కథ

గుండు

మార్చి 2015

“మీరెన్ని చెప్పినా నేనొప్పుకొనేదేలేదు” అని ఖచ్చితంగా చెప్పింది వెంకటమ్మ గుడ్డలమూటమీద బాసిపట్లేసుకొని కూర్చుంటూ.

“నీకే అంతుంటే నీ మొగుడ్ని అందునా మొగోడ్ని నాకెంతుండాలి, నేను మాత్రం ఎందుకొప్పుకుంటాను” ఎదురు ప్రశ్నించాడు యాకోబు కండవని తలకు చుట్టుకుంటూ.

కథ మళ్ళీ మొదటికొచ్చేసరికి కందులూరు గ్రామస్థులందరికి విసుగొచ్చి లేచి ఇంటికి వెళ్ళాలనిపించింది. చూస్తే కరెంట్ లేదు టీవీలు కూడా రావు, ఇంటి దగ్గర పనులేమి లేవనే విషయం గుర్తుకొచ్చి ఊరికే వచ్చే ఆనందాన్ని ఎందుక్కాదనాలని అక్కడే కూర్చుండి పోయారు.

“ఒరేయ్ వెంకటేసు నువ్వే చెప్పరా మీయమ్మ మాట వింటావా ? మీ నాన్న మాట వింటావా?” అన్నాడు అంత అందమైన తగాదా లో నిశ్శబ్దాన్ని భరించలేక తంబారంబావ ( తంబారం అనే వూరి నుంచి కందులూరు కొచ్చిన మొట్ట మొదటి అల్లుడు కాబట్టి అందరు అతన్ని బావ అనే అంటారు).

తను నమ్మేవన్ని నగ్న సత్యాలే అని నమ్మే ఆదాము, నత్తేసేబు, కత్తేసు, చిన్న నవాకు, పెద్ద నవాకు, పేతురు, దేవనందం, కొండయ్య, గోవిందమ్మ, జానూ, ఉలిపిరి నాగేంద్రం మరియు ఆమె ఏడేళ్ళ కూతురు నల్లకుమారి, మేరిమ్మ, మరియమ్మ, ఇస్రాంతమ్మ, రూబేను, పులిబొంగరాలు (పుణుగులు) అమ్ముకునే ఆదెయ్య, జిలకర ఏసుపాదం, మాజీ పసిరెంటు పిచ్చమ్మ తదితరులందరూ ఆసక్తిగా వెంకటేసు వైపే చూస్తున్నారు ఏమి చెప్తాడా అని. నవమాసాలు మోసి, కని ,పెంచి ఇప్పుడు తూర్పుకి తిరిగి కూర్చున్న అమ్మ మాట వినాల? లేకపోతే అమ్మకు, తనకు అన్నీ తానే అయ్యి ఇప్పుడు పడమరకు తిరిగి కూర్చున్న నాన్న మాట వినాలో అర్ధం కాని వెంకటేసు అలా ఆకాశంలోకి చూస్తు పట్టపగలే చుక్కలు లెక్క పెడుతుంటే వెనకాలగా వచ్చి వెంకటేసు తల్లో పేలు చూడడం మొదలెట్టింది నాన్నమ్మ కోటమ్మ.

ఇంతలో దేవుడిలా వచ్చాడు సుబ్రమణ్యం మాష్టారు. ఆనాడు కూలికిబోయిన యాకోబును, ఆసామి కూతురు వెంకటమ్మ ప్రేమిస్తే, అది అర్ధం చేసుకొని యాకోబు వెంకటమ్మ కు మనసిస్తే, ఇది తెలిసిన ఆసామి కోపంతో ఇంతెత్తున యెగిరి గంతేస్తే, ఆయన్ని కాదని ఆరోజుల్లోనే కులాంతర వివాహం జరిపిన జూనియర్ కందుకూరి అతను. ఇంకా చెప్పాలంటే యాకోబు వెంకటమ్మలకు కొడుకు పుట్టినప్పుడు ‘నా కొడిక్కి వెంకటేశ్వరస్వామి పేరు పెడతానని వెంకటమ్మ , కాదు ఏసుప్రభు పేరు పెడతానని యాకోబు గొడవ పడుతుంటే అలా కాదని వెంకటేశ్వర స్వామిలోంచి వెంకటను తీసి, ఏసుప్రభు లోంచి ఏసును తీసి దానికి గుణసంధి సూత్రం ఆపాదించి, వెంకట+ఏసు=వెంకటేసు అని నామకరణం చేసిన ఈ కాలపు తెనాలి రామలింగడతను. అటువంటి మహానుభావున్ని చూసి గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకొని పైకి లేచారు.

సుబ్రమణ్యం మాష్టారు నవ్వి, అందర్నీ కూర్చోమని సైగ చేసి, తనూ పక్కనే వున్న నాబ్బండరుగు మీద కూర్చుని, చేతి కర్రను జాగ్రత్తగా ఒల్లో పెట్టుకొని, నిమిషాల్లో విషయం తెలుసుకొని గర్వంగా మీసాలు దువ్వి , ఛాతి నిండా గాలి పీల్చి “ఓస్ ఇందుకేనా గోలంతా! ఎరీ సింపుల్, అరగుండు + అరగుండు = ఎంత?” అని అడిగాడు అక్కడ కూర్చున్న వాళ్ళని , ఆ లెక్కకు జవాబు తెలియక అందరు తిక మక పడుతుంటే ఆ గుంపులో వున్న జాన్ అప్పుడే స్కూల్కి వెళ్ళడం మొదలెట్టిన తన ఆరేళ్ళకొడుకుని చెప్పమన్నాడు. ఆ పిల్లాడు బాగా ఆలోచించి, బలపం కోసం బ్యాగంత వెతికి అది కనపడక పోయేసరికి వేలితో నేలమీద రాసి మరీ చెప్పాడు “అరగుండు + అరగుండు = రెండరగుండ్లు” అని. అది విన్న జాన్ సంతోషంతో సుబ్రమణ్యం మాష్టారు వైపు చూసాడు ‘అవును కదా!’ అన్నట్లు. మాస్టారు ఆ అజ్ఞానులను చూసి అందంగా నవ్వి “అరగుండు + అరగుండు = గుండు” అని, వెంటనే “ అంటే వెంకటేశ్వర స్వామికి సగం వెంట్రుకలు, ఏసుప్రభు కి సగం వెంట్రుకలు ఇస్తే సరి “ అన్నాడు పొంగిన ఛాతిని ఇంకొంచం పొంగిస్తూ . “అదెలా కుదుర్తుంది” అన్నారు ఇద్దరూ ఒకేసారి.

***

ఏడు సంవత్సరాలు పట్టు వదలని విక్రమార్కుడిలా చదివి పదో తరగతి పాసయ్యాడు ఇరవై రెండేళ్ళ వెంకటేసు. వాళ్ళ విజయం కంటే పక్క వాళ్ళ అపజయంలోనే నిజమైన ఆనందాన్ని వెతుక్కుని హాయిగా గడిపే ఆ వూరి ప్రజలు ఆశ్చర్యచకితులై అన్నం తినడం కూడా మానేశారు. ఆ వూరి విద్యావంతుల లిస్టులో వెంకటేసే మొట్టమొదటి పదో తరగతి పాసయిన వ్యక్తి కావడం వెంకటేసుకే ఆశ్చర్యంగా వుంది. ఇదే విషయం అమ్మ వెంకటమ్మ తో అంటే “ఇదంతా వెంకటేశ్వరుడి దయ” అని కనపడకపోయినా తిరుపతి ఏడు కొండల వైపు చూసింది. నీళ్ళు తెస్తూ ఆ విషయం విన్న నాన్న యాకోబు “కాదు కాదు ఇదంతా ఏసుప్రభు దయ” అని కొండ కోసం కొంచెం సేపు వెతికి అది కనపడక పోయే సరికి అక్కడే మోకాళ్ళు వంచి ఆకాశం వైపుకు చూస్తు చేతులు జోడించి “ప్రభువా నీకు వేలాది స్తోత్రములు” అన్నాడు. “పదో తరగతి ప్యాసయితే ఎన్ని డబ్బులిత్తర్రా యాకొబా” అని అడిగింది ఏడు సంవత్సరాలు ఏపుగా పెరిగిన వెంకటేసు తల్లో పేలు చూస్తు నాన్నమ్మ కోటమ్మ. ప్రార్ధించటం అయిపోయిన యాకోబు వెంకటేసు భుజాలు పట్టుకొని కళ్ళల్లోకి చూస్తు రెండు ఆనంద భాష్పాలు రాల్చాడు. ఆ ఆనంద భాష్పాలు యాకోబు దవడలపై ప్రయాణిస్తూ, చెవి దగ్గర ఆగి “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినపుడే పుట్టదు జనులా……” అనే పద్యాన్ని ఆలపించాయి.

ఎంతమందో చెప్పారు యాకోబుకి వెంకటేసు గురించి రకరకాలుగా… ‘వాణ్ని చదివించటం దండగని, చదువు మన పల్లె వాళ్ళకు అబ్బదని, తొందరగా పెళ్లి చెయ్యమని, అనవసరంగా పిల్లోన్ని పాడు చెయ్యద్దని. ఇంకొందరైతే మీ వాడు పాసయితే మీసాలు తీయించుకుంటామని, చెవులు కోయించుకుంటామని పందేలు కూడా కాసారు. కాని వెంకటేసు పని తనం గురించి, చూసి రమ్మంటే అక్కడిదాకా పోయి కళ్ళు మూసుకొని కనపడలేదని చెప్పే అతని చాకచక్యం గురించి యాకోబుకు బాగా తెలుసుగనక, ఈ ప్రపంచం లో అన్నింటికంటే అతి తేలికైన పని చదువుకోవడమే అని పక్కూరి విద్యావంతుల్ని చూసి తెలుసుకున్న యాకోబు, కొడుకుని కూడా చదువుకు పంపించి ఈనాడు ఇంతటి విజయాన్ని పొంది తట్టుకోలేక ఇంకో రెండు ఆనంద భాష్పాలు రాల్చాడు.

ఇదంతా అరుగుమీద కూర్చొని గమనిస్తున్న పక్కింటి ఆదాం ‘పదో తరగతి పాస్ కావాలంటే గడ్డాలు, మీసాలు, పొడవైన జుట్టు ఉండాలని అవి లేనందువల్లె తన కొడుకు ఈ సంవత్సరం పదోతరగతి ఫెయిలయ్యాడనే 11 వ నగ్నసత్యాన్ని తెలుసుకొని’ కొట్టిన తన పదహారేళ్ళ కొడుకుని ఓదార్చడానికి వెళ్ళిపోయాడు. జాన్ అయితే అపుడే స్కూల్కి వెళ్ళడం మొదలుబెట్టిన తన కొడుకుని తెచ్చి వెంకటేసుకి షేక్ హ్యాండ్ కూడా ఇప్పించాడు. ఆ పిల్లాడు మారం చేస్తే ఊరుకున్నాడు గాని లేకపోతే వెంకటేసు కాళ్ళకు దండం పెట్టించాలని కూడా అతని అజెండా లో వుంది.

పొయ్యి ముందు కూర్చుంది వెంకటమ్మ, పొయ్యి గణ గణ మండు తుంది, అన్నం వుడుకుతూ వుంది. పొద్దున్నే ఎండ మండిపోతుంది. ఆ ఎండకు నల్లగా నిగ నిగ లాడుతూ, ఏడేండ్లు కత్తెర మొకం ఎరుగని వెంకటేసు ఎంట్రుకలు కనిపించాయి వెంకటమ్మకి. తన కంటే ఎక్కువ ఎంట్రుకలు వున్నందుకు వెంకటేసు మీద వెంకటమ్మకు అసూయ కలిగినా కొడుకు కదా అని ఏ శాపమూ పెట్టలేదు కాని ఆ తళ తళ లాడే తల నీలాలను తిరుపతి ఏడుకొండల వాడికి అర్పించాలని మాత్రం గట్టి నిర్ణయం తీసుకుంది. ఇది పితృస్వామిక వ్యవస్థ కాబట్టి ఆ తలనీలాలను ఏసుప్రభు కే అర్పించాలని ఇంకా గట్టి నిర్ణయం తీసుకున్నాడు యాకోబు.

వెంకటమ్మ కొడుకును దగ్గరకు పిలిచి “ఒరేయ్ ఎంకటేసా, మనం కన్ను మూసినా కన్ను తెరిచినా, గాలి పీల్చినా అన్నం తిన్న, జుట్టు పెంచుకున్నా అందులో గోకున్న, పది ప్యాసయిన పెయిలయినా అంతా ఆ వెంకటేశ్వరుడి దయ. ఆయన దయ లేనిదే పొయ్యి మండదు అన్నం వుడకదు. అటువంటి వెంకటేశ్వర స్వామికి నువ్వు పదో తరగతి ప్యాసయినందుకు ఏమిచ్చావు రా” అంది వెంకటేసుతో. ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాక తల గోక్కోవటం మొదలు పెట్టాడు వెంకటేసు.

“బాగా చెప్పావు నాయన అదే ఇవ్వాలి, నువ్వు పది పరిచ్చలు రాయడం మొదలెట్టిన్దగ్గరనుంచి అందులో గాని ప్యాసయితే నీకు గుండు కొట్టిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. ఎవురి రుణమైన వుంచుకొని లోకంలో దర్జాగా తిరగచ్చు కాని, దేవుడి రుణం మాత్రం ఎంటనే తీర్చెయ్యాలి, ఇప్పుడా రుణం తీర్చాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను ,మనం తొందరలో తిరుపతి కి బోవాల ఆ విషయం మీ నాన్నకు సెప్పు” అంది పక్కనే గొడ్లకి మేత వేస్తున్న యాకుబుని చూపిస్తూ.

“ నానో అమ్మా …..” మొత్తం చెప్పేసాడు వెంకటేసు యాకోబుకి. “ ఒరేయ్ మనం దేవుడి దగ్గర ఎంత ఫలం పొందామో అందులోంచి దశమబాగాన్ని అర్పించమన్నాడు దేవుడు. నాకు తెలిసి నువ్వు నీ జీవితంలో దేవుడి ద్వారా సంపాదించింది రెండే రెండు అందులో ఒకటి పదోతరగతి ప్యాసవ్వడము తర్వాతా ఇదిగో ఈ జుట్టు. పదో తరగతి లోంచి నువ్వు దేవుడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు ఈ పాటికే కొన్ని వందల పదోతరగతులు ప్యాసయ్యి ఉంటాడన్నది సత్యం, ఇకపోతే పెంచుకున్నఈ జుట్టు లోంచి దశమ భాగాన్ని ఇస్తే బాగుండదు కాబట్టి ఈ సారికి నీ తలనీలాలను ఏసుప్రభు కే ఇద్దామనుకుంటున్నాను. ఇవేం ఇంతటితో ఆగిపోయేవేమి కాదు కదా, ఈ సారి పెరిగే జుట్టుని మీ యమ్మకి ఇష్టమొచ్చినోల్లకి ఇయ్యమను, అపుడు నేనుగాని కాదంటే భాంచత్ నీ సెప్పుతో కొట్టు, ఏమంటావ్” అన్నాడు వెంకటేసుతో చెబుతున్నట్టే చెబుతూ భార్య వెంకటమ్మతో.

“ఇదిగో చూడోవ్, ఇంత వరకు నోరు తెరిచి నిన్నేం అడిగిందీ లేదు, నీ మాట కాదంది లేదు సెబ్తన్నా… ఈ ఒక్క సారికి నా మాట కాదనకు” అంది వెంకటమ్మ. “ఏదో పెద్దింటి పిల్లవీ, అందర్నీ కాదనుకొని నాతో వచ్చావని పతిసారినీ మాటే ఇంటన్నా కదా! ఈ సారికి నా మాటిను, నేనేమైనా నీ జుట్టునియ్యమన్ననా అబ్బాయిదేగా ఈ సారికి నా మాటే నెగ్గనియ్” అన్నాడు బర్రెలకు కుడితి బెడుతూ. నెగ్గనివ్వు అనే మాట వినపడే సరికి వెంకటమ్మలో పంతం పుట్టుకొచ్చింది “ ఇదిగో సూడు నిన్ను పెళ్లి సేసుకోవద్దూ అని మా నాన్నంటే, నా మాటే నెగ్గాలని నిన్ను పెళ్ళిచేసుకున్న, నాతో పందెం కాస్తే, పోటి కొస్తే పోట్లగిత్తను నేను గుర్తుంచుకో” అంది పొయ్యిలో పుల్లలు ఎగదోస్తూ. “నువ్వు పోట్లగిత్తవైన కయ్యి లో చెత్తవైన నా కనవసరం ఈ సారికి మాత్రం నేనెవ్వరి మాట ఇనేది లేదు” బర్రెనొక్క బాదు బాదాడు, అది అరుస్తూ నానా గోల చేస్తుంది. “కుదరదో” అంది వీర కోపంగా పొయ్యి ముందు నుంచి పైకి లేస్తా, ఆ కోపానికి బర్రె భయపడి బిగుసుకు పోయింది, కిక్కురు మనకుండా చూస్తా వుంది వెంకటేసు వైపు అంతా నీ వల్లేరా అని. “ ఎలా కుదరదో నేను చూస్తా” అన్నాడు ఊగిపోతూ. “ అంతేనా” అంది గొంతు పెంచి. “అంతే మాటంటే మాటే” అన్నాడు యాకోబు. “ ఇదిగో నాకు కోపమొస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు నీ ఇష్టం” బెదిరించింది.

చిన్నగా జనాలు మూగటం మొదలెట్టారు, అక్కడ ఏమి జరుగు తుందో తెలియక ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలెట్టారు.

“నీ ఇష్టమొచ్చింది చేసుకో, ఒరేయ్ వెంకటేస గుడ్డలేసుకో బో గుణదల బోవాల” అన్నాడు బర్రెను ఇప్పుతూ. ఆవేశం తట్టుకోలేక పోయింది వెంకటమ్మ. పొయ్యి కానుకొని వున్న పొంతలో నీళ్ళు పొయ్యిలో గుమ్మరించింది, సగం వుడికిన అన్నం కుండని కిందకి దింపింది.

జారుతున్న పైట కొంగుని నడుమ్మీదనుంచి లాగి బొడ్లో దోపింది “ రేయ్ వెంకటేసా అడుగు ముందుకేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు సివ్వరి సారి సెబ్తన్న” చివరి హెచ్చరిక చేసింది.

“అదేం చేస్తుందిలేర ముందు ఇంట్లోకిబోయి గుడ్లేసుకో గుణదల బోవాల” అన్నాడు ముందుకు కదులుతూ యాకోబు.

వెంకటేసు ఇంట్లోకి వెల్లబోయేడు. అంతే మెరుపు లాగ కదిలింది వెంకటమ్మ, వెంకటేసు కంటే వేగంగా ఇంట్లోకి పోయి తలుపేసుకుంది. ఆ చప్పుడికి దర్వాజా మీద దాక్కొని వున్న రెండు బొద్దింకలు ఒక సాలీడు ఉచ్చ పోసుకొని ఇల్లొదిలి వీధినపడ్డాయ్. ఆ వేగాన్ని, ఆమె పట్టుదలని చూసి యాకోబు మనసులో భయం మొదలయ్యింది. కొంపతీసి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందో ఏమోనని చేతిలో వున్న సూడి బర్రెను కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు బాదటం మొదలుపెట్టాడు.

ఇదంతా చూస్తున్న వెంకటేసు నాన్నమ్మ కోటమ్మ “ ఓమ్మో ఓయ్యొ నా కోడలు లోపలకు బోయి తలుపేసుకుందయ్యో, ఏం అఘాయిత్యం చేసుకుంటుందో ఏమోనయ్యో తొందరగా రండయ్యా….. నా కోడలిని కాపాడండయ్య…” అని సాకండాలు మొదలెట్టింది. అది విన్న యాకోబుకు భయం ఎక్కువైయింది ఇంకా గట్టిగా తలుపులు బాదటం మొదలెట్టాడు.

ఇదంతా చూస్తున్న వెంకటేసుకి ఏమి చెయ్యాలో అర్ధంకాక తల్లో గోక్కోవడం మొదలుపెట్టాడు.

ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని అక్కడే నుంచుని చూస్తున్న జనాలంతా యాకోబుని పక్కకు తోసి మరి తలుపు బాదడం మొదలెట్టారు.“ఈ మాత్రం దానికి తలుపెసుకోవాలా … బయటకి రావే” అన్నాడు అందర్నీ తోసుకుంటూ ముందుకు రావాలని ప్రయత్నిస్తున్న యాకోబు. “మీ మద్య ఎన్ని తగదాలుంటే మాత్రం, ఉరేసుకోవడం తప్పమ్మాయ్ తలుపుతియ్” అన్నాడు ఉరేసుకుంటుందని నిర్ణయించుకున్న తంబారంబావ.“వామ్మో వెంకటమ్మ ఉరేసుకుంటుందంటసెతల్ల” అంది గుంపులో వున్నగోయిందమ్మ. “యాకోబు కొడితే వెంకటమ్మ ఉరేసుకుంటుందంట” అంది ఇస్రాంతమ్మ పక్కనున్న నత్తేసేబు తో. “ ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకు చెప్పాలి” అంటూ ఊళ్లోకి పరిగెత్తాడు జిలకర ఏసుపాదం.

నత్తేసేబు కష్టపడి ఆ విషయాన్ని నత్తి నత్తి గ అందరికి చెప్పేలోపలే, లోపలున్న మనిషి చనిపోయిందని నిర్ధారించుకున్నాడు కొండయ్య, వెనక్కి తిరిగి అదే విషయాన్ని అందరికి చెప్పెసేడు. “నిన్నంతా నాతోనే తిరిగింది, కనీసం మాట మాత్రమైనా చెప్పలేదే రేపు ఉరేసుకుంటానని, చూడమ్మా ఎంత లోతు మనిషో” అంది మరియమ్మ పక్కనున్న మేరిమ్మతో. “లోపలికిబోయి తలుపేసుకొని చానసేపయ్యింది ఈ పాటికి ప్రాణం గాల్లో కలిసిపోయి వుంటుంది” అంది ఉలిపిరి నాగేంద్రం. ప్రాణం ఎటు పోతుందో చూద్దామని ఆమె కూతురు నల్లకుమారి ఇంటిచుట్టూ తిరగడం మొదలుపెట్టింది. “రేయ్ గడ్డపార్లు తెచ్చి ముందు తలుపు పగలకొట్టండ్రా” అని అరిచాడు యాకోబు అన్న రూబేను. కత్తేసు, చిన్ననవాకు, పెద్దనవాకు, దేవానందం, పేతురు గడ్డపార్ల కోసం ఇళ్ళకు పరిగెత్తారు. మాజీ పసిరెంటు పిచ్చమ్మ ఎంత మంది జనాలోచ్చారో లేక్కేస్తుంది.

“నా ప్రాణాలు పోయినా సరే తలుపులు మాత్రం పగలగొట్టనీను” అంది తలుపుకు అడ్డంగా నుంచొని కోటమ్మ. “ నీయమ్మ నీకు నీ తలుపెంతముక్కెమో నాకు నా పెళ్ళాం అంతకన్నాముక్కెం, నీ తలుపు పొతే మళ్ళీ సేయించుకోవచ్చు నా పెళ్ళాం పోతే నేనేమి సెయ్యాలి” అంటూ తలుపు కి అడ్డంగా నుంచున్న కోటమ్మనిపక్కకి తోసాడు. కింద పడిన కోటమ్మకి ఇంట్లో తన ప్రాధాన్యం తగ్గిందని, చెప్పలేనంత ఏడుపొచ్చింది. “కోటమ్మకి తన కోడలంటే ఎంత ప్రేమో సూడండసే మగడ్లారో…. ఎక్కెక్కి ఏడుస్తుంది” అంది కోటమ్మని చూపిస్తూ ఉలిపిరి నాగేంద్రం. “అందరికి ఇలాంటి అత్తలు దొరకాలమ్మ” అంటూ కోటమ్మని పొగిడింది మరియమ్మ అసలు విషయం తెలియక.

“నాన్న! మొన్న నువ్వు తాగొచ్చి పెదపెద్దగా కేకలేస్తుంటే, ఇంట్లోకి వచ్చినాక అమ్మ కొట్టిండ్లా! మరి నువ్వు ఉరేసుకోలేదే” అని ప్రేమగా అడిగాడు అపుడే స్కూల్కువెళ్ళడం మొదలెట్టిన జాన్ కొడుకు. జాన్ గుంపులోంచి బయటకు వచ్చి “సదువుకొని పిల్లలు సెడిపోతున్నారు ఛీఛీ” అని వాడికో పుల్లయిసు కొనిపెట్టాడు. పులిబొంగరాలు అమ్ముకొనే ఆదెయ్య అక్కడ్నుంచే తన బేరం మొదలెట్టాడు. అరుగు మీద కూర్చొని ఇదంతా గమనిస్తున్న ఆదాం ‘పెళ్ళాలని కొట్టకూడదని,కొట్టినా ఇంటి బయటే కొట్టి ఇంట్లోకి పోనివ్వకూడదనే 15 వ నగ్నసత్యాన్ని’ తెలుసుకున్నాడు.

ఇంతలో భళ్ళున తెరుచుకుంది తలుపు. అందరు ఊహించినట్లు కాకుండా గడ్డిమోపంత గుడ్డల మూట బయటపడింది. దానివెంటే పరిగెత్తు కుంటూ వచ్చి దాని మీద కూర్చుంది వెంకటమ్మ. “నువ్వింకా ఉరేసుకోలా?” అని మనసులో మాట బయటకు అనేసింది ఉలిపిరి నాగేంద్రం. “ఉరేసుకునే ఖర్మ నాకేం , ఇప్పుడెల్లమను గుణదల గుడ్డల్లేకుండా ఎట్ట పోతాడో నేను చూస్తా. నాతో పందెం ఏస్కుంటే అంత సామాన్యంగా నెగ్గలేరని ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాలా” అంది యాకోబుతో. ఏమి అఘాయిత్యం జరగనందుకు యాకోబు ఆనంద పడుతుండగా గడ్డపారల కోసం పోయిన కత్తేసు, చిన్ననవాకు, పెద్దనవాకు, దేవానందం, పేతురు గడ్డపారలతో అక్కడికి చేరుకున్నారు.

“మేము రాకుండానే తలుపు తీసిందెవరు” అని అడిగాడు రొప్పుతూ కత్తేసు. “నేనే తీసాను ఏం” అంది వెంకటమ్మ. “బలే ఇచిత్రంగా వుందే తలుపులు దేనితో పగలకొట్టా? ఇంతకీ లోపల మనిసి బతికాడా సచ్చడా?” అని అడిగాడు లోపల ఎవరుందో కూడా తెలియకుండా గడ్డపార కోసం పోయిన పేతురు. “నేనే లోపలి మనిషిని ముందా ఇసయం తెలుసుకొని గడ్డపార తీసుకొని ఇంటికి వెళ్ళు ఇకది అవసరంలేదు” అంది వెంకటమ్మ.”అంతా మీ ఇష్టమేనట్టా! కుదరదు ఈ రోజు ఏదో ఒకటి పగలకొట్టంది మేము ఇక్కడ్నుంచి తిరిగి వెళ్లేదే లేదు” అక్కడే కూర్చున్నారా ఐదుగురు. “ అయితే మా ఇంటి ముందు తుమ్మమొద్దు పగలకొట్టండి, పోయిలోకి బొత్తిగా పుల్లల్లేవు” అంది ఉలిపిరి నాగేంద్రం. “నీయమ్మ నీ తలకాయ పగలకొడతా ముందు ఇంటికి పోయి ఆ పొయ్యి మీద కూడు ఏమయ్యిందో చూడుబో” అన్నాడు నాగేంద్రం మొగుడు.

ఆదెయ్యను పిలిచి ఐదురూపాయలకి పులిబొంగరాలు అప్పు తీసుకుంది వెంకటమ్మ. “మేయ్ మర్యాదగా గుడ్డలిస్తావా ఇయ్యవా?” అన్నాడు కోపంగా యాకోబు. “ఏం సేసుకుంటావో సేసుకో నేను మాత్రం ఇయ్యను, తిరుపతికెల్లడానికి ఒప్పుకుంటేనే గుడ్డలిచ్చేది” అంది పులిబొంగరాలు తింటూ. “గుడ్డల్లేకపొతే మొండిమోలనైనా గుణదల పోతా గాని తిరుపతి కి మాత్రం పోనియ్యను అన్నాడు అక్కడే గొడకానుకొని కూర్చుంటూ.

“అసలేం జరిగిందో సెప్పండోయ్ మీలో మీరే తగూలాడుకుంటే ఎట్ట మాకూ తెలియాలిగా” అన్నాడు రూబేను. “నీకు తెలియదులే ఊర్కొన్నా” అన్నాడు విసుగ్గా యాకోబు. “తెలియకే అడుగుతున్నానోయ్, ఇషయం ఇవరం లేకుండా మీ ముందు కూర్చోడం అంతగా బాలేదు, అందుక్కదా అడుగుతుంది” అన్నాడు రూబేను కోపంగా. “వెంకటేసు గుండు కోసం వచ్చిందీ గోలంతా” అంది కోటమ్మ. “గుండేంది గోలేంది…. నాకు అర్ధం కావడం లేదే కొంచం ఇవరంగా సెప్పు” అంటూ కోటమ్మ ముందు కూర్చున్నాడు పులిబొంగారాల ఆదెయ్య. “పొయ్యి మీద అన్నం పొంగొచ్చిందేమోవ్” అంటూ కేకేసింది ఉలిపిరి నాగేంద్రం కూతురు నల్లకుమారి . నాగేంద్రం పరిగెత్తుకుంటూ కోటమ్మకాడికొచ్చి “ఇప్పుడే వస్తానమ్మ, ఇక్కడెవర్నీ కూర్చూనీమాక” అంటూ ఇంటికి పరిగెత్తింది. “ ఇది మా ఇంట్లో గోల మీరెవరూ కలుగజేసుకోవద్దు” అన్నాడు కోపంగా యాకోబు. “నువ్వూరుకోవోయ్ ఇంట్లో గోలైతే ఇంట్లో వుండాల ఈదిలోకెందుకొచ్చారు… మేమురమ్మన్నామా? అందుకే అసలేమైయిందో నువ్వు చెప్పే కోటత్త” అన్నాడు తంబారం బావ.

“ఏముంది దేవుడి దయవల్ల వెంకటేసు పది ప్యాసయ్యాడు కదా”,“అవును అది అందరికి తెలిసిందేగా” అన్నాడు జాన్, కోటమ్మ మాటలను మధ్యలోనే ఆపేసి. “ అది వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందుకే వెంకటేసు తల నీలాలు ఏడుకొండల వాడికి అర్పించాలన్నది నా నిర్ణయం” కుండ బద్దలు కొట్టేసింది వెంకటమ్మ. “ అదంతా అబద్దం వాడు ప్యాసయ్యింది ఏసుప్రభు దయవల్ల అందువల్ల వెంకటేసు తలనీలాలు ఏసుప్రభుకే ఇయ్యాలన్నది నా నిర్ణయం” రెండు కుండలు బద్దలు కొట్టాడు యాకోబు. “ఇదిగో ఇదే గోల” అంది వెంకటేసు తల్లో పేలు చూస్తూ కోటమ్మ. “ఓస్ ఇంతేనా నేనింకేదో పెద్ద గోలనుకున్న” అన్నాడు ఆదెయ్య. “గోలెంతది అనేది కాదు ముఖ్యం…. గోల అయ్యిందా లేదా అన్నదే ముఖ్యం” అన్నాడు తంబారం బావ పైకి లేచి. అవునన్నట్టు తలూపింది ఊరంతా. గబ గబ వచ్చి ఉలిపిరి నాగేంద్రం వెంకటమ్మ పక్కన కూర్చుంది మళ్ళీ.

“ఏం ఈ ఒక్కసారికి నా మాట ఒప్పుకోవచ్చుగా తంబారం బావా” అంది కొంచెం ఏడుపు మొఖంతో వెంకటమ్మ.

“ తనోప్పుకోవచ్చుగా తంబారం బావ “ అన్నాడు ఇంకొంచెం పెద్దగా యాకోబు. ఇద్దరూ తననే అడిగేసరికి అటు ఆనందమూ, ఆశ్చర్యమూ కలగలిపిన సంతోషముతో వచ్చిన పెద్దరికముతో ఉబ్బి తబ్బిబ్బయ్యి గొంతులోకి అనుకోని దర్పం వచ్చి “ఎవరో ఒకరు ఒప్పుకోకపోతే సమస్య ఎలా తీరుతుంది?” అన్నాడు తంబారం బావ. “ ఆయన కోసం అన్నీ వదులుకొని వచ్చాగా ఈ ఒక్కసారికి నా మాట వినచ్చుగా ఆ మనిషి, అడగవేం తంబారం బావ” అంది వెంకటమ్మ. “మాట్లాడవేమిరా ఈ సారికి ఆ ఆడకూతురి మాట వినచ్చుగా, పాపం ఆ పిల్ల నిన్ను ప్రేమించి అమ్మాఅబ్బని కూడా కాదనుకొని మన పల్లెకి వచ్చినే… అటువంటి పిల్లని ఏడిపియ్యడానికి నీకు మనసెట్ట ఒప్పిందిరా” అన్నాడు పెద్ద మనిషిగా మారిన తంబారంబావ.

పాపం యాకోబుకి వెంకటమ్మ మీద నిజంగా జాలేసింది సరే పోనియ్యిలే అనుకుంటూ వుండగా “ఎలా ఒప్పుకుంటాడోయ్…. ఎలా ఒప్పుకుంటాడు ఒక్క మగపుటక పుట్టి ఆడదాని మాట ఒప్పుకుంటే మగ పుటకకే అవమానం కదా” అని నిష్టూరపోయాడు యాకోబు అన్న రూబేను. మెట్టల్దీసి కాలుతో తన్నేదేమిరా సెడునాబట్టని అనుకుంది మనసులో రూబేన్ని చూస్తూ వెంకటమ్మ. ఇంత దూరం వచ్చినాక ఒప్పుకుంటే పరువు పోతుందని అనుకోని “నేను మాత్రం దాని కోసం దానబ్బ సేత తన్నిచ్చుకుండ్ల, దాన్నడగవెం తంబారం బావ అది ఒప్పుకోవచ్చుగా” అన్నాడు యాకోబు. ఇదంతా అరుగు మీద కూర్చొని గమనిస్తున్న ఆదాం ‘పరాయి కులపోల్లని ప్రేమించచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, కాని పుట్టిన పిల్లవాడికి జుట్టు మాత్రం పెరగనివ్వకూడదని, పెరిగినా గుండు మాత్రం చేయించకూడదనే 23 వ నగ్న సత్యాన్ని’ తెలుసుకున్నాడు.

“తంబారం బావా ఆయినకి సెప్పు నేను మాత్రం నా మాట నెగ్గకుండా ఈ గుడ్డలమూట మీద నుంచి లేవనని” అంది వెంకటమ్మ. “ఇదిగో తంబారం బావ మొగుడి మాట ఇనేది వాళ్ళ కులంలో వుందో లేదో గాని మన కులంలో ఆడది మొగోడి మాట ఖచ్చితంగా ఇనాలని చెప్పు” అన్నాడు యాకోబు. “రాముడి మాట ప్రకారం సీతమ్మ నిప్పుల్లో దూకింది వాళ్ళ కులమూ మా కులమూ ఒక్కటే, అది గుర్తుంచుకోమను తంబారం బావా” అంది వెంకటమ్మ. “అయితే రాముడికి సీతేమైద్దె నువ్వు సెప్పవే తంబారం బావ” అన్నాడు యాకోబు. నేను చెబుతా అంటూ చెయ్యెత్తాడు జాన్. తంబారం బావకి కోపమొచ్చింది జాన్ మీద “ఆ నువ్వు జెప్పరా…నేనెందుకిక్కడా… నువ్వు జెప్పు” అన్నాడు వెటకారంగా తంబారం బావ. “రాముడికి సీత పెళ్ళామయ్యిద్ది” అన్నాడు తంబారం బావ వెటకారం అర్ధం కాని జాన్. “కదా మరి…. రాముడికి సీత పెళ్ళామయినపుడు యాకోబుకి వెంకటమ్మ ఏమైద్దో చెప్పరా జాన్ గా” అన్నాడు యాకోబు. తంబారం బావ కి తలకోట్టేసినట్లయ్యింది యాకోబు జాన్ని అడిగేసరికి.

“ఏమవుతుందీ నీకు పెళ్ళామవుతుంది” అన్నాడు కొంచెం నవ్వు మొఖంతో జాన్. “మరి వాళ్ళకులపాచారం ప్రకారం సీత రాముడి మాట ఇన్నపుడు, వెంకటమ్మ యాకోబు మాట ఇనాలా లేదా” అన్నాడో లాజిక్కులాగి. “ఇనాలి గదామరి” అన్నాడు తంబారం బావ అందర్నీ ఇంకోసారి తనవైపుకి తిప్పుకుంటూ. వెంకటమ్మ పంటి కింద రాయి పడింది, “ఈ ఆదెయ్య పులిబొంగరాలు పిండితో చేస్తున్నాడా ? లేక రాళ్ళతో చేస్తన్నాడ సెడు నా బట్ట” అంది తంబారం బావ మీద కోపాన్ని ఆదెయ్య మీద కు మళ్ళిస్తూ. సెడునా బట్ట అన్నందుకు ఆదెయ్య కి కోపమొచ్చినా బ్రతకనేర్చినోడు కాబట్టి అంతగా పట్టించుకోలేదు.
“ఆదెయ్య సంగతి తరవాత ముందు యాకోబు ప్రశ్నకు సమాధానం సెప్పు” అన్నాడు తంబారం బావ వెంకటమ్మ వైపు తిరిగి. కుదురూగా వున్నా తగాదాలోకి కులాన్ని తెచ్చి ఇప్పుడు చిక్కుకపోయి ఎటూ తేల్చుకోలేక వెంకటమ్మ “తంబారం బావా నీకు ఇంటిదగ్గరేం పనులేమిలేవా? పోయి అయి జూడుపో మా విషయాలు నీకెందుకు” అంది ప్రశ్నను దాటేస్తూ. “పనులన్నీ ఎప్పుడో అయిపోయినియిగానే ముందు వాడి ప్రశ్నకు సమాధానం చెప్పు” అన్నాడు తంబారం బావ.

వెంకటమ్మకు యాకోబు ని చూసి పాపం అనిపించింది. ‘నా కోసం మా నాన్న చేత తన్నిచ్చుకున్నాడు, పడరాని మాటలు పడ్డాడు, నాకు బాగా లేకపోతే ముద్దమింగడు, నా కోసం ఇన్ని చేసిన నా మొగుడిని గెలవనిస్తే నేమి? నా పంతం కోసం ఓ మంచి మొగుడ్ని అందునా మొగోడ్ని ఓ ఆడది బజారుకీడ్వడం తప్పుగాదా? ఇంత జేసి నా గెలుపుని ఇంకో మొగోడికే అర్పిస్తున్నానే! ఎక్కడో కొండల మద్యలో వుండే దేవుడు గొప్పోడా? ఇక్కడే నా పక్కనే వున్న నా మొగుడు గొప్పోడా? అని తనను తనే నిలదీసి అడుక్కొని మిగిలిపోయిన నాలుగు పులిబొంగారాలని పక్కనే వున్న ఉలిపిరి నాగేంద్రం కిచ్చి గుడ్డల మూట మీద నుంచి లేచింది యాకోబు మాటే ఇందామని . పులిబొంగరాలు అందుకున్న నాగేంద్రం తర్వాత తినచ్చని వాటిని ఒల్లో దాచి పెట్టుకుంది, “మౌ నాకొక పులిబొంగరమియ్ మా” అని అడిగింది కూతురు నల్లకుమారి. “తర్వాతా తినచ్చులే” కసురుకుంది ఉలిపిరి నాగేంద్రం.

“రాముడు సీతమ్మోరిని నిప్పుల్లో దూకమంటే దూకింది, యాకోబు వెంకటమ్మని నిప్పుల్లో దూకమంటే ఇప్పుడే దూకిద్ది, కాని ఈ ఇసయం ఆ ఇసయం వేరు గదా? ఈ ఇసయం ఆ ఇసయం వేరయినపుడు రాముడు యాకోబు వేరే గదా? రాముడు యాకోబు వేరైనపుడు సీత రాముడి మాట విన్నట్లు వెంకటమ్మ యాకోబు మాట ఇనాల్సిన అవసరం లేదుకదా? అలాంటపుడు ఎందుకు వెంకటమ్మ యాకోబు మాట ఇనాలి” అని లాజిక్కు అడిగేసరికి మాజీ పసిరెంటు పిచ్చమ్మ వైపు అందరూ అదొకవిధంగా చూసారు. అందరూ తనవైపు తిరిగేసరికి ముందు గర్వపడి, అలాగే చూస్తున్న జనాల కళ్ళలోకి సూటిగా చూడలేక సిగ్గుపడి అలవాటులో పొరపాటుగా అందరికి దండం పెట్టి చెయ్యూపింది.

అది మొత్తం విన్నవెంకటమ్మ అర్ధం కాక పోయినా అడ్డంచెప్పాలనే ఉద్దేశ్యంతోటి “తత్ బాన్చత్ పెదమ్మ చెప్పింది అక్షరాల నిజం కదా? మరి నేనెందుకు ఆయన మాట ఇనాలి…. నేను ఇనను గాక ఇనను, నా కొడుక్కి నేను తిరుపతిలోనే గుండు చేయిత్త ఇది నా ఆఖరు మాట” అంది నాగేంద్రం ఒల్లో వున్న పులిబొంగరాలు మల్లి లాక్కొని, గుడ్డలమూట మీద కూర్చొని తింటా . అది చూసి ఉలిపిరి నాగేంద్రం గుండె గుటుక్కుమంది, ఆమె కూతురు నల్లకుమారి కోపంతో ఉలిపిరి నాగేంద్రాన్ని గట్టిగ గిచ్చింది ‘ఇందాకే తిన్నా పోయేది’ అని తెగ భాదపడిపోయింది.

“లోకులు లచ్చ చెప్తారు…. ఏ నాకొడుకో చెప్పిన మాట ఇని మొగుడు మీద తిరగ బడే ఆడదానికి ఈ లోకంలో ఏ పేర్లు లేవబ్బ…. సర్లే పోనియ్ ఇంత దూరం వచ్చినాక నేను మాత్రం నా కొడుక్కి గుణదలలో గుండు చేయించలేనా ఎట్ట” అన్నాడు యాకోబు పైకి లేచి తుండుగుడ్డ ఇదిలిస్తూ. మాజీ పసిరెంటు పిచ్చమ్మ నోట్లో మట్టి బడింది.

***

“ఎందుక్కుదరదు” అన్నాడు కడుపు మండి పోయి కోపంతో ఊగిపోతూ సుబ్రమణ్యం మాస్టారు. వెంకటమ్మ యాకోబులతో పాటు ఊరంతా భయపడింది సుబ్రమణ్యం మాస్టారి కోపానికి. “ఏం ఎందుక్కుదరదు చెప్పండి? ఏసుప్రభుకి సగం ఎంట్రుకలు ఇయ్యండి, వెంకటేశ్వర స్వామికి సగం ఎంట్రుకలు ఇయ్యండీ, ఏం సగం సగం ఎంట్రుకులిస్తే వాళ్ళు తీసుకోమన్నారా ఏంది? వాళ్ళు తీసుకోమంటే నాకు చెప్పండి, కేసేసేద్దం”అని పెద్దగా అరిచేసాడు. అప్పుడే అటుగా వెళ్తూ జనాన్ని చూసి అరుద్దామనుకొని ఆగిన ఒక కుక్క మాస్టారి కోపాన్ని, ఆయన చేతిలో వున్న కర్రను చూసి వీలైనంత నెమ్మదిగా అక్కడనుంచి జారుకుంది. “ మాస్టారు మీరేమనుకోనంటే ఒక్క మాటడుగుతా సెప్పండి, ఇప్పుడు మీ దగ్గర్నుంచి ఎయ్యిరూపాయలు అప్పుతీస్కోని, తిరిగి ఐదొందలు సేతిలో బెట్టి మీ అప్పు తీరిపోయిందిలే పో అంటే మీరోప్పుకుంటారా?” అని సూటిగా మాస్టార్నే అడిగింది వెంకటమ్మ. “దానికి దీనికి లింకేంటి?” అన్నాడు పళ్ళు బిగించి మాస్టారు.

“అక్కడే వుంది లింకు. వెంకటేసు పదోతరగతి మొత్తం ప్యాసయ్యాడు కాబట్టి అందుక్కారణమైన బగవంతుడికి కూడా మనం ఏమి ఇవ్వాలనుకున్న మొత్తం ఇవ్వాలన్నది నా నిర్ణయం” అంటూ వెంకటమ్మ యాకోబు వైపు చూసింది. “హమ్మా సగం ఇస్తే మా దేవుడేమైనా అనుకోడు! వెంకటేసుకి దేవుడు, మొఖం ఇచ్చి ముక్కివ్వకుండా ఊరుకున్నాడా? నోరిచ్చి మాటివ్వకుండా ఊరుకున్నాడా? తలిచ్చి జుట్టివ్వకుండా ఊరుకున్నాడా? అన్ని బానే ఇచ్చాడుగా…. అందుకని అయన ఇచ్చినవి ఆయనకి తిరిగి ఇచ్చేటప్పుడు కూడా పూర్తిగా ఇవ్వాలన్నది నా కోరిక. ప్రాణం పోయినా సగం జుట్టు ఇవ్వడానికి నేనొప్పుకోను” అన్నాడు యాకోబు. సుబ్రమణ్యం మాస్టారికి చిర్రెత్తుకొచ్చింది. చేతి కర్ర తీసుకొని ఇద్దరి పిర్రలు పగలకోట్టాలనిపించింది. ఇంతలోనే వాళ్ళు విద్యార్దులు కాదని తెలుసుకొని కోపం పోవడానికి వెంకటేసు చేత కుండలో నీళ్ళు తెప్పించుకొని తాగాడు.

కోపం తగ్గి పోయినాక “అసలు వెంకటేసుకి గుండు చెయ్యాల్సిన అవసరం ఏందంటా?” అన్నాడు ఇంకో ఉపాయం ఆలోచిస్తూ. “ అవసరం వుంది మాష్టారు అవసరం వుంది” అంది వెంకటమ్మ. “ అదే ఏందని?” అన్నాడు సుబ్రమణ్యం మాస్టారు. వెంకటమ్మ చెప్పడం మొదలుపెట్టింది “వెంకటేసు పదోతరగతి ప్యాసయినాడని తెలిసి రాత్రి అన్నం కూడా తినకుండా ఆనందంగా నిద్రపోయా. మద్ది రేత్రిలో నాకో కలొచ్చింది. ఆ కల్లో నేనూ వెంకటేసు కలసి ఎక్కడికో పోతా వున్నాం…. పోయే దారిలో నల్లటియి ఏడుకొండలు కనిపించాయ్…. నేను వాటి దగ్గరకు పోయి చూసా అవన్నీ ఎంట్రుకలు, ఎంట్రుకల కొండలన్నమాట. నేను ఆ ఎంట్రుకల కొండలవైపే చూస్తా వున్నా… ఇంతలో పెద్ద మెరుపొచ్చి ఎంట్రుకల కొండలోంచి వెంకటేశ్వర స్వామి పైకి లేచాడు.

అపుడు నేనా స్వామికి దండం బెట్టి ఏడుకొండల్లో వుండాల్సినోల్లు ఎంట్రుకల్లో వున్నరేంది స్వామి అని అడిగా, వెంకటేశ్వర స్వామి నవ్వి, ‘భక్తులకు వరాలిచ్చి నేను సంపాదించుకున్న ఆస్థి ఇదే వెంకటమ్మ, అందుకని నేను కాపలా వున్నాను… అంతే కాకుండా నాకు కొంతమంది అప్పున్నారు మరి ఆ అప్పు ఎప్పుడు తీరుస్తారో’ అని వెంకటేసు వైపు చూసాడు. నేను వెంకటేసు వైపు చూస్తా వున్నానా ఇంతలో వెంకటేశ్వర స్వామి గాల్లో ఎగరడం మొదలెట్టాడు. అంతే గబుక్కున మెలుకవొచ్చింది అదీ సంగతి. దేవుడే స్వయంగా వచ్చి అయన బాకీ తీర్చమని అడిగాడు. ఇపుడాయన బాకీ తీర్చలేదంటే ఆయనకి కోపం వచ్చి వెంకటేసు ని ఏమన్నా చేస్తాడేమోననే నా బాధంత” అంది ఏడుస్తూ. అది విన్న ఉలిపిరి నాగేంద్రం కూడా రెండు ఎక్కిళ్ళు పెట్టింది. “లైలాడి ఏడుపులు ఏడవబాకమ్మో సాల్లే గానే” అంది నోటి కాడ పులిబొంగరాలు కాజేసిందన్న కోపంతో నల్ల కుమారి.
వెంకటమ్మ ఏడవడం చూసిన యాకోబు సూర్యుడి వైపు సూటిగా చూసి రెండు కన్నీటి చుక్కలు కార్చి “ఆ యొక్క భగవంతుడు వెంకటమ్మకి వెంకటేశ్వరస్వామి రూపంలోకనిపించాడు కాని నాకైతే ఆయన యేసుప్రభు రూపంలో కనిపించేవోడు… ఆయన కూడా ఇదే అడిగేవోడు” అన్నాడు ఏడుస్తున్నట్టు నటిస్తూ. “ఏడిసే మొగోల్లని నమ్మకూడదంటార్రోయ్ నువ్వూరుకో” అన్నాడు సుబ్రమణ్యం మాస్టారు, వెంటనే యాకోబు నోరు మూసాడు. కాని ఈ లోకంలో ఎంతో మంది ఇలా నంగనాచి ఏడుపులు ఏడిచిన తరువాతే సానుభూతి విజయాలు పొందారన్న విషయం గుర్తొచ్చి, మొగోడిగా ఏడవలేక, గెలవాలని ఏడవకుండా వుండలేక నానా యాతనపడుతూ ఉండిపోయాడు యాకోబు. అంతే కాకుండా ఏడుస్తుంది కాబట్టి అందరూ వెంకటమ్మకే సపోర్ట్ చేస్తారేమోనని దిగులు కూడా పట్టుకుంది.

“యాకోబు మాట ఎంకటమ్మ ఇనదు, ఎంకటమ్మ మాట యాకోబు ఇనడు, ఈళ్లిద్దరూ పంతులు మాట ఇనరు వాళ్ళు మన మాట ఇననప్పుడు మనం వాళ్ళ మాటలు ఇంటా ఎందుకిక్కడా పోదాం పదండ్రా” అంటూ కదిలాడు తంబారం బావ. “అవసరమైతే మా తలుపే పగలకోట్టుకుంటాం…. అంతగా అత్యవసరమైతే ఈ గడ్డపారతో నా బుర్ర పగలకొట్టుకుంటా, అంతే గాని మీరేదో ఇస్తారు పగలకోడదామని ఇక్కడుండటం బుద్ది తక్కువ పని అని ఇప్పుడు తెలిసింది, ఇదిగో మేం బోతన్నాం, తలుపేసుకుంటారో లోపల తన్నుకుంటారో మీ ఇష్టం” అగ్గి మీద గుగ్గిళం అయిపోయాడు పేతురు అక్కడి నుంచి వెళ్లిపోతు. “యమోవ్ కుంకుడుకాయలతో తలకి పోస్తానంటివే రా…” అని కేకేసింది నాగేంద్రాన్ని వాళ్ళ కూతురు నల్ల కుమారి. “సెంబు లో నీళ్ళు బోసి కుంకుడుకాయలు దాంట్లోయేసి పిసుకుబో వస్తన్న” అంది నాగేంద్రం.

“భార్యాభర్తలన్నాక ఒకర్నొకరు గౌరవించుకోవాల అలా వీలుకానప్పుడు పక్క వాళ్ళ మాటలనైనా గౌరవించాల, మీరు మిమ్మల్ని గౌరవించుకోరు పోనీ నన్నూ నా మాటని గౌరవిస్తారా అంటే అదీ లేదు, గౌరవం లేని చోట గౌరవస్తులు ఉండకూడదు, అందుకే నేనెల్లోస్తా” అని బెదిరించబోయాడు సుబ్రమణ్యం మాస్టారు, అది అర్ధం కాని యాకోబు “సరే మాస్టారు మీ ఇష్టం” అనేసరికి సుబ్రమణ్యం మాస్టారికి ఏమనాలో అర్ధం కాక పళ్ళుకొరుకుతూ వెళ్ళిపోయాడు. “నేనూ ఎల్లోస్తానమ్మాయ్ మల్లి గొడవయితే మర్చిపోకుండా పిలవండి” అంటా బయలు దేరింది మాజీ పెసిరెంటు పిచ్చమ్మ.

జనాలందరికీ విసుగు పుట్టి ఇళ్ళకు బయలుదేరారు. “పులిబొంగారాలోయ్…. పులిబొంగారాలో” అంటూ ఆదెయ్య వీధిలోకెళ్ళాడు. అరుగు మీద కూర్చొని ఇదంతా గమనిస్తున్న ఆదాం ‘ఇటువంటి గుండులో యవ్వారాలని తొందరగా ముగించకుండా సాగదీస్తే జనాలకి బోరు కొడుతుందని, బోరు కొడితే అందరూ అక్కడనుంచి లేచి వెల్లిపోతారనే 27 వ నగ్నసత్యాన్ని’ తెలుసుకొని ఇంటికి వెళ్ళాడు. గుడ్డలమూట మీద నుంచి లేచిన వెంకటమ్మ పొయ్యి దగ్గరకు పోయి అన్నం కుండలో చెయ్యి బెట్టి చూసింది. అన్నం నన్నపాయ పడిందని తెలుసుకొని అన్నం మొత్తాన్ని కుడితి తొట్టెలో గుమ్మరించి మళ్ళి బియ్యం కడగడం మొదలు బెట్టింది.

కుడితి తొట్టెను చూడగానే యాకోబుకి తాను వదిలేసినా సూడి బర్రె గుర్తుకొచ్చి పరుగు పరుగున ఊళ్లోకిపోయాడు. ఇక్కడ జరిగిన విషయాన్ని పొల్లుబోకుండా వెంకటమ్మ వాళ్ళ నాన్నకి చెప్పడానికి ఊళ్లోకి బయలు దేరాడు జిలకర ఏసుపాదం. నాగేంద్రం కూతురు కుంకుడుకాయలు తిందని ఎవరో పిలిస్తే, “ఒసే ఇది కుంకుడు కాయల్ని పులిబొంగారాలు అనుకుందో ఏం పాడో” అంటా పరిగెత్తు కుంటూ ఇంటికి పోయింది.

వెంకటేసొక్కడు అక్కడే వున్నాడు, వాడి బుర్రలో అనేక ఆలోచనలు వస్తూ పోతూ వున్నై, ‘మా అమ్మకూ నాన్నకూ గొడవపడటానికి కారణం నేనే, మాస్టారుకి కోపం రావడానికి కారణం నేనే, ఊరంతా మా ఇంటి ముందుకు చేరి వేడుక చూడటానికి కారణం నేనే…. నేనే నేనే నేనే’ అని చాల మదనపడ్డాడు. మనసులో ఏదో బలమైన నిర్ణయం తీసుకొని ఈసరమ్మ బొంకువైపు పరిగెత్తాడు. సూర్యుడు కూడా వాడి లాగే పరిగెత్తి చీకట్లో దూరాడు.

***

అమావాస్యలో తడుస్తూ ఊరంతా ఊర చీకట్లలో వుంది. రాత్రి బాగా పోద్దుపోయినాక యాకోబుకి మెలుకువొచ్చి వెంకటమ్మను లేపాడు మంచం మీదకు రమ్మని. బెట్టుచేసింది, కసురుకుంది. ఊరుకోలేదు యాకోబు. తనే మంచం దిగాడు. ఒప్పుకుంది. దేవుడి దగ్గర లైటు ఆపమంది, లైటాపుదామని యాకోబు లేవబోయే సరికి కరెంటు పోయింది, మంచి శకునం అనుకోని యాకోబు ఆనందంగా వెంకటమ్మ పక్కన చేరాడు. ఓ అరగంట తరువాత కరెంటు వచ్చింది, దేవుడి దగ్గర ఉన్న లైటు వెలిగింది. ఆ వెలుతురిలో వెంకటేశ్వరస్వామి ఏసుప్రభులిద్దరి పటాలు పక్క పక్కనే గోడకు వేలాడుతూ వున్నై ఇద్దరికీ కలిపి ఒకే దండ వేసుంది, ఇద్దరూ హాయిగా వున్నారు వెంకటమ్మ యాకోబు లాగా. యాకోబు మంచం ఎక్కాడు తృప్తిగా. పైన పడుకున్న యాకోబుకి కింద పడుకున్న వెంకటమ్మ మీద విపరీతమైన జాలేసింది. ఇంత కోపంలో కూడా తను అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు వెంకటమ్మ మీద ఇంకా ప్రేమ పెరిగింది. ఎలాగైనా సరే ఈ సారికి వెంకటమ్మ మాటే వినాలని నిర్ణయంతీసుకొని నిద్రపోయాడు యాకోబు.

***

వేకువజామునే యాకోబు నిద్ర లేచి వెంకటమ్మ మొఖం చూసాడు, మంచందిగి వెంకటమ్మ దగ్గరకు వెళ్లి “వెంకీ …. ఓయ్ వెంకటమ్మ” అని ముద్దుగా పిలిచాడు. ఉలిక్కిపడి నిద్రలేచింది వెంకటమ్మ. “ ఇదిగో సూడు ఇప్పుడు నేను చెప్పబోయే ఇషయం ఎవురికి సెప్పమాక, నువ్వూ వెంకటేసు వెళ్లి తిరుపతి లోనే గుండు చేయించుకొని రండి మా దేవుడికి నేను ఏదొకటి చెప్పుకుంటాలె, నువ్వు నా కోసం ఎంత సాహసం చేసావు, ఎన్ని అవమానాల పాలయ్యావు, మీయమ్మనిఅయ్యని కాదనుకొని నాతో వచ్చేసిండ్ల నేనీ మాత్రం సేయ్యలేనా…. నీ మాట ప్రకారమే అబ్బాయికి తిరుపతిలోనే గుండు చేయించ్కరాపో” అన్నాడు నవ్వు మొఖంతో.

ఇంత మంచి మొగుడ్ని నలుగురిలో నిలబెట్టిందుకు వెంకటమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్, మొగుడి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది. ‘ఇంత మంచి మొగుడెవరికీ దొరకడమ్మా… నా బంగారి మొగుడు’ అనుకుంది మనసులో. వెంటనే అలా కాదులేయ్యా ఈ సారికి నేను కూడా నీ మాటే వింటా అబ్బాయికి గుణదలలోనే గుండు సేయిద్దాం అనాలని అనుకుంది కాని మళ్ళి మొగుడి మాట కాదనడం ఇష్టం లేక అంగీకరించింది. ఆ సమయంలో మొగుడికో ముద్దు కూడా ఇవ్వాలనుకుంది కాని అలవాటు లేని పనులు అనవసరం అనుకొని అక్కడినుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి బయటపడుకున్న వెంకటేసు మంచం దగ్గరకు వెళ్ళి “వెంకటేస ఒరేయ్ వెంకటేస తొందరగా లేరా… తిరుపతిబోవడానికి మీ నాన్న ఒప్పుకున్నాడు” అని ఆనందంతో హడావుడి చేసింది.

ఆ హడావుడికి బయపడి చివ్వుక్కున్న లేచి కూర్చున్నాడు వెంకటేసు తల్లో గోక్కుంటూ, ఎప్పుడు నల్లగా నిగనిగ లాడుతూ మూర పొడవుండే వెంకటేసు వెంట్రుకలు ఇప్పుడు వెనకాల మాత్రమె మూరపొడవుండి, మద్యలో జానా ఇంకో చోట బెత్తె పొడవు వుండి ముక్కలుముక్కలుగా, బొక్కలుబొక్కలుగా, చిక్కురుబక్కురుగా వుండటం చూసి వెంకటమ్మ ఆశ్చర్యపోయింది. యాకోబు మగవాడు కాబట్టి రెండు ఆశ్చర్యాలు పోయాడు. “ నీ జుట్టుకేమైందిరా” అని అడిగారు ఇద్దరు ఒకేసారి. ఇద్దరు ఒకేసారి అడిగేసరికి వెంకటేసుకి ఏడుపొచ్చింది. ఈసరమ్మ బొంకు దగ్గరకు పోయి బ్లేడు కొనుక్కున్న విషయం, రాత్రి కరెంటు పోయినప్పుడు దాంతో జుట్టు కోసేసుకున్న విషయం ఏడుస్తూనే చెప్పాడు, వెంటనే “నా జుట్టుకోసం ఇక మీరిద్దరూ గొడవపడి కొట్టుకోవాల్సిన అవసరం లేదు” అని చెప్పాడు.

కొడుకు ప్రేమకి మురిసిపోయిన ఇద్దరూ వెంకటేసు ని హుటాహుటిన ఫస్ట్ బస్సుకే ఒంగోలు తీసుకెళ్ళి అక్కడ ఒక మంగలషాపులో గుండు చేయించి ఇంటికి తీసుకొచ్చారు. ఇదంతా తెలియని ఆదాం ‘వెంకటేశ్వరస్వామికి తలనీలాలు అర్పించాలన్నా గుండు గీసేది మంగలోడే, గుణదలలో తలనీలాలు అర్పించాలన్నా గుండు గీసేది మంగలోడే, పక్క వూరి షాపులో కూడా గుండు గీసేది మంగలోడే కాబట్టి మంగలోడే నిజమైన దేవుడు’ అనే 29 వ నగ్న సత్యాన్ని తెలుసుకున్నాడు. ప్రేమ కోసం దేవుడ్ని కూడా కాదనుకొని పక్క వూరిలో వెంకటేసుకి గుండు చేయించారని నమ్మిన ప్రజలు వారిద్దరి అన్యోన్యదాంపత్యాన్ని వేనోళ్ళాకొనియాడారు.

**** (*) ****

 

రచయిత పరిచయం: ప్రస్తుతం యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో నాటక రంగంపై Phd చేస్తున్నాను. నేను రచన చేసి దర్శకత్వం వహించిన “మిస్ మీనా” అనే నాటకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 80 కు పైగా ప్రదర్శనలు వేసాము. ఇంకా అడ్వెంచర్స్ అఫ్ చిన్నారి, ఒక రాజుకథ అనే నాటికలు, “ముళ్ళు”, “నేను నాన్న బిర్యాని”, “జనారణ్యం”, “నాటకాలాయనింట్లో పాము” అనే కథలు నా రచనల్లో ముఖ్యమైనవి. నాటకాన్ని వృత్తిగా తీసుకున్న నేను ఈ మధ్యే కథలను రాయడం మొదలు పెట్టాను. ఇంకా రాస్తాను.

**** (*) ****