అనువాద నవల

రాజ్ఞి – రెండవ భాగం (‘SHE‘ by Sir H.Rider Haggard)

జూన్ 2015

విన్సే అలా ఉన్నట్లుండి చనిపోవటం కళాశాలలో కలకలం రేపింది. అయితే, ఎప్పటినుంచో జబ్బుగా ఉన్నాడని అందరికీ తెలిసిందే, వైద్యుడి ధృవ పత్రమూ దాన్ని బలపరుస్తూనే ఉంది. అందువల్ల శవపంచాయితీ ఏర్పాటు చేయలేదు. నిజానికి ఆ రోజుల్లో అటువంటి పంచాయితీలు కాస్త తక్కువగానే జరిగేవి , జనం ఒకంతట ఇష్టపడేవారు కాదు- అప్రతిష్ఠ వస్తుందని. నన్నూ ఎవరూ గుచ్చి గుచ్చి ప్రశ్నించ లేదు. తరచూ వచ్చేలాగే అతను చనిపోయిన రాత్రి కూడా విన్సే నా గదికి వచ్చి అవీ ఇవీ మాట్లాడాడని తప్ప ఎక్కువ వివరాలేమీ నేను ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అంత్యక్రియలు జరిగే రోజున విన్సే న్యాయవాది వచ్చి నాతోబాటు శ్మశానం వరకూ నడిచాడు. అతని గది లో దొరికిన పత్రాలూ మిగిలిన వస్తువులూ తనతో తీసుకు వెళ్ళాడు, విన్సే అప్పగించిన పెట్టె మాత్రం నా దగ్గరే ఉండిపోయింది. తర్వాత ఇంకో వారం దాకా నేను ఆ సంగతులేవీ పట్టించుకోలేకపోయాను , నా పరీక్షలు దగ్గరపడుతున్నాయి. చివరికి ఒక రోజున ఆఖరి పరీక్ష రాసి వచ్చి నా గదిలో వాలు కుర్చీలో వాలిపోయాను- అన్నీ బాగా రాశాననే తృప్తితో.

ఆ తెరిపి ఎంతో సేపు నిలవలేదు . అప్పటివరకూ చదువు కోసం అణిచిపెట్టుకున్న ఆలోచనలన్నీ నన్నుఒకేసారిగా ముట్టడించాయి. పదే పదే ఆ రాత్రి విన్సే చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. వాటికి సంబంధించి కొత్తగా ఏమైనా నాకు తెలుస్తుందా ? ఒకవేళ తెలియకపోతే ఆ వింత పెట్టె ని ఏం చేయాలి ? ఆ అర్థరాత్రి అకస్మాత్తుగా విన్సే రావటం, తన చావు గురించి తను చెప్పిన జోస్యం ఆ రాత్రే ఫలించటం, నా నుంచి అతను తీసుకున్న విడ్డూరపు వాగ్దానం , నేనేమైనా మోసం తలపెడితే- తను చనిపోయినా ఇంకో లోకం నుంచి నన్ను హెచ్చరిస్తానని నొక్కి చెప్పటం…. తల్చుకుని మనసు తీవ్రంగా కలత పడింది. ఒకవేళ విన్సే ఆత్మహత్య గాని చేసుకోలేదు కదా ? అవునేమో…అతను చెప్పిన ఆ అన్వేషణ దేని గురించి అయిఉంటుంది ? ఇదంతా చాలా విపరీతంగా అనిపించి నాకు భయం వేయటం మొదలైంది. స్వతహా నేను అంత త్వరగా బెదిరే మనిషినేమీ కాదు గాని రాను రాను ఈ గందరగోళం తో నాకు సంబంధం లేకపోతే బావుండుననిపిస్తూ ఉంది. ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రోజునా అనుకుంటూనే ఉన్నాను, నిజంగా నాకే సంబంధమూ లేకపోయిఉంటే ఎంత నయంగా ఉండేదని…

నేను అలా కూర్చుని బుర్ర వేడెక్కించుకుంటూ ఉండగానే తపాలా మనిషి తలుపు తట్టి నాకొక ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు . అది విన్సే న్యాయవాది నుంచి వచ్చింది- నా కర్తవ్యం గురించేనని వెంటనే తట్టింది. ఇప్పటికీ నా దగ్గర ఆ ఉత్తరం భద్రంగా ఉంది, అందులో ఇలా ఉంది.

అయ్యా,
మేము కీర్తిశేషులైన ఎం.ఎల్. విన్సే గారి లావాదేవీలు చూస్తూ ఉంటాము. ఆయన వీలునామా రాసిఉంచారు, దాని నకలు ని మీకు పంపుతున్నాము. దాన్ని అమలు చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. ఆ ప్రకారంగా,ఆయన కుమారుడు, పసివాడైన లియో ను సం రక్షించే షరతు కు లోబడి, విన్సే గారి ఆస్తిలో సగభాగాన్ని మీరు జీవితాంతమూ అనుభవించవచ్చు. విన్సే గారు నోటిమాటతోనూ రాత పూర్వకంగానూ మాకు అతి స్పష్టమైన సూచనలు ఇచ్చి ఉన్నారు గనుక వాటిని మేము తూచా తప్పకుండా పాటించవలసిఉంది. లేకపోయినట్లైతే , ఆ వీలునామా లో విషయాలు గొప్ప వింతగా ఉన్నాయి గనుక- పిల్లవాడి శ్రేయస్సు దృష్ట్యా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చేది. వీలునామా రాసిన వారు నిఖార్సైన పెద్దమనిషీ చాలా సూక్ష్మబుద్ధి కలవాడూ మేధావీ అయిఉండటం వల్లనూ, ఆయనకు దగ్గర బంధువులెవరూ జీవించి లేనందువల్లనూ కూడా మేము ఆ వీలునామా కు వ్యతిరేకంగా న్యాయస్థానానికి విన్నవించుకోవటం లేదని మనవి.
మీరు ఆజ్ఞాపించినట్లైతే లియోనూ మీకు రావలసిన మొత్తాన్నీ మీకు అతి త్వరలో అందజేస్తాము.
చిత్తగించవలెను.
ఇట్లు మీ నమ్మకస్తులైన
జాఫ్రే మరియు జోర్డాన్

ఉత్తరాన్ని పక్కనపెట్టి విల్లుని ఆసాంతం చదివాను. న్యాయశాస్త్రపు పరిభాషని పకడ్బందీ గా పాటించారు , అది నాకు బొత్తిగా అర్థం కాలేదనే చెప్పాలి. నాకు తెలిసినంతవరకూ విన్సే ఆ చివరి రాత్రి చెప్పుకొచ్చిన విషయాలే అందులో ఉన్నాయి. అయితే అదంతా నిజమేనన్నమాట…నేను పిల్లవాడి బాధ్యత తీసుకోవలసిందే ! ! అప్పుడు విన్సే , పెట్టె తోబాటు ఇచ్చి ఉన్న ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. వెళ్ళి దాన్ని తెరిచి చూశాను. అందులో లియో కి ఇరవై అయిదేళ్ళు వచ్చిన రోజు న ఏం చేయాలో చెప్పి ఉంది. అదిగాక పిల్లవాడి చదువు గురించి- అతను గ్రీక్ భాషా సాహిత్యాలు నేర్చుకోవాలి, గణిత శాస్త్రాన్ని పూర్తిగా మథించాలి- అరబిక్ భాష లో సమగ్రమైన పరిజ్ఞానాన్ని సాధించాలి. చివరలో- ఒకవేళ అతను ఇరవై అయిదో యేడు వచ్చేలోపు మరణిస్తే [ అలా జరిగే అవకాశం లేదనే విన్సే భావిస్తున్నట్లు రాశారు] నేనే ఆ పెట్టెని తెరిచి అందులో చెప్పినదాని ప్రకారం చేయాలి. నాకు అలా చేయటం సబబుగా అనిపించకపోతే ఆ సరంజామా ను మొత్తాన్నీ ధ్వంసం చేయాలి- ఎట్టి పరిస్థితులలోనూ వేరేవారికి దాన్ని అందజేయకూడదు.

కొత్తగా తెలిసిందీ నిరాకరించవలసిందీ ఏమీ లేదు గనుక, ఆ న్యాయవాదులకి నేను సిద్ధంగా ఉన్నాననీ పది రోజుల్లో పిల్లవాడినీ ఆస్తి పత్రాలనీ నాకు పంపించవచ్చుననీ తెలియజేశాను. కళాశాల అధికారుల దగ్గరికి వెళ్ళి , చెప్పగలిగినంతగా, విషయాన్ని వివరించాను. నాకు త్వరలో ఫెలోషిప్ ఇవ్వబోతున్నారని తెలిసిందే- సరిగా ఆ సమయం లో, నేను వివాహితుడిని కూడా కాను గనుక , ఒక చిన్న పిల్లవాడిని తెచ్చి పెంచుకునేందుకు వాళ్ళు ఒకంతట ఒప్పుకోలేదు. ఎంతో బ్రతిమిలాడాక, పిల్లవాడు నా దగ్గరికి రాగానే నేను కళాశాలలో నాకు ఇవ్వబడిన గదులు ఖాళీ చేసి వేరే ఇల్లు తీసుకునే షరతు మీద వాళ్ళు అంగీకరించారు. ఎలాగో తంటాలు పడి, కళాశాలకి దగ్గరగానే , మంచి ఇంటిని అద్దెకి తీసుకున్నాను. ఇక వాడి ఆలనా పాలనా చూసేందుకు ఒక దాదిని నియమించవలసి ఉంది. నా బ్రహ్మచారి కొంపలోకి ఒక స్త్రీని, సేవకురాలిగా అయినా సరే, తీసుకురావటం నాకు నచ్చలేదు, పైపెచ్చు వాడి ఆపేక్ష లో ఆ స్త్రీకి భాగం ఇవ్వటమూ నాకు ఇష్టం కాలేదు. ఆడవాళ్ళ పెంపకం ఖచ్చితంగా అవసరమయే వయసు వాడికి దాటిపోయింది గనుక, ఆ నిమిత్తం ఒక పురుషుడినే నియమించాలనుకున్నాను. కొంత ప్రయత్నించిన మీదట నాకు సరిపడే మనిషి దొరికాడు. అతను ఇదివరకు ఒక గుర్రపుసాలలో పనిచేసి ఉన్నాడు. మొత్తం పదిహేడు మంది సంతానం ఉన్న కుటుంబం లోంచి వచ్చాడు గనుక పసిపిల్లల బాగోగులు బాగానే చూడగలడు. గుండ్రటి మొహం తో సాధువుగా, మర్యాదస్తుడిలాగా కనిపించే యువకుడు, జాబ్ అతని పేరు. లియో ను పెంచే పనికి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నగరానికి వెళ్ళి ఇనప పెట్టెని భద్రం గా బాంక్ లాకర్ లో దాచాను. పిల్లల పెంపకానికి సంబంధించిన నాలుగైదు పుస్తకాలని వెతికి కొన్నాను. వాటిలో రాసిఉన్నదంతా ముందు నేను చదువుకుని తర్వాత జాబ్ కి చదివి వినిపించాను. ఇక వాళ్ళు లియోని పంపించటమే ఆలస్యం.

ఎట్టకేలకి వాడు వచ్చేశాడు. వాడినీ, దాదినీ ఒక పెద్దవయసు నౌకరు తీసుకువచ్చాడు, లియోని విడిచిపెట్టలేక వాళ్ళిద్దరూ, పాపం బాగా ఏడ్చా రు. చాలా ముద్దుగా ఉన్నాడు లియో, అంత అందమైన పిల్లవాడిని అంతవరకూ నేను చూడలేదు. వాడి కళ్ళు మబ్బు రంగులో ఉన్నాయి, నుదురు విశాలంగా ఉంది. అంత చిన్న వయసులోనే ముఖ కవళికలు తీర్చిదిద్దినట్లున్నాయి. అన్నిటికన్న సొగసైనది వాడి జుట్టు. అది బంగారు రంగులో, ఉంగరాలు తిరిగి, వాడి చక్కని తల మీద శ్రద్ధగా అమర్చినట్లు కనిపిస్తోంది. దాదీ నౌకరూ వెళ్ళిపోతుంటే లియో కూడా కొద్దిగా ఏడ్చాడు… కాసేపటికి ఊరుకున్నాడు.

ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. కిటికీ లోంచి పడుతున్న సూర్యకాంతి వాడి బంగారపు జుట్టు తో ఆడుకుంటూ ఉంది. తల ఒకవైపుకి వాల్చి మమ్మల్ని తేరిపారచూశాడు. నేను వాడిని దగ్గరికి రమ్మని పిలిచాను. జాబ్ నోటితో ‘ ళో, ళో, ళో ‘ అని శబ్దం చేస్తున్నాడు. ఎలాంటి పిల్లలైనా ఆ ధ్వని విని , నెమ్మది పడతారని జాబ్ కి గట్టి నమ్మకం లా ఉంది. అక్కడే ఉన్న వికారపు కొయ్య గుర్రాన్ని అటూ ఇటూ, అటూ ఇటూ…ఆపకుండా ఊపటం మొదలుపెట్టాడు. అదంతా బొత్తిగా బుర్ర తక్కువ వ్యవహారంగా అనిపించింది నాకు. కొద్ది నిమిషాలు అలా గడిచాక, లియో ఉన్నట్లుండి చేతులు చాపి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేశాడు.

” నువ్వు నాకిష్టం ” చెప్పాడు వాడు… ” నువ్వు బాలేవు, కాని మంచాడివి ”

పది నిమిషాల అనంతరం లియో తృప్తిగా వెన్న పూసిన రొట్టె తింటున్నాడు. దానికి జాం రాయాలని జాబ్ చాలా అనుకున్నాడు గానీ, నేను చదివిన పుస్తకాలలో ఎక్కువ పంచదార పిల్లలకి మంచిది కాదని ఉంది – అందుకని వద్దన్నాను.

అతి కొద్ది కాలం లోనే లియో కళాశాలలో అందరికీ ఇష్టుడైపోయాడు. అడ్డొచ్చే నియమాలన్నిటినీ దాటేసి, వాడు అక్కడ స్వేచ్ఛావిహారం చేయటం మొదలుపెట్టాడు. అన్ని నిబంధనలూ వాడి కోసమని సడలించబడ్డాయి. వాడికి ప్రతివారినుంచీ లెక్కలేనన్ని కానుకలు లభిస్తూ ఉండేవి. అప్పట్లో ఒక వృద్ధుడైన అధ్యాపకుడు ఉండేవాడు. బాగా పెడసరం మనిషి, చిన్నపిల్లని చూస్తే మండిపడతాడనుకునేవారు. అలాంటివాడికి ఏం పుట్టేదో, లియోని తన గదికి తీసుకుపోయి బోలె డేసి మిఠాయిలు తినిపించి, ఎవరికీ చెప్పద్దని వాడి చేత ఒట్టు పెట్టించుకుంటుండేవాడు. ఆయన లియోను ఎత్తుకుపోకుండా జాబ్ కాపలా కాస్తుండేవాడు. ” ఏం మనిషండీ బాబూ ! పద్ధతీ పాడూ ఉందా అని ? అన్నీ సవ్యంగా జరిగిఉంటే ఈ పాటికి తాతయ్య అయిఉండేవాడు కదా…జ్ఞానం ఉండద్దూ ? ” అనేవాడు జాబ్. ‘ అన్నీ సవ్యంగా జరగటం ‘ అంటే పెళ్ళి చేసుకోవటమని జాబ్ తాత్పర్యం …దాంతో మాకిద్దరికీ పోట్లాట మొదలయేది.

ఆ హాయయిన రోజులన్నిటి గురించీ రాసేందుకు ఇక్కడ చోటు చాలదు. వాటి జ్ఞాపకాలు అపురూపంగా నిలిచి ఉన్నాయి. కాలం గడిచేకొద్దీ లియో, నేనూ ఇంకా ఇంకా ఆప్యాయంగా దగ్గరయాం. చాలా కొద్దిమంది తండ్రీ కొడుకులు మా ఇద్దరిలాగా ఒకరినొకరు ప్రేమించుకుని ఉంటారు.

పసివాడు కుర్రవాడయాడు, కుర్రవాడు యువకుడయాడు. కాలం నిశ్చింతగా సాగిపోయింది. వాడు ఎదిగేకొద్దీ వాడి అందం పెరిగింది, దాంతోబాటు వాడి వివేకమూ పెరిగింది. పదిహేనేళ్ళు వచ్చేసరికి వాడిని ‘ బ్యూటీ ‘ అని పిలుస్తుండేవారు కళాశాలలో, నన్ను , చాటుగా [ ఎవరైనా ఊహించేటట్లే ] ‘ బీస్ట్ ‘ అని. ఒకసారి మేమిద్దరం వెళుతుంటే తుంటరివాడొకడు వెనకనుంచి ఆ పేర్లతో పిలిచాడు. లియోకి పట్టరానంత కోపం వచ్చి , నేను తరగతి గదిలోకి వెళ్ళగానే వాడిని పట్టుకుని చితగ్గొట్టాడు. నాకు తెలిశాకా వాడిని గట్టిగా మందలించలేదని అందరూ నొచ్చుకున్నారు. ఇంకొన్నేళ్ళకి మాకు కొత్త పేర్లు తగిలించారు. నన్నేమో ‘ ఛారన్ ‘ [1] అనీ లియోని గ్రీక్ దేవుడనీ పిలిచేవారు. వయసు మీరిన నా వికృతరూపం అలాగే ఉంది కనుక అది నాకు తగినపేరే. లియోకీ ఆ పేరు నూటికి నూరుపాళ్ళూ తగిందనేదానిలో అణుమాత్రమూ సందేహం లేదు. ఆ ఇరవై ఒక్కేళ్ళ వయసులో గ్రీక్ దేవుడు అపోలో విగ్రహం లా ఉండేవాడు. వాడి తో ఏ కొంచె మైనా పోల్చదగిన రూపాన్ని నేను చూడలేదు… వాడినుంచి కళ్ళు తిప్పుకోగలిగినవాళ్ళని అంతకన్నా చూడలేదు.

చాలా తెలివిగలవాడూ చురుకైనవాడూ అయాడు. కాని పండితుడు కాలేదు, అందుకు అవసరమైన స్తబ్దత అతనిలో లేదు. అతని విద్యాభ్యాసం లో తండ్రి చెప్పినట్లే చేశాము, ఫలితాలూ తృప్తికరంగానే వచ్చాయి… ముఖ్యంగా గ్రీక్, అరబిక్ భాష ల విషయం లో. అతనికి సాయం చేసేందుకని నేనూ అరబిక్ నేర్చుకున్నాను- రాను రాను అతను అందులో నన్నూ, మాకిద్దరికీ బోధించిన ఆచార్యుడినీ కూడా మించిపోయాడు. ప్రతి ఏటా, ఆకురాలేకాలం లో వేటాడేందుకో, చేపలు పట్టేందుకో- ఒకసారి స్కాట్లండ్ కీ, ఇంకోసారి నార్వే కీ కొన్నిసార్లు రష్యాకీవెళుతుండేవాళ్ళం.నాకుఆరెండువిద్యలలోనూమంచిప్రవేశంఉండేది,అతనునన్నుమించిన
ప్రవీణుడయాడు.

అతనికి పద్దెనిమిదేళ్ళు వచ్చాక కళాశాల వసతి గృహం లో చేర్చి నేను తిరిగి అక్కడి నా గదులలో ప్రవేశించాను. ఇరవై ఒక్కేళ్ళకి అతను పట్టా పుచ్చుకున్నాడు- అందరి లోకీ మొదటివాడుగా కాదుగానీ, ప్రథమ శ్రేణి లోనే వచ్చాడు. అప్పుడు, మొదటిసారిగా- తండ్రి చరిత్రను కొంత పరిచయం చేశాను అతనికి. సహజంగానే ఇంకా ఎక్కువ తెలుసుకునేందుకు కుతూహలం చూపించాడు. అప్పుడే మొత్తం తెలుసుకోవటం వీలవదనీ ఆ లోపు న్యాయశాస్త్రం కూడా చదువుకుంటే మంచిదనీ నేను సూచించాను. అతను నేను చెప్పినట్లే కేంబ్రిడ్జ్ లో న్యాయశాస్త్రం అభ్యసించాడు.

అతనితో నాకు ఒకే ఒక్క సమస్య వస్తుండేది- అతన్ని చూసిన ప్రతి అమ్మాయీ ప్రేమలో పడిపోతుండేది. వివరాల్లోకి వెళ్ళను గానీ నాకు, సరిపడా తలనొప్పులు అలా ఎదురైనమాట నిజం. అతనైతే బుద్ధిమంతుడే, అంతకన్నా ఇంకేమీ చెప్పలేను.

ఆఖరికి అతనికి ఇరవై అయిదేళ్ళు నిండాయి- అప్పుడు మొదలైంది, ఆ విచిత్రమైన భయంకరమైన చరిత్ర.

[ ఇంకా ఉంది]

[1] – Charon – గ్రీక్ పురాణాలలో మరణించిన వారి ఆత్మలను నది దాటించేవాడు. కోపిష్టి ముసలివాడుగా, వికృతమైనవాడు గా వర్ణిస్తారు. Aenid [ Virgil ] లోనూ ,Divine Comedy, Inferno [ Dante Alighieri ] లలోనూ ఇతని ప్రస్తావన వస్తుంది.

**** (*) ****