ఆవలి తీరం

అన్నీ ఊహాజనితమే!

ఫిబ్రవరి 2013

వరంగల్‌లో ఇంజనీరింగ్ చదివేరోజుల్లో రాయడం మొదలు పెట్టాను. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, జ్యోతి పత్రికల్లో నాలుగయిదు కథలు వచ్చాయి. కాలేజ్ చదువు ముగిశాక భిలాయిలో ఉద్యోగం రావడంతో ప్రవాసాంధ్ర జీవితం మొదలయింది. కాలేజ్ రీడింగ్‌రూంలో చదవడానికి అన్ని వార, మాస పత్రికలూ ఉండేవి కానీ అక్కడ ఏవీ దొరికేవి కాదు. ఒకటీ అరా తప్పించి రాయలేదు ఆరోజుల్లో. అక్కడినుంచి ఎమ్మెస్ చేయడానికి అమెరికా వచ్చినప్పుడూ అందులో ఏ మార్పూ కలగలేదు. అయితే తొంబైలలో SCIT న్యూస్ గ్రూప్ ఏర్పడటంతో ఇంటర్నెట్‌లో తెలుగువారికందరికీ అన్నీ పంచుకునేందుకు ఒక వేదిక దొరికింది. అందులోనే నా రచనావ్యాసంగం మళ్ళీ మొదలయింది.

రాయడానికీ, చదివేవాళ్ళకు చదవడానికీ ఎక్కువ సమయం పట్టదు కనక కవితలు రాసి పోస్ట్ చేసేవాడిని. తర్వాత తెలుగు సాహిత్యం కోసమే ప్రత్యేకంగా మొదలయిన తెలుసా గ్రూప్ లోనూ అదే కొనసాగింది. తొంభయి ఎనిమిదిలో ఈమాట వెబ్ పత్రిక ఆరంభించిన వారిలో ఒకరయిన  కె.వి.ఎస్.రామారావు గారి ప్రోద్బలంతో ఆ పత్రిక కోసం కథలు రాయడం మళ్ళీ మొదలుపెట్టాను.  అప్పట్నుంచీ అడపాదడపా ఆ పత్రికకేనో, తానా, ఆటా మహాసభల సావెనీర్ల కోసమో ఆయా సంపాదక మిత్రులు అడిగినప్పుడు (సిగ్గుచేటు, కొన్నిసార్లు అడగ్గా అడగ్గా) రాస్తూ ఉన్నాను. అంచేత ఈ మధ్యకాలంలో నేను రాసిందేమన్నా ఉంటే ఆ పాపమూ పుణ్యమూ రాయించినవారికే చెందుతాయి (దీనికి అఫ్సర్‌గారికి!).

అసలు రాయడం వెనక కథ అది. ఇప్పుడు విషయానికి వద్దాం. నా రచనలపై అమెరికా ఎటువంటి ప్రభావం కలగజేసింది? అమెరికాలో అడుగు పెట్టకుంటే నా రాతలు కొనసాగేవేనా? చెప్పడం కష్టం. కథలు రాయడానికే పరిమితమయి ఉండేవాడినేమో! సాహితీమిత్రులు దొరకడమూ, సాహిత్యచర్చలు అందుబాటులోకి రావడమూ వంటి వాటికి అమెరికా రావడం కంటే ఇంటర్నెట్ కారణమేమో! కానీ ఇక్కడికి రాకపోయుంటే ఇంటర్నెట్ ఇంత విరివిగా వాడగలిగేవాడినా అన్నదీ ఒక అనుమానం. అదొక పార్శ్వం. ఇక అసలు విషయానికి వద్దాం. ఇక్కడి జీవితం నా ఆలోచనను ప్రభావితం చేసి నా రచనల్లో ప్రతిఫలించిందా? ఇండియాలో ఉన్నప్పటికంటే భిన్నంగా రాశానా? ఇదీ కష్టమైన ప్రశ్నే. మొదటినుంచీ మూసలో వొదగని కథలే రాద్దామన్న ఆలోచన ఉండేది (అదే ఒక మూస ఆలోచన అని తెలియదు కనక:-). నా అభిప్రాయాల్ని సూచనప్రాయంగా వెల్లడించడమే గానీ వాటిని రుద్దడమూ, లోకమంతా నా అభిమతానికి అనుగుణంగానే నడుచుకోవాలనుకోవడమూ అప్పుడూ చేసిన గుర్తు లేదు. పాఠకుడికంటే ఒక మెట్టు పైనున్నానన్న భ్రమ కూడా అప్పుడూ లేదనుకుంటాను. తీర్పులూ, బుద్ధులూ చెప్పడం కాక సానుభూతితో అర్థం చేసుకునే ప్రయత్నమే అప్పుడూ చేశాననుకుంటాను. అయితే అప్పుడు నేనేం చేస్తున్నానో, చేయడం లేదో అంత స్పష్టత ఉండేది కాదేమో! భిన్న జాతుల, భిన్న సంస్కృతుల సంపర్కంతో ఉదారవాదం నాలో బలపడి ఉండొచ్చు. అన్నిటికీ ఒకేరంగు పులమడం కాక ఏడు రంగులూ ఉండడాన్ని ఇష్టపడటం అలవాటయి ఉండొచ్చు. నాకు ఇవన్నీ తెలుసుకుందుకూ, ఇంకేం తెలియవో కూడా తెలుసుకునేందుకూ ఇక్కడి జీవితం కంటే కూడా ఇంటర్నెట్లో దొరికే సమాచారమూ, పత్రికలూ దోహదపడ్డాయి, పడుతున్నాయి.

చదవడంలో వచ్చిన మార్పు క్రమంగా కాల్పనికేతర సాహిత్యాన్ని ఇష్టపడడం. ఉద్వేగాలనుంచి ఆలోచన్లవైపు మొగ్గుతున్నానేమో! తెలుసుకోవలసింది ఎంతో ఉంది. ఇక్కడి కాల్పనిక సాహిత్యంలో కథలే ఎక్కువ చదివాను. ప్రత్యేకంగా అభిమాన రచయితలు ఎవరూ లేరు కానీ ఇష్టపడ్డ రచయితలు చాలామంది ఉన్నారు. హద్దులు చెరుపుతున్న కథ విశ్వరూపం అవలోకిస్తున్నాను. వస్తువు విషయానికి వస్తే ఇక్కడి జీవితం మాత్రమే ఆధారంగా చేసుకుని రాసినవి తక్కువే. ఇక్కడికి వచ్చాక రాసిన మొదటి కథ “భేష్!” అక్కడ జరిగినట్లు రాసిన కథే. “ఎక్కడ చెడు జరిగినా ఖండించడానికీ, పూనుకుని స్వయంగా దండించడానికీ ముందుకుదూకే మనకి చిన్న మంచిపని చేసినవాళ్లనూ అభినందించాలనీ, మెచ్చుకోవాలనీ ఆలోచనే రాదు” అన్న అక్కడి నా పరిశీలన ఆధారంగా దాన్ని విశ్లేషించుకుంటూ రాసిందది. తర్వాత రాసిన కథ ఈమాట మొదటి సంచిక కోసం. “మధ్య వ్యవధిలో నీడలు” ఇక్కడ విడిపోవడానికి సిద్ధపడిన కొత్త జంట గురించి.

ఇక్కడి వాళ్ల కథలు తక్కువ రాయడానికి కారణం ఎంత తెలిసినా పైపైన మాత్రమే చూస్తున్న వీళ్ళ జీవితాలను లోతుగా తరచి చూడలేకపోవడం కావొచ్చు. ఇక్కడ ప్రైవసీకి ప్రాధాన్యత ఎక్కువ. అక్కడ అయినట్టు జీవితాలంత బట్టబయలు కావు. ఇక్కడికి వచ్చిన వాళ్ల బతుకులన్నీ దాదాపు ఒకేగాడిలో నడవడం వల్లనూ కావొచ్చు. లేని నాటకీయతను – సంభాషణల్లోనూ, సంఘటనల్లోనూ -  చొప్పించడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అసలు నాకు ఇక్కడి మన చరిత్రనూ, మానవ జీవితాన్నీ కాక ఎక్కడి జీవితాల్లోనయినా మాటల్లో పెట్టలేని, మరు నిమిషంలో పారిపోయే భావనలని మాత్రమే పట్టుకోవాలన్న కోరికే ఉందేమో! మొత్తానికి వస్తుపరంగా ఇక్కడి జీవితం పెద్దప్రభావం చూపలేదనే అనిపిస్తుంది. అందుకు విచారమూ లేదు, సంతోషమూ పడను. నా పాత్రలేవీ నిజ జీవితాల్లోంచి నడిచి వచ్చినవి కావు, రక్తమాంసాలతో జీవం తొణికిసలాడేవీ కాదు. ఆధారాలు లేవని చెప్పలేనేమో కానీ అన్నీ ఊహాజనితమే. అవి కూడా సారాంశమాత్రంగానే నా కథల్లో కనపడతాయనుకుంటాను. అందులోనూ అప్పటికీ ఇప్పటికీ తేడా లేనట్లే. ఇక శైలీ కథనాలలో కనిపించే మార్పులకు కాలమూ, రాతలో అనుభవమే కానీ ఇక్కడి జీవితం కారణం కానేకాదు.