కవిత్వం

అదే రోడ్డు

జూన్ 2015

రోడ్డంతా ఖాళీగా వుంటుంది. కొన్ని సంవత్సరాలుగా మనుషుల
జాడ లేనట్లు. రాలిపడ్డ ఆకులు జాలిగా చూస్తుంటాయి. గాలి
మాట లేదు. సిలుం పట్టిన పాత బండి గోడకు ఆనించి
వుంది. రంగు వెలిసిన ఆకాశం. నెర్రెలు బాసిన నేల.

వెనక్కి వెళ్ళనే కూడదు. కేవలం నమ్మకం మీద నడక
సాగించాలి. ఈ దారి గుండానే ప్రయాణించి అటు చివర
ఒకరు ఎదురు చూస్తున్నారు. చెవులు రిక్కించి,
కళ్ళు రస్తాకు అప్పగించి. శ్వాస చివరంచున నిలబడి.

నేననుకోవడం, ఈసారి తప్పకుండా కలుసుకుంటాం.
పరిచయం లేనివాళ్ళను కలపడానికే కదూ, ప్రపంచం
వున్నది?!