సంపాదకీయం

బాస్! కొత్తగా ఏమైనా ఉందా?

మార్చి 2015

“బాగా రాయడానికి బాగా చదవక్కర్లేదు. ఏమంటావ్?”
“రైటే కానీ. ఏం రాయక్కర్లేదో తెలుసుకోడానికి అల్రెడీ ఎవరేం రాశారో చదవాలేమో!”
“పాయింటే! ఇంకోటేంటంటే- చాలామంది చాలా సార్లు చెప్పేశారని తెలిసిన విషయం తప్ప, కొత్తగా చెప్పడానికేం లేకపోతే…”
“అహహ, కనీసం పాతదాన్నైనా కొత్తమాటల్లో, మరోవైపు నుండి చెప్పలేకపోతే..”
“…”
ష్.. ఎవర్రా అక్కడ?పాడిందే పాట.. షటప్ ఐ సే.

***

ఉదాహరణకి ఒక కథ ఇలా మొదలౌతుంది “చీకట్లని చీల్చుకుంటూ స్టేషన్లో రైలొచ్చి ఆగింది.” నిజానికి చాలా కథలు ఇలానే మొదలౌతాయి, అక్కడికీ రైళ్ళు చెయ్యవలసిన అసలు పని చీకట్లను చీల్చడమే అన్నట్టు. లేకపోతే “అలారం మోతకి అతను నిద్రలేచి ఖంగారుగా బ్రష్ నోట్లో పెట్టుకుని బాత్రూమ్ లోకి పరిగెట్టాడు.” ఇప్పటికి కొన్ని వందలమంది కథానాయకులు అలా మొదటి లైన్లోనే బాత్రూముల్లోకి నెట్టబడ్డారు పాపం.

కొన్ని పాత్రలుంటాయి “నిర్మలమైన మొహంలో స్వచ్చమైన నవ్వుతో” తప్ప మరోలా ఉండవు. బహుశా ఆ నవ్వుని రోజూ నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికి ఆరేస్తూ ఉండొచ్చు. కొన్ని ఇళ్ల చుట్టూనేమో అదేపనిగా నందివర్ధనం మొక్కలు, ఆ ఇంట్లో మనుషుల అందమైన మనసుల్ని సూచించే గున్నమావిడి కొమ్మలు, మల్లెపువ్వుల్లాంటి తెల్లని బట్టలు, భర్త షూ విప్పుతుంటే తరతరాలుగా పకోడి ప్లేట్, కాఫీ కప్పుతో పాటు రెండు ప్లేట్ల ఆప్యాయతని వడ్డించే భార్యలతో వెగటు పుట్టించే పంచదార పాకపు వర్ణనలు.

ఉదాహరణ ఎందుక్కానీ- చాలా కవితలుంటాయి. తరతరాలుగా రాలిన ఆకులు చిగర్చడం తప్ప పెద్ద పనేం ఉండదు చెట్లకి. ఏవో చిన్న ముళ్లున్న పాపానికి గులాబీ రేకల మెత్తదనం చుట్టూ గుచ్చుకుపోయే ఉపమానాల పదునుకి మొత్తం పుష్పజాతికే తమ పుట్టుక మీద విరక్తి పుట్టిందేమో. చందమామనీ, వెన్నెల్నీ ఎలానూ వేలకి వేలుగా జిరాక్స్ లు తీసీతీసీ అరిగిపోయిన సబ్బిళ్లతో అంట్లు తోమినట్టు తోమి అవతల పడేశాం. మరీ ముఖ్యంగా కవుల దాడికి దడుచుకుని సముద్రం ఎప్పుడో అలలన్నిటినీ చంపేసి పాతాళంలో పూడ్చి పెడుతుందేమో అని నాకో భావుకత్వపుటనుమానం (ఈ పాపభారంలో భాగంగా- మమ).

ఇక కొన్ని వ్యాసాలైతే- రిఫరెన్సు పుస్తకాల్లోని సంభారాలతో సమకూర్చుకున్న స్వయంపాకాలు. పుస్తకాల ముందుమాటల్లో రాసినట్టు పుస్తకంలోంచే జడపట్టి లాక్కొచ్చి గోడకుర్చీ వేయించిన కోటబుల్ కోట్స్. ఇంతకీ పోయినవాళ్ల గురించి మంచే చెప్పుకోడం మర్యాద కావచ్చు కానీ, పోయినవాళ్ళు నివాళి రాస్తున్నవాళ్లని మెచ్చుకున్న మంచిని మాత్రమే రాసుకోవడం ఏపాటి మర్యాదంటారు? ఆధార్ కార్డ్ అప్లికేషన్ లాగా అభ్యర్ధి పేరు తప్ప అన్ని విశేషణాలూ సేం టూ సేం ఉండే పుస్తక పరిచయాలు, విశ్లేషించడమంటే అదేపనిగా మెచ్చుకోడమే అనే విషయాన్ని పదేపదే రుజువు చేసే రివ్యూ లూ- వెరసి ప్రతిరోజూ ఎంతో సరుకు సాహిత్య మార్కెట్లోకి దిగుతున్నప్పటికీ..
..
ఊహూ.. ఇది కాదు. ఇంకేదో చదవాలనుంది. బాస్! కొత్తగా ఏమైనా ఉందా?

**** (*) ****