కథ

పాత ఒక వింత!

మే 2015

సాచుసెట్స్ విశ్వవిద్యాలయం లో ఉమెన్స్ హెల్త్ అండ్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ పై అధ్యయనం చేసి ఇండియాకొచ్చి దీనిపై పరిశోధనలు జరిపిన జోలీ ఈ మధ్యే ఓ జిం ఏర్పాటుచేసింది. దేశరాజధాని న్యూఢిల్లిలో ఆ జిం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఎందరో శ్రీమంతుల స్త్రీలకు, అందునా సీమంతం చేసుకోబోయే ఇంతులకు కూడా ప్రత్యేక వ్యాయామాలున్నాయి. ప్రతి వ్యాయామమూ నిజానికి వ్యాయామం కాదు. ఓ పని! ఆ పనిలో ఉండే వ్యాయామాల వల్ల మన ఆరోగ్యం ఎలా బాగుపడుతుండో ఇక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాదు శారీరిక చైతన్యంతోబాటు మానసిక ఒత్తిడుల్నుంచికూడా ఉపశమనం దొరుకుతుందట.

ఒక పని గుండెపోటుని రానీకుండా చేస్తుందట. మరోపని పొత్తికడుపు పెరగనీయకుండా, ఇంకోటి శ్వాసకోశం మెరుగుపడేది, మరోటి ఉచ్చ్వాసనిశ్వాసాలను క్రమబధ్ధం చేసేది, మరింకోటి నడుము సన్నబడేది, ఇంకా మరోటి జబ్బలు నునుపు తేలేది, ఇంతేకాదు సుఖప్రసవం అయేదికూడా!

పనిలోవుండే స్వప్రయోజనాల్ని, సత్ప్రయోజనాల్ని శ్రమైకసౌందర్యంలోని గొప్పదనాన్ని కోర్స్ వైజ్, సిలబస్ వైజ్ నేర్పిస్తోంది జోలి.

ఈ జిం గురించి ఆనోటా, ఈనోటా ఏం ఖర్మ టి.వి చానెళ్ల నిండా ప్రకటనలు, రేడియో ఎఫ్.ఎం ల ద్వారా ప్రచారాలు!

మహిళలు తండోపతండాలుగా కాకపోయినా ఓ తండా గా వెళ్లినమాట నిజం. అదీకూడా బాగా “డబ్బుచేసిన”వాళ్లకే అందుబాటులో ఉందనేది వాస్తవం!

వారిలో “సుకుమారి” అనే తెలుగమ్మాయి ఉండటం విశేషం కాకపోయినా, ఓ విషయం అన్నమాట!

***

సుకుమారి ..పేరుకు తగ్గట్టే సుకుమారం, ఇటుపుల్ల అటు తీసిపెట్టనీయని గారాబం, బోలెడంత వయ్యారం..వెరసి ఏడు మల్లెలెత్తు అంటే సరిపోతుంది!

కొత్తగా పెళ్లై భర్త వెంట నడచివచ్చింది. క్షమించాలి.. ఢిల్లీ దాక ఎలా నడచివస్తుంది? అదేమరి విమానం లో ఎగిరివచ్చింది. అతగాడికి అక్కడే ఉద్యోగం. ఆమె పుట్టింది కృష్ణాతీరం, పెరిగింది తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తా మహానగరం, మెట్టింది బొంబాయిలోని తెలుగువారింట, ఇక కాపురం న్యూఢిల్లీ!

ఆ కొత్తకాపురం చూడటానికి విజయవాడ్నుంచి వాళ్లమ్మమ్మ ఓ ఉదయాన్నే రైలు దిగింది..అదే వీళ్లింట్లో కూడా! సుకుమారి భర్త రాహుల్ స్టేషన్ కెళ్లి ఆమెను తీసుకొచ్చి దించి ఆఫీసుకెళ్లిపోయాడు. రావటం రావటం ఆమె తన స్నానాదికాలు ముగించుకొని సుకుమారిని ముందు కూర్చోబెట్టుకుని తలంతా నూనెరాసి, మీగడ సున్నిపిండితో నలుగుపెట్టి తనవెంట తెచ్చిన కుంకుడుకాయలతో తలంటిస్నానం చేయించింది.

సుకుమారి వద్దువద్దని మొత్తుకున్నా విన్లేదు. “ఎప్పుడో నీవు పుట్టినప్పుడు ఓ మూణ్ణెల్లపాటు నలుగుపెట్టి స్నానంచేయించా. ఆ తర్వాత మీ అమ్మ ఎలాపోసిందో ఏమో! ఇప్పుడుచూడు ఎలా మెరిసిపోతున్నావో! కొంచెం శ్రమేననుకో, అయినా ఫలితం చూడు ఎంత గొప్పగా ఉందో!” అంటూ తలంతా సాంబ్రాణిపొగవేసి ఆరబెట్టి, చిక్కుతీసి, వదులుగా జడ అల్లటం మొదలుపెట్టింది.

“అమ్మమ్మల్లా జడేస్తావేం?” అని విసుక్కున్నా ఒప్పుకోలేదావిడ.

“జడ అందం, విరబోసుకుంటే వస్తుందా? జడలు అమ్మాయిలేసుకుంటారు. అమ్మమ్మలు కాదు. అమ్మమ్మలు ముడేసుకుంటారు.” అంటూ బాల్కనీలో కుండీలోని గులాబీమొక్కకు పూచిన గులాబీని తుంచి సుకుమారి జడలో గుచ్చింది.

“అమ్మమ్మా!” కెవ్వున కేకేసింది సుకుమారి.

“ఏమైందే అమ్మలూ?” గాబరాపడిపోయిందామె.

“ఆ పూవు కోసేవేం? అది కొమ్మకుంటేనే అందం”

“పిచ్చి అమ్మలూ! అది “ఈ కొమ్మ”కుంటేనే అందం” అంటూ మనవరాల్ని ముద్దుపెట్టుకుంది.

“చూడు తల్లులూ! ఆ బైరాగి నైటీ తీసేసి, చక్కగా ఈ వాయిల్ చీర కట్టుకో” అంటూ చిన్నచిన్న పసుప్పచ్చ పూల ప్రింట్లున్న పింక్ కలర్ చీర తీసిచ్చింది.

“ఈ చీర ఎక్కడిదమ్మమ్మా?”

“నేనే తెచ్చానే నీకోసం. రెడీమేడ్ బ్లౌజ్ తో సహా”

“నైట్ డ్రెస్స్ చాలా కంఫర్ట్ గా ఉంటుందమ్మమ్మా. చీరతో కష్టం..”

“అదేంటమ్మడూ చీరలో అందం ఈ పిచ్చిగుడ్డలో ఎక్కడుందే!? నామాటవిని ఈరోజుకి కట్టుకో”నచ్చచెప్పిందావిడ.

కాదనలేక అమ్మమ్మ సాయం తో చీర కట్టుకుంది.

రాత్రి ఎనిమిదింటికి ఇల్లుచేరిన రాహుల్ కి సుకుమారిని చూడగానే అలసటంతా మాయమైనట్లు అనిపించింది.

“నువ్వు నువ్వేనా?”అడిగాడతను.

“ఈ చీర .. జడ.. జడలో పువ్వు..ఎంత బాగున్నావ్?”

చక్కటి మెచ్చుకోలు! మాటల్లోనే కాదు, చూపుల్లో కూడా!

సుకుమారి మొదటిసారి అందంగా ఆనందంగా సిగ్గుపడింది.

మర్రోజు “అమ్మమ్మా! మరే..మరీ.. నాకింకా ఇలాంటి చీరలు కావాలమ్మమ్మా!” అంటూ ముద్దుముద్దుగా అడుగుతున్న ఆ ముద్దరాల్ని చూసి అమ్మమ్మ చాలా మురిసిపోయింది.

“నాకు తెల్సే! అందుకే ఓ డజనుపైగా పట్టుకొచ్చా. ఇంట్లో ఇలాంటి చీరలే వంటికి హాయిగా ఉంటాయి. అదిసరేగానీ మైసూరుపాకు, లడ్డూలు, సున్నుండలు, బాదుషాలు అన్నీ ఇంట్లో చేసి తీసుకొచ్చా. అప్పుడప్పుడూ నోట్లో వేసుకుంటుండు. ఇంటికి రాగానే అబ్బాయికి పెడ్తుండు”

“అమ్మమ్మా! ఎన్నిసార్లు చెప్పాను అంతంతేసి నెయ్యేసి చేసిన స్వీట్స్ నేను తిననని? ఫ్యాట్ బాగా వస్తుంది”

“అమ్మలూ! నువు అనవసరంగా భయపడుతున్నవ్. తినాల్సిన వయసులోనే తినాలి. పెద్దవాళ్లయ్యాక తిందామనుకున్నా తినలేం. అయినా తగుమాత్రం పనిచేసుకుంటుంటే వళ్లేం రాదు. పైగా అదే వ్యాయామం కూడానూ”
“అదేంటమ్మమ్మా నేను ఏరోబిక్స్ చేస్తూనే ఉన్నా! నీకు తెలీదా?”.

“మరింకేం!? నీవు ఎంచక్కా తినొచ్చు. అయినా నీవు చేసేది ఆ పిచ్చిగెంతులేగా? ఓ పొడవాటి నిక్కరూ, చొక్కా వేసుకొని, ఏవో పాటలు పెట్టుకుని?”

“అదేకాదు. ఇప్పుడు ఓ కొత్త జిం కి వెళుతున్నా. జోలీ అని యు.యస్ నుంచి వచ్చింది. ఆమె సైంటిఫిక్ గా స్టడీ చేసి కొత్త కొత్త ఎక్సర్ సైజెస్ కనిపెట్టింది తెల్సా? కావాలంటే నీవే వచ్చి చూడు”అంది గర్వంగా.

దేన్నీ ఒక పట్టాన మెచ్చుకోని అమ్మమ్మ ముక్కుమీద వేలేసుకోవాలి అనుకుంటూ జిం లో చేసే ఎక్సర్ సైజెస్ గురించి చెప్పటం మొదలుపెట్టింది.

అవన్నీ విన్నాక అమ్మమ్మకెందుకో అనుమానం వచ్చింది. ముక్కుమీద వేలేసుకోలేదుగానీ, గడ్డం కింద చెయ్యిపెట్టుకుని విచిత్రంగా చూసింది.

“వస్తానే, అవేంటో చూస్తా. ఎప్పుడెళ్దామంటావ్?”

“రేపే వెళ్దాం” అంది సుకుమారి ఉత్సాహంగా.

పొద్దున్నే ఎనిమిదిగంటలకల్లా రాహుల్, కారు లో వాళ్లిద్దరినీ జిం దగ్గర దించేసి ఆఫీసుకెళ్లిపోయాడు.

“ఇప్పుడీ కొత్త వింతను చూశాక అమ్మమ్మకి తెలిసొస్తుంది. నేటితరం ఎంత ముందుందో , ఎంత ఇనవేటివ్ గా ఆలోచిస్తుందో! ఎప్పుడూ మా తరంలో ..మా తరంలో అంటూ గొప్పలు చెప్తుంటుంది. ఈరోజుతో ఇక అవన్నీ కట్” అనుకుంటూ ముందుకు దారితీసింది సుకుమారి. అమ్మమ్మ అనుసరించింది.

***

ఓ చిన్న తోటలో వెదురు కుటీరాలు. ఒక్కో కుటీరంలో ఒక్కో వ్యాయామం చేయిస్తున్నారు. అవన్నీ చూశాక మతిపోయింది అమ్మమ్మకి. ఒక కుటీరంలో కొంతమంది విసుర్రాళ్లతో బియ్యం,పప్పులు విసురుతున్నారు. మరో కుటీరంలో రోళ్లలో ధాన్యం పోసి రోకళ్లతో దంచుతున్నారు. ఇంకా చిత్రమేంటంటే ఆ ఆవరణలోనే ఓ బావికూడా ఉంది. కొంతమంది గర్భిణులు నీళ్లు తోడుతున్నారు. తోడిన నీళ్లను బిందెలలో నింపుకుని అక్కడున్న మొక్కలకి పోస్తున్నారు నలభై ఏళ్లకు పైబడిన వాళ్లు.

ముందు అయోమయంగా అనిపించినా చాలా సంతోషంగా కనిపించింది అమ్మమ్మ సుకుమారికి. ఆ పరికరాల్ని చేత్తో తడమటం మొదలుపెట్టిన అమ్మమ్మతో “అమ్మమ్మా! నీకివి అంతగా నచ్చాయా?” అంది.

“నచ్చటమేమిటే అమ్మలూ! వీటినిచూస్తే మా అమ్మను చూస్తున్నట్లుందే తల్లీ!”

“అవునా! చూశావా మరి! ఎంత అమేజింగ్ గా ఉన్నాయో కదూ?”

“వింత కాకపోతే ఏమిటే తల్లీ! ఇవన్నీ మా చిన్నప్పుడు మా అమ్మ రోజంతా చేసిన పనులేనే! మా నాయనమ్మ, ఆమ్మా, అమ్మ, పిన్ని వాళ్లు అందరూ కల్సి చేస్తుండేవాళ్లు. సంప్రదాయ కీర్తనలు పాడుకుంటూ, మాట్లాడుకుంటూ పనులు కానిచ్చేవాళ్లు. అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్లే! వాళ్లకి పొత్తికడుపులు పెరగలేదు. ఏ గుండెనెప్పీ రాలేదు. వాళ్ల జబ్బలు నున్నగానే ఉండేవి. అందరికీ సుఖ ప్రసవాలే! అందరూ నాజూగ్గా, ఉత్సాహంగా ఉండేవాళ్లు. ఏ రోగాలు లేకుండానే మంచాన పడకుండానే వృద్ధాప్యం వచ్చాకనే వెళ్లిపోయారు”

“అదిసరేగానీ ఇక్కడ మీరంతా వెర్రివాళ్లలాగా ఎవరో అమేరికానుంచొచ్చి చెప్పిందనీ కొత్తగా నేర్చుకుంటున్నామనీ, ఇంకెవరూ కనీ,వినీ, కనిపెట్టనివనీ అనుకుంటున్నారా? ఇవన్నీ మనదేశంలోవి కావుటే!? పైగా ఇదంతా ఆమె గొప్పదనుమనుకుటున్నారేగానీ, ఇవి మనవేనని, ఇదంతా మన పూర్వీకుల గొప్పదనమనీ మీకు బొత్తిగా తెలియదులాగుందే! మన వేపచెట్టు, కలబందల్ని మనకే అమ్మి వ్యాపారం చేసేవాళ్లు కాదుటే వీళ్లు!

మన విషయాలే నేర్చి మనకే తెలియచెప్పాలనుకునేవాళ్లు! నిజంగా ఈ విషయంలో వాళ్లని చూసి నేర్చుకోవాలి మనం! బుధ్ధితెచ్చుకోవాలి! ఓ విషయం తెల్సా? మన సంప్రదాయమేంటో, మనమేంటో మర్చిపోతే ఇలాగే జరుగుతుంది. అసలు సంప్రదాయమంటే ఏంటనుకుంటున్నారు? “పాత రోత” అనుకుంటున్నారా? కాదు! అది మన ఆరోగ్యకరమైన జీవన విధానం! కట్టూ బొట్టూ, ఆటామాటాపాటా అన్నీ మన వాతావరణాన్ని బట్టి వచ్చినవే! అసలెక్కడున్నారు మీరంతా? ఎటువైపుకు వెళుతున్నారు? ఇదేనా మీ పెద్ద చదువులు మీకు నేర్పిన లౌకిక ఙ్ఞానం!?” దులిపేసింది అమ్మమ్మ. ఈ “పాత వింత” ను అమ్మమ్మ నోట విని విస్తుపోవటం సుకుమారి వంతయింది.

**** (*) ****