కవిత్వం

ఒక జ్ఞాపకాల జీవ నది!

మే 2015

భగీరధుడి ప్రయత్నానో
జారి,
ఏ కొండల గుండెల పైనో పారాడి,
ఏ చెలమల సాన్నిహిత్యానో పెరిగి,
ఒక్కొక మలుపులో
కదాచిత్ గా ఒక అద్భుత చిత్రమై,
స్వేచ్ఛా ప్రవాహమై సాగుతూ…

జడి వానై వచ్చిన
హర్షపు వడి నడకలు
తనువంతా ముసురును పట్టిస్తే,
వాగై, వంకై ,
ఆరాటమై, ఆవేగమై ముంచెత్తుతూ,
సుఖ శిఖరాలపైనుండి జలపాతపు హోరై
లోతులను చూసి,
సుఖించో, దుఃఖించో,
సుడిగుండాలలో తిరిగి,
మనసెండినపుడల్లా
క్రొత్త అర్ధాలకు యత్నిస్తూ,
ద్వీపాలకు తావిస్తూ,
కన్నీరై ఇంకుతూ…

గ్రీష్మానికీ,చలికోరల శిశిరాలకూ కుంగక
గుప్పెడు శరచ్చంద్రికలకూ,
ఆశై నవ్వే కొన్ని చినుకులకూ పొంగుతూ,
అన్ని గట్లను దాటి,
వెనుకకు పోలేక,
అర్ధాంతరంగానూ ఆగలేక,
నిరంతర ఆలోచనా ప్రవాహంతో
జీవిత ఋతుహేలకు సాక్షిగా,
కాల గర్భంలో అంతర్వాహినిగా
మన పయనం…!