కవిత్వం

ఆమె కవిత

మే 2015

మె కవిత
ఆత్మలో లీనమవుతుంది
మాటలు కన్నీటిలో ఇంకిపోతాయి
భావజలధార ఒళ్లంతా పాకి
అక్షరమక్షరమూ ఆవహిస్తుంది

ఆమె దుఃఖం తరతరాల మూలాలను తడుముతుంది
ఆమె తత్వం అనాది మూలుగల్లోని బానిసత్వాన్ని ప్రశ్నిస్తుంది

ఆమె మాత్రం ఎవరినీ ప్రశ్నించదు
దేనినీ నిందించదు
విధి అని విరామం తీసుకోదు
కాగితానికి, కంటికి మధ్య
కన్నీటి సిరాగా ప్రవహిస్తూనే ఉంటుంది

పదాలు
వాటికి పాదాలు తొడిగి
అడుగులు వేసిన ఆమె కవితలు
శబ్దానికి శరీరమిచ్చి
ఆత్మకు దారిని కనుగొనే
ఆమె అక్షరాలు
ఆమె మది నదిలో
అనేక నిగూఢపు ప్రవాహాలు

మనసుకు చెవులిచ్చి
తను చెప్తూనే ఉంటుంది
ఆమె కవిత్వం
హృదయాంకురం నుంచి
మెలుచుకొస్తూనే ఉంటుంది