సంపాదకీయం

రాత బల్ల

జూన్ 2015

ళ్లో పలక పెట్టుకుని మెడ బాగా ముందుకు వంచి మొదటిసారి అ ఆ లు దిద్దడం గుర్తుందా? పోనీ- కూర్చోడానికే బెంచీల్లేని పల్లెటూరి బడినుండి, రాసుకోడానిక్కూడా డెస్కులున్న హైస్కూల్లో చేరిన రోజు? ఆ రాత బల్ల మీద ఫస్టు ఫస్టు తెలుగు సీడబల్యూ పుస్తకంపై పేర్రాసుకుని శ్రీరామ రాసుకుని పెద్దోళ్ళమయ్యామని ఫోజివ్వడం?

ఏదెట్లా ఉన్నా పుస్తకాన్నట్లా నేలమీద పడేసి మోకాళ్ళు వెనక్కి మడిచి కూచుని రాసుకోవడమే బాగుంటుంది కాస్త పెద్దయ్యే వరకు. పొడుగు చేతుల కుర్చీలో అడ్డంగా పెద్ద చెక్క అట్ట పెట్టుకుని దానిపైన సకల పుస్తకసామాగ్రీ వేసుకుని రుబ్బడం, మధ్యలో మంచినీళ్ళకి లేవాలంటే ఆ అట్టమీది ప్రపంచాన్ని ఎక్కడ దించాలో తెలీక నోర్మూసుకుని మళ్ళీ చదూకోడమూ కాలేజ్ రోజుల్లో బాగా అలవాటైన పద్దతి.

రాయడమూ, చదవడమూ, ఆడటమూ, పాడటమూ అన్నీ ఎలక్ట్రానిక్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ టేబులే సర్వరోగ నివారిణి. కాకుంటే కాళ్ళ దగ్గర ప్రింటరో, హార్డ్ డిస్కో, సోడాలో గోలీకాయలా.. వెతికి పెట్టిన చార్జింగ్ తీగ కాలికడ్డం పడటమో, అద్సరే ఇంతలా టైపింగ్ కి అలవాటుపడి స్పెల్లింగులూ, ఒత్తులూ, పొల్లులూ చేత్తో రాసేటప్పుడు అనుమానంతో ఆగి చూసే వాళ్ళెంతమంది మనలో?!

ఇదంతా కాదు గానీ, కాస్త రొమాంటిగ్గా, మరికాస్త సినిమాటిగ్గా మనకంటూ విడిగా ఒక రైటింగ్ డెస్క్ ఉంటే ఆ కులాసానే వేరు. చదూతూ పేజీ మడతపెట్టిన నవల్లు, ఒక డిక్షనరీ, మరో కొన్ని రిఫరెన్సు బుక్స్, వీటి అడుగునో లేక తాళమేసిన సొరుగులోనో ఓ డైరీ, ఒకటి రాయని, మరొకటి కాస్త విదిలిస్తే గానీ రాసే పెన్ను. సగం తాగి పక్కన పెట్టి పుస్తకంలో లీనమైపొతే ఎదురుచూస్తున్న ఓ టీ కప్పు. ఇంకా.. నడుమొంచి నిలబడ్డ ఒక రీడింగ్ లైట్, ఆ పక్కనే ఇష్టమైన కొటేషన్ ప్రేమ్. ఇంకా?

ఇంతకీ మీ రాత బల్ల ఎలా ఉంటుంది?