కథ

పాపం పరాంకుశం!

జూన్ 2015

రోజెందుకో సెలవు కావడంతో, వేరే పనులేవీ లేకపొవడంతో, కాఫీ తాగి ప్రొద్దున్నే టీవీ ముందర, సోఫాలో కూలబడ్డాడు పరాంకుశం. భార్య మండోదరి పిల్లల్ని బడికి పంపే హడావిడిలో వంటింట్లో వుంది. పేపరు అటు ఇటు తిరగేసి టీవీ లో చానల్స్ మార్చి మార్చి చూస్తూ ‘రాసి-వాసి’ దగ్గర సెటిల్ అయ్యాడు. అన్ని రకాల బొట్లూ పెట్టి, చిత్రంగా నుదిటి మధ్య రూపాయంత నల్ల చుక్క బెట్టి, గడ్డాలు పెంచిన, నల్ల తలపాగా పెట్టిన, ఎర్ర గుడ్డల సిధ్ధాంతి ఒకడు ఆ రోజు రాసి ఫలాలగురించి చెప్తున్నాడు. రాశుల వారీగా చివరెక్కడో ఉన్నా తన రాశి ఫలం వచ్చే వరకు ఓపిగ్గా వినడం మొదలెట్టాడు పరాంకుశం.

ఒక్కో రాశికి ఒక్కో రకంగా చెప్తూ , కొందరికి ‘ముక్కుమీద నీలాంజనీ కాటుక పెట్టుకో’మని, ‘కింద పెదవికింద గంగ సిందూరం పెట్టుకొ’మ్మని , ‘రావి చెట్టు వేరు నూట రెండు సార్లు కొరక’మనీ, ‘తెల్లజిల్లేడు పూలు మాల కట్టి వేసుకో’మనీ, ‘ఆముదంతో చేసిన దీపారాధన నెత్తి మీద పెట్టుకు తిరగ’మనీ , ‘అభాండాయ విభాండాయ స్వాహా’ అంటూ నూట ఎనిమిది సార్లూ పొర్లు దండాలు పెట్ట’మనీ , ‘ముక్కుపొడుము రంగు దుస్తులు కట్టుకుని నెత్తి మీద నీలంరంగు టోపీ పెట్టుకొ’మ్మనీ, ‘బాగా కాల్చిన వత్తిని నలిపి వొంటికి రుద్దుకొ’మ్మనీ, ‘వూరి చివర ఉన్న మర్రి వేరు మూడు సార్లు నమిలి ఉమ్మ’మని ఒక్కో రాశి వారికి చెబుతున్నాడు.

అసలే ఈ మధ్య ఆఫీసులో బాసుతో సరిగా లేని పరాంకుశం, తన రాశి ఫలాలు ‘ఎలా ఉంటాయో’నని ఆసక్తిగా చూస్తున్నాడు. మీన రాశి ఫలం రానే వచ్చింది. సిధ్ధాంతి ఇలా చెప్పసాగాడు. “ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఎవరితో ఒకరితో, ఏదొ జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో, అలా జరగకోడదని అనుకుంటారు. కానీ అన్నీ మనమనుకున్నట్లు జరగవు. ఈ వారం మీరు తక్కువగా మాట్లాడితే మంచిది. శనిగ్రహం యొక్క చెడు దృష్టి పోవాలంటే ‘ఢం ఢం డః డః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. రెండు గంటలకోసారి కాచి చల్లార్చిన కొబ్బరినూనెలో ఆరావళీ కుంకుమను కలిపి ఒకచెంచా చప్పరిస్తూ ఉండాలి. పగల కొట్టిన కొబ్బరి చిప్ప పెంకును జేబులో పెట్టుకొని తిరగాలి” అంటూ ముగించాడు.

భార్య ప్రోద్బలంతో ఇటువంటి వన్నీ నమ్మడం మొదలెట్టిన పరాంకుశం ఉన్న పళంగా లేచి పాంటు చొక్కా వేసుకొన్నాడు. వాళ్ళావిడ ఇంట్లోంచి పిలుస్తున్నా వినకుండా స్కూటర్ బయటకు తీసాడు. ఈ హడావిడి చూసి వాళ్ళ ఆవిడ మండోదరి బయటకు వచ్చింది ‘ఎక్కడికెళుతున్నా’రంటూ. ‘అత్యవసరంగా ఆరావళీ కుంకుమా, కొబ్బరి నూనె డబ్బా, కొబ్బరి కాయ తేవడానికని’ చెప్పాడు. ‘ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? తొమ్మిది కూడా కాలేదు! ఆరావళి కుంకుమ అమ్మే షాపులు తెరవరు. ఐనా పోయిన వారం నేను తెచ్చుకొంటానంటే వద్దన్నారు సంగతేమిటొ ?’ అంది. ‘అసలే బాసుతొ గొడవలు, సర్లే మళ్ళీ వెళతాను’ అని ఇంట్లోకొచ్చాడు. వచ్చి మళ్ళీ హాల్లో కూర్చున్న పరాంకుశం రాసి పెట్టుకొన్న మంత్రం ‘ఢం ఢం డః డః’ చదవడం మొదలుపెట్టాడు. ఇంతలో వాళ్ళావిడ ప్లేట్లో ఒక ఇడ్లీ లాంటి పదార్థం పెట్టుకొచ్చింది. దాని పైనంతా కారట్ ముక్కలూ, కొతిమీర అన్నిటితో గార్నిష్ చేసి తెచ్చి ‘వేడి వేడి గా పులుసిడ్లీ రెడి’ అంది. అది చింతపండు రంగులో, అటు దోశ లాగా ఇటు దిబ్బరొట్టె లాగా కాకుండా కుల్ఫి కుండలాగ గుండ్రంగా ఉంది.

‘ఢం ఢం డః డః’ అంటూనే ‘ఇదెమిట్రా బాబూ’ అన్నాడు. ‘ఇవాళ ఎక్కువగా మాట్లాడడం మీకు మంచిది కాదని చెప్పారుగా. మండోదరి కిచెన్లో స్పెషల్ న్యూటిషస్ ఇడ్లీ. దీనికి కావలసిన పదార్ధాలు -వారం రోజులుగా నానిన ఇడ్లీ పిండి, గోరుచిక్కుళ్ళు, చింతపండు, పప్పులు, ఉప్పులు అన్ని! అది తిని చూసి చెప్పండి. దీంట్లో 40% కార్బోహైడ్రేట్లు 30% ప్రొటీన్లు, 25% ఫైబర్ , 5% ఫాట్స్ ఉంటాయి. తిని చూసి చెప్పండి’ అంది. ఫోర్కుతో 4-5 సార్లు పొడిచినా కూడా పొడవలేక పోయాడు పరాంకుశం. అతికష్టం మీద నోట్లో పెట్టుక్కొరికాడు. పొడవుగా ఉడికీ ఉడకనీ చిక్కుడు కాయ ఒకటి బయటకు వచ్చింది.

‘ఇవి నేను రోజూ చూసే వంటల ప్రోగ్రాంలోవి. గుప్పెడు ఇడ్లీ పిండి, రెండు గుప్పెళ్ళు గోరు చిక్కుళ్ళు. బాగుందా?’ అని అడిగింది. ‘బానే వుంది కాని నేను ఎప్పుడూ తినలేదు’ అంటూ మొహమాటంగా ముగించాడు. ‘నేనెటూ గుడికెళుతున్నా. ఆరావళీ కుంకుమ, కొబ్బరి కాయ, కొబ్బరి నూనె డబ్బా తెస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి’ అంది.

మళ్ళీ టీవీ ముందు కూలబడ్డాడు పరాంకుశం. ఏదో సీరియలొస్తూంది. అది ఒక కోడలు, అత్తా మావల్ని హత్య చేసే సీరియల్. ఛానల్ నం. 135 లో వార్తలు ఒక్కొకటి పదేసి సార్లు చదువుతున్నారు. ఇంతలో మొబైల్ గణ గణ మోగింది. బాసు నుండి కాల్.

‘ప్రాజెక్టుకి సంబంధించిన ‘ఎక్స్పెండిచర్ స్టేట్మెంటు’ సిధ్ధం ఐందో లేదో’ అంటూ. ‘సిధ్ధం చేసి మెయిల్ పెడతా’ నన్నాడు. మళ్ళీ చానళ్లు మారుస్తుండగా కునుకు పట్టింది. మండోదరి రానే వచ్చింది. ‘అబ్బబ్బా, ఏమి ఎండలు? ఈ ఆరావళీ కుంకుమ కి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? ఇపుడే ఆరు లారీల లోడ్ దిగింది. వచ్చింది వచ్చినట్లే అయిపోతోంది. చాలా కష్టపడి పావుకిలో సంపాదించాను.’ అంది. ‘అంతెందుకు? వంద గ్రాములు తీసుకోకపొయ్యావా?’ అన్నాడు.

‘పావుకిలొ కు తక్కువ ఇవ్వడంలేదు బాబూ’ అంది వెటకారంగా. ‘అయితే ఒక గుడ్ న్యూస్, మన యేరియా లోనే ఈ సామాన్ల బ్రాంచి పెడుతున్నారట.’ అంది.హడావిడి గా కొబ్బరి నూనె కాచి దాంట్లో ఒక చెంచా ఆరావళీ కుంకుమను కలిపాడు. కొబ్బరి కాయ కొట్టి, ఒక పెంకు చొక్కా జేబులో పెట్టుకొన్నాడు.

మళ్ళీ టీవీ ఆన్ చేసాడు. ‘మా ఇంట్లో వంట-మీ ఇంట్లో గంట’ ప్రోగ్రాం వస్తోంది. చానల్ మార్చాడు. ‘గరిట పట్టు- గోల పెట్టు’ కార్యక్రమం నడుస్తోంది. ఇంకో చానల్ పెట్టాడు. ‘వంటింటి ముచ్చట్లు’ అనె ప్రోగ్రాం. ఏదో వెరైటీగా ఉందని చూస్తున్నాడు. వాళ్ళు సగ్గు బియ్యం పచ్చడి, బార్లీ చారు గురించీ చెబుతున్నారు. ‘ఇవెఫ్ఫుడూ ట్రై చెయ్యలేదే’ అనుకుంటూ పక్కన కూర్చున్న మండోదరి కిచెన్లో కెళ్ళింది.

అదేపనిగా కొబ్బరి నూనె చప్పరిస్తున్నాడో ఏమో, కడుపంతా హల్చల్గ ఉంది. అతికష్టం మీద కడుపు నొప్పెడుతున్నా లంచ్ ముగించి మళ్ళీ టీవీ ముందు చేరాడు. ‘ఢం ఢం డః డః’ అంటూండగానే మొబైల్ మోగింది. మళ్ళీ బాస్. ‘ఏవయ్యా పరాంకుశం నాకొంట్లో బాలేదు. రేపాఫీసుకొస్తానో లేదో తెలీదు. ఇవాళ ఎలాగైనా మెయిల్ చెయ్యాల్సిందే.’ అన్నాడు. ‘ఐదింటికల్లా పంపిస్తాన’న్నాడు. సినిమా పాటలు, జోకులు, వార్తలు, ఇలా మార్చి మార్చి చూస్తుండగా కడుపులో నొప్పి మొదలైంది. ‘ఈ ఆరావళీ కుంకం నూనె కాదు కానీ ఏం చెస్తుందో ఏమో !’ అనుకుంటూ ఓ టాబ్లెట్ మింగి మళ్ళీ కూర్చున్నాడు.

‘పేరులో పెన్నిధి’ అనే ప్రోగ్రాం వస్తోంది. పేరులో ఎన్ని అక్షరాలుండాలి, ఎన్ని సంఖ్యలుండాలో చెపుతున్నాడొకడు. ‘అసలే కలిసి రావట్లేద’నుకుంటూ, తెరపై పరిగెడుతున్న ఫోన్నంబరుకి ఫోన్ చేసాడు. పరాంకుశం పేరును అటూ ఇటూ పరిశీలించి, పేరు ముందు ‘ఛీ’ అని పెట్టుకొమ్మన్నాడు న్యూమరాలజిష్టు. ‘వీడి ముఖం’ అనుకుంటూ చానల్ మార్చాడు మళ్ళీ.

ఏదో వైద్య సలహాల కార్యక్రమం. ‘కడుపులో నొప్పి, అల్సర్స్’ అనే విషయం మీద సలహాలు. ఎక్కువగా నూనెలు తినడం వల్ల పేరుకుపొయిన కొవ్వును ట్యూబుల ద్వారా ఎలా బయటకు తీస్తారో చూపిస్తున్నారు. అసలే ఆరావళీ కుంకుమ నూనె తాగుతున్న పరాంకుశం ఠక్కున చానల్ మార్చాడు.

‘బర్రె కు పుట్టిన పంది పిల్ల’ అంటూ ‘ఫ్లాష్ బాంబ్’ అనే ప్రోగ్రాం వస్తోంది. బర్రెలు, పందులు, వాటి జెనిటిక్స్, బర్రెకు బర్రే పుట్టాలా, పంది పుట్టకోడదా, పుడితే ఏమవుతుంది అంటూ బ్రహ్మం గారి కాల ఙ్ఞానం తో కలిపి ప్రళయం రెండ్రోజుల్లో రాబోతోం’దంటూ ఊదరగొడుతోంది ఒక మిడి గుడ్ల ఏంకరు. విసిగిపోయి చానల్ మార్చాడు మళ్ళీ. ఈసారి చూసి మరింత భయపడ్డాడు. ‘వేస్కో కోకోకోల’ అంటూ 50 యేళ్ళున్న నలుగురాడవాళ్ళు విచిత్రంగా స్టెప్పులు వేస్తూ నృత్యాలు చేస్తున్నారు. కడుపంతా తిప్పి నట్లవడం తోటి రెస్ట్ రూం కెళ్ళొచ్చి మళ్ళీ కూర్చున్నాడు.

మండోదరి ఒక విచిత్రమైన ప్రోగ్రాం చూస్తూ చప్పట్లు కొడుతూ అరుస్తోంది. ‘ఏవిటబ్బా’ అని చూస్తే ఒకగది మధ్యలో ఒక బాల్చీ పెట్టి అటు చివర, ఇటు చివర ఇద్దరు ఆడవాళ్ళు నోట్లో నీళ్ళు పోసుకోని సరిగ్గా బాల్చీలో పడేట్టుగా ఉమ్ముతున్నారు. బాల్చీలో పడ్డప్పుడల్లా ఏంకరు ‘పుయ్యి’ మని చప్పుడు చేస్తోంది. ఎవరు ఎక్కువగా బాల్చీలో ఉమ్మితే వారికో గిఫ్ట్ హాంపరు. మతి పోయింది పరాంకుశానికి.

మండోదరి మళ్ళా చానల్ మార్చింది. ఎవరో ఒక పండితుడు ధర్మ సందేహాలకు సమాధానాలు చెపుతున్నాడు ఐతే ప్రశ్నలడిగే వాళ్ళు మాత్రం ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నారు. ‘తలంటుకోడానికి కుంకుండుకాయలు ఐదు కొట్టాలా ఏడు కొట్టాలా’, ‘తుమ్మిన తరువాత కుడివైపుకి తిరిగి నడవాలా, ఎడమ వైపుకి తిరిగి నడవాలా’ అని, ‘గర్భిణీ కుక్క అరిస్తే మంచిదేనా’ అని, ‘అగర్బత్తులు వెలిగించినప్పుడు ముక్కు మూసుకోవాలా’ అని ఇలా చిత్రమైన ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. మండోదరి వీటి సమాధానాల్ని చాలా అరాధనా భావంతో వింటోంది.

ఇంతలో మళ్ళీ బాసు దగ్గర్నుంచి ఫోను. బాసు ఇలా అడుగుతాడని తెలిసి రాత్రే సిధ్ధం చేసి పెట్టాడు పరాంకుశం. ‘సెలవు రోజు కూడా పని చేస్తున్నాడన్న ఫీలింగ్ ఇవ్వా’లని ఇప్పటి దాకా ఆపాడు. కడుపులో మళ్ళీ గేర్ బాక్స్ కదిలినట్టు చప్పుడు. ‘ఇక ఆరావళీ నూనె ఆపేస్తానే’ అంటూ అడిగాడు మండోదరిని. ‘ఇంకొక్క చెంచా తాగి ఆపేయ’ మని సలహా చెప్పింది. బాస్ కు మెయిల్ పంపించి అలా బయటకెళ్ళొస్తానని తన స్నేహితుడింటికి వెళ్ళాడు.

వాళ్ళంతా టీవీ గది లో కూర్చొని టీవీ చూస్తున్నారు. ‘గండు పిల్లి అత్త, చెవుల పిల్లి కోడళ్ళ ’నే సీరియల్. వాళ్ళందరి కళ్ళు కళ్ళకలక వచ్చినట్లుగా ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. వారి వైపు జాలిగా చూసాడు పరాంకుశం. ‘అలా బయటకొస్తావా?’ అంటూ అడిగి స్నేహితుణ్ణి తేరిపార చూసి కంగుతిన్నాడు పరాంకుశం. ముక్కు మీద నల్ల బొట్టు, పెదవి కింద ఎర్ర బొట్టు చూసి ‘ఓ వీడుకూడా నాలాంటి బాధితుడే’ అనుకొని నవ్వుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది.

‘హలో సార్, పెట్టేశా, పెట్టేశా, చెక్ చేసుకోండి’ అని అరిచాడు. ‘ఏం పెట్టావ్ నా బొంద, నువు ముందు అర్జెంటుగా నోబుల్ హాస్పిటల్ కి వచ్చేసెయ్, అమ్మా!’ అని మూల్గి కట్ చేసాడు. ‘మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టాడనుకుంటా. అసలే టైం బాలేదు. ‘ఢం ఢం డః డః’ అనుకుంటూ ఆటోలో వెళ్ళాడు. వెళ్ళేసరికి బాస్ భార్యా పిల్లలు ఒక మంచం చుట్టూ గుమ్మి గూడి ‘ఢం ఢం డః డః’ అని అరుస్తున్నారు. డాక్టర్ దూరంగా నిలబడి పిచ్చి చూపులు చూస్తున్నాడు. బాస్ మంచం మీద బోర్లా పడున్నాడు. నడుం కిందంతా పెద్ద బాండేజు. కాళ్ళు రొండూ పైకి లాగి కట్టి వున్నాయి. ఆందోళనగా బాస్ భార్యను అడిగాడు ‘ఎమైంది’ అని. ఆమె కళ్ళు తుడుచుకుంటూ ‘వద్దంటే వినకుండా, రాశీ వాసీ ప్రోగ్రాం చూసి కత్తుల్లాంటి రెండు కొబ్బరి పెంకులు పాంటు వెనక జేబులో పెట్టుకొని, మెట్ల మీద జారి పడ్డాడు.’ అని చెప్పింది. ‘ఆరావళీ నూనె తాగలేదా సార్?’ అనేంతలో బాసు భార్య, ‘నేను చెప్తే వినలేదుగా’ అంటూ సంచీ లోంచొక సీసా తీసింది. దాన్నిండా ఎర్రగా ఆరావళి తైలం. అంతలో బాసు అటు ఇటు కదల్లేక పెద్దగా అరిచాడు. వారం రోజుల పాటు ‘తాను రానం’టూ బాధ్యతలన్నీ అప్పగించాడు. ‘అసలే ఈ వారం పెళ్ళి కెళ్ళాలి. మండోదరి ఏమనుకుంటుందో’ అనుకుంటూ పై జేబులోంచి కొబ్బరి పెంకు తీసి కచ్చగా కాలవ లోకి విసిరేసాడు. అటుగా వస్తున్న ఒక ఆటోని పిలిచి కూర్చోబోయి మళ్ళీ నిర్ఘాంతపోయాడు. ఆటోలో ‘అభాండాయ విభాండాయ స్వాహా’ అనే బోర్డు. ‘108 పొర్లు దండాలు పెట్టించడు కదా!’ అనుకుంటూ చూస్తే, దాని చుట్టూ నానా మతాల తాయత్తులు, రక్ష రేకులు. ప్రక్కనే ‘ నీ దినము సంక్రమించినపుడు నీ కెవ్వరూ తోడు రాజాలరు’ అని ఉంది. ఎక్కకుండా భయంతో గుటకలు మింగ సాగాడు పరాంకుశం!

**** (*) ****