యెల్లో రిబ్బన్...

ఇట్లు మీ… (5)

మే 2015

చుట్టూ కాగితాలు. యెదుట లాప్ టాప్. మరో పక్క లాగేస్తోన్న మల్లె పూలవనం. లోపల అల్లరి పెడుతోన్న పాటలెన్నో.
యేకకాలంలో యెన్నెన్ని భావాలో. మనకి పరిచయం అయిన ఆ తొలి వసంత కాలంలో మనిద్దరం కడియం మల్లెపువ్వుల తోటల్ని చూడటానికి వెళ్లాం. ముదురాకుపచ్చని గుబుర్ల నడుమ చిన్నివి, కొంచెం పెద్దవి, బాగ పెద్దవి మల్లెలు. పందిరి మొగ్గలు. ఆ మొగ్గలని బుట్టల్లోకి చకచక కోయటం చూసి నువ్వెంతగానో ఆ స్కిల్ ని మెచ్చుకున్నావ్.

యెన్నిన్ని కాంబినేషన్స్ తో మాలలు అల్లేవారో కదా! మల్లె దవనం. మల్లె మరువం. మల్లెలు కనకాంబరాలు. మల్లెలు మరువం కనకాంబరాలు… ఆ కలబోత మాలలు యెంత అందంగానో వుండేవి. వాటి పరిమళాలు సుమధురం. వదులు జుట్టుని అల్లుకొంటే యెంచక్కగా పువ్వులు పెట్టుకోవచ్చు కదా అనేవారు ఆ వూరిలో పరిచయం అయిన బామ్మ గారు. తిరిగి ఆమె నవ్వుతూ యిప్పుడు పువ్వులు యెవ్వరూ పెట్టుకోవటం లేదు అనేవారు. ఆమెతో వొక రోజు మల్లెపూల జడ అల్లించుకొంటే బరువే తెలియనివ్వ లేదు ఆ పూలపరిమళం.
పూల జడ అల్లటం వో కళ. వరుస తప్పకుండా అల్లాలి. యెన్ని మల్లెల వరసల తరువాత యే రంగు పువ్వులు పూలజడ సొగసుని మరింత ఎన్హాన్స్ చేస్తాయోననే రంగులచూపు వుండాలి.

ఆ అనేక తీపి సువాసనలు మనలని చుట్టుకొంటుంటే ఆ జడపై పై నుంచి కిందనున్న జడ గంటల వరకు యెన్ని ముద్దులు వస్తాయోనని లెక్క పెడుతూ, మధ్యలో లెక్క తప్పిందని ఆగి, మొదటి నుంచి ముద్దులు పెట్టాలని, తిరిగి లెక్క పెట్టాలని నువ్వు మళ్లీమళ్లీ లెక్క పెట్టే పని చేస్తుంటే, నువ్వు కావాలనే చేస్తున్నావని గుర్తు పట్టి కూడా గుర్తుపట్టనట్టే వున్నాను. ఆ నీ పూల ముద్దులు యేమో కాని నా మెడ పై నుంచి వీపు పైకి జారుతోన్న నీ లేత వెచ్చని వూపిరి పూయించే గిలిగింత కావాలనిపించేది. మళ్లీ మళ్లీ నువ్వు యెన్ని సార్లు యెన్నెన్నో ముద్దులు పెట్టినా ఆ గిలిగింత యిప్పటికి పచ్చని పులకరింతే.

తప్పదు యిక్కడ ఆగాలి. పనుంది. చాల రాయాలి యింకా… పంచుకోవలసినవి చాలున్నాయి.

***

హమ్మయ! సమయం చిక్కపట్టుకొని వచ్చేసాను నీకు రాయాలని.
నీదెంత సునిశితమైన సున్నితమైన మనసు. ఆ ఆఫ్ఫీషియల్ మీటింగ్ మధ్యలో టీ బ్రేక్ లో చిటికేసిన మోహాన్ని నీకు మెసేజెస్ పంపించినప్పుడు పని వొత్తిడిలోనే ఆ మెసేజ్ ని పంపానని నీకు భలే తెలిసిపోయింది. అవును అలాంటప్పుడే ఆ మెసేజ్ ని పంపాను. నువ్వన్నట్టు పనొక్కటే కాదు మనసులో కూడా అనేక ప్రశ్నలున్నాయి.

యిప్పటి వరకు యెర్రని యెండ. యెండ ఛాయే. యెండ చుర్రుమంటుంది. వేసవి వచ్చింది అనుకొన్నానో లేదో చూస్తుండగానే అర్ధరాత్రిలా మిట్ట మధ్యాహ్నం నల్లని మబ్బులు దట్టంగా. అంత తొందరగా కమ్ముకొన్న చీకట్లని చూసి గూడు చేరుకొనే వేళ యింత తొందరగా అయిందేమిటి అనుకున్నాయేమో తేనె పిట్టలు గూళ్ళకి వచ్చేసాయి త్వరత్వరగా.

వడగళ్ళ వాన.

వడగళ్ళు అంటే నాకు స్నో వైట్ కథ గుర్తొస్తుంది. స్నో వైట్ గుర్తొస్తే వడగళ్ళు కురుస్తాయి కళ్ళ ముందు. వొకప్పుడు వడగళ్ళ వాన చాల అరుదుగా కురిసేదట. ఆ వాన వొక మంచి ముచ్చట. ఆ వాన కోసం యెదురు చూసేవాళ్ళం. యిప్పుడు తరచు వడగళ్ళ వానే. అదీ మాములుగా కాదు. పంటంతా ధ్వంసం చేస్తూ. మళ్లీ కాసేపటికి వాన కురిసిన ఆనవాలే లేని యెండ. తిరిగి వాన. పగలు రాత్రి యిదే వరస.
ప్రభాత వేళ విచ్చుకొనే పువ్వులని దాదాపు ప్రతి వుదయం చూస్తాను. అదే మెరుపు. అదే రంగు. అదే సుగంధం. యెన్నెన్నో రంగులని సువాసనలని వెదజల్లే స్థాయికి రావడానికి తను యెన్నెన్ని వడగాలుల్ని మంచు రాత్రులని చూసి వుంటాయో కదా పూల తోటలు. అడ్డదిడ్డంగా పెనవేసుకొంటు సరసరా పాకే తీగలు అనేక రంగుల పువ్వులతో మనలని పలకరిస్తుంటాయి, యెన్నెన్నో అవరోధాల నడుమ. వాటిని చూసినప్పుడు కొందరు మనుష్యులు సాటి మనుష్యుల మీద చిమ్మే చేదుని పెద్దగా పట్టించుకోకుండా యెంతటి వ్యతిరేక పరిస్థితుల్లోనైన స్నేహం ప్రేమలాంటి మానవీయపుష్పాలపై మరింత విశ్వాసాన్ని పెంచుకొంటూ ఆ సుపరిమళాన్ని మనం శ్వాసిస్తూ మన చుట్టూ వున్న వాళ్ళు శ్వాసించేట్టు మన మనసులు విరబూయాలి రుతువు యేదైనా …

**** (*) ****