కొత్త పుస్తకం కబుర్లు

తాత్వికాన్వేషణ దిశగా సాగిన “అసంపూర్ణ” కవిత్వం

మార్చి 2015

జీవితంపట్ల, సమాజంపట్ల ఒక విశ్వాసం,నమ్మకం ఉన్న కవి జీవితానుభవం సంతరించుకునే కొద్దీ ప్రాణభూతమైన లక్షణంగా జీవద్భాషను ఉపయోగిస్తూ తనవే ఐన గాఢ తాత్వికభావాల్ని వెల్లడిస్తూపోతూంటాడు. కవిత్వ రహస్యాన్ని పట్టుకుని పాఠకుల హృదయాల్లోకి జొరబడుతూంటాడు. తాత్విక పునాదిని భద్రపరచుకుంటూ, సామాజిక స్పృహతో, ఆత్మస్పృహతో, సాహిత్య స్పృహను కట్టుదిట్టం చేసుకుంటూ, కవిత్వంలో ప్రజ్ఞత, రసజ్ఞత, విజ్ఞతను ముప్పిరిగొల్పే విధంగా పెనవేసుకుంటూ, కవిత్వమై ప్రవహిస్తున్న కవి రామా చంద్రమౌళి. ఈయన ఇటీవల వెలువరించిన కవితాసంపుటి “అసంపూర్ణ” చదివినప్పుడు పైవిషయాలన్నీ కనిపిస్తాయి. కవి ఆశించిన విలువలపట్ల పాఠకలోకంలో ఏ ‘ఇజం’ ప్రత్యేకించి కనబడదు. అభ్యుదయ దృక్పథంతో మానవత్వాన్ని ఊతంగా చేసుకుని గమ్యం వైపుకు సాగిపోతున్న కలం వీరిది. కవిత్వం ఒక సామాజిక చర్యగా భావిస్తూ ఒక సాంస్కృతిక సైనికునిగా సాగుపోతున్నవారు రామా చంద్రమౌళి గారు.

లోకానుభవాల్ని, ఆవేశాల్ని వడగట్టుకున్న కవిగా ” తెలిసో తెలియకో ప్రతిదాన్నీ పూర్ణమే అని భావిస్తూ అడుగులు వేస్తూ వేస్తూ ఒక అసంపూర్ణాన్ని దోసిట్లో పొంది, వెలుగుతోపాటు కొంత చీకటినికూడా గ్రహిస్తూ, ఏదీ ‘పూర్ణం’కాదని తెలుసుకున్న ఒక అసంపూర్ణ దశలో ఈ కావ్యమిప్పుడు” అంటారు తన ప్రవేశికలో. తానేమిటో సమాజమేమిటో లోనా బయటా అనుభవాల చీకటి వెలుగుల తండ్లాటను తన కవిత్వంలో గుప్పిస్తాడు. వాస్తవికతను పరిశీలిస్తాడు.

“అసంపూర్ణ” కవితా సంపుటిలో మొత్తం 46 కవితలున్నాయి.  మొదటి కవిత “వాళ్ళిద్దరు”. చివరి కవిత “మరమేకు మెల్లమెల్లగా దిగుతూ”. “వాళ్ళిద్దరు” కవిత అనుభవాలు వడగట్టుకున్న ఇద్దరు దంపతులను గూర్చి రాసిన కవిత. పారదర్శకత గురించి అర్థంకాని భిన్న అభిన్నత.  ”అలసిపోయాంగదా మనం..ఇంకెంత దూరమో.?..అందామె/గమ్యం తెలుస్తేగదా..దూరం తెలియడానికి?” అని అతని జవాబు.

“ఎప్పటికైనా పిల్లలు తిరిగొస్తారంటావా?..అన్నాడతడు దీనంగా
మనం మన తల్లిదండ్రుల దగ్గరకు పోలేదుకదా?అందామె అభావంగా
ఎందుకో అతని కళ్ళనిండా..నీళ్ళు చిమ్మాయి
నడుస్తూనే ఉన్నారిద్దరూ..అతనూ ఆమే ..ప్రక్క ప్రక్కనే?-చీకటిపడ్తోంది-”.  వయసు ఉడుగుతున్నప్పటి దంపతుల సంక్షుభిత అనుభవాన్ని ఎంతో లోతుగా చెప్పాడు కవి..బహుశా అది కవి దంపతుల స్వీయానుభంకూడా ఐ ఉండొచ్చేమో అన్నంత సహజంగా.

“విడిచిపెట్టబడ్డప్పుడు” అనే కవితలో ” మనిషికూడా ఔట్ డేట్ ఔతూ చివరికి విడిచిపెట్టబడ్తాడా/అంతిమంగా మిగిలే జాడలు..అవశేషాలు..శిథిల నిసర్గాలు” ఏ విధంగా నూతనత్వాన్ని సంతరించుకోలేని మనిషిని కాలంతో కలిసి నడవలేనివానిని ఏ విధంగా నెట్టివేయబడ్తాడో చెప్తాడు కవి.
అట్లే మనిషి
“దిగమింగుకోవాలి తుఫాన్లను
చిరిగిపోయిన చత్రీని,తెగిపోయిన చెప్పును
ఖాళీ పశువుల కొట్టాన్ని
ఎండిపోతున్న పొలాన్ని
ఎండాకాలపు మధ్యాహ్నం రేగుతున్న దుమ్ముతో కాలిబాటను
ఎండి రాలిన ఆకులతో నిండిన…శిథిల దేవాలయాల్ని చూస్తున్నప్పుడల్లా
నానుండి నేనే వెళ్ళిపోతున్నట్టు
నన్ను నేనే పోగొట్టుకుంటున్నట్టు” ఏదో అర్థంకాని దుఃఖపు లోతుల్లో కరిగిపోతున్న అనుభవాన్ని వ్యక్తీకరిస్తాడు కవి.చివరికి దేన్నైనా ఎవరినైనా విడిచిపెట్టవలసిందేనా? అనే ఒక జ్వలిత సత్యాన్ని వెల్లడిస్తాడు.

“మనిషికి అటువైపు” అనే కవితలో మనిషిలోనికెళ్ళి పరిశీలించుకొన్నపుడు కలిగే అనుభవాన్ని వ్యక్తీకరిస్తూ
“చాలాసార్లు మనింట్లోనే మనం అపరిచితులం కావడం
మనకు మనమే పరిచయం లేకపోవడం
తెలుస్తుంది మనకు
ఆత్మలోకి చూస్తున్నపుడు
లోపల సారంగి తీగలపై ఒక విషాదస్వరం వినబడి
దిగంతాల అవతలికి తరుముతుంది
చుట్టూ దట్టంగా పొగమంచు..దారి కనబడదు” మనిషి మనిషికి అర్థంకాని తీరును చివరికి తనకు తానే అర్థంకాని వైనాన్ని ఎత్తిచూపుతాడు కవి.

2

సాధారణ మనిషిగానీ, మేధావి గానీ తెలుసుకోవాల్సిన అంశం”మనిషికి దేన్నైనా/ఎప్పుడు ప్రారంభించాలో తెలియాలి/అంతకంటే ముఖ్యం/దేన్నైనా ఎప్పుడు ముగించాలో తెలియాలి”అంటాడు ఒకచోట.ఇది ప్రధానమైన అంశం. ఇది తెలుసుకోవాల్సిన జీవితానుభవం.”అస్తమించని సూర్యుడు ఉదయించలేడు”అనే సత్యాన్ని ఎరుగడమంటే ఓటమి గెలుపుకు మార్గదర్శకమని చెప్పడమే!

మనిషంటే మానవ పరిమళమని చెప్తాడీయన . కన్న కలలను కలిపి కుట్టుకోమంటాడు.తనను తాను అర్పించుకోవడం,త్యాగించడం,రహించడంలోనే జీవనసారం ఉందంటాడు కవి.

“ఎవరైనా చేసేది వెదకడమే
రోడ్లను,మనుషులను,కాలపు పొరల లోతులను
ఒంటరిగా వెళ్ళడం
సమూహాలతో తిరిగి తిరిగి
మళ్ళీ ఒంటరిగానే తిరిగిరావడం
కొన్ని కూడికలు కొన్ని తీసివేతలు” అలాగే ఉంటాయంటాడు.

అక్షరాలకు ఒక శక్తేకాదు,పరిమళమూ,జీవమూ,ప్రాణం కూడా ఉంటాయని తెలుసుకోవడమే ప్రపంచాన్ని చదవడం, చదివి సందర్భోచితంగా లొంగదీసుకోవడం చేయాలి అంటాడు.

భూమిమీద మనిషి ఆశపోతుతనాన్ని చెప్తూ
“పక్షులు ఒక్కో గింజను ఏరుకోవడం
సీతాకోకచిలుకలు ఒక్కో పువ్వు తర్వాత మరోపువ్వు దరిచేరడం
మనిషే ఏమిటో చేతులు యోజనాలకు యోజనాల దూరం చాస్తూ
“అంతా నాకే” అని,నిచ్చెనలపైనుండి పరమపద ప్రయాణం
చటుక్కున లోయల్లోకి జారుతూ
నేలపైకి తెగిన చుక్కవలె కూలుతూ”మనిషి ఏ విధంగా దిగజారిపోతున్నదీ వివరిస్తాడు.

నవనాగరికత ముసుగులో “సగం మందికంటే ఎక్కువమంది తమ సెల్ ఫోన్లలో సమాధియై ఉంటారు” అంటూ నికర జీవితాన్ని మొబైల్స్,టివీలు మింగేసే వైనాన్ని వివరిస్తాడు కవి.

కవిలో వొక తాత్విక చింతన పెళ్లుబికివస్తున్నపుడు జీవితానుభంలోంచి ఒక నగ్న సత్యమై వెలువడుతుంటూంది. “అంతిమంగా నివాసం అశాశ్వతం/అస్థిరం/ఖాళీ చేయడమే సత్యం,శాశ్వతం/ఖాళీ చేయడమంటే../మనిషి వెళ్ళిపోతూ మరో మనిషికి జీవితాన్నివ్వడమే”అంటాడు.తనదైన విజ్ఞానపు వెలుగులను తరువాత తరానికి అందించడమే మనిషి ధర్మం అనే భావనను కవి ఉద్ఘాటిస్తాడు.

“నీ వెంట ఉంటూనే ఎక్కడో యోజనాల దూరంలో నేను/ప్రక్కప్రక్కనే ఉంటాం/కాని కనబడం/వినబడం/కళ్ళనిండా ఘనీభవించిన కన్నీళ్ళు/చూపులున్నట్టా లేనట్టా?”.కన్నీటిని ఘనీభవించే స్థితికి తేకూడదు.కన్నీరు వస్తే వర్షించాలి..అప్పుడే కళ్ళు కనబడతాయి.కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి.

కవిగా,కథకునిగా,నాటకకర్తగా,నవలాకారునిగా ఎంతో అనుభవమున్న కవి రామా చంద్రమౌళి. కొంత మోడర్నిజాన్ని మరికొంత పోస్ట్ మోడర్నిజాన్ని కలగలిపి తాత్వికంగా కవిత్వం చెప్పడం ఈ కవి లక్షణం.ఈ కవిలో ఒక భావజలరాశి పొంగిపొర్లుతుంది.కవితను ఒకచోట కథగాను అల్లుకుపోతూంటాడు. ఒక గంభీరమైన భాషతో జీవన సత్యాలను వ్యక్తీకరిస్తూంటాడు.ఈయన కవితా సంపుటి “అసంపూర్ణ” సృజనాత్మకతకు తాత్వికతకు మార్గదర్శకంగా నిలుస్తూ పాఠకుల్లో చైతన్యాన్ని నింపుతుందని భావిస్తూ కవిని అబినందిస్తున్నాను.

*

అసంపూర్ణ (కవిత్వం) – రామా చంద్రమౌళి
ప్రతులకు:
నవోదయ బుక్ హౌజ్,ఆర్యసమాజ్ ఎదురు రోడ్డు,హైదరాబాద్
మరియు అన్ని విశాలాంధ్ర బ్రాంచీలు.
వెల: రూ.100

**** (*) ****