డైరీ

ఓ భావ సంచలన శకలం

ఏప్రిల్ 2015

“ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను”

“ఎందుకు?”

“ఎందుకు అంటే….”

“ఏదో different గా ప్రవర్తించాలన్న కోరిక, సమాజపు pattern నుండి విడివడాలన్న కాంక్ష. అందుకే వెళ్ళపోతానంటున్నావు”

“అవునా! ఏమో! కోరికలేమీ లేవు ప్రస్తుతానికి ఏదో రాసుకుంటూ మనసు వంక చూసుకుంటూ ఉందామనే కాని”

“దీనికి ఇప్పుడున్న దానికన్నా ఎంతో alertness కావాలి”

“తెలుసు, లేకపోతే నిర్వేదంలోకి జారిపోవడం తప్పదనీ తెలుసు.

“అయితే ఎందుకు వెళ్ళడం?”

“ఇక్కడ నిరంతరం మారుతున్న mood వల్లేమో వెళ్ళిపోవాలనుకోవడానికి కారణం. క్షణక్షణానికీ, రోజురోజుకీ మారే perceptions and reactionary thoughts. ఎంతో స్నేహితులు అనుకున్న భావన ఒక్క క్షణంలో మాయమవడం, కట్టుకున్న image లన్నీ కూలడం, చిన్న సంఘటన లేదా ఆలోచన వల్ల అంతస్తులు కట్టుకోవడం. ఒకరిది సూటి చూపు, ఇంకొకరిది మందబుద్ధి, వేరొకరిది శాస్త్రాసక్తి, మరికొంత మందికి ప్రకృతి శక్తులని వశపరుచుకోవాలన్న తపన, మరి కొంత మంది తమ భావజాలమే రైటన్న వాదన, ఒకడికి అమితమైన పట్టుదల, ఎక్కువ మందికి కాంత కనక కీర్తి కాంక్ష – వీటి వల్ల నాలో ఇంకా పెరిగిన విషయ వాంఛలు”

“నిజమే ఇవన్నీ ఈర్ష్యాసూయలనీ, భయాందోళనలనీ కలిగిస్తాయి. అయితే ఇక్కడ నుండి వెళితే ఇవన్నీ పోతాయనా?”

“పోతాయని కాదు ఎక్కడైనా ఉండేవే. కాకపోతే నెమ్మదిగా, ఒంటరిగా వేరే భారాలు లేకుండా నా వంక చూసుకుంటూ రాసుకోగలుగుతాననే వెళ్ళడం. అదే తృప్తి అని తెలుస్తోంది కనుక వెళ్ళడం. ఆలోచనల, జ్ఞాపకాలతో నిర్మించబడ్డ ‘నేను’(అహం) రాత వల్ల ఎంత ఎక్కువగా dilute అయిపోతే – ఇక మిగిలి ఉన్న ‘అసలు core’ బయట పడుతుంది. ప్రతి వాళ్ళకీ అందుబాటులో ఉన్నదిది. అయితే వాంఛలతో నడుస్తున్న – కాదు పరిగెత్తుతున్న మనిషిని ఆగమనో లేదా వెనక్కి చూడమనో అంటే వెర్రివాళ్ళుగా జమకడతారు. ఎవరి వృత్తిలో వారు మునిగి ఉండటం గొప్ప అంతే – ఆగి తమ వంక చూసుకోవడమే అవమానంగా భావిస్తారు. కోరికలు, పుణ్యాలు, శాస్త్రాలు, ఇజాలు వెనుక పరిగెత్తుతూనే ఉంటారు అందుబాటులో ఉన్నది చూసుకోకుండా… ప్చ్!”

“అవును! ‘మేమేమైనా పనీ పాటా లేని వాళ్ళమా?’ అని అంటున్నారు కూడా. రాత వల్ల ‘నేను’ dilute అవడం!! interesting, నీ అనుభవమా?”

“రాయడం మొదలు పెట్టిన దగ్గర నుండీ నాలో వచ్చిన మార్పు నేను గమనిస్తున్నాను. ఏమిటి ఆ స్థితికి అర్థం? కోపాన్నీ, ద్వేషాన్ని జయించాననా? కాదేమో! జయించాను అనే మాటకి అర్థం లేదని తెలుసు. ఆ సమయానికి అవి మాయమవుతాయి. అంతే. తర్వాత రేపు ఎల్లుండి వస్తాయా రావా అన్న ఆలోచన లేదు. అసలు నిజంగా పోవడం, పోకపోవడం అన్న మాటలకి అర్థం లేదేమో!! ఏ విషయానికైనా ‘ఉనికి లేదా రాహిత్యం ‘ మనం అనుకోవడం వల్లే… ఈ విషయం అనేక వేల సంవత్సరాలుగా చెప్పారు ఎందరో…. కాబట్టి రాసుకునే ఆ క్షణంలో లేవు అనేదే నిజం”

“మంచిది ఫ్రెండ్ వెళ్ళిరా, కాదు కాదు ‘వెళ్ళు’ – బెస్టాఫ్ లక్”

**** (*) ****