటి ఆకును శుభ్రంగా కడిగి…అన్నం కూరలు వడ్డించారు. చిలుకూరి ఉల్లిపాయలు చిన్నవి ఆ పళంగానే వేసి మసాలాతో తయారుచేసిన బంగాళాదుంప కూర…అద్బుతం. భాస్కర్‌ రెట్టింపు తిన్నాడు ఆరోజు. సూర్యారావు కొసరి కొసరి వడ్డించాడు. అమ్మను మరిపించాడు. సూర్యారావుకు తినేవాళ్ళంటే ఆనందం. భోజనానికి ధర కట్టి అమ్ముకుని డబ్బులు బాగా సంపాదించే తత్త్వం అతనిది కాదు.తన హొటల్‌లో తృప్తిగా తిని తేన్చి…బావుందంటే చాలు…మహదానందపడేవాడు.

‘‘ ఈ ఇల్లు మీదేనా? ’’ అడిగాడు భాస్కర్‌ ఒకరోజు
‘‘ అద్దెది. మెయిన్‌రోడ్‌కు దగ్గరగా…ఇదే నాదైతే…అంతకన్నా ఏముంది?’’

“యానాంలో స్థలాలకు లోటేముంది? వూళ్ళోనే మంచి సైటుంది. మీకైతే తగ్గించి ఇస్తాను. తీసుకోండి.”
టేబులు దగ్గర అన్నం తింటున్న సీతారాం అన్నాడు.

‘‘ నాకెందుకండి,బాబూ…ఏదో… బండి ఇలా లాగించేస్తే చాలు’’ ముక్తసరిగా అన్నాడు సూర్యారావు.సీతారాం మరి మాట్లాడలేదు.

మరొక రోజు
‘‘ ఇలా అయితే…ఎన్నాళ్ళు నడుపుతారు? ’’ అన్నాడు భాస్కర్‌. అలా అనడానికి కారణముంది. సూర్యారావు
చేబదులు అడిగాడు.ఎంత? రెండొందలు.

‘‘ నా దగ్గరకొచ్చిన వారికి కడుపు నిండా తృప్తిగా పెట్టకుండా ఉండలేను. ఒకవేళ ఆ పదిరూపాయిలు ఇచ్చుకోలేని వాడిని ఖాళీ కడుపుతో పంపుతానా? తర్వాత ఇద్దువులే అంటూ పెడతాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు….సంతృప్తిగా పెట్టకపోతే నా కళ్ళు పోవూ? ఏనాడైనా కూర కుదరకపోయినా అన్నం సిమిడినా నిద్ర పట్టదు..బాబూ
..సాగినంత కాలం ఇంతే’’ అన్నాడు సూర్యారావు. కబీరు ఈ మాటలు విని విసురుగా తండ్రి దగ్గరకొచ్చాడు.

‘‘ ఎదుటివాని కడుపే గానీ తన కడుపు చూసుకోని అన్నదాత మా నాయన’’ వ్యంగ్యంగా అనేసి తుర్రుమన్నాడు
కబీరు. పకపక నవ్వాడు సూర్యారావు.

‘‘ అన్నింటినీ వ్యాపారంగానే చూస్తామా? ఏం చేసినా మంచి అనిపించుకోవాలి. పొట్ట గడిస్తే చాలదా? మన కూడా పట్టుకుపోతామా?’’

అపుడపుడు భాస్కర్‌ దగ్గర్నుండి డబ్బులు తీసుకోవడం…మళ్ళీ తిరిగి ఇచ్చేయడం…మామూలై పోయింది.భాస్కర్‌కు తర్వాత తెలిసింది`తన లాంటి ఆప్తులు మరో నలుగురైదుగురున్నారని…ఇస్తానని ముందుగా చెప్పిన రోజున ఎవరో ఒకరి దగ్గర తీసుకుని సరిపెడతున్నాడని…
వంటకు కావాల్సిన వెచ్చాలు ఏ పూటకాపూట తెచ్చుకోవడమే. ఆనాడు బజారులో తక్కువ ధర పలుకుతున్న కూరాగాయల్ని ఎంచుకునేవాడు కాదు. తన మనసులో తయారుచేసుకున్న మెనూ ప్రకారమే కొనుక్కొచ్చేవాడు.నాణ్యత
విషయంలో రాజీ లేదు. దగ్గరకెళ్ళి`‘‘ కూర మరికొంచెం వేసుకోండి.. పచ్చడి బావుంది…రుచి చూడండి….సాంబారు అద్భుతంగా కుదిరింది…’’ అంటూ కొసరి కొసరి తినిపించడం అలవాటు సూర్యారావుకు.అంతే కాదు` భోజనం చేసి వెళ్లి పోతున్నవారిని ఆపి`‘‘ భోజనం బావుందా? లోటుపాట్లు చెబితేనే కదా తెలిసేది ’’ అనేవాడు. వాళ్ళు బావుందని అనగానే సూర్యారావు ముఖం మతాబులా వెలిగిపోయేది.

‘ ఏమిటీ మనిషి… ఈ కాలంలో ఉండదగ్గవాడు కాదు. ఎలా బతుకుతాడో ఏమిటో…?’ చాలసార్లు అనుకున్నాడు భాస్కర్‌.

‘‘ రుచిగా వండటమే కాదు. శుచి శుభ్రత ఉండాలి. ముక్కు మూసుకుని ఎలా తింటాం?’’ అన్నాడు భాస్కర్‌
ఆ రోజు` కుండపోతగా వర్షం. జనజీవనం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. పిల్లారాయుడి గుడి దగ్గర లోతుగా నీరుతో నిండిపోయింది.వాహనాలు ఆగిపోయాయి. మురికినీటి వ్యవస్థ లోపం స్పష్టంగా కనిపిస్తూ…వెక్కిరిస్తూంది.
భాస్కర్‌ గొడుగుతో రాగానే సూర్యారావు తల తుడుచుకోడానికి తువ్వాలందించాడు.

భాస్కర్‌కు ఆకలి దంచేస్తూంది. కుర్రాడ్ని పిలిచి అన్నం వడ్డించమన్నాడు.

కుర్రాడు తీసుకొచ్చాడు, కంచంలో పెట్టి. భాస్కర్‌ ‘ఇదేమిటి’ అన్నట్టు చూసాడు.

‘‘ ఈవేళకు సర్దుకోండి,బాబూ…వర్షం కుదర్లేదు. రేపట్నుంచి విస్తరేస్తాను. తేడా రానివ్వను’’ ప్రాధేయపూర్వకంగా అన్నాడు సూర్యారావు బయటకు చూస్తూ.

భాస్కర్‌కు ఒక పక్క ఆకలి నకనకలాడుతున్నది. పైగా ఇష్టమైన కూరలు కంచంలో కనబడుతున్నాయి. అయినా కోపం ముంచుకొచ్చింది. విసురుగా లేచాడు.

‘‘ ముందుగా విస్తరాకు సిద్ధం చేసుకోవచ్చు కదా. మీరు చేసిన పని బాగా లేదు. నేను తినలేను’’

‘‘ ఈ ఒక్క రోజుకి మన్నించండి. ఇంకెప్పుడూ ఇలా జరగదు’’ సూర్యారావు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. భాస్కర్‌ వినలేదు. ఆకలి కూడా కలిసిందేమో ఆవేశంతో ఊగిపోయాడు. తొలిరోజు నాటి షరతు గుర్తు చేసాడు. తను చేసిన సహాయాలు ఏకరువు పెట్టాడు. ఇక ఆఖరుగా రేపట్నుంచి హోటలుకు రానని చెప్పేసాడు.

‘‘ అరె…బాబు…పరిస్థితి అర్థం చేసుకోండి. కూచున్న కంచం దగ్గర్నుంచి లేచిపోవడం భావ్యం కాదు. మీకు దణ్ణం పెడతాను’’ అన్నాడు. భాస్కర్‌ ఆగలేదు. విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.

సూర్యారావు ఊహించలేదు. విషయం అంత తీవ్రమౌతుందనుకోలేదు.

భాస్కర్‌ పట్ల ఎంతో అభిమానం. భోజనం వేళ కంచం ముందు నుంచి లేచి వెళ్ళడం బాధ కలిగించింది.తప్పు తనదే అనుకున్నాడు. ఎదుటి వ్యక్తి ఇష్టాల్ని గౌరవించాలి. ఇప్పుడేం చేయగలడు?

మరో వారం రోజులకు అనుకోకుండా భాస్కర్‌కు పాండిచేరి బదిలీ అయింది.

‘‘ చిన్న కారణంతో ముఖం చాటేసాడు. అదే బాధ. మంచి మనిషి. చల్లగా ఉండాలి’’ సూర్యారావు నిట్టూర్చాడు.

***

పాండిచేరి వెళ్ళిన కొద్దిరోజులకు భాస్కర్‌కు పెళ్ళైయింది. పాండిచేరిలో ఉండగా యానాంలోని మిత్రుల ద్వారా సంగతులు తెలిసేవి. ముఖ్యంగా సంవత్సరం పాటు అన్నం పెట్టిన సూర్యారావు గురించి తెలుసుకుంటూ ఉండేవాడు.

యానాంలో కాలానుగుణమైన మార్పులు. హొటల్స్‌…లాడ్జీలు…పట్టణ శోభ సంతరించుకుంటూంది. అదే క్రమంలో సూర్యారావు హొటలు ఎత్తేసినట్లు తెలుసుకుని బాధ పడ్డాడు భాస్కర్‌. పోటీ ప్రపంచంలో సూర్యారావు లాంటి వాళ్ళు తట్టుకోవడం కష్టం.అదీ కాకుండా తాత్కాలికంగా వచ్చినవాళ్ళు స్థిరపడ్డారు. పెళ్ళిళ్లు చేసుకున్నారు. వాళ్ళకు హొటలు అవసరం లేదు. చిన్న చిన్న వ్యాపారస్తులు…భవన నిర్మాణ దినసరి కూలీలు…మొక్కలమ్ముకునే వాళ్లు…భోజనం చవకగా తినాలనుకునే వాళ్లు…కష్టజీవులే ఇక మిగిలారు.వీళ్లంతా అలసి పనిపాటలు చేసేవాళ్ళేమో కాస్తంత ఎక్కువ తినే రకాలు.పనివాళ్ళు టిప్పులిచ్చే చోట్లు వెతుక్కున్నారు.

మంచితనమే సూర్యారావు ఆస్థి. డబ్బు కూడబెట్టగలిగిన సమయంలో జాగ్రత్త పడలేక పోయాడు. ఇప్పుడేం చేస్తున్నాడో సమాచారం లేదు.

చూస్తూండగానే ఇరవై ఏళ్లు గడచిపోయాయి. భాస్కర్‌కు తిరిగి యానాం బదిలీ అయ్యింది.యానాం లోని మార్పులు…ఇంతకాలం వినడమే. గత కొద్ది కాలంగా యానాం చూడాలనే ఆతృత మరీ ఎక్కువగా ఉంది.

యానాంలో దిగగానే అమితాశ్చర్యం. ఇరవై ఏళ్ళకూ ఇప్పటికీ ఎంతో తేడా. మాటల్లో చెప్పేది కాదు. ఆనంద్‌ రీజెన్సీ త్రీ స్టార్‌ హొటల్‌, జి.వి. రెసిడెన్సీ, సర్వా ఇన్‌…ఇంకా ప్రభుత్వ అతిధి గృహాలు…సుప్రియాంక, ఎల్‌విటీ స్పైస్‌ ఫామిలీ రెస్టారెంట్‌,యూత్‌ స్క్వేర్‌…వెజ్‌ నాన్‌ వెజ్‌ హొటళ్ళు…. సూర్యారావు ఏం చేస్తున్నాడో? ఎక్కడున్నాడో?
ఊరికి దూరంగా జి.ఎన్‌.నాయుడు కాలనీలో ఉంటున్నాడట. మనిషి బాగా లొంగిపోయాడట. ఎనభై ఏళ్ళకు చేరువవుతున్న సూర్యారావు గుర్తుపడతాడా? ఆయన గురించి ఇపుడు ఎవరికి కావాలి? ఊరు విశాలం అయ్యేకొలదీ సూర్వారావు ఇరుకై పోయాడన్నమాట.

ఒకరోజు వీలుచూసుకుని భాస్కర్‌ వెళ్ళాడు, నాయుడు కాలనీకి సూర్యారావు కోసం. బయట ఉన్న కుర్రాడ్ని అడిగితే గది చూపించాడు.

మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నాడు. దుప్పటి తొలగించుకుని నెమ్మదిగా లేచాడు. బక్క చిక్కి …నీరసంగా ఉన్నాడు. గుర్తు పట్టాడు. బోసినోరుతో భాస్కర్‌ పేరు పలికాడు.

‘‘ బావున్నారా? నా మీద అలిగి వెళ్ళిపోయారు. నాదే తప్పు’’
ఎప్పటి సంగతి? ఆశ్చర్యపోయాడు.

కుశల ప్రశ్నలయ్యాక భాస్కర్‌ అన్నాడు`‘‘ చానాళ్లుగా మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నాను. మీ ఆప్యాయత…ప్రేమ..అన్నీ గుర్తుకొచ్చేవి. ముఖ్యంగా మీ ఆతిధ్యం లాభాలతో పనిలేని …ఎదుటి వ్యక్తులకు తినిపించడమే మహద్భాగ్యం అనుకునే మనస్తత్వం…ఎవరికుంటుంది? నేనూ ఆ రోజు ఆవేశపడ్డాను. కంట్రోలు చేసుకోలేకపోయాను. ఆ తర్వాత చాలసార్లు అనుకున్నాను` మర్నాడు యధాప్రకారం వెళ్లిపోవాల్సిందని’’
చిన్నగా నవ్వాడు సూర్యారావు. ఒక్కక్షణం భాస్కర్‌ను తేరిపారి చూసాడు.

‘‘ ఎవరి పంతాలు వాళ్ళవి. మీకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోవడం` నాది పొరబాటే కదా. కొత్త కంచంలో పెడితే సరిపోయేది. సరే, బాబూ…జ్ఞాపకముంచుకుని వచ్చారు. అదే పదివేలు’’ ఒక్కో మాట ఆగి…ఆగి అంటున్నాడు. అరగంట గడిచింది. ఉన్నట్టుండి తల అటూ ఇటూ తిప్పి చూసాడు. ఆయనలో ఒక సంశయం…ఒక అనుమానం…ఏదో అడగబోయి మానేసాడు. అడగాలా? వద్దా? పాపం` ముసిలాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు.

‘‘ చెప్పండి…పర్వాలేదు…చెప్పండి…’’

‘‘ ఏం లేదు, బాబూ…అన్నం పెట్టేటపుడు తప్ప ఈ గదిలోకి ఎవరూ రారు. ఈలోపులో నేనేమైపోయినా ఎవరికీ అక్కర్లేదు. ఒంటరితనం…రోజులు లెక్కపెట్టుకుంటూ గడుపుతున్నాను. చలాకీగా బతికిన క్షణాల్ని నెమరేసుకుంటున్నాను’’
టీపాయి మీద స్టీలు చెంబు వంచుకుని మంచినీళ్లు తాగాడు. పులమారి దగ్గు…ఆ తర్వాత…ఆయాసం…కొన్ని క్షణాలు…మౌనంగా ఉన్నాడు, ఏవో ఆలోచనల్లో మునిగినట్లు. దగ్గరకు రమ్మని పిలిచాడు. భాస్కర్‌ భుజం తట్టి చేతులు పట్టుకున్నాడు. వడలిన చేతులు…ముడతలు పడ్డ శరీరం…గెడ్డం గీయని ముఖం..ఏదో కోల్పోయి…బెంగటిల్లినట్టుగా
ఉన్నాడు.ఇంతకూ ఆయన చెప్పాలనుకున్నదేమిటి?

‘‘ మొన్నామధ్య మా మేనమామ కొడుకు సుబ్బారావు వచ్చాడు. నాకంటే అయిదేళ్ళు చిన్న. ఏం కావాలి? ఏం కావాలి? అంటూ విసిగించాడు. వాడ్ని వదిలించుకోడానికి … ఓ ఏభై రూపాయిలు ఇవ్వరా అన్నాను. మేం గుసగుసలాడుకోవడం… వాడు డబ్బులివ్వడం …ఎక్కడ్నుంచి చూసాడో…మావోడు..అదే మా అబ్బాయి పరుగెట్టుకుని గదిలోకి వచ్చి…ఇక్కడేం జరుగుతుందని గదమాయించాడు. ఇదంతా మా ముసలాళ్ల గోలలే…నువ్వెళ్ళు..అని సుబ్బారావు

చెబితేపోయాడు. నేను డబ్బులు అడుక్కుంటున్నానేమోనని వాడి అనుమానం. అలా చేస్తే వాడికి నామోషీ…ఏదో ఒక లోటును ఊహించుకుంటూ అది లేదని బాధపడుతూ బతకడం అలవాటయిపోయింది….మిమ్మల్ని ఓ కోరిక కోరదామని ఉంది. అదేమిటంటే…’’ మళ్ళీ ఆగాడు.

సూర్యారావు తన నుంచి డబ్బులు ఆశిస్తున్నాడా? అదే అయ్యుంటుంది.

లేచి నిలబడి పర్సు తీసాడు భాస్కర్‌.

భాస్కర్‌ ప్రయత్నాన్ని సూర్యారావు గమనించాడు.

‘‘ వద్దు బాబూ, నాకు కావాల్సినవి డబ్బులు కావు. అయినా సొమ్ములు నాకెందుకు? నేనేం చేసుకుంటాను?‘‘
మళ్ళీ దగ్గు…మాట్లాడలేకపోయాడు.నీరసంగా మూలిగాడు. యధాప్రకారం పడుకున్నాడు. దుప్పటి కప్పుకున్నాడు. భాస్కర్‌ కేసి చూసాడు.

భాస్కర్‌కు అర్థం కాలేదు,సూర్యారావు ఉద్దేశ్యం ఏమిటో. ఆయన అడిగేదేమైనా తప్పక చేయాలని మనసులో అనుకున్నాడు.
సైగ చేసాడు,దగ్గరకు రమ్మని.

‘‘ రోజూ వచ్చి కాసేపు మాట్లాడండి. కాసింత సమయాన్ని కేటాయించండి. వీలున్నపుడు శరీరాన్ని తాకండి.
అయినవాళ్ళో ఆప్తులో రోజూ పలకరిస్తే ముట్టుకుని మాట్లాడితే అంతకన్నా మాకింకేం కావాలి? అదే మిమ్మల్ని కోరుకునేది. ఈ వయసులో ఒంటరితనం భరించలేనిది. ఒక్క పలకరింపైనా లేని రోజు నరకంతో సమానం. కొడుకైనా.. కావల్సినవాళ్ళైనా అలా చేస్తే ఇక మందులు మాకులుతో పనేముంటుంది?’’

భాస్కర్‌ కళ్ళంటా నీళ్ళు. సూర్యారావు చేయి పట్టుకుని వదిలాడు. ఎంత చిన్న కోరిక? పలకరింపు అంత భాగ్యమా? తాకడం దివ్యౌషధమా?

తను చేయాల్సిందేమిటో బాగా తెలిసింది. తను అక్కడితో ఆగిపోడు.

చుట్టూరా ఎంతో మంది ముసలివాళ్ళు… వాళ్ళకు కొడుకులు…

**** (*) ****