కిటికీలో ఆకాశం

కులం లక్ష్మణ రేఖ రహస్యం విప్పిన పద్యం

ఏప్రిల్ 2015

జీవితం లోని తీరిక సమయాలలోని వ్యాపకంలానో, లేక, వ్యక్తిగత విషాదాలను గానం చేసుకునే వాహిక లానో, కవిత్వాన్ని స్వీకరించిన వాళ్లకు, సమాజంలో తన చుట్టూ వున్న సంక్షోభాలను, అసమానతలను, అవకతవకలను పలికిన కవిత్వం పెద్దగా నచ్చక పోవొచ్చు. ఆ మాటకొస్తే, అసలది కవిత్వమే కాదని దబాయించనూ వొచ్చు ! కానీ, కవి సున్నిత మనస్కుడైన మనిషి కదా ! తన లోపలి ప్రపంచపు సంక్షోభాలని గానం చేసే కవి, తన బయటి ప్రపంచపు సంక్షోభాలని గానం చేయకుండా ఎట్లా వుండగలడు ? ‘కవిత్వ కళ ‘ నిర్దేశించిన కొన్ని ప్రమాణాలు తక్కువైనాయని పండితులు హాహాకారాలు చేసినా సరే – ఆగ్రహ ప్రకటన చేయకుండా ఎట్లా వుండగలడు ?
తెలుగు సాహిత్యం లోకి దళిత కవిత్వం ఒక ఉప్పెనలా దూసుకు వొచ్చినపుడు, ఆ కవిత్వంలోని భాష పైన పెద్ద చర్చలు జరిగాయి. ‘వాడ బతుకుల వెతల నుండి, తర తరాల వేదనల నుండి పుట్టిన కవిత్వం ఇట్లా పచ్చి పచ్చిగానే వుంటుంది’ అని తమ కవితల ద్వారా ప్రకటించారు దళిత కవులు. మరి, సమాజంలోని ఈ కుల వ్యవస్థ పట్ల ఒక శూద్ర వర్ణ అగ్ర కుల కవి వేదన ఏమిటి? అందుకు ఒక సమాధానంలా ఆ కాలంలో వొచ్చిన ఒక మంచి కవిత ‘బోధనం నర్సిరెడ్డి’ రాసిన ‘మై కేమీలియన్ ఫాదర్’.

కొన్ని కవితలకు ఎట్లాంటి వివరణలు, టీకా టిప్పనీలు అవసరం లేదు. కవి పల్లెటూరి రైతు అయిన తండ్రిని ఉద్దేశిస్తూ రాసిన కవిత ఇది. ఊళ్ళో పెద్ద కులం వాడిగా చెలామణి అయ్యే ఆ రైతు తన రోజువారీ పనులు చేసుకుంటూ వున్నపుడు, ఆయా పనులు చేసే కులాల మనుషులు తన తండ్రిలో ఎట్లా కనిపిస్తారో చెబుతూ పోతాడు కవి. అట్లా చెబుతూ పోయి, భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అంతర్ధానం కాకుండా కాపాడుతూ వొస్తోన్న కీలక రహస్యం గుట్టు విప్పుతాడు. ఈ కవితకు నేపథ్యం తెలంగాణ లోని కుల వ్యవస్థ. కవితలో తెలంగాణలో వాడుకలో వున్న శ్రమ సంబంధిత, కుల సంబంధిత పదాలని, పద బంధాలని చాలా అందంగా అమర్చాడు కవి.

మై కేమీలియన్ ఫాదర్

ముడ్డి మొల్తాడుకు రెండు మెల్కలేసి
కాసెగట్టి గోసి బోసినప్పుడు
కాల్వ కిందకి జీవాల్ని తోల్తున్న గొల్ల పర్వతాలు మా నాయన

ఈతాకు నడి తడ్పతో
కల్లం బోయిన మోట బొక్కెనకు పంటి బిర్రున కుట్లేసినపుడు
ఊముతో ఆరును తడిపి
ఉంగటం బెడుతున్న మాదిగ ఇస్తారి మా నాయన
గొర్రో, గుంటుకో నొగలిరిగితే
గొడ్డలిని బాడిశ జేసి అందెపుకొర్ల బేడాలేశినప్పుడు
శీర్లపులితో నాగలికోలకు
మట్టుశీలను బిగిస్తున్న వడ్ల పాండురంగం మా నాయన

తెడ్డయిన కర్రును బొగ్గుల కుంపట్లే కాల్చి
యేనే రాయి దాకలి మీద మొనబెట్టి సరిశినపుడు
తోలుతిత్తిల కొలిమి దగ్గర రోజుకింత
పొగచూరుతున్న కమ్మరి పాపయ్య మా నాయన

మంగముల్లిరిగిన బూసరేద్దు మునగాలును
కీలుకత్తితో బయల్జేసి
గుంట గరగడాకు పసరు బోసినప్పుడు, గోరుగాలితో గోర్లుదీసి
సంకల బొచ్చును సాఫు జేస్తున్న మంగలి సోములు మా నాయన

బురద నాగలి ఇడిశినంక మొలగట్టిన పై గుడ్డను
మెది నీళ్ళ కింద బులిమి ఎండ పొడకు ఎగదులిపినప్పుడు
సాకెర పొయి కాడ సౌడు సున్నంతో
మైల బట్టల్ని కమ్మున బెడుతున్న సాకలి సైదయ్య మా నాయన

పెద్ద మడిశైన చెల్లిని
పేడకు వద్దనలేకా బడికి బొమ్మనలేకా
సందకాడ సతమతమవుతున్నపుడు
తెలంగాణ కూలి రైతు మా నాయన

కానీ – చెల్లె మనసు పడ్డ చెంద్రయ్యను
కులం తక్కువోడని, రచ్చ కాడ పెద్ద మనుషుల్తో కలిసి
తనూ నాలుగు తన్నినపుడు మాత్రం
బోధనం అంతి రెడ్డి పటేలు మా నాయన

కవితని మళ్ళా ఒకసారి చదవండి. ఈ రైతు మోతుబరి కాదు. ‘పెద్ద మడిశైన బిడ్డను పేడకు వద్దనలేకా బడికి బొమ్మనలేకా సందకాడ సతమతమవుతున్న తెలంగాణ కూలి రైతు’.

‘మోట బొక్కేనకు పంటి బిర్రున కుట్లేసినపుడు’; ‘తెడ్డయిన కర్రును బొగ్గుల కుంపట్లే కాల్చి యేనే రాయి దాకలి మీద మొనబెట్టి సరిశినపుడు’; ‘మొలగట్టిన పై గుడ్డను మెది నీళ్ళ కింద బులిమి ఎండ పొడకు ఎగదులిపినప్పుడు’ గుర్తుకురాని కులం, చివరికి కూతురి పెళ్ళికి కూడా కట కటలాడే పేదరికంలో వున్నపుడు కూడా గుర్తుకు రాని కులం, కూతురు తక్కువ కులం వాడి పైన మనసు పడిందని తెలిసినపుడు మాత్రం గుర్తుకు వచ్చింది ఈ పేద రైతుకు. ‘కూటికి లేకున్నా, కులానికి లేని వాడిని కాదన్న’ ఒక అహంకారం అతడి తలకెక్కింది!

తన Annihilation of Caste లో డా బి ఆర్ అంబేద్కర్ ఇట్లా అంటారు -

‘Caste System is not merely a division of labour. It is also a division of labourers. Civilized society undoubtedly needs division of labour. But in no civilized society is division of labour accompanied by this unnatural division of labourers into watertight compartments. In no other country is the division of labour accompanied by this gradation of labourers’

డా అంబేద్కర్ మరింత ముందుకు వెళ్లి, భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అంతర్ధానం కావాలంటే, కులాంతర వివాహాలే మార్గం అన్నారు. ఆ రహస్యం తెలుసు కాబట్టే, భారతీయ సమాజంలోని అగ్ర వర్ణాలు ఒక లక్ష్మణ రేఖని సరిగ్గా అక్కడ గీసాయి. కూతురి పెళ్లి చేసే స్తోమతు లేకపోయినా, ఆమె మనసు పడిన వాడు తక్కువ కులం వాడైతే, ‘రచ్చ కాడ నలుగురితో కలిసి నాలుగు తన్నడానికీ’ తెగబడ్డాయి. గీత దాటిన వాళ్ళని పరువు హత్యలు చేయించేంత దుర్మార్గాలకూ వొడిగడుతున్నాయి.

కవిత చదవడం పూర్తి చేసాక మీకేమనిపించింది?

నిజానికి, ‘అంతిరెడ్డి పటేలు’ తనకు కుల పట్టింపులు లేవని ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదు. తన కులం గురించి ఒకింత గర్వంతో వుండే ఒక సామాన్య రైతు ఈ పటేలు. తన కుల పట్టింపుని నాటకీయంగా కప్పి పుచ్చి బతకడం తెలియని పల్లెటూరి బక్క రైతు ఈ అంతిరెడ్డి పటేలు.

మరి, ‘కులానిది ఏముంది ?’ అంటూనో, ‘మేమసలు కులం గురించి పట్టించుకోము’ అంటూనో, ‘ఈ దేశం నుండి కుల సమస్యని తరిమి వేయాలి’ అంటూనో మాటలు చెప్పే, రాతలు రాసే, ఉపన్యాసాలు దంచే ‘పెద్ద పటేళ్ళు’, తమ ఇళ్ళ బయట కడు భద్రమైన లక్ష్మణ రేఖలని గీసుకుని, మన కళ్ళ ముందే తిరుగాడుతున్నారు గదా ! వీళ్ళతో పోలిస్తే, అంతి రెడ్డి పటేలు నేరం ఏపాటిది ?

-కోడూరి విజయకుమార్

**** (*) ****