ఉదయం పదిగంటలవుతోంది. పొద్దున్నే లేచి బయల్దేరినా నా మ్యాప్ పై గుర్తు పెట్టుకున్న ప్రదేశాన్ని కనిపెట్టలేకపోయాను. టెన్నెస్సీ రాష్ట్రంలోని న్యాష్ విల్ పట్టణం నడిబొడ్డున ఉత్తర అమెరిక ఆదివాసి తెగల్లో (నార్త్ అమెరికన్ నేటివ్స్) ఒకటైన చెరోకి తెగకు సంబంధించిన గుర్తుల కోసం చూస్తున్నాను. ఎన్ని వీధులు తిరిగినా ఆ గుర్తుల జాడ కనిపించకపోగా, దారిలో నాకు ఎంతో ఇష్టమైన గాయకుడు జానీ క్యాష్ మ్యూజియం కనిపించింది కానీ ఎక్కడా కారు పార్క్ చెయ్యడానికి స్థలం దొరకలేదు.
పార్కింగ్ కోసం అరగంట ప్రయత్నం తరువాత, ఒడిలో పెట్టుకున్న మ్యాప్ ఇక తరువాత అనుకున్న ప్రదేశానికి వెళ్లాలని తొందరపెట్టింది. మామూలుగా అయితే పొద్దున్నే అనుకున్న పని జరగకపోతే చిరాకేసేది. ఈరోజు అలా లేదు. పదిహేనేళ్లుగా చెయ్యాలనికుంటున్న ప్రయాణం ఇప్పటికి వీలయ్యింది. మూడురోజులు నా ఆలోచనల్లో నేను ఉండబోతున్నాననే ఉత్సాహం ఒకవైపైతే మరోవైపు ఈ ప్రయాణపు రస్తా చరిత్ర గురించిన బాధ గుండెను మెలిపెడుతోంది. 1830ల చివర చెరోకి తెగకు చెందిన ఒక గుంపు టెన్నెస్సీ, ఆ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఓక్లహోమా రాష్ట్రంలో వాళ్లకు కేటాయించిన భూభాగానికి (రిజర్వేషన్స్) బలవంతంగా తరలి వెళ్లిన రస్తా అది. గడ్డకట్టించే చలిలో దాదాపు నాలుగు నెలల పాటు కాలి నడకన సాగిన ప్రయాణంలో వారు అక్కడక్కడ విడిది చేసిన ప్రదేశాల్ని సందర్శించాలని నా ప్రయత్నం.
న్యాష్ విల్ పట్టణం దాటగానే పంటపొలాలు మొదలయ్యాయి. దాదాపు రెండు గంటలు పంట పొలాల మీదుగా డ్రైవ్ చేసి హాప్కిన్స్ విల్ అనే వూరు చేరుకున్నాను. ఈ వూర్లో ఒక చిన్న మెమోరియల్ పార్కులో ఇద్దరు చెరోకి నాయకుల జ్ఞాపకార్థం రెండు విగ్రహాలు ఉన్నాయని గూగుల్ చెప్పింది. కొన్ని నిమిషాలు అక్కడ గడిపి మరో చోటికి వెళ్లాలని నా ప్లాన్.
హాప్కిన్స్ విల్ పట్టణం కాదు కానీ పెద్ద వూరే. వూరు పొలిమేరల్లో గద్ద ఒకటి నేల బారుగా ఎగురుతూ కనిపించింది. అమెరికాకు వచ్చిన కొత్తలో ఒక ఉత్తర అమెరికన్ ఆదివాసి నన్ను చూసి ‘నీ టోటెమ్ తోడేలు. గద్ద కూడా – ఏమంటే గద్ద ఎదురుపడితే నువ్వనుకున్న పని జరగదు.” ప్రతి ఒక్కరికి ఒక జంతువు ఆత్మ అండగా ఉంటుందని ఎన్నో అమెరికన్ ఆదివాసి తెగలలో నమ్మకం వుంది. దాన్నే టోటెమ్ అని అంటారు. నాకు వీటిపట్ల నమ్మకాల్లేవుగానీ అదేం విచిత్రమో గానీ గద్ద కనిపించినప్పుడల్లా అతని మాటలు గుర్తొస్తాయి, నేను అనుకున్న పని కూడా జరిగేది కాదు – అందుకు నేనే కారణమయినా నెపం గద్దమీదకు నెట్టేసి పరిస్థితిని తేలికచేసుకోవడం పరిపాటైపోయింది. విప్పారిన రెక్కలతో వున్న గద్ద అతిదగ్గరగా కనిపించేసరికి ఒక క్షణం చిరాకు పడి వెంటనే నవ్వుకున్నాను. “నువ్వెన్ని వేషాలైనా వెయ్. ఈ రోజు నేను వెతుకుతున్నది కనిపెట్టి తీరుతాను” అని ఆ హాప్కిన్స్ విల్ గద్దకు ప్రమాణం చేశాను.
E9th Street బోర్డు కనిపించగానే ఒడిలోని మ్యాప్ ప్యాసింజర్ సీటులో పడేసి స్టీరింగ్ వీల్ మీదకు వంగి రోడ్డు పక్కన సైన్ బోర్డులు చూడటం మొదలెట్టాను. న్యాష్ విల్ లో నేను చూడాలనుకున్న ప్రదేశం కనిపించలేదని గుర్తొచ్చి ఇంకా అప్రమత్తమయ్యాను. ‘చెరోకీ ట్రైల్ ఆఫ్ టియర్స్ కమ్మెమొరేటివ్ పార్క్’ కనిపించగానే కారు పార్కింగ్ లాట్ లోకి తిప్పేశాను. కారు చక్రాల కింద నలుగుతూ కరకరమన్న కంకర్రాళ్ల శబ్దం విని నవ్వొచ్చింది. కొన్ని బండరాళ్ల మధ్య జాలువారే చిన్ని జలపాతం ఉన్న ప్రదేశాన్ని టూరిస్టు అట్రాక్షన్ చేసేసి అన్ని హంగులు ఏర్పాటు చేస్తారు. ‘అదిగో జలపాతం, అక్కడ’ అంటూ ఎంతో దూరం నుండే బోర్డులు పెడతారు కానీ అమెరికన్ చరిత్రకు ఎంతో ప్రత్యేకమైన ఇలాంటి ప్రదేశాలకు మాత్రం సరైన గుర్తులు గానీ సదుపాయాలూ గానీ వుండవు.
కారు పార్క్ చేస్తుండగా ఒక లాగ్ క్యాబిన్ ముందు స్థూలకాయురాలైన ఒకామె జండా స్తంభానికి రెండు జండాలను ఎగరేస్తూ కనిపించింది. నేను ఆమెను ఎంత విచిత్రంగా చూశానో ఆమె నన్ను అంతకంటే విచిత్రంగా చూసింది. నేను ఇంతకుముందు ఉత్తర అమెరిక ఆదివాసులను చూశాను, మాట్లాడాను. అయినా ప్రతిసారి విచిత్రంగా వుంటుంది – పుస్తకాల్లో చదివి ఎంతో ప్రేమించిన ఒక క్యారెక్టర్ ఎదురు పడినట్లుంటుంది. ఆశ్చర్యంతో పాటు వెంటనే ప్రేమ పుట్టుకొస్తుంది.
ఆమే ముందుగా తేరుకుని, చిరునవ్వుతో “మ్,… రియల్ ఇండియన్? గుడ్ మార్నింగ్, వెల్ కం” అంటూ క్యాబిన్ తలుపు తెరిచింది.
స్నేహపూరితమైన ఆమె పలకరింపుకు సమాధానమిచ్చి క్యాబిన్ లోపలికి తొంగి చూసి అడిగాను, “ఇది మ్యూజియమా?”
“మ్యూజియమే, కానీ వసంతం నుంచి ఆకురాలు కాలం దాకా ఇది నా రెండో ఇల్లు.” గట్టిగా నవ్వుతూ అందామే.
ఆ క్యాబిన్ లో వున్నది రెండే గదులు. నేనే ఒక గదిలోకి దారి తీశాను. ఆమె నా వెనుకే వచ్చి తన కుర్చీలో కూర్చొని అక్కడి వస్తువుల గురించి చెప్పడం మొదలెట్టింది. జండాలను ఎగరెయ్యడానికి కష్టపడినట్లుంది, కాస్త రొప్పుతోంది.
“నేను త్వరగానే వెళ్ళాలి. ఈరోజే ఈ రస్తాలో ఇంకొన్ని ప్రదేశాలు చూడాలి. కానీ, ఓ రెండు నిమిషాలు కూర్చొని కాస్త ఊపిరి పీల్చుకుని అప్పుడు చెప్పండి. అప్పటి దాకా నేనే చూట్టూ చూసి వస్తాను.” అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాను.
అక్కడ చెరోకి తెగకు చెందిన వస్తువులు చాలానే వున్నాయి. వాళ్ళ దుస్తులు, ఆయుధాలు, వంట సామాగ్రి – ఒక నిమిషం రెస్ట్ తీసుకుందోలేదో ఆమె వచ్చేసి ఆ వస్తువుల గురించి వివరించడం మొదలెట్టింది. బాగోదని ఆమె చెప్పేది వింటునట్టు ఊ కొడుతున్నాను కానీ నా మనసు ఆమె మాటలు వినట్లేదు.
ఆమె హఠాత్తుగా మాటలు ఆపి ఒక క్షణం నన్ను చూసి అడిగింది, “ఈ వస్తువుల మీద మీకేం ఆసక్తి లేదు కదూ?”
“ఆహా, అలా అని కాదు. ఆసక్తి వుండే కదా ఇక్కడికి వచ్చింది? కాస్త అలసటగా వుందంతే. చాల సేపటి నుండి డ్రైవ్ చేస్తున్నాను.”
“అలిసిపోయుండొచ్చు, కానీ కారు దిగేటప్పుడు మీ కళ్ళల్లో కనిపించిన మెరుపు ఇప్పుడు లేదు. వస్తువులు కాదు మీకు కావల్సింది. ఇంకేదో వెతుకుతున్నారు.”
నిజానికి ఈ దుఃఖభరిత రస్తాలో ఏదో వెతుకుతూనే బయల్దేరాను. ఏం వెతుకుతున్నానో కూడా తెలీదు. అప్పుడప్పుడు ఉన్న ప్రదేశం కాక ఇంకోచోటికో, అసలు ఇంకో శరీరంలోకో వెళితే గాని ఈ అన్వేషణ తీరదనిపిస్తుంది. తీరా ఆ ఇంకో ప్రదేశానికి వెళ్ళాక, ఇక్కడికీ అక్కడికీ పెద్ద తేడాలేదని తెలుసుకుని బిక్కమొహం వెయ్యాల్సొస్తుంది. ఆమె అలా నా మనసులోని విషయాన్ని కనిపెట్టేసరికి విచిత్రంగా అనిపించింది. షామాన్ విద్యలేమైన కోరుకుంటున్నానా అని మనసులోనే నవ్వుకున్నాను.
“నాతో రండి.” అంటూ పక్క గదిలోకి దారి తీసిందామె.
పక్క గదిలో రెండు గోడలకు ఆనించిన అల్మరాల మధ్య సందులో ఆమె టేబిల్ వుంది. టేబిల్ మీదకు వంగి, ఒక న్యూస్ పేపరు కటింగ్ తీసి నా చేతికిచ్చింది. మిలటరి దుస్తుల్లో వున్న ఒక యువకుడి బ్లాక్ అండ్ వైట్ ఫొటో అది. అమెరికన్ ఆదివాసిలా వున్నాడు. కళ్ళతో నవ్వుతున్నాడు. ఫొటో పరిశీలించి ఆమెకు తిరిగి ఇచ్చేశాను.
ఆమె ఫొటో చూస్తూ అంది, “మా నాన్న. మిలటరీనే తన సర్వస్వంగా జీవించాడు. ఇప్పుడు లేడు. తను ఫుల్ బ్లడెడ్ చెరోకి. అంటే ఆయన అమ్మా నాన్నలిద్దరూ చెరోకీలే. నేను కాదు. మా అమ్మ స్కాటిష్. నేను హాఫ్ బ్లడ్ చేరోకీని. హస్యాస్పదమేమంటే, మా కుటుంబానికి రిజర్వేషన్లు లేవు. అంటే కాలేజీల్లో, ఉద్యోగాల్లో చేరడానికి మీతో సరిసమానంగా పోటీ పడాలి మా పిల్లలు. కానీ చెరోకి జాతికి చెందినదాన్ని అని చెప్పగానే మాకు రిజర్వేషన్లు ఉంటాయని అనుకుంటారు చాలామంది. చెరోకీలను ఈ చుట్టు పక్కల ప్రదేశాల నుంచి పోగేసి ఓక్లహోమాకు తరలించిన సమయంలో చాల మంది చెరోకీలు పుట్టిన ప్రదేశాల్ని వదిలి వెళ్లలేక కొండ గుహల్లో దాక్కున్నారు. పరిస్థితులు కాస్త సద్దుమణిగాక మళ్లీ మామూలు జనజీవనంలో కలిసిపోయారు కానీ చెరోకీలుగా గుర్తింపు లేదు వాళ్లకు. విచిత్రం కదా? వేల ఏళ్ల నుంచి ఈ చుట్టుపక్కల వేల కొద్దీ ఎకరాల్లో స్వేచ్చగా తిరగాడిన జనానికి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ స్థలాలకు వెళ్లకుండా దాక్కున్నందుకు చెరోకి ఐడెంటిటీనే లేదు. మా నాన్న చాలా కష్టపడ్డాడు. మిలటరీలో చేరితే గాని మంచి జీవితం ఉండదని చిన్నప్పుడే తెలుసుకున్నాడు. చాలామంది ఇక్కడి చేరోకీలతో పోలిస్తే మా కుటుంబం పరిస్ధితి చాలా మెరుగు.”
ఆమె గబగబా చెప్పుకుపోతోంది. పుస్తకాల్లో, చరిత్ర పాఠాల్లో లేని విషయాలు చెబుతోంది. కాలాన్ని మర్చిపోయి ఆమె మాటలు వింటున్నాను. ఆమె మాటలకు దరువేస్తున్నట్లుగా దూరంగా అప్పుడప్పుడు గద్ద అరుపు వినిపిస్తోంది.
“మా అమ్మ చెరోకి కాకపోయినా, నాన్న దగ్గర చాలా విషయాలు నేర్చుకుంది. తను న్యూ జెర్సీ రాష్ట్రంలో పెరిగింది. నాన్నను కలవకపోయుంటే ఆమె జీవితం బాగుండేది కాదని చెప్తుంది. స్నేహితులతో సిగరెట్లు తాగుతూ ఏదో ఒక ఇంటి మెట్లమీద కాలం వెల్లదీస్తున్నప్పుడు నాన్న కలిశాడు. ఇద్దరికీ స్నేహమై, త్వరలోనే పెళ్లి చేసుకుని నాన్న స్వంత వూరైన ఈ ఊరికి వచ్చేశారు. నేను పుట్టకముందు నుంచే అమ్మ చెరోకి అమ్మాయి అయిపోయింది. ఇంకో హాస్యాస్పదమైన సంగతేంటంటే, చెరోకీలది మాతృస్వామ్య సమాజం. అంటే భర్త భార్య తెగకు చెందుతాడు. అంటే పాతరోజుల్లోనైతే అమ్మ చెరోకి కాక నాన్న స్కాటిష్ అయ్యేవాడు. అమ్మ హాప్కిన్స్ విల్ రావడం కాదు, నాన్న న్యూ జెర్సీ వెళ్ళాలి. భార్యకు భర్త చేష్టలు నచ్చకపోతే అతని చెప్పులు తీసుకెళ్ళి టిపి (గుడిసె లాంటి ఇల్లు) బయట పెడితే ఇక అతనేం మాట్లాడకుండా వెళ్లిపోవలసిందే. ఆమె వేరే పంచాయితి పెట్టక్కర్లేదు, అతనితో గొడవ పడక్కర్లేదు. చెరోకి దేశమే లేదు ఇక చెరోకి కట్టుబాట్లను ఏ ప్రభుత్వం వప్పుకుంటుంది? చెరోకిలకు సంబంధించిన ఒక ఫేమస్ పోస్టరు వుంది. ఒక స్త్రీ నడుస్తూ వుంటే ఆమె ముందు ఒక పురుషుడు నడుస్తుంటాడు. అది చూసి, వేలెత్తి ‘హేయ్ చూడండి చెరోకి స్త్రీని చెరోకి పురుషుడు లీడ్ చేస్తున్నాడు’ అని హేళనగా అంటారు. అలా అనే వాళ్లను చూస్తే కోపంతో పాటు నవ్వొస్తుంది. స్త్రీని పురుషుడు లీడ్ చెయ్యడం కాదు. ఆమెకు ఏ హాని కలగకుండా సంరక్షిస్తున్నాడు. ఆమె వల్లే అతని తెగ అభివృద్ధి అవుతుందని తెలుసు అతనికి, ఆమెను గౌరవించాలని, శత్రువులనుంచి ఆమెను కాపాడాలని తెలుసు అతనికి. అందుకే అతను ముందు నడుస్తాడు, బాడీ గార్డులా. లీడ్ చెయ్యడానికి కాదు.”
ఉద్రేకాన్ని అణుచుకోవడానికి కాస్త ఆగిందామె. కాస్త రొప్పుతూ అంది, “చాలా రోజులయ్యింది ఇలా మాట్లాడి. నేను చాలనే మాట్లాడుతాను కానీ ఇక్కడి వస్తువుల గురించే ఎక్కువ మాట్లాడాలి కాబట్టి అలసట వుండదు.”
“ఓ, సారీ. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను.” మొహమాటంగా అన్నాను, ఆమె ఇంకాస్త మాట్లాడితే బాగుండని అనుకుంటూనే.
“లేదు, లేదు. ఈ మధ్యే అమ్మా నాన్న ఇద్దరూ పోయారు. రెండేళ్ల క్రితం నా భర్త కూడా చనిపోయాడు. లేకపోతే ఎవరో ఒకరు తోడుగా వుండే వాళ్ళు. ఇలాంటి విషయాలే మాట్లాడుకునే వాళ్లం. ఇలా మాట్లాడుతుంటే గుండె బరువు తగ్గుతుంది.”
ఇంతలో ఎవరో తలుపు తీసిన చప్పుడయింది. జీన్స్ ప్యాంట్, తెల్ల టీ-షర్టు మీద జీన్స్ కోట్ వేసుకున్న ఒకతను మేమున్న చోటికి వచ్చాడు “హలో, ఈ చక్కటి ఇంట్లో ఎవరైనా ఉన్నారా?” అంటూ.
ఆమె నిర్వికారంగా అతని వైపు చూసి, అతని చేతిలో అట్టకు తగిలించిన పేపర్లు చూపిస్తూ, “ఏమిటి సంగతి?” అని అడిగింది.
అతను కాస్త ఇబ్బందిగా నవ్వి, “కొత్తగా కడుతున్న కమ్యూనిటీ సెంటర్ గురించి వివరాలు కావాలి. ఈ క్యాబిన్ లో వస్తువులు ఎప్పడు మూవ్ చేస్తారో తెలుసా?” అని అడిగాడు.
“తెలీదు, కానీ కనీసం నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తరువాతైతే బాగుండు.”
ఆతను మాట మార్చి ఇంకేవో సంబంధం లేని విషయాలు మాట్లాడి మాలోకానికి మమ్మల్ని వదిలి త్వరగా వెళ్ళిపొయ్యాడు.
ఆమె కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని కూర్చుంది. ఆమెకు బాగా బాధ కలిగించే సంఘటన జరగబోతోందని అర్థమైంది. ఏం మాట్లాడాలో తెలీక నేను స్తబ్దుగా నిలుచుండిపోయాను. ఎన్ని ప్రశ్నలో నాలో.
నేను ఏదైన అడిగే లోపలే ఆమె అందుకుంది, “ఓక్లహోమాకు తరలింపబడతామని చెరోకీలు ఊహించలేదు. జార్జియా, టెన్నెస్సీ, తదితర రాష్ట్రాల నుంచి ఎంత త్వరగా జనాల్ని పోగేశారంటే ప్రభుత్వంతో మంతనాలు జరపడానికి వాషింగ్టన్ డి. సి వెళ్లిన కొంత మంది చెరోకి నాయకులు వాళ్ల ఇళ్ళకు తిరిగి వచ్చేసరికి వాళ్ల ఇళ్ళను తెల్లవాళ్లకు లాటరీ పద్దతిలో ఇచ్చేశారు. అప్పటికి చెరోకి తెగ తెల్లవాడి ప్రకారం ఎంత అభివృద్ధి చెందిందంటే సెక్వోయా అనే చెరోకి అతను చెరోకి అక్షరమాల తయారు చేశాడు. ఈ అక్షరమాలతో ‘చెరోకి ఫీనిక్ష్’ అనే పత్రిక కూడా అచ్చయ్యేది. కొంతమంది చెరోకీలు చాలా డబ్బు సంపాదించి ఎకరాల కొద్దీ భూములు, కొన్ని ఇళ్ళు, కొంతమంది బానిసలను కూడా కూడబెట్టుకున్నారు. వీళ్ళల్లో కొంతమంది పేరుమోసిన రాజకీయ నాయకులయ్యారు. వారిలో ఒక నాయకుడు వైట్ పాత్. ఈ నాయకుడు వాషింగ్టన్ నుంచి వచ్చేసరికి అతని ఇల్లు ఒక తెల్లవాడి పరమయ్యింది. చేసేదేం లేక ఆ డెబ్బై ఏళ్ళ ముదుసలి నాయకుడు మిగతా చెరొకీలతో కలిసి ఓక్లహోమకు ప్రయాణమయ్యాడు. దారిలో ఆండ్రూ జాక్సన్ వీళ్లను చూసి నవ్వుతూ వీడ్కోలుగా చేతులూపాడని అంటారు. ఆండ్రూ జాక్సన్ అప్పటి అమెరిక ప్రెసిడెంట్. చెరోకీలను ఓక్లహోమా తరలించడానికి చాలా కృషి చేశాడు. చెరోకీలను తరలించకూడదన్న సుప్రీం కోర్టు తీర్మానాన్ని ధిక్కరించాడు. ఇంతకీ క్రీక్ తెగతో యుద్దంలో వైట్ పాత్ ఆండ్రూ జాక్సన్ కు సహాయం చేశాడు. మేము చేసిన సహాయానికి మూల్యం ఇది కాదు అని జాక్సన్ కు చెప్పినా అతను మనసు మార్చుకోలేదు. వైట్ పాత్ వున్న గుంపు మనమున్న ఈ ప్రదేశానికి చేరేసరికి ఆయన ఆరోగ్యం బాగా క్షిణించి చనిపోయాడు. ఫ్లయ్ స్మిత్ అనే ఇంకో నాయకుడు కూడా చనిపోయాడు. శవాలను పూడ్చి పెట్టేందుకు చుట్టు పక్కల సెమెటరీలు ఒప్పుకోలేదు, చెరోకీలు క్రిస్టియన్లు కాదని. ఓక్లహోమకు చేరేలోగా చనిపోయిన 4000 మందిని ఎక్కడికక్కడే పూడ్చిపెట్టి కదిలిపోయారు. ఎంత అన్యాయం – చెరోకీల స్థలాల్ని ఆక్రమించేసి, వాళ్లని ఎక్కడికో పంపించేస్తూ చచ్చిపోయిన వారి నాయకులనైనా ఒక గౌరవనీయ స్థానంలో పూడ్చిపెట్టటానికి కాసింత జాగా ఇవ్వలేదు. అయితే తెల్లవాళ్లందరూ చెడ్డవాళ్లు కాదు. ఇప్పుడు మనం నిలుచున్న స్థలం ఒక తెల్ల వాడిది. చెరోకీల దయనీయ స్థితిని చూసి ఇక్కడ విడిదీ చెయ్యనిచ్చాడు ఆయన. చనిపోయిన ఆ ఇద్దరు నాయకులను తన పొలంలో పూడ్చిపెట్టమని చెప్పాడు. అదిగో బయట ఆ రెండు సమాధులు అవే.”
కిటికీలోంచి కనిపిస్తున్న సమాధుల వైపు చూస్తుండిపోయాం ఇద్దరం. ఆమె చెబుతున్న విషయాలు కొన్ని ముందే తెలిసినా ఆమె గొంతునుంచి వినడం ఎంతో బాధగా వుంది.
సమాధుల పక్కనే ఇనుప కంచెలో ఇద్దరు చెరోకీల శిల్పాలున్నాయి.
“ఎవరివి ఆ శిల్పాలు? వైట్ పాత్ , ఫ్లయ్ స్మిత్ లవేనా? ఆ కంచె ఎందుకు?”
“ఆ యిద్దరు నాయకులకోసం కట్టినవే. కానీ వాళ్ళు ఎలా వుంటారో శిల్పులకు తెలియదు కదా. అందుకని ఇద్దరు ఫుల్ బ్లడెడ్ చేరోకీలను మాడల్స్ గా పెట్టుకుని ఆ శిల్పాలను తయారు చేశారు. కనీసం జీవించివున్న చెరోకీలనైన ఉపయోగించారు. ఇక కంచె అంటారా, ఆ శిల్పాలని ఎవరైనా పాడు చేస్తారని భయంతో ఆ కంచె కట్టించింది సిటీ మునిసిపాలిటీ. వాళ్ల పిచ్చి గాని, ఈ వూర్లో 95 శాతం నా లాంటి వాళ్లే, అంటే ఎంతో కొంత శాతం చెరోకీ రక్తంగాళ్లే. ప్రతిరోజు రాత్రి ఆ కంచె మూసి తాళం వేస్తుంటే చాలా బాధగా వుంటుంది. కనీసం శిల్పాలుగానైనా మా వాళ్లను స్వేచ్చగా వుండనివ్వరా, నాతోనే ఈ గేటు తాళం వేయిస్తారా అని గట్టిగా అడగాలని వుంటుంది కానీ ఈ క్యాబిన్ మీద ప్రేమ నాకు. మా కుటుంబం జ్ఞాపకాలున్నాయి ఇందులో. మా నానమ్మ నేర్పిస్తే మా అమ్మ చేసిన కొన్ని వస్తువులు వున్నాయి ఈ అల్మరాలలో. ఇందాక వచ్చినతను హాప్కిన్స్ విల్ సిటీ మునిసిపాలిటి తరపున వచ్చాడు. ఇక్కడికి దగ్గరలో ఒక కమ్యూనిటీ సెంటర్ కడుతున్నారు. అందులో ఒక స్టోర్ లాగా ఈ క్యాబిన్ కూడా అవుతుంది. వస్తువులను చూడడానికి వచ్చే వాళ్లేవుంటారు. చరిత్రను తెలుసుకోవడానికి, అలా తమను తాము తెలుసుకోవడానికి రాక పోవచ్చు. నా అనంతరం ఈ స్థలాన్ని కూడా ఇక్కడనుంచి తరలిస్తారట. మా పూర్వీకుల లాగే, నేను వెళ్లనని చెప్పడానికి స్వేచ్చ లేదు. కొన్ని రోజుల్లో ఈ స్థలం ఏమవుతుందో అని బాధగా వుంటుంది. కానీ ఎంతైనా మా హాప్కిన్స్ విల్ మునిసిపాలిటి అంత తొందరగా పనులు తెమల్చదు. ఏదో ఒకలా దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నాం. ఇంతకీ చెరీకీలను తరలించిన రస్తాను “ట్రైల్ ఆఫ్ టియర్స్” అని ఎందుకు అంటారో తెలుసా? నదులు కూడా మంచుగడ్డలయ్యే చలిలో నాలుగు నెలలపాటు వారి ప్రయాణం సాగింది. దారిలో చనిపోయిన తమవాళ్లను ఎక్కడికక్కడ పూడ్చి పెడుతూ తలలు వంచుకుని వెళ్లిపోతున్న చేరోకీలను చూసి ప్రజలు ఏడ్చారట. అందుకని ఈ ట్రైల్ కు ఆ పేరొచ్చింది.”
మాట్లాడుతూనే కొన్ని బ్రోచర్లు నా చేతిలో పెట్టింది. “అదిగో బయట ఆ బండరాళ్లు చూడు. వందల ఏళ్ళ నుంచి అక్కడే వున్నాయి. గుండెలు పగిలిన చెరోకీల కన్నీళ్లను అవి చూసే వుంటాయి. అప్పుడప్పుడు వెళ్లి ఆ రాళ్లను తడుముతుంటాను – ఈ రాళ్లే మాట్లాడగలిగితే ఏం చెప్పేవి? ఆ కొండలు దద్దరిల్లేట్టు ఆక్రోసించవూ?”
ఉద్వేగంగా మాట్లాడుతున్న ఆమె కాసేపు మాటలాపి, కాస్త తేరుకున్న తరువాత మెల్లగా అంది, “ఇక నా మాటలతో విసిగించను. బయట సమాధుల దగ్గర ఫలకాల మీద ఇంకొన్ని చారిత్రిక వివరాలున్నాయి. అవి మీరే చదువుకోవచ్చు. ఆ ఇనుప కంచె లోపలికి వెళ్లి శిల్పాలను దగ్గరగా చూడొచ్చు.”
ఆమె ఏకాంతాన్ని కోరుకుంటున్నట్లు అనిపించి ఏమీ మాట్లాడకుండా బయటకు నడిచాను. దారిలో కనిపించిన ఫలకాల్లో పుస్తకాల్లో చదివిన విషయాలే వున్నాయి. సమాధుల చుట్టూ కూడా ఒక కంచె వుంది. అ కంచెలో ఒక చెట్టు కింద ఉన్నాయి సమాధులు. దగ్గరలోనే ఒక చెక్క బెంచీ మీద కాసేపు కూర్చున్నాను. వింత నిశ్శబ్దం అలుముకుంది ఆ పరిసరాల్లో. ఆకాశంలో ఎక్కడికో పరిగెడుతున్నాయి తెల్లని మబ్బులు, సూర్యుడిని మసకగా కప్పేస్తూ. రోడ్డు మీద కార్లు మెత్తగా సాగిపోతున్నాయి. పక్కింట్లో ఓ కుక్కపిల్ల అటూ ఇటూ తిరుగుతోంది నా వైపు అనుమానంగా చూస్తూ. డాగ్ వుడ్ కొమ్మలు చల్లని గాలికి మెల్లగా వూగి ఆకులను అంటిపెట్టుకుని వున్న తెల్లని పూలని రాల్చాయి.
శిల్పాలతో కూడా కాసేపు గడిపి కంచె బయటకు వచ్చేసరికి కొత్త విజిటర్స్ తో మాట్లాడుతూ కనిపించిందామె. దగ్గరికి వెళ్లి “నాతో ఇన్ని విషయాలు పంచుకున్నందుకు చాలా థ్యాంక్సు.” అని చెప్పాను. “యు ఆర్ వెల్ కం. మళ్లీ రండి మా చిన్ని క్యాబిన్ దగ్గరికి.” అని నవ్వుతూ చెయ్యి ఊపింది.
కరుణతో మెరుస్తున్నాయి ఆమె కళ్ళు. కొన్నేళ్ళ క్రితం కలిసిన కనెక్టికట్ రాష్ట్రంలో మొహిగన్ తెగకు చెందిన ఒక మహిళ ఇలాగే మెరుస్తున్న కళ్ళతో అన్న మాటలు గుర్తొచ్చాయి, “మేమింకా బ్రతికే ఉన్నామని ప్రపంచానికి చెప్పండి.”
**** (*) ****
Painting Credit: “The Trail of Tears,” by Max D. Standley
చాలా బాగా రాసారు మమత.మీ యొక్క శైలి భిన్నంగా వుంటుంది.అనుభవాల మేళవింపు మీ కవిత్వము మరియు కథలు.అభినందనలు.
చాల బాగా రాసారు.హృదయాన్ని కదిలించింది.అవునూ…..మమత అంటే మా hrk కూతురు కదా.
మీ మెసేజ్ చదివి కొండంత సంతోషమేసింది మామయ్య
పోటో చూడగానే ఇది Trail of tears లాగుందే అనుకున్నా!
ఆ మాట వింటేనే కన్నీళ్ళతో కళ్ళు నిండిపోతాయి. ఆ కాసేపట్లోనే అప్పుడెప్పుడో జరిగిందిసరే ఇప్పుడు జరుగుతున్న వాటి సంగతేంటి అని మనసు తేలిక పడాలని ప్రయత్నిస్తుంది.
చాలా బాగా రాశారు. ఆమిలా చెప్పిందో లేదో గానీ మీమాటల్లో ఆమెతో నేనే మాట్లాడినట్టుగా వుంది.
మమత గారూ
ఎప్పటి లాగే వైవిధ్య మైన రచన. చరిత్ర లోకి తీసుకెళ్ళి ఒక భాగాన్ని చేసారు. అభినందనలు
Very touching account… Mamata garu.
I am so sorry. I was very late in reading this.
Thank you
ఆలస్యంగా చూసి చదివాను. ఇంత మంచి కథను ఎలా మిస్ అయ్యనబ్బా …!
‘అఘాధమౌ జలనిదిలోనే ఆనిమున్నటులె …’ ఓ అనిముత్యమైన కథను చదివిన అనుభూతి కలిగింది.
గుడ్. కీప్ ఇట్ అప్!
–భాస్కర్.
మమతా..మళ్ళా చకితుడిని చేసావ్..అక్షరాలను దాటిన అనుభూతి ని ఇచ్చావ్ ..
బావుంది మమత గారూ, చదువుదాం చదువుదాం అనుకుంటూనే మిస్ అయిపోయాను. చరిత్రలో/పాఠాల్లో లేని ఇలాంటి కథలు/వ్యధలు ఎన్నో…
అభినందనలు
థ్యాంక్యూ తిలక్, విజయ గారు, మూర్తి గారు, రాధ గారు, భాస్కర్ మామయ్య, అమరేంద్ర మామయ్య. Thank you so much for the encouragement.
ప్రసాద్ గారు, నాతో రికార్డర్ తీసుకెళ్లలేదు కానీ, ఆమె మాటలు మర్చిపోకూడదని ఆ పార్కింగ్ లాట్ లోనే కార్లో కూర్చుని నోట్ బుక్ లో రాసుకున్నాను. రాసుకోక పోయినా గుర్తుండేవేమో ఆమె మాటలు. చెరోకీల గురించి తెలీని వారికి అర్థమవ్వడం కోసం కొన్నంటే కొన్ని చారిత్రిక విషయాలు మధ్యలో చొప్పించాను, కానీ 98% ఆమె మాటలే.
ఎంత అద్బుతంగా ఉంది. చదివేకొద్దీ చదవాలనిపిస్తుంది
మమత గారూ చాలా రోజులకి ఒక వైవిధ్యమైన రచన మన తెలుగు వారిది చదివాను మంచి అనుభూతి ధన్యవాదాలు …ప్రేమతో జగద్ధాత్రి
థాంక్యూ చెన్న కేశవరెడ్ది గారు, జగధాత్రి గారు.