కథ

గాలికీ కులముంది…!!

మార్చి 2015


దో గాడ్పు మధ్యాహ్నం. వాళ్ళని దింపిన బస్సు అంపకాలు పెట్టి చేతులు దులిపేసుకున్న తండ్రిలా హడావిడిగా అపస్వరపు హారన్ రోదన చేసుకుంటూ వెళ్ళిపోయింది. దూరం నుంచి ‘ఇదే ఇల్లు ‘ చూపించాడు నారాయణ. దగ్గర పడుతున్నకొద్దీ ఏదో దిగులుగా, గుండెలు చిక్కపట్టినట్టు అనిపించింది అమృతకి . ఆమె హ్యాండ్ బాగ్ లో ఉన్న అమృత మత్సకంటి వెడ్స్ నారాయణ స్వామి గౌడ్ అని ఉన్న శుభలేఖ ఒక్కసారిగా బరువెక్కినట్టు, ఒకానొక వేసవి జూన్ నెల ఉబ్బరం అంతా మొహం లోకి వేడిగాలిలా కొట్టినట్టయి నారాయణ చేతిని పట్టుకుంది, అప్రయత్నంగా. సెకనులో టెన్షన్ తో ఉన్న నారాయణ మొహంలోకి ధైర్యపు నవ్వు పాకి వచ్చింది. చేతిని వత్తి పట్టుకున్నాడు. నేనున్నాగా..! అన్నట్టు.

నిజానికి అది పెద్ద ఇల్లేం కాదు. కానీ కళకళ లాడుతూ ఉంది. పెద్ద ఆవరణ, ఒక ప్రక్కగా గేదెల కోసం వేసిన షెడ్, గుమ్మాలకి మామిడి తోరణాలు. యేవో రకరకాల పూసలతో అల్లిన ఇంకో తోరణం, పెద్ద అరుగులు, అరుగు మీద వాల్చిన దీవాన్ లా అనిపించే మంచం. ఇంకో రెండు ప్లాస్టిక్ కుర్చీలు. “ఇదే మా నాన్న ఆఫీసు” నవ్వాడు నారాయణ. అంతే కులాసాగా నవ్వుదామని ప్రయత్నించి విఫలం అయింది అమృత.

పెద్ద అరుగుల పక్కన ఉన్న మూడు మెట్లు దాటి వెళ్ళారు అమృత, నారాయణ. సమయం పదకొండు గంటలవుతోంది. ఇంకో గంట ముందు వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాడు నారాయణ. ఇంట్లో ఎవరూ లేనట్టుగా ఉంది. ఇల్లు చల్లగా, నారాయణకి వేడిగా, జ్వరం వచ్చినట్టుగా ఉంది. “బాపూ… ఉన్నవా ?” అడిగాడు నారాయణ.

“ లగ్గం చేస్కొని వచ్చినవా.. చెప్పనీకి వచ్చినవా ??’ ఖంగు మంది లోపల నుండి ఒక స్వరం. వినటానికి పెద్ద గొంతుక కాకపోయినా, అందులో ఉన్న ధిక్కారం, అసహనం, అమృతకి వొళ్ళు జలదరించింది.

“జేస్కొని పద్దినాలయుండే.. కార్డంపిన.. అందలే ..!” నారాయణ సమాధానం. లోపలనుండి గభాల్న వచ్చిన నారాయణ తండ్రి నర్సిమ్మ , వెనకాలే వచ్చిన తల్లి పార్వతిలను .. నారాయణ పరిచయం వేరేగా చేయనక్కర లేనట్టుగా ఉన్నారు అనిపించింది.

అయిదు నిమిషాల పాటు, అంతా నిశ్శబ్దం. అమృత గోడల వైపూ, గోడలకి తగిలించిన ఫోటోల వైపూ చూడటం మొదలెట్టింది. కొత్తగా వెల్ల వేసిన గోడలు, వాటిపై వంకర టింకరగా తగిలించిన పసుపు రంగుకి తిరిగిన ఫోటోలు, చాలా వరకూ రాజకీయ నాయకులతో తీయించుకున్నవి, కండువాలతో, ఎక్కడా గోడ కనబడనంతగా కిక్కిరిసి ఉన్నాయి. అటక మీద బాగా తోమిన, ఇత్తడి, స్టీల్ పెద్ద గిన్నెలూ, గంగాళాలతో ఒక షాప్ లా ఉంది అనుకుంది అమృత. ఒక్కసారి ఆ గిన్నెలన్నీ వచ్చి తలమీద పడితే, ఉక్కిరిబిక్కిరి అయినట్టు అనిపించి, అంతే గబగబా వినిపిస్తున్న మాటలకి గభాల్న పై చూపు మాని టకీమని తలదించుకుంది .

మాటలు ఇత్తడి గంగాళాలు మీద పడ్డట్టు, బరువుగా అదుపు లేకుండా పడుతున్నాయి.
“ఎమ్రా కొడకా.. లగ్గానికి ఈ కులం తక్వ దెక్కడ దొరికిందిరా నీకు.. గా కాలేజ్ల ఇసంటి ఇజ్జత్ తీసే పన్లా నువ్ నేర్చింది ? ……” కొన్ని బూతులు అమృతకి అర్ధం కాలేదు.

నారాయణ తల దించుకున్నాడు ..” అది గాదె నాయనా…నేను ప్రేమించిన …నీకు సమజైతలే ..”

నర్సిమ్మ అందుకున్నాడు –“ ఏందిరా నాకు సమజయ్యేది .. గాడ్ద కొడకా… నీకొల్లు కొవ్వెక్కి ప్రేమైంది అంటం ఎక్వ అయ్యింది.. “ నర్సిమ్మ దృష్టి క్షణంలో కాసేపు అమృతమెడలో పచ్చగా కనిపిస్తున్న కొత్త సూత్రాల తాడు మీద, మరో సెకను ఆమె పొట్ట మీదా పడింది. లీలగా ఎత్తుగా కనిపిస్తున్న ఆమె పొట్ట పై పడి, నొసలు చిట్లించి భార్య పార్వతి వైపు చూసాడు. ఆమె కూడా , అతని అనుమానాలతో ఏకీభవించినట్టు అనిపించగానే … అందుకున్నాడు-

“ నువ్వేది సమజైతలే దన్నావో సమజైంది రా బిడ్డా .. కానీ నువ్వోటి యాదుంచుకో .. లోకం నువ్వు సొంచాయించినట్టుగా ఏం మారలే ..కులం తక్వ పిల్లని .. ఎవరిది?.. మాలదేనా .. చేస్కుంటే… నీకు పుట్టే పోరగాల్లని మన కులపోల్లు అన్రు…అందునా మనకో ఇజ్జత్, ఉండాయిగా .. నామాటినవే.. లగ్గం సంగతి మర్చిపో ..!”

ఒక్కసారి గాలి స్తంభించినట్టయింది అమృత మనసులో, చెవుల్లో హోరు .. తను వింటున్నదేమిటి ? పెళ్లి చేసుకున్నాం కదా.. మర్చిపోవటం ఏంటి ? కబేళాలో తల్లి నుండి విడిపోయిన పిల్లమేకలా , నారాయణ వైపు చూసింది.అతను అభావంగా తండ్రి వైపే చూస్తున్నాడు. ఒక్క్ససారి అతన్ని హత్తుకోవాలి ఇక్కడే, ఇప్పుడే అనిపించింది. తప్పేముంది? రహస్యంగా ఎన్నో రాత్రులు గడిపి, కలగా పులగంగా జ్ఞాపకాలు పెనవేసుకున్న శరీరాలే కదా అవి .. కానీ వాళ్ళ చూపుల్లో తెలీనిది ఏదో ఆమెని అక్కడే ఆపేసింది. మూకీ సినిమాలో దృశ్యంలా వాళ్ళు మాట్లాడుకునేవి ఏవీ వినబడటం మానేశాయి. అమృత అక్కడే కూలబడింది.

విసురుగా నారాయణ చేయి తనని లేపేదాకా జరిగేదంతా ఒక కలలాంటి దృశ్యంలా, ఏదో ఏదో జరిగిపోతున్నట్టు .. అనిపిస్తూనే ఉంది. “ లే.. మనం పోదాం … ఇంతవరకు అయింది చాలు ..!” కలలోని మనిషిలా అతని వెంట నడుస్తోంది అమృత.
గుమ్మం దాటుతుండగా పార్వతి దుఃఖస్వరం –‘ అంత మోజుంటే …పండినవ్ కదా కొడకా.. ఉంచుకొబట్టే… లగ్గమే కావాల్నా..??’’

ఆ దుఖం, ఆ స్వరం, అందులోని తెలీని ఒక భయం, అది కప్పేసే అహంకారం అమృతను చాలాకాలం వెంటాడాయి. అలా వచ్చేసిన మర్నాడే అమృత, నారాయణ అక్కడకి ఇరవై కిలోమీటర్ల దూరంలోని మండల హెడ్ క్వార్టర్స్ లో , ఒక కార్పోరేట్ కాలేజీలో టీచర్లు గా చేరారు .

***

హోరున ఒకటే గాలి వీస్తోంది. ఆకాశం మూసేసి ఏదో పూర్తిగా సూర్య కిరణాలకి గుడ్ బై చెప్పేసినట్టుగా ఇంత చీకటిగా, మబ్బుగా, దిగులుగా ఉందేంటి వాతావరణం ‘- కాలేజీ నుండి నడిచోస్తూ అనుకుంది అమృత. చాలా నీరసంగా ఉంటోంది, మళ్ళీ డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి , ఇవాల్టికి అబార్షన్ అయి రెండు నెలలు అని మనసులోనే బరువుగా లెక్కేసుకుంది. పిచ్చి గాలి వీస్తోంది, మరి వర్షం ఎంత పడుతుందో తెలీదు గానీ.. మనసులో హోరున ఒకటే ఆలోచనలతో, కాలేజీకి దగ్గరగా తీసుకున్న ఇంటికి నడుస్తోంది. రెండు నెలల క్రితం అర్దరాత్రి, నెప్పితో మొదలైన రక్తస్రావం, కొన్ని వర్షాల్లా మొత్తం, పరిసరాల్నీ, మనసునీ, శరీరాన్నీ ఖాళీ చేసి కడిగేసినాక గానీ వదిలింది కాదు… అది కూడా ఇలాంటి ముసురు రోజే.. ఒక గంట నెప్పి వోర్చుకొని, ఇక భరించలేక నారాయణని లేపింది. పాపం.. చాలా గాభరా పడ్డాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళేసరికే , అబార్షన్ జరిగిపోయింది. ఆగని రక్తస్రావం ఒకవైపు , విపరీతమైన నీరసం ఒకవైపు, నారాయణలో తెలీని రిలీఫ్ మరో వైపు ఇవన్నీ అమృతని బాధించినాయి. ఆమెకి , ఒక ప్రక్క సపర్యలు చేస్తూనే, నారాయణ అన్నమాట -
“ పోనీలే పెళ్ళికి ముందు కడుపులో పడ్డటోడు, ఆడి లెక్క ఇక్కడితో సరి.. ఊరుకో.. మనం ఇంక ఎవరికీ లెక్క చెప్పక్కర్లా ..!” – వాడుతున్న మందుల వల్ల శరీరపు బ్లీడింగ్ తగ్గి …. మనసులో బ్లీడింగ్ మొదలైంది అమృతకి.

అబ్బా.. ఏంటీ పిచ్చి గాలి .. కిటికీ రెక్కలు వేసానో లేదో, గ్యాస్ ఆపానో లేదో అనుకుంటూ ఇంటికొచ్చేసింది అమృత. వచ్చేలోగా చిరుజల్లు మొదలై , ఒక్కసారి మనసు ఆహ్లాదంగా అయింది. క్లాసుల్లేకపోతే నారాయణ వచ్చేసి ఉంటాడు. ఏదన్నా చేసి పెడదాం అనుకుంటూ ..గుమ్మం దాకా వచ్చి, ఏదో సంభాషణ వినపడి ఆగిపోయింది.

అత్తగారు పార్వతి గొంతు వినబడుతోంది – “ నాయన బీమారున్నడు.. చెట్టంత కొడుకు ఇంటికి కాకుండా పోయిండని.. ఆనికి నేన్ సమజాయిస్త మల్ల .. మీరైతే ఇంటికి రాండ్రి… కులం తక్వ అయితేనేమి .. కడుక్కుంటే పాయె.. బిడ్డ పోయింది కదా.. నాయన బాలేడని పగోల్ల గోస ఎక్వ అయిపాయె, మల్ల రెండేల్ల సంది ఎలక్సన్లు ఉన్నయి.. యాదుందిగా మల్ల.. ఐనా ఏదో పని మీద రోజూ వూర్ల రాబట్టేగా నువ్వు .. దాన్ని గూడా నవుకరీ మాన్పించి ..తోలకరా ..తిన్నమా..పండామా అన్నట్టుగాక ఎందుకీ ఖరాబ్ పన్లు…!!” ఇంకా ఏదో అనబోతూ.. అలికిడి విని ఆపేసింది.

ఇంట్లో కొచ్చిన అమృతని, నారాయణ మొహమాటంగా, పార్వతి అభావంగా చూసారు ..

‘అమ్మొచ్చే చూడు.. జర్రంత చాయ్ పెట్టు ..!!” – నారాయణ ఆదేశించాడు.

‘అమ్మయ్య… అనుకుంటూ వంటింట్లోకి వచ్చి పడింది అమృత… చాయ్ పత్తీ వేసి కుత కుత లాడుతున్న వేడినీళ్ళలా ఉంది ఆమె అంతరంగం. ముందుగదిలో పార్వతి, నారాయణ కాస్త గొంతు తగ్గించి మాట్లాడుకోవటం వినిపిస్తూనే ఉంది.

అమృతకి సడన్ గా , తను పెరిగిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గుర్తొచ్చింది. ఏదో దగ్గరలో గ్రామం నుండి ఎవరో సోషల్ వర్కర్ తీసుకొచ్చి అమృతని చేర్పించి పోయాడు, ఐదేళ్ళ వయసులో అని హాస్టల్ లో చెప్పటమే. అతను చెప్పిన వివరాలతో, ఇంటి పేరుతో , ఆమెకి కేస్ట్ సర్టిఫికేట్ చేయించారు హాస్టల్ వాళ్ళు. తర్వాత ఆమె కోసం ఎవరూ రాలేదు. ఇటు బీ సి గ్రూప్ లో “మార్కులు బాగా వచ్చినంత మాత్రాన, నీ రిజర్వేషన్ కి మేం సరి తూగుతామా – అని చేర్చుకోక, అటు ఎస్సీ గ్రూప్ లో “తెల్లగా,అందంగా, ఏ బేమ్మర్ల, కమ్మోరమ్మాయి లా” ఉన్నదని, వెలి వేసిన సంఘటనలు గుర్తు వచ్చాయి, యూనివర్సిటీ కి వచ్చేసరికి మరో బాధ- తను మాట్లాడే మాట బట్టి, యాస బట్టి , ఆమె ఎవరో, ఏ జిల్లా, ప్రాంతం , వర్గం వాళ్ళ . అక్రమ లేదా సక్రమ సంతానమో తెలుసుకోలేక పోవటం . నేనెవర్ని , ఏ గ్రూప్ నాది ? అని ప్రశ్నించుకుంది అమృత. చాయ్ పెట్టేలోగా తేలే విషయమా అది .. అలా అనుకోగానే అమృతకి చప్పున నవ్వు వచ్చింది .

మరో వారానికి , అమృత చేస్తున్న ఉద్యోగం మాని, ఇల్లు ఖాళీ చేసి నారాయణతో పాటు అధికారికంగా అత్తారింటికి వెళ్ళింది. నువ్వు నీరసంగా ఉన్నావు.. తేరుకున్నాక మళ్ళీ ఉద్యోగం గురించి ఆలోచిద్దాంలే అని నారాయణ అన్నాడు. ఇరవై కిలోమీటర్లే కదా .. తను రోజూ తిరగటం ఎంత సేపు .. అయినా మగాణ్ణి , అవసరం లేకపోవచ్చు కానీ.. ఉద్యోగం మానేసి నేనేం జెయ్యాలె.. అన్నాడు నారాయణ . నీరసంగా నిజమేనంది అమృత.

***

మరో ఉక్కపోత మధ్యాహ్నం. చావడి అనబడే వరండాలో నర్సిమ్మ ఆఫీసు అనబడే చీడీ మీద కూర్చొని వడ్లు ఏరుతోంది అమృత. చాలానే పనులు వచ్చేసాయి నాకు అనుకుంటూ. వడ్లు ఏరటం, పనమ్మాయి రమణతో వాటిల్ని దంచటం, బట్టలు గుంజటం, వంటకి కావాల్సినవన్నీ సిద్ధం చేయటం, అంట్లు తోమటం, ముఖ్యంగా అడక్కుండా వంటింట్లోకి వెళ్లకపోవటం, వెనకాల మొక్కల పని చేయటం.. ఎన్ని వచ్చేసాయో. భలే అనుకుంది అమృత. పనమ్మాయి రమణ ఇంకా రాలేదు. అదృష్టవంతురాలు.. దాని మొగుడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాడు, వాడికి భోజనం పెట్టి, సర్దుకొని అప్పుడు వస్తుంది. నెమ్మదిగా అనుకుంది అమృత. ఇక్కడికి వచ్చిన దగ్గరనుండీ నారాయణ ఇంట్లో ఉండటమే తక్కువ అయింది .. పొద్దున్న హడావిడిగా ఏడో గంట కల్లా తయారై కాలేజీకి వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చేది సాయంత్రం ఐదు దాటాకే, అప్పటికే కొంత మంది కుర్రాళ్ళు, రాజకీయ పక్షులు కూర్చొని ఉంటారు . టీలు తాగేసి, వాళ్ళు వూరి మీద పడతారు. మళ్ళీ వచ్చేది ఏ రాత్రికో, అది చాలా సహజం మగాడికి అంటుంది అత్త పార్వతి. పైగా తన మొగుడు ఎలా వారాల తరబడి ఉంచుకున్న దాని ఇంట్లో ఉండేవాడో చెప్తుంది. చివరికి అమృత ‘వాళ్ళ ‘ కులంలో పుట్టినా ఎంత అదృష్టవంతురాలో చెప్పటంతో ఆ లెక్చర్ ముగుస్తుంది. అమృత సహనంగా వింటూ ఉంటుంది. అత్త తిన్నాక, అమృత తింటుంది. పార్వతి, తను తినగానే , గిన్నెలు వదిలేసి , వంట గది తాళం వేసేస్తుంది. నారాయణ కోసం తీసిపెట్టి… అమృత తింటుంది.

మామ నర్సిమ్మ కి నిజంగానే ఆరోగ్యం బాలేదు. అందుకే అత్తారింటికి వచ్చిన నాలుగు నెలలకే అమృత మళ్ళీ నెలతప్పటం ఒక భూకంపంలా ఫీల్ అయ్యారు, తల్లీ కొడుకులు. నారాయణ రెండు రోజులు మొహం మాడ్చుకున్నాడు. మరో రెండు రోజులు ఆలోచిస్తున్నాను అన్నాడు. ఇంకో రెండు రోజులు విసుక్కున్నాడు, కొంచం జాగ్రత్త తీసుకోవచ్చు కదా అని. జాగ్రత్త ఎవరు ఎలా తీసుకోవాలో  అమృతకి అర్ధం కాలేదు. ఇంకో రెండు రోజులు తల్లీ, కొడుకులు తలుపులు వేసుకొని తెగ మాట్లాడుకున్నారు. తర్వాత ఒక రాత్రి నారాయణ మొదలెట్టాడు-“ఇంకా, నిన్ను చేసుకోవటం కూడా పూర్తిగా వొప్పుకోలేక పోతున్నాడు బాపు. ఇంకోసారి చూద్దాంలే.. ఈ సారికి తీయించేసుకో.. అమ్మ మా డాక్టరమ్మ తానికి తీసకెల్తది” – అన్నాడు. అదీ అయింది, ఆ పల్లెటూరు పెంకుటింటి ఆస్పత్రిలో, మళ్ళీ గర్భం ఖాళీ అయింది. ఎందుకింత కష్టం అయింది .. ఇది ఎన్నో అబార్షన్ ? అడిగింది .. పెళ్ళికి ముందు చేయించుకున్న రెండు అబార్షన్లు తలచుకుంటూ .. పైకి ‘ఒకటి ‘ అని చెప్పింది అమృత, తిట్టుకుంటున్న డాక్టర్ కి.

“ఈసారి త్వరగా గర్భం వస్తే కష్టం. ప్లాన్ చేసుకోవాలి గానీ ఇదేంటి? చదువుకున్నానన్నావు మళ్ళీ .. లూప్ పెడుతున్నా ప్రస్తుతానికి” చెప్పింది డాక్టర్. నిశ్శబ్దంగా తలాడించింది అమృత. ధ్వంసమైన మనసుతో, నెలల తరబడి రక్తస్రావంతో అమృత అదో మాదిరి మనిషి అయింది. చుట్టూ నిశ్శబ్దంగా ఉండేది అమృతకి,  మధ్యలో పసిపిల్ల ఏడ్పులు తప్ప ఏదీ వినబడని నిశ్శబ్దం.

యూనివర్సిటీ హాస్టల్ లో రాణి గుర్తొచ్చింది అమృతకి, రాణికి వాళ్ళ మావయ్యతో పెళ్లి అయింది , చదువు కోసమని వెల్ఫేర్ హాస్టల్ లో ఉంచారు. వాళ్ళ మావ వ్యవసాయం .. రాణి కనబడ్డ పుస్తకమల్లా చదివేది, ఏదో ఉద్యమాల్లో తిరిగేది … “ మొగుడంటే రాత్రికి ఆకలిగా చుట్టుకొనే చేతులు … వంట సరిగ్గా లేదని తిట్లూ ..పిల్లల పెంపకమూ కాదు.. స్నేహానికి పొడిగింపు పెళ్లి .. స్నేహం కూడా మీ హక్కు …ఎదగండి .. అడగండి ..” ఇలా ఏవేవో చెప్పేది .. పొద్దుటి నుండీ పనిచేసి అలసి పడుకున్న అమృతకి… , బరువైన కోరిక చేతల వల్ల వచ్చే మెలకువ రాణి ని ఎందుకు గుర్తుకు తెస్తుందో అర్ధం కాదు.

వడ్లు ఏరుతూ ఎక్కడికి వెళ్ళిపోయాను అని నవ్వుకుంటుంటే .. “ ఏం పిల్ల.. గట్ల నవ్వతావేంటి ..మీ అత్త లేదా ?” – అత్త పార్వతి ఫ్రెండ్ , పోచమ్మ .. వచ్చి చతికిల బడుతూ అరుగు మీద. పొద్దున్న నారాయణ తండ్రి మీటింగ్ పెడితే.. మధ్యాహ్నం అతను నిద్ర పొతున్నపుడు ఆ వంతు అత్త పార్వతి ది. అప్పుడు మరో ఇద్దరు ఆడవాళ్ళు నెమ్మదిగా అరుగు మీదకి చేరుతారు, పప్పులు చెరుగుతూనే, వడ్లు ఏరుతూనో అందర్నీ చెరిగి పడేస్తారు. అత్త పార్వతి ఎన్ని మాటలు ఆడినా మంచి మేనేజర్. ఆ మీటింగ్ అయ్యేలోగా, ఏ చింతపండు వలిపించటమో, పప్పులు బాగు చేయించటమో చేయించేస్తుంది. వాళ్ళు రాగానే మళ్ళీ అమృత అక్కడ ఉండటానికి వీలు లేదు, మొక్కలు ఎండిపోతున్నాయి అంటుంది, మరేదో పని చెప్పి పెరట్లోకి పంపుతుంది . సరిగ్గా అదే టైంకి పనమ్మాయి రమణ వస్తుంది . అమృతకి ఒక స్నేహితురాలు దొరికినట్టే, ఇద్దరూ కలిసి పని చేస్తారు. మధ్యలో అమృత వేరే వంట గదిలో టీ పెట్టి ఇస్తుంది. ‘పాలేళ్ళ కోసం ఉన్న వంట షెడ్ లో కూడా గ్యాస్ ఉంది కదా.. పూజగది ఉన్న వంటిల్లు లోకి వెళ్ళద్దు’- నేను లేనప్పుడు అని పార్వతి చెప్పినప్పటి నుండీ , అమృత వంటింట్లోకి వెళ్ళటం మానేసింది. అమృత కడిగి ఇచ్చిన గిన్నెలు మళ్ళా పార్వతి కడుక్కుంటుంది. ఇంట్లో మగాళ్ళు, చుట్టాలు ఉంటే , ఆ కడుక్కోవటం, సణుక్కోవటం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. ఎలా కులం , ఆచారం అన్నీ మంట గలిసాయో మధ్య మధ్యలో చెప్తూ ఉంటుంది. ఆమె కాబట్టి కడుక్కొని ఎంత శుభ్రంగా ఉంటోందో చెప్తుంది … “ మరి నాతో కాపురం చేస్తున్న, నీ కొడుకుని ఏం పెట్టి కడుగుతావ్? ?” అనే ప్రశ్న ఎప్పుడూ అమృత కళ్ళల్లో, పెదాల వెనుక నిలిచిపోతుంది.

‘ అముర్తా .. ఓ అముర్తా టీ నీల్లు పెట్టేటిది లేదా ?- పార్వతి గదమాయించింది.

‘పోతున్నా అత్తమ్మా ..’

గుమ్మం దాటిందో లేదో , పోచమ్మ అడుగుతోంది –“ గిట్ల అమూర్త అచ్చి, దినాము పది నెలలయుండ్లా.. ఇగ నీల్లాడేది గెప్పుడు మల్ల ..?’

వెంటనే అందుకుంది పార్వతి – ‘ ఆ… సదూకున్నోల్లు .. ఏం పడ్తరో .. జెప్తరా మల్ల.. .కుక్క మూతి పిందెలూ .. కులం తక్వ పిల్లలూ అని ..”

అబార్షన్ బాధ తట్టుకోలేక అమృత అరుపుల్లా మూలుగుతుంటే, తలుపు చేర వేసి, నర్సుతో కబుర్లాడుతున్న పార్వతి మొహం అమృత కళ్ళముందు కదలాడుతోంది. ఆరోజు కూడా ఆలస్యంగా వచ్చి, ఎప్పుడూ ఏడుపుగొట్టు మొహమే… నా పేరు ఈ సారి ఎలక్షన్ లిస్టులలో ముందుంది .. బాపు చాలా సంతోషించిండు’- అని చెప్తున్న నారాయణ మొహం కూడా కొత్తగా కళ్ళముందే ఉంది. టీనీళ్ళ తో పాటు అమృత మనసు ఉడుకుతోంది. బయట వాతావరణం అమృత మనసులాగే …. ఉడకపోతగా గాలి స్థంబించినట్టుగా ఉంది.

***

అదో గాలి లేని నెమ్మది సాయంత్రం. ఎండ సాయంత్రం లోకి మారకుండా పెళ పెళ లాడుతోంది ఇంకా. పొద్దున్న బట్టల పని మిగిలిపోయింది అంటే, రమణ రాగానే .. నేను సాయం చేస్తానమ్మా అన్నది. అమృత, రమణ కలిపి బట్టలు గుంజి ఆరేస్తున్నారు. రమణ ఒక న్యూస్ పేపర్ లాంటిది అమృతకి. విన్నా, వినకపోయినా అన్ని వూళ్ళో విషయాలన్నీ చెప్తూనే ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారో, ముఖ్యంగా పల్లెటూళ్ళ పుకారు అంతా దానికి తెలిసినట్టుగా ఎవరికీ తెలీదు. ‘మా బావ చెప్తడమ్మా .. ‘ అని నవ్వేస్తుంది. పెళ్లి చేసుకొని ఈ ఊర్ల కొచ్చి పడిన .. నీ లెక్క .. అని మళ్ళీ నవ్వుతుంది. తల్లీ తండ్రీ రోజువారీ కూలి పనుల్లో, ఊరూరా తిరిగేవాళ్ళు.. అన్ని ఊర్లూ, యాసలూ నావే అంటుంది. అంత చదువుకొని, ఉద్యోగం చేయకుండా నిశ్శబ్దంగా , స్నేహంగా ఉండే అమృత అంటే దానికి చాలా ఇష్టం. చాలా సార్లు అడిగేస్తుంది కూడా.. ఏదో నౌకరీకి పోవచ్చుగా ..ఇంట్లోనే ఉన్నావే అని , నా ఉద్యోగం గురించి నువ్వు తప్ప ఇంకెవరూ అడగటం లేదు … అని అమృత మనసులోనే నిట్టూరుస్తుంది.

బట్టలు ఆరేస్తూ, ఇద్దరూ కలిపి బట్టలు పిండుతూ, అమృత ఆలోచిస్తోంది. ఈ ఇంటికి వచ్చి రెండేళ్ళు అయింది. గత ఆరునెలలుగా నారాయణని చూడటం, అంటే ఒక ఫ్లాష్ లా తప్ప మాట్లాడింది లేదు. వడ్డిస్తే, ఫోన్లు మాట్లాడుతూ తినటం, తర్వాత అలసి నిద్ర పోవటం . ఎలెక్షన్లు దగ్గర పడ్డాయి. నర్సిమ్మ కోల్పోయిన పంచాయితీ గిరి నారాయణ ద్వారా మళ్ళీ తిరిగి వస్తుందని ఇంట్లో అమృత తప్ప అందరూ ఆశ పడుతున్నారు. ఇంటికి వచ్చే చుట్టాలతో సహా. అమృతకి శారీరక గాయాలు తగ్గాయి … భర్త కి అవసరం లేని శరీరం, మనసుకి బరువుగా తోస్తోంది. ఇంట్లో అమృత అనే మనిషి ఉందని అందరూ మర్చిపోయి చాలాకాలం అయింది, కొంచం శుభ్రంగా ఉండే పనిమనిషి, అంతే … నారాయణ కి కోపం, విసుగు ఎక్కువయ్యాయి. పార్టీ కార్యాలయం పెట్టాడు. ఇంటికి ఇంకా రావటం మానేసాడు. అక్కడ ఆడా, మగా అందరూ రాత్రంతా ఉంటారట అమ్మా .. రమణ న్యూస్.

అమృతకి ఏదీ ఇష్టంగా అనిపించటం లేదు .. కడుపు లేని వేవిళ్ళు , పచ్చిదనం అంటే ఇవే .. అమృతకి దుఖం ఎక్కువై నవ్వు వస్తోంది. అమృత గొంతు వినబడిందంటే రమణ వచ్చిందన్నమాటే . గత సంవత్సరంగా ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు, అందరూ ఎలక్షన్ల గురించే మాట్లాడుకుంటున్నారు. వోట్లు, జన సమీకరణ, ఎవరు ఏ ఎత్తులు వేస్తే ఎలా చిత్తు చేయాలో .. గొప్పలు వినీ వినీ చెవుల్లో హోరు మొదలైంది అమృతకి . అలానే ఏదో వింటోంది రమణ మాట్లాడుతుంటే..
హటాత్తుగా , పెరట్లోకి వచ్చాడు నారాయణ. వెనుక ఇంకెవరో ఒకబ్బాయి ఉన్నాడు. పార్టీ ఆఫీసులో ఏదో చేయించాలి , పెరట్లో ఉన్న పెద్ద కర్రలు పట్టుకుపో, అంటూ వచ్చాడు. సరిగ్గా అప్పుడే బట్టలు గుంజిన నీళ్ళు అతనిపై పడ్డాయి.

“ ఏమే వచ్చేటిది తెలీదా .. మాల లంజా .. గద్దిస్తూ అన్నాడు నారాయణ , రమణని .

‘”లేదయ్యా , పొరపాటైంది ..!” సంజాయిషీగా అంది రమణ.

అమృత ఉండబట్టలేకపోయింది- “అలా అంటావేంటి ? మధ్యలో కులం ప్రసక్తి దేనికి ? నీతో ఏదీ పొరపాటు అవదా..?” – నెమ్మదిగా చెప్తున్నాను అనుకుంటూనే అరిచింది .. !

ఆగాడు నారాయణ –“ మధ్యన నీకెందుకు .. నీ కులం మనిషనా..?” ఆ మాటలో వ్యంగ్యం తగలరాని చోట దెబ్బలా తగిలింది అమృతకి.

అర్ధం కాలేదు అమృతకి- ‘అదేంటి? ఆమె, నేనూ ఒకటేనా .. ?’ – ఊరుకోవాలి అనిపించలేదు ఆమెకి.

మళ్ళీ మెత్తటి వ్యంగ్యపు నవ్వు ఒకటి విసిరాడు నారాయణ- “ కాదు, మీరిద్దరూ ఒకటి కాదు… అది కులంలో పుట్టి, అందులోనే పెళ్ళాడి , అందులోనే చస్తాది… దానివల్ల నాకో నాలుగు వోట్లు అయినా వస్తాయి.. నీ వల్ల ఏంటి లాభం .. నాలుగు పోయిన కడుపులు … మాలదాని మొగుడనే బిరుదూనా ..??” – నారాయణ ఎప్పుడు వెళ్ళాడో తెలీదు .

ఒక్కసారి గాలి స్థంబించింది అమృతకి. అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుంది. రమణ కళ్ళల్లోకి చూడాలని అనిపించలేదు. ఒక్కసారి దాహం వేసింది… ఎక్కిళ్ళు.. రమణ గ్లాసుతో నీళ్ళు తెచ్చింది. తల తిరుగుతున్నట్టుగా ఉంది అమ్రుతకి . త్వర త్వరగా మిగతా బట్టలు ఆరేస్తోంది రమణ.

నెమ్మదిగా అంది అమృత తో – ‘ఏంటో కులం కులం అంటారు గానీ… నా వరకూ రానే లేదమ్మా.. అవసరం అయినప్పుడు తప్ప నన్నెవరూ అంటుకోలేదు. వయసు పిలిచినప్పుడు తప్ప మావోడు కూడా ముట్టుకోలేదు. కులం లేకుండా కౌగలించుకోవటానికి పిల్లలు లేరు ఇంకా. అందుకే కులం నన్ను తాకలేదు కాబోసు..!”

గజిబిజి గాలి క్రమబద్ధం అయినట్టు.. నీళ్ళల్లో ఉక్కిరి బిక్కిరి అయిన ముఖం బయటకి పెట్టి ఊపిరి పీల్చినట్టు అనిపించింది అమృతకి. ఇక్కడ గాలి కులం కంపు కొడుతోంది. ఏ వాడ గాలి ఆ వాడ లోనే తిరగాలి కదా ..!

***

మరో ఆహ్లాదకరమైన సాయంత్రం. గేటు తీసుకొని వస్తున్న అమృతని అసహనంగా, కోపంగా చూసాడు నారాయాణ. అతని చుట్టూ ముగ్గురు ఉన్నారు, పార్టీ కుర్రాళ్ళు . “ ఎక్కడికి పోయావు? వారం రోజులుగా.. అసలే దగ్గరలో ఎలెక్షన్లు.. నీకసలు బుద్ధుందా .. ……” ఇంకేదో అనబోయి, చుట్టూ ఉన్నవాళ్ళని చూసి తమాయించుకున్నాడు.

“లోపలికి రా.. నీతో మాట్లాడాలి .. “ అమృత గొంతు లో ఉన్న ఏదో స్వరం అతన్ని ఆమె వెంట వెళ్ళేలా చేసింది .
లోపలికొస్తున్న ఇద్దర్నీ చూసి పార్వతీ, పడక్కుర్చీ లో నిద్ర పోతున్న నర్సిమ్మ ఒక్కసారి సర్దుకున్నట్టుగా అయారు. అమృత , నారాయణని లోనికి రానిచ్చి తలుపు వేయగానే గదిలో గాలి కూడా అలానే సర్దుకుంది. అమృతకి ఆ ఇంటికి వచ్చిన మొదటి రోజు గుర్తుకు వచ్చింది.

అమృత , నర్సిమ్మ పడక్కుర్చీ కి ఎదురుగా ఒక కుర్చీ లాక్కొని కూర్చుంది. పార్వతి చేయి అప్రయత్నంగా ఆమె నోటి మీదకి వెళ్ళింది. నారాయణకి భలే కోపం వచ్చింది – “ఏంటీ డ్రామా .. అసలే అక్కడ .. ఎలక్షన్ల లెక్కలు మారుతున్నాయని మేము తలగొట్టక చస్తుంటే.. ??’ అన్నాడు.

అమృత, తన చేతిలో కాగితాలు నారాయణకి ఇచ్చింది. ‘ఏంటి ఇవి ?”- అన్నాడు అసహనంగా .. !

అమృత నెమ్మదిగా చెప్పింది – అవి రెండు కవర్లు. ఒకటి సిటీ లో డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ , నేను తల్లిని అవటం కష్టం, పెళ్ళికి ముందు, తర్వాత నువ్వు చేయించిన అబార్షన్ల వల్ల నాకు ట్యూబ్స్ బ్లాకేజ్ ఉందని, తల్లిని కావటం ఇంచుమించు అసంభవం అని చెప్పిన రిపోర్ట్ . నేను నా ఫ్రెండ్ రాణి దగ్గర ఉండి, అన్ని టెస్ట్ లూ చేయించుకున్నాను ..!!

ఒక్క నిమిషం ఆగి – మళ్ళీ చెప్తోంది అమృత, ఆగి ఆగి వీచే గాలిలా .. మంద్రంగా ..

ఇక.. నీకు చాలా అవసరమైన రెండో కవరు, అమృత నారాయణ గౌడ్ అనబడే నన్ను ఈ పంచాయితీకి మీ పార్టీ తరపున అభ్యర్ధిగా నిలబెడుతూ ఇచ్చిన నామినేషన్ ఫారం. మిగతా ఫార్మాలిటీలు అన్నీ నేను పార్టీ ఆఫీసులో పూర్తి చేసాను. గడువులోగా సబ్మిట్ చేసేయండి. లేకపోతే మన కుటుంబం పరువు .. ఇజ్జత్ .. నర్సిమ్మ వైపు చూస్తూ నవ్వింది అమృత.

కూర్చున్న కుర్చీనే దబాయిస్తున్నట్టు కొట్టాడు నర్సిమ్మ. నీరసంగా ఉన్నా రాజుకుంటోంది స్వరం, ” ఏమే ..నువ్వు చెప్పబట్టంగనే టికెట్ ఈనికి గదేమన్నా నీ మామగారిల్లు అనుకొంటివా .. తక్వ బుద్దులసంటివే ..!” హూంకరించాడు
నిశ్శబ్దపు గాలి ఎందుకో అసహనంగా కదిలింది నలుగురి మధ్య . ఫోన్ రింగ్ అయింది , చిరాగ్గా చూసేడు నారాయణ .. ఫోన్ లో చేసేదెవరో వినగానే ఎలక్షన్ లో చేసే నమస్కారం లాంటి గౌరవం అలముకుంది ..!

” బాపూ .. పార్టీ ప్రెసిడెంట్ రాజన్న గారు ..! ” చెప్పాడు తండ్రితో ..

” గదేదో ..స్పీకర్ అంటివి కదా ఫోన్ల ..గది నొక్కరా .. ఈమె గారి రుబాబు ఏందో తెలుస్తాంది.. మూడు తరాల బట్టి పార్టీనే నమ్ముకొని ఉన్నం. మనకి కబురీయకుండా మార్చేనికి గదేమన్న వాని ఉంచుకున్న లంజనా ..?” – హూంకరించాడు నర్సిమ్మ వణికే చేతులతో నారాయణ స్పీకర్ ఆన్ చేసాడు.

“నారాయణా.. ఇది నీ తెలివి అయి ఉండదు ..భలే నచ్చారోయ్.. ఎలా అయినా మీ నాన్న మాస్టర్ కదా ..వూరికి .. అమ్మాయి వచ్చింది , అన్నీ చెప్పింది , అసలే లేడీ రిజర్వేషన్ లో అవుతుందేమో అని ఆలోచిస్తా తల బద్దలు కొట్టుకుంటా ఉంటె, ఒక దళిత మహిళకి టికెట్ ఇచ్చిన మొదటి పార్టీ మనదే అవుతుంది అక్కడ .. మనకి విన్ గారంటీ .. అన్నీ రెడీ చేస్తున్నాం , పంపిస్తాం .. మా అమృతమ్మ జాగ్రత్త .. నాన్నని అడిగానని చెప్పు.. కోడలి ద్వారా మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు ..ఇంకా అంతా నీదే , నీ పెళ్ళాం ప్రెసిడెంట్ అయితే చక్రం తిప్పేది నువ్వే కదయ్యా ..భలే చేసుకున్నావ్ పెళ్లి .. నచ్చావోయ్..పైకొస్తావు “- నారాయణని మాట్లాడనియ్యకుండా రాజన్న మాట్లాడిన మాటలతో, హోరు గాలి వచ్చి వెలసినట్టు అయింది వాతావరణం.

అప్పటికే  పార్వతి, నర్సిమ్మ నిలబడి ఉన్నారు .. నారాయణ బ్లాంక్ అయ్యాడు. ‘ నువ్వు ..ఇదేంటి ..ఇదెలా.. ?’
ఒకనాటి సాయంత్రపు మెత్తటి వ్యంగ్యం గుర్తొచ్చింది అమృత కి .. “ నాలుగు వోట్లు రావు అని చెప్పావు కదా .. నా కులం తో.. ఇప్పుడు అదే కులం , నీ కుటుంబం అడ్డు పెట్టుకొని ఈ పంచాయితీ నాలుగు వేల వోట్లు సంపాదించుకో .. ఇదే మాట చెప్పి, నా కులపోళ్ళ నీ కులపోళ్ళ వోట్ల బాధ్యత నీదే .. పార్టీ ఆఫీసు లో అదే చెప్పాను .. ఆ ఇంటి కోడల్ని .. సాధించుకునే కులంలో పుట్టినదాన్ని… నాకు టికెట్ ఇవ్వండి అని.. మా ఫ్రెండ్ రాణి కూడా అదే చెప్పింది .. చదువుకున్న అమ్మాయిలు, తక్కువ కులాల్లో లేరని అన్నారు కదా .. చూపిస్తున్నా .. మీ లెక్కలకు సరిపోయే అమ్మాయిని .. టికెట్ ఇవ్వండి అని .. నీ ఇంటి పేరు మీద, నా కులం లెక్క మీద ఇచ్చారు టికెట్ .. పండుగ చేసుకో .. ఇక అన్ని వోట్లు నీవే .. పదవి మాత్రం నాదే …” అమృత నెమ్మదిగా ఖచ్చితంగా చెప్పింది .. !

పార్వతి ఏదో మాట్లాడబోయి .. అమృత చూపు చూసి మానుకుంది.

అమృత చెప్తోంది.. తనకు తను చెప్పుకుంటున్నట్టుగా …” నాదీ అనే ఇల్లు, కుటుంబం కోసం నేను చాలా భరించాను నారాయణా.. పిల్లలంటే నాకు చాలా ఇష్టం.. నాకు లేని బాల్యాన్నీ…ఇంటినీ..కుటుంబాన్నీ ..వాళ్లకి ఇద్దామనుకున్నాను.. నువ్వు చెప్పినప్పుడల్లా మరో మాట మాట్లాడకుండా .. గర్భం ఖాళీ చేసుకున్నాను .. ఎందుకు అంటే .. నువ్వు తప్ప నాకు వేరే ఏదీ తెలియలేదు,వేరే ఇల్లు అంటే ఎక్కడికి వెళ్తాను అని భయపడేదాన్ని.. నువ్వు గుర్తు చేసేదాకా నా కులం , దాని ప్రాధాన్యం నాకు తెలియలేదు.. విచిత్రం ఏమిటంటే .. నీ ఇంట్లో నా కులం నప్పదు.. కానీ.. నాతో కాపురం చేయచ్చు.. తక్కువ జాతి పిల్లని, అనాధని పెళ్లి చేసుకున్నాననే ఉదారత ఫ్రీ గా దొరుకుతుంటే .. మొత్తం కుటుంబం అది ఆనందంగా మోస్తున్నట్టు అనుభవిస్తారు… ఇప్పడు నా వల్లే వచ్చిన ఈ పంచాయితీ గిరి కూడా అనుభవించు .. ! “

‘ అలా అని .. నేనేదో సాదిస్తున్నాను అనుకోకు.. నా గర్భం కాలటం.. ఏదో గుడిసెలు కాలిన సంఘటనా కాదు.. డబ్బులిచ్చి వదిలించుకోవటానికి .. నా నష్టానికి పరిహారం ఎలానూ ఇవ్వలేవు .. కానీ..నన్ను నేను బలపరచుకోవాలి అని నాకు అర్ధం అయింది. ఇక్కడ గాలి కూడా కులం కంపు కొడుతోంది. ఇవే వాడల్లో సందుల్లో తిరిగి తిరిగి అలా అన్ని వాడల మీదుగా తిరిగి రానీ. తరతరాల కంపు కొంచం తగ్గనీ. ఈ కుల పిచ్చి , భయం తగ్గాలంటే .. తక్కువ కులాల మహిళలకి సీట్లూ.. మీలాంటి ఎక్కువ కులాల పురుషులకి వోట్లు రాబట్టే పని అప్పచేప్తే ఎలా ఉంటుంది ..??” పెద్ద పెట్టున నవ్వింది అమృత.

అలా వెళ్లి దేవుడి వంటింట్లోని ఫ్రిజ్ లో మంచి నీళ్ళు తాగింది.

‘నీ కొడుకుతో కాపరానికీ, ఇంటెడు చాకిరీకి.. నీ గొప్పలు వినటానికీ పనికొచ్చిన ఈ మాలపిల్ల, మనవల్ని ఇవ్వటానికి పనికిరాలేదా అత్తమ్మా ..??”

అని తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. గదిలో మిగిలిన ముగ్గురి మొహాలపై గాలి నాట్యం చేస్తోంది.. !

ఇంటి బయట కొత్తగా వేసిన తాటాకు పందిరి మీద సరిగ్గా ఇంకా కుదరని తాటాకులు రెప రెప లాడుడుతున్నాయి. అప్పటిదాకా ఉగ్గబట్టిన గాలి వీచటంవల్ల  కాబోసు బహుశా ..!

**** (*) ****