కొత్త పుస్తకం కబుర్లు

మసిబారిన మానవ సంబంధాలను ఎత్తి చూపే మమత కవిత్వం

జూన్ 2015

నసు బాధతో గుక్కపట్టినప్పుడో, జీవితంలో ఓ ఆనందం పూదండలా మెడకు చుట్టుకుని ఆహ్లాదపరచినప్పుడో ఉద్వేగంతో కూడిన భావజాలం కవిత్వమై మమతకు సాంత్వననిస్తూంటుంది. జీవితానికో పరమార్ధముందంటూ గుర్తుపట్టగలగడం తల్లిదండ్రులనుండి ఈ కవయిత్రి సంతరించుకున్న అనిర్వచనీయమైన వో అనుభూతి కావచ్చు. లేదా తాను నడచిన విద్యార్ది జీవితానుభవం కావచ్చు. ఉద్యమ శ్వాసా కావచ్చు. ఏది ఏమైనా జీవితానికి అర్ధం వో పరమార్ధం ఉందని భావించడం లోనే ఈ కవయిత్రి ఆశావాహకత బట్టబయలవుతూంది. కవిత్వం లో ఉన్న సృజనాత్మక ప్రతిభతో తనను తాను ఓదార్చుకుంటూ వో నిబ్బరమైన ప్రతిభతో అబలత్వాన్ని ఆవలకు నెట్టి సబలత్వాన్ని చేపట్టి జీవితంలోని సంక్లిష్టతను, అస్తవ్యస్తతను తొలగదోస్తూ ముందుకు సాగిన తీరు ఈ కవయిత్రి కవిత్వం లో కనిపిస్తూంటుంది. పిన్న వయసులో గాఢమైన జీవితానుభవాలు, నిత్య సంఘర్షణలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న స్పందనలు, వాస్తవ ఘటనలు మరెన్నో సంఘటనలు జీవిత సమాహారంగా దర్శనమిచ్చిన తీరు కవిత్వం లో గోచరిస్తూంటుంది. జీవితాన్ని విమర్శనా సాహిత్యంగా విడమరచి రూపొందించిన కవయిత్రి మమత.

“కవిత్వం ఎప్పుడూ వేదన సంఘర్షణ లోనుంచే పుడుతుంది”అనే మేధావుల అభిప్రాయాలకు సమాంతరంగా ఈ కవయిత్రి భావజాలం నడవడం ఈమె వ్యక్తిత్వాన్ని పట్టిస్తూంటుంది. సాహిత్య సృజన వో జఠిలమైన సంక్లిష్టమార్గంగా కవయిత్రి భావిస్తూంది. సమాజం ఎప్పుడూ మేడిపండు లాంటిదే.! అనుకున్నంత, కలలు కన్నంత, ఊహించినంత న్యాయసమ్మతమైనది,ధర్మబద్ధమైనది మాత్రం కాదు. అది ఎప్పటికీ వైరుధ్యాల, వైవిధ్యాల పుట్ట. అణచివేత, దోపిడీ, దగా, మతం, రాజకీయం ముసుగుల్లో స్వార్ధం నీడలో , అధికారం ఆర్దికోన్నతుల జాడలో కళ్ళుగప్పి న్యాయసమ్మతమనిపిస్తూసాగిపోతున్న తీరు సమాజానిదే. తలవంచుకుని సర్దుకుపోడం, నాదీ నేనూ అంటూ నాకెందుకులే అంటూ స్వార్ధం పడగనీడన బతకడం, స్వేచ్చారాహిత్యంగా జీవించడానికి అలవాటు పడ్డవారికి సామాజిక విధ్వంసక మూలాలు ఆనందపుహేలనిస్తుంటాయి. అంతా మంచిగానే కనిపిస్తూంటుంది. అక్రమాన్ని, అన్యాయాన్ని, అణచివేతను, స్వేచ్చారాహిత్యాన్ని, సమానత్వాన్ని ఇచ్చిపుచ్చుకునే మర్యాదల వ్యత్యాసాన్ని ‘ఇదేమి’ అని ప్రశ్నించినప్పుడే అసలు సమస్య జీవితం లో తలెత్తుతూంటుంది. ఇలా తలెత్తిన కొన్ని సందర్భాలు ‘మమత’ చేత మంచి కవిత్వాన్నే రాయించాయి.

“రంగులు మాయని సీతాకోక చిలుక” లా జీవితాన్ని తీర్చిదిద్దుకునే ధైర్యాన్ని , నిబ్బరాన్ని, నిష్టను ప్రసాదించ గలిగాయి. అందుకే ‘స్వేచ్చ’ కవితలో “పంజరంలో తిరుగుతూ స్వేచ్చా గీత మెందుకే?” అనే ప్రశ్న వేసుకోగలిగింది. అనుభవాల వడపోతతో మిగుల్చుకున్న జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోగలిగింది గనుకనే

“నీ వెనుక ఉన్న జీవితం అంధకారమయినా
ముందున్న భవిత దరిలేని సముద్రమైనా
చీకట్లో దారి చూసుకుంటూ
సముద్రంలో ధృవనక్షత్రాన్ని వీక్షిస్తూ
నీ మాతృదేశాన్ని కనిపెట్టాలి కొత్తగా”

అనగలిగింది.

అందుకే పంజరాన్ని సమస్యలకు ప్రతీకగా భావించగలిగింది.

“నీలోని సూర్యున్ని ఎప్పటికీ అస్తమించనీయకు
చంద్రుని రాకకై ఎదురు చూడకు”

అనగలిగింది.

కష్టాలకు తలవొగ్గి సుఖాలకోసం వెంపర్లాడ వద్దనే భావన “చంద్రుని రాకకై ఎదురు చూడకు “అనే వాక్యం లో కనబడుతుంది. “పంజరం లోని చిలుకా/ ఇక పాడవే ఒక స్వేచ్చా గీతికా“ అంటూ గుండె దిటవుతో ముందుకు సాగింది.
ఎదురు చూపులతో విసిగిపోవడం, పగటి కలల్లో కూరుకు పోవడం, కౄరనిరీక్షణలో శిధిలపడటం, మనసున్న మనుషులు కొంతకాలమే భరించగలరు, సహించగలరు. అమాయకంగా తొలినాళ్ళలో మొహపూరితమైన దేహ భాషను హత్తుకుని పగలబడి నవ్వవచ్చు కాని ఆలోచన ఉన్న వారిని ఒక కాంతి రేఖ బుగ్గను చురుక్కుమనిపించి, పగటి కలల నుండి బయటపడేస్తూంటుంది.ఆత్మాగతమైనఆలోచనలలోకి నెట్టివేస్తుంది.

ఉద్యమ నిబద్ధత తోసమాజాన్ని పరిశీలించేవారు “తియ్యని పాట ఈటెను/ మెరిసే వేయి ఇంద్ర ధనుస్సులుగా “ భావించగలరు. తమ లోతైన ఊహలకు రెక్కలు తొడగగలరు. ఒక పదునైన ఆలోచనను పరిపక్వత దిశగా పయనించడానికి సమాయత్తపరచుకోగలరు. “ ఓవర్షం వెలిసిన సాయంత్రం” లో నాదంటూ ఒక గౌరవనీయ స్థానం కోసం /నాదంటూ ఒక్క నిమిషం కోసం /నాదంటూ ఒక ప్రేమ కోసం /ఈ వెంపర్లాట “ అనుకుంటూ ఊపిరి సలపకుండా కరిగిపోతున్న ఉనికిని కాపాడుకునేందుకు తనను తానూ నిలదీసే వో ప్రయత్నంగా “ నేనే ఎందుకిలా?” అనే ప్రశ్న ఉత్పన్నమౌతూంది. “చూసినా చూడనట్టు” పోతున్న సమాజాన్ని పట్టించుకుని, రెక్కలుడిగిన పిట్టలా కూర్చోకుండా తన హృదయానికి తన చేయి అందించి ముందుకు సాగుతుంది. వంద సంకోచాలకు ఒక్క సమాధానాన్ని వెతుక్కుంటుంది.తానూ తిరిగిన సమాజం నుంచి ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటుంది.

తండ్రి తల్లి జ్ఞాపకాల ఒడిలో తడిసి ముద్దైన తీరు ఆవిష్కరిస్తూ ‘ఎడబాటు’ కవితలో

“పొద్దుపొడుపు చుక్క
మసక వెలుతురులో కరిగిపోయిన చోట
తొండమెత్తి
మొదటి కిరణాన్ని రారమ్మని పిలుస్తోంది
ఒక ఆవిరి ఏనుగు”

అంటారు.

తనను అమాంతం గాల్లోకి ఎగరేసి పట్టుకుని గుండెకు హత్తుకుంటే, తండ్రి మెడలో ముఖం దాచుకునే ఆప్యాయతను కోరుకుంటుంది. అమ్మ చెప్పినట్టు కంటి చివర తడిలో దొరికిన వెంట్రుకను మనసులో అనుకున్న మంచి కోరికతో గాలిలోకి ఊదిన జ్ఞాపకం వెన్నంటి ఉన్నా, తనలో అణువణువూనిండిన జ్ఞాపకాల అలజడిని మోసుకుని వెంట్రుక వారిని చేరుతుందని, కన్నీటి చుక్కల్ని తనలో ఇముడ్చుకొని ఓ చిట్టి అల తమను తాకుతుందని వో నమ్మకాన్ని ఆరవోస్తుంది కవయిత్రి. నిరాశ్రయం ఎదురైనప్పుడు ఆశ్రయమిచ్చిన జ్ఞాపకాల్లో తడిసిపోవడం మనసుకున్న బలం, బలహీనత కూడా.

ఒక కల వాస్తవ జీవితం లోకి ప్రవేశించి , ప్రవేశించకుండా నీడల్లోకి అదృశ్యమవుతున్న తీరును, కదిలే మేఘాల గుంపులో నర్తింఛి మాయమయే దిగులు నవ్వును, ప్రశ్నల ముళ్ళపొదల్లో వెతుక్కుంటూ అద్భుత పరచే ప్రణయభాష ఆంతర్యాన్ని విప్పి చెప్తుంది –తన కవిత్వంలో మమత. నల్ల చేపపిల్ల కధతో ఒక పోరాట గరిమను, గమ్యం చేరాలనే ఆకాంక్షను, పట్టుదలను, పోరాటాన్నీ, పాఠకులలో ఆలోచనా స్పృహను కలిగించే విధంగా ఆవిష్కరిస్తుంది. ఏది ఏమైనా మమత కవిత్వంలో అపారమైన అనుభవసారముంది. అవలీలగా భావాలను కవిత్వం చేసే నేర్పుంది. కవితను స్వయానా బాధల్లోనో, సుఖశాంతుల్లోనో ఇరుక్కున్నప్పుడే కవిత్వమై ప్రవహించాలనుకోవడం కంటే, కవి వైరుధ్యాల్లోకి , వైవిధ్యాల్లోకి పరకాయ ప్రవేశం చెయ్యడం నేర్చుకోవాలి. సృజనాత్మకంగా బతుకులోని ఖాళీ తనాన్ని పసిగట్టి భర్తీ చేసుకునే ఆలోచనలనివ్వాలి. మమత కవిత్వంలో ఆ కోవకు చెందిన పరిణితి కనిపిస్తుంది. ఈమె కలం ఆగిపోకుండా కదలాలని ఆశిస్తూ అబినందిద్దాం.

**** (*) ****