లాఫింగ్ 'గ్యాస్'

మారు (య ) పేర్లు!

ఏప్రిల్ 2015

నం కోరుకుని ఒకరి ఇంట్లో పుట్టలేదు. మనల్ని అడిగి మరీ కన్నవారు మనకీ సుబ్బారావు, సుబ్బలక్ష్మి అన్న పేర్లు పెట్టరు. ఏ దేవుడికో మొక్కుకున్న తరువాత పుట్టిన బిడ్డకు ఆ దేవుడి వరప్రసాదమని నమ్మి ఆ గాడ్ పేరు పెట్టుకుంటారు కొంతమంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడి పేరు మస్తానయ్య. ఏ పీర్ల పండుగ నాడో ఆ పైనున్న సాహెబ్ కి మొక్కుకుంటే పుట్టిన వరప్రసాదమని నమ్మి పాపం వాడికా పేరు పెట్టి ఉంటారు. అదొక ఆచారం. కొంత నయం. వరుసగా పిల్లలు పుట్టి పోతుంటే ఏదో శని చుట్టుకుందన్న భయంతో దాన్ని పోగొట్టుకోవటానికి బిడ్డను ఏ పెంటయ్యో, చింపిరమ్మో అనో పిలిచే ఆచారమూ చాలా కుటుంబాలలో వుంది. అలాంటి పేరున్న వాళ్ళను చూసి జాలి పడటం మినహా మనం చేయగలిగిందేముంది! చాలా మంది ఇళ్ళల్లో పిల్లలకి వెంకటేశ్వరరావు అనో ఆంజనేయులు అనో సాయిబాబా అనో తాము నమ్మిన దేవుడి పేరు పెట్టుకుంటుంటారు. ఇప్పుడంటే అనిల్ లు , అనూహ్యల్లాంటి పేర్లు విపరీతంగా పుట్టుకొచ్చాయి గానీ ఒక రెండు దశాబ్దాలుగాని వెనక్కి పోయి చూస్తే.. ఇంటికో వెంకటేశ్వరరావు! వీధికిద్దరు ముగ్గురు సుబ్బారావులు, ఊరికో వందమంది ధనలక్ష్ములు దర్శనమిచ్చేవారు. ఏ పెళ్ళో పేరంటమో జరిగే కళ్యాణమండపంలోకెళ్ళి ’ఒరేయ్ ..అప్పిగా !’ అని ఒక్క పొలికేక వేసినా చాలు ‘ఇదిగో వస్తున్నా!’ అంటో బదులిచ్చే జనం డజను మందికి తక్కువుండరంటే నమ్మి తీరాలి.

తాత పేరో, తండ్రి పేరో, అమ్మ పేరో, అమ్మమ్మ పేరో పెట్టుకోవటం అప్పట్లో ఓ సర్వసాధారణ కుటుంబ మర్యాద. ఆ పెద్లల పేరు వినసొంపుగా ఉంటే ఓ కే! అలా కాకపోతేనే పేచీ. నామకరణం నాడు బియ్యంపళ్ళెంలో పేరు రాసిన మరుక్షణం నుంచే చికాకులు మొదలు. ఒకసారి నమోదు అంటూ జరిగాక ఆ పుట్టించిన బ్రహ్మ కూడా సదరు పేరునేమీ చేయలేడు. బడిహాజరు పట్టీలోనూ, జనన మరణ శాఖ వారి రిజిస్టరులోనూ అదే పేరు నమోదు తప్పనిసరి గనక ఎంత అయిష్టమయినా పేరు దాచుకోవటం ఎంత పేరున్నపెద్దమనిషికైనా తలకు మించిన పనే. అదే మన పేరు ఏ పుల్లారావో, సన్యాసమ్మో అనుకోండి ..ఇక చెవులకు తాటాకులు కట్టాడమూ తప్పదు. ఇంటిపేరు క్కూడా ఏ ‘పిచ్చి’ అనో ‘శుద్ధ’ అనో జత కలిసిందా … ఇంక ఆ కష్టాలు చెప్పటం దేవుడి తరం కూడా కాదు. ‘నన్ను ఆ పేరుతో పిలవద్ద’ని ఎంత కొట్లాడినా ప్రయోజనం సున్నా. పాస్ పోర్ట్ నుంచి.. రేషన్ కార్డ్ దాకా ఏ గుర్తింపు పత్రంలోనైనా మన ఆరాధ్యదైవం ఏ చిరంజీవి పేరో తగిలించుకోవాలనున్నా చట్టబద్దంగా చెల్లదు. కన్నవారు పెట్టిన పేరు మార్చుకోటానకి ఉన్న ఒకే ఒక వెసులుబాటు న్యాయస్థానం గేటు తట్టడమే! చేతిచమురు వదలటం తప్ప అప్పుడయినా పేరు ముచ్చట పూర్తిగా తీరుతుందన్న నమ్మకం లేదు. ఈ తతంగమంతా ముందుకు సాగాలంటే ముందు మనకు మైనారిటీ తీరివుండాలి గదా ! ఆ సరికే మన పేరు నలుగురిలో తెగ నలిగిపోయుంటుందాయ! ఏ రాతకోతలకో తప్ప నిజంగా మనం మోజుపడ్డ పేరుతో మనల్ని పిలిపించు కోవాలన్న ముచ్చట మరి తీరే దారి ఏదీ దాదాపు లేనట్లే!

అలాగని అందరు తమ తల్లితండ్రులు పెట్టిన పేర్లతోనే పిలవబడుతున్నరా అంటే అదీ అనుమానమే. పేరు పెట్టిన కన్నవారూ మనల్ని ఆ పేరుతో పిలవని సందర్భాలు బోలెడన్ని. ఏ మహేష్ బాబో, శృతీ హాసననో అని ముచ్చట పడి పెట్టుకున్నా.. చంటి అనో బంటి అనో పిలవటమే ఎక్కువ. బయట స్నేహితులయితే అసలు పేరుతో పిలిచేదీ తక్కువే. క్లాసులో పాఠాలు సరిగ్గా వినక పోతే చదువు చెప్పే పంతులుగారు కూడా అసలు పేరుతో తప్ప మిగతా అన్ని పేర్లతో వరసలు కట్టి మరీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పోస్తారు. ముద్దుకృష్ణ అని కన్నవారు ఎంత ముద్దు పేరు పెట్టినా ఏం లాభం? చివరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ‘ ఏమయ్యో’ అనో ‘ఏమండీ’ ,,,అనంటుందే కానీ ఏ జీతాలు వచ్చిన మొదటి తారీఖునో తప్పించి ముద్దుగా ఏనాడూ పిలవనే పిలవదు. మనిషి ఎంత జూనియర్ ఎన్ టి ఆర్ అంత అందంగా ఉన్నా.. పేరు ఏ ‘పెంటయ్యో’ అని ఉంటే పెళ్లి కావడం కూడా తంటాయే. ఏ ఆడపిల్లకయినా పిచ్చమ్మ అని పేరు ఉందనుకోండి .. ముందు సంబంధాలు దొరకటమే గగనకుసుమమయి పోతుందా లేదా? కొన్ని కులాలలో పెళ్లి అయిన తరువాత ఆడపిల్ల ఇంటిపేరే కాదు.. అసలు పేరూ మార్చి పారేసే ఆచారం ఉంది. ఏ అనుష్క అనో ఐశ్వర్యారాయి అనో ఎంత మోజుపడి మొగుడుగారు గ్లామరస్గా పేరు తగిలించుకున్నా చివరికి అందరూ పిలిచేది చిన్నప్పటినుంచి అలవాటయిన ఏ చిన్నా అనో గున్నా అనో ! మగసన్నాసులకయితే ఆ మాత్రం కూడా వెసులుబాటు లేదనుకోండి అదే వేరే విషయం.

లోకంలో తల్లితండ్రులు పెట్టిన పేరుతో చచ్చినా పిలిపులకి నోచుకోని జాతుల జాబితాలో అందరికన్నా ముందు ఉండేది పాఠాలు చెప్పుకునే పంతుళ్ళు. మారుపేరు లేని ఉపాధ్యాయుడు నూటికో కోటికో ఒక్కరుంటారేమో! సుద్దముక్కల సారనీ, బ్రేకుల్లేని బోడింజననీ, ఛత్రపతి శివాజీ అనీ ఇలా రకరకాల పేర్లతో గోడలెకెక్కారు మిమ్మల్ని గోడకుర్చీలేయించిన మా మాష్టార్లు. ఈ జాబితాలోకి వచ్చే తరువాతి దురదృష్ట జీవులు కార్యాలయాల్లో కర్రపెత్తనం చేసే ఆధికారులు. బాసుని యములోడని పరోక్షంలోనైనా సరే తిట్టి పోస్తేగాని కచ్చ తీరని గుమస్తా గురువయ్యలు రావి శాస్త్రి గారి అల్పజీవిలోలాగా బోలెడంత మంది. ముళ్ళపూడివారి బుడుగు, ఇంట్లో వాడి నాయన గోపాళం తమ ఆఫీసు బాసుని మీసాల్లేని రావణాసురుడు అని అస్తమానం తిట్టడం విని విని ఆ బాసు ఇంటి కొచ్చినప్పుడు “నాన్నా! వీడేనా నీ మీసాల్లేని రావణాసురుడు?” అనడగడం మనం ఎప్పటికి మర్చిపోలేని మారుపేరు ముచ్చట.

ఎవరూ పెట్టకుండా తమకు తామే వేరే పేరుతో వీర ప్రచారంలోకొచ్చే జాతి ఇంకోటుంది .అదే కళాకారుల జాతి. ముఖ్యంగా రచయితలు. వీరి మీదయితే ఒక పెద్ద గ్రంధమే రాసి పారేయచ్చు . మహాకవి శ్రీశ్రీని శ్రీరంగం శ్రీనివాసరావనే కంటే శ్రీ శ్రీ అంటేనే చాలామంది తేలికగా తెలిసేది. బాపుగారి అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణనీ, కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరనీ, వపా అంటే వడ్డాది పాపయ్య శాస్త్రిగారి పొట్టి పేరనీ ఎంత మందికి తెలుసు? చాలా మందికి తమ మారు పేర్లకి వెనకో ముందో శ్రీ అని తగిలించుకొంటేగాని తోచదు. ఉషశ్రీ, మంజుశ్రీ, విజయశ్రీ ఈ కోవలోవే. పాలగుమ్మి పద్మరాజుగారికి కూడా ‘పాప’ అని పొట్టి పేరుతో పిలిపించుకోవాలని ఎంత ఇదిగా ఉన్నా.. పాపం ఎందుకో అది అంతగా వర్కవుటయినట్లు లేదు. కొడవటిగంటి కుటుంబరావుగారు కొ కు , సి.నారాయణరెడ్డిగారు సినారె, చాగంటి సోమయాజులుగారు చాసో, భమిడిపాటి కామేశ్వరరావుగారు భ కా రా, భమిడిపాటి రామ గోపాలంగారు భ రా గో, రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు రా వి శాస్త్రి.. ఇలా పొట్టిపేర్లతోనే చాలా గట్టిపేరు తెచ్చుకున్నఘటికులూ చాలామందే ఉన్నారు . కానీ, ఆరుద్ర అంటే భాగవతుల శంకరశాస్త్రి అనీ, ఆత్రేయ అంటే కిళాంబి నరసింహచార్యులనీ సాహిత్యంతో బాగా సంబధం ఉన్న వారికి తప్ప తతిమ్మా వారికి అంతగా తెలియదు.

మారుపేర్ల పురాణం ఒక్క మన భాషకే పరిమితం కాదు. అల్లెన్ స్టువర్ట్ కొనిగ్స్ బర్గ్ -అనే పేరు పలకటం కష్టమయి వుడీఅలెన్ గా మారి పోయాడు ఒక ఇంగ్లీష్ రచయిత. జోజెఫ్ తియదోర్ నలీ జ్ కోన్రాడ్ కర్జెనియో విస్కీ పేరు.. అబ్బో పలకడమే కాదు.. స్పెల్లింగ్ చెప్పడంకూడా కష్టమే! అందుకే జోసెఫ్ కోన్రాడ్ గా కుదించుకుపోయి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. మోలియోర్, వోల్టేర్, విర్గిల్ వగైరా వగైరా లంతా ఈ కోవలోకే వస్తారు.

స్త్రీల రచనలు ప్రసిద్ధి పొందుతున్నాయని మగ రచయితలు దొంగ ఆడపేర్ల ముసుగులో రచనా వ్యాసంగాలు సాగించిన సందర్భాలు కూడా బోలెడన్ని. ఆ అడపేరు రహస్యం బట్టబయలయినప్పటికీ.. అప్పటికే వచ్చిన ప్రాచుర్యం వల్ల వాళ్ళు ఆ పేరుతోనే బండి లాగించేసారు. పురాణం సీత పేరుతో పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు రాసిన ఇల్లాలి ముచ్చట్లే ఇందుకు మనకో ప్రసిద్ధ ఉదాహరణ.

వెండితెర వేల్పులు ఈ వేరుపేర్ల కోసం సాగించే సెంటిమెంటయితే ఇక చెప్పనవసరమే లేదు. చిరంజీవి అసలు పేరు వర ప్రసాదు . శోభన్ బాబుకి కన్నవారు పెట్టిన పేరు శోభానాచలం. శివాజీ గైక్వాడ్ రజనీకాంత్ గా మారడం వెనక ఒక పెద్ద సినిమా కథే వుంది. మొదటి సినిమా పేరో , హిట్టయిన చిత్రం పేరో ఇంటి పేరుగా మారి పోయేటంతగా తారలు ప్రసిద్ధి పొందటం సినిమా రంగంలో అంతటా ఉంది. సాక్షి రంగారావు, షావుకారు జానకి, అల్లరి నరేష్ లాంటివి ఈ కోవలోకి వచ్చే పేర్లే. జంధ్యాల వారి ఒక చిత్రంలో వేలు, వీరభద్రరావు సుత్తి అనే పదంతో సుత్తి కొట్టి కొట్టి చివరికి సుత్తి జంటగా స్థిరపడి పోయారు.

ఎక్కడయినా ఏమోగాని రాజకీయాలలో మాత్రం మారు పేర్లతో పిలవడం గొప్ప గౌరవంగా భావిస్తారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే కంటే మహాత్మా గాంధీ, జాతిపిత, బాపూజీ అంటేనే మనకు చాలా దగ్గరయినట్లు భావం కలుగుతుంది. జవహర్లాల్ నెహ్రూని చాచా నెహ్రు అనీ , ఇందిరా గాంధీని ఇందిరమ్మ అని పిలవటానికే చాలామంది ఇష్టపడతారా లేదా? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అంటే తెలియని వారు అది మోదీ పూర్తి పేరంటే నోరు వెళ్ళ బెడతారు. దివంగత మహానేత ఎన్. టి. ఆర్ ని అన్నగారు అని తప్ప సంబోధించని వీరాభిమానులు ఆంధ్రదేశం నిండా కో కొల్లలు. దేశబంధు చిత్తరంజన్ దాస్, లోక్ నాయక్ జయప్రకాస్ నారాయణ్ , ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు లాంటి పేర్లన్నీ ఆ నేతలమీద జనతా కున్నఅవ్యాజ ప్రేమకు తిరుగులేని తార్కాణాలు.
కాలం మారిపోయింది. నేతల తీరూ మారిపోయింది. కుంభకోణాలతో అయినా సరే జనంలో నలగటమే ప్రధానమని నేతలు భావిస్తున్న రోజులివి. వాటర్ గేటు అనంగానే జలాశయానికన్నా ముందు నిక్సన్ మహాశయుడి పేరు మనకు స్ఫురించటానికి వెనుకున్న రహస్యం మరి వేరే విడమరిచి చెప్పాలా? లాలూ పేరు చెప్పగానే చటుక్కుమని దాణాస్కామే గుర్తుకొస్తుందా లేదా ? బోఫోర్స్ అనంగానే ఎంత వద్దనుకున్నా నాటి ప్రధాని రాజీవ్ గాంధీ పేరు స్ఫురించకుండా వుండటం లేదు.

పేరు నిలబెట్టుకోవటమంటే ఇలానా? గతంలో ఒకసారి ఇందిరమ్మ తమ పేరు కలకాలం నిలిచిపోవాలని ఇలాగే ఏదో కాలనాళిక ప్రయోగం చేసినట్లు గుర్తు. ఆమె వీరవిధేయులు ఆ మధ్య ఏనాటినుంచో మనం ప్రేమగా చూసుకుంటున్న తెలుగు కళాతోరణానికి తెలుగు గడ్డ మ్యాపులో ఎక్కడుందో కూడా పట్టించుకోని రాజీవుని పేరు తగిలించారు. మనుషులకే కాదు, కొన్ని కట్టడాలక్కూడా మారు పేర్లు ఎలా వెగటు పుట్టిస్తాయో చెప్పటమే ఇక్కడి ఉద్దేశం.

జనం గుండెల్లో కలకాలం గూడు కట్టుకుని వుండాలంటే అధికారంలో వున్నప్పుడే జనం గోడు పట్టించుకోవాలి. ఆ మంచి దారి వదిలేసి ఇలా మారు పేర్లతో మాయ చేసేద్దామనుకుంటే.. చివరికి ఎద్దేవా పాలయేది ఆ మాయదారి రాజకీయ సంతే!

**** (*) ****