అనువాద కథ

కొలను – రెండవ భాగం

జూలై 2015


కాని, అతణ్ని బాగా మంత్రముగ్ధుణ్ని చేసిన ప్రదేశం ఏపియా పట్టణానికి రెండుమూడు మైళ్ల దూర్లో వున్న ఒక కొలను. స్నానం చేయటం కోసం అతడు తరచుగా సాయంత్రాల్లో అక్కడికి వెళ్తాడు. దానిపక్కనే వున్న రాళ్లగుట్టలో ఒక చిన్న సెలయేరు జన్మించి, గలగలల్తో వేగంగా పరుగెత్తుతుంది. తర్వాత లోతైన కొలనుగా మారి, చిన్న వంతెన కిందుగా ప్రవహించి, పెద్దపెద్ద బండరాళ్లను సగం ముంచుతూ ముందుకు సాగిపోతుంది. స్థానిక ప్రజలు కొందరు అక్కడికి వచ్చి, తమ బట్టల్ని ఉతుక్కుంటారు. ప్రవాహానికి రెండు వైపులా గట్లమీద కొబ్బరిచెట్లు దట్టంగా పెరిగి, నిర్లక్ష్యంతో కూడిన మనోహరత్వాన్ని వెలయిస్తూ ఉంటాయి. వాటి ప్రతిబింబాలు కింది నీళ్లలో ప్రతిఫలిస్తాయి. ఇంగ్లండులోని డెవాన్ షైర్లో వున్న రమణీయమైన ప్రకృతి దృశ్యాల్ని పోలి వుంటుంది అదంతా. ఆ కొలనులోని నీళ్లు తాజాగా, తేటగా ఉంటాయి. కాని, వాటిలో ఇబ్బంది పెట్టే చల్లదనం వుండదు. మధ్యాహ్నపు వేడిమి తర్వాత ఆ నీళ్లలో మునిగితే ఎంతో హాయిగా ఉంటుంది. అందులో స్నానం చేస్తే శరీరమే కాక ఆత్మ కూడా శుభ్రమైనట్టుగా ఉంటుంది.

ఒకసారి లాసన్ ఆ కొలనుకు వెళ్లినప్పుడు అక్కడ ఒక్క పురుగైనా లేకుండా ఆ ప్రదేశంలో పూర్తి ఏకాంతం వుంది. అతడు చాలా సేపు నీళ్లమీద బద్ధకంగా తేలుతూ సమయాన్ని గడిపి, తర్వాత సాయంత్రపు ఎండలో తన ఒళ్లును ఆరబెట్టుకున్నాడు. అక్కడి ఏకాంతాన్నీ, స్నేహపూర్వకమైన నిశ్శబ్దాన్నీ బాగా ఆనందించాడు. లండన్ నూ, అక్కడి జీవితాన్నీ వదిలి వచ్చినందుకు అతనికెంత మాత్రం విచారం కలగలేదు. ఎందుకంటే ఏపియా పట్టణంలో తను గడుపుతున్న జీవితం కూడా అతనికి సంతృప్తికరంగా తోచింది.
ఎతెల్ ను లాసన్ మొదటిసారిగా చూసింది అక్కడే.

మరునాడు పడవ ద్వారా పంపించవలసిన ఉత్తరాల గురించి ఆలోచిస్తూ, ఒక సాయంత్రం వేళ అతడు గుర్రం మీద కొలను దగ్గరికి వెళ్లాడు. అప్పుడు సూర్యరశ్మి దాదాపు పూర్తిగా మాయమవుతోంది. గుర్రాన్ని ఒకచోట కట్టేసి, నదిఒడ్డు వైపు నడిచాడు. అక్కడ ఒక అమ్మాయి కూర్చుని వుంది. లాసన్ అక్కడికి నడిచివస్తుంటే చూసిన ఆమె, చప్పుడు చేయకుండా నీళ్లలోకి దిగింది. పురాణాల్లో మానవమాత్రుల్ని చూసి ఉలిక్కిపడే జలకన్య లాగా ఆమె మాయమైంది. లాసన్ కు ఆశ్చర్యం, వినోదం కలిగాయి. ఆమె ఎక్కడ దాక్కుందా అని అటూయిటూ చూశాడు. ఏటవాలుగా కొంత దూరం ఈదుకుంటూ పోయి చూస్తే, అక్కడ బండరాళ్ల మీద కూచుని వున్న ఆమె కనిపించిందతనికి. ఎంత మాత్రం కుతూహలం లేని చూపుతో అతణ్ని చూసింది ఆమె. సమోవా భాషలో ఆమెను పలకరించాడు లాసన్.

ఆమె చిన్నగా నవ్వి, వెంటనే మళ్లీ నీళ్లలోకి దిగింది. ఆమె చాలా అవలీలగా ఈదుతుంటే వెంట్రుకలు నీళ్లమీద పరచుకున్నాయి. ఆమెనే చూస్తూ గట్టు మీదికి చేరుకున్నాడు లాసన్. అందరు స్థానికుల్లాగానే ఆమె కూడా ఒక స్విమ్మింగ్ డ్రెస్ తొడుక్కుని వుంది. నీళ్లమూలంగా అది శరీరానికి అతుక్కుపోయింది. తన వెంట్రుకల్ని పిండుకుని, ఏమీ పట్టనట్టుగా బండల దగ్గర మొలలోతు నీళ్లలో నిలబడింది. అప్పుడామె మానవమాత్రురాలి లాగా కాక ఒక జలకన్య లాగా, వనదేవత లాగా కనిపించింది. ఆమె మిశ్రమజాతికి చెందిన స్త్రీ అని గమనించాడు లాసన్. తర్వాత ఈదుకుంటూ అటువైపు దగ్గరగా పోయి “చాలా పొద్దు పోయాక ఈదటానికి వచ్చారు మీరు” అన్నాడు ఆంగ్లంలో.

తన వెంట్రుకల్ని వెనక్కి తోసుకుని, వాటిని బుజాలమీద కప్పుకుని, “ఏకాంతంలో యీదటమే ఇష్టం నాకు” అన్నదామె.

“నా విషయంలో కూడా అంతే” అన్నాడు లాసన్.

ఆమె చిన్నపిల్లల కలుపుగోలుతనంతో స్థానిక యువతి లాగా నవ్వింది. వెంట్రుకలు తడవకుండా తలమీద పెట్టుకున్న ప్లాస్టిక్ కవరును తీసి, దాని స్థానంలో మరొక పొడి కవర్ను పెట్టుకుంది. నీళ్లలోంచి బయటికి వచ్చి, ఆ తడిసిన కవర్ను పిండి, అక్కణ్నుంచి వెళ్లిపోవటానికి సిద్ధమైంది. తర్వాత కొంతసేపు తటపటాయించి, నడుచుకుంటూ వెళ్లిపోయింది. అకస్మాత్తుగా చీకటి పడింది.

లాసన్ హోటలుకు పోయి, అక్కడ మద్యం తాగుతూ పాచికలు ఆడుతున్న వ్యక్తులకు ఆమె గురించి చెప్పాడు. వెంటనే ఆమెకు సంబంధించిన సమాచారమంతా తెలిసిపోయిందతనికి. మెట్రోపోల్ హోటలుకు తరచుగా వచ్చి అక్కడ రమ్ తాగే బ్రెవాల్డ్ అనే వృద్ధుడు ఆమె తండ్రి అట. అతడు పుట్టుక పరంగా నార్వే దేశానికి చెందినవాడు. ముడుతలు పడ్డ అతి పురాతనమైన చెట్టు లాగా ఉంటుంది అతని రూపం. నలభయ్యేళ్ల క్రితం ఒక ఓడలో ఆ ద్వీపానికి వచ్చాడట. కొంత కాలం కమ్మరిగా పని చేసి, తర్వాత వ్యాపారస్థునిగా, వ్యవసాయదారునిగా – ఇట్లా రకరకాల వృత్తుల చేసిన అతడు ఒకప్పుడు ధనవంతుడే. కాని, అప్పట్లో వచ్చిన తుఫాను మూలంగా ఆర్థింకంగా చితికిపోయాడు. ఆఖరుకు అతనికి మిగిలింది ఒక చిన్న కొబ్బరితోట మాత్రమే. అతనికి నలుగురు భార్యలుండేవాళ్లు. తనకు పుట్టిన పిల్లల సంఖ్య తెలియదని చిట్లిన గొంతుతో నవ్వుతూ చెప్తాడు.

వాళ్లలో కొందరు చనిపోగా మరి కొందరు వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. తన దగ్గర ఉండటానికి ఎతెల్ ఒక్కతే మిగిలింది.

“ఆమె బలే రంజుగా వుంటుంది. ఒకటిరెండు సార్లు ఆమెతో చూపులు కలిపాను కాని, అంతకన్న యెక్కువగా యేమీ ఏమీ జరగలేదు” అన్నాడు నెల్సన్. అతడు మోనా అనే ఓడను నడుపుతాడు.

మిల్లర్ అనే మరొకతను “బ్రెవాల్డ్ తెలివి మాలిన మూర్ఖుడు కాడు నాయనా. తనను జీవితాంతం కనిపెట్టుకుని వుండే పురుషుడినే అల్లునిగా చేసుకోవాలని అతని కోరిక” అన్నాడు.
ఆ అమ్మాయి గురించి వాళ్లు అట్లా మాట్లాడటం లాసన్ కు నచ్చలేదు. మరునాడు పడవ ద్వారా పంపాల్సిన ఉత్తరాలకు సంబంధించిన పని వుందంటూ వాళ్ల సంభాషణను మధ్యలోనే తుంచేశాడు. మరుసటి రోజు సాయంత్రం వేళ లాసన్ మళ్లీ ఆ కొలను దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఎతెల్ వుంది. మునిమాపు లోని మార్మికత, నిశ్చలమైన నీళ్ల శబ్దం, సన్నగా ఊగే కొబ్బరిచెట్ల సోయగం – ఇవన్నీ ఎతెల్ సౌందర్యానికి అదనంగా కలిసి, ఒక మంత్రముగ్ధతతో అతని హృదయంలోని అజ్ఞాత భావోద్వేగాన్ని కదిలించాయి. ఎందుకో గాని అప్పుడు ఆమెతో మాట్లాడవద్దని అనిపించింది లాసన్ కు. ఆమె కూడా అతని ఉనికిని పట్టించుకోలేదు. అతని వైపు దృష్టిని కూడా సారించలేదు. అక్కడక్కడే యీదింది. కొన్నిసార్లు నీళ్లలోకి డైవ్ చేసి, కొంత సేపు గట్టు మీద విశ్రాంతి తీసుకుని, తాను ఏకాంతంలో ఉన్నట్టుగా ప్రవర్తించింది. ఆమె తనను చూడకపోవటం అతనికి చిత్రంగా తోచింది. సగం జ్ఞాపకమున్న కవితా పంక్తులూ, స్కూలుజీవితపు రోజుల్లో నిర్లక్ష్యంగా చదివిన గ్రీస్ దేశపు అందాలూ అతనికి జ్ఞాపకం రాసాగాయి. తడిసిన గుడ్డల్ని తీసి పొడి గుడ్డల్ని తొడుక్కున్న తర్వాత, ఆమె కొంత దూరం నడిచింది. ఆమె ఆగిన దగ్గర ఒక మందారచెట్టు ఉన్నట్టు గ్రహించాడు లాసన్. నీళ్లలోకి దిగక ముందు ఒక పువ్వును తన వెంట్రుకల్లో ధరించింది ఎతెల్. నీళ్లలోకి దిగుతూ ఆ పువ్వును తీసిపారేసిన ఆమె, స్నానం ముగించాక ఆ పువ్వును మళ్లీ పెట్టుకోవడం మరిచిపోయిందో లేక వద్దనుకుందో తెలియదు. లాసన్ ఒక ప్రత్యేకమైన ఉద్వేగంతో ఆ పువ్వును చూశాడు. దాన్ని తనదగ్గరే ఉంచుకోవాలనిపించిందతనికి. కాని తన సెంటిమెంటల్ తత్వానికి తనే విసుక్కుంటూ దాన్ని నీళ్లలోకి విసిరేశాడు. ఆ పువ్వు నీళ్లమీద తేలుతూ కొట్టుకుపోతుంటే ఆ దృశ్యాన్ని చూసిన లాసన్ కు హృదయంలో ఒక చిన్న పరవశత్వపు తీపు అనుభవంలోకి వచ్చింది.

ఎవ్వరూ లేని ఏకాంతంలో యీదాలని ఆమెకు అనిపించడం ఎంత విచిత్రం అని అబ్బురపడ్డాడు లాసన్. అక్కడి స్థానిక ప్రజలు నీళ్లను దేవునిలాగా కొలుస్తారు. వాళ్లు నీళ్లున్న ఎక్కడో ఒకచోట రోజుకు కనీసం ఒకసారి, అప్పుడప్పుడు రెండు సార్లు స్నానం చేస్తారు. కాని వాళ్లంతా గుంపులుగుంపులుగా స్నానానికి వెళ్తారు. కుటుంబమంతా కలిసి, అమ్మాయిలంతా గుంపుగా పోయి, నవ్వుతూ తుళ్లుతూ స్నానం చేస్తారు. చెట్ల సందుల్లోంచి సూర్యుని వెల్తురు వాళ్ల శరీరాలమీద చిన్నచిన్న వలయాలుగా పడుతుంటే, ఆ నదిలోని నీళ్లను చేతుల్తో ఇతరుల మీదికి కొడుతూ ఆనందిస్తారు. దానికి విరుద్ధంగా ఎతెల్ తన స్నానం కోసం ఒంటరిగా కొలను దగ్గరికి వస్తున్నదంటే అందులో యేదో రహస్య మాంత్రిక శక్తి ఉండి వుండాలి అనుకున్నాడు లాసన్.

పూర్తిగా చీకటి పడింది. అతడు మెల్లగా నీటిలో మునిగాడు. చప్పుడు రావద్దనే ఉద్దేశంతో బద్ధకంగా మెత్తగా ఆ వెచ్చని చీకటి వేళలో యీదాడు. ఎతెల్ శరీరస్పర్శతో ఆ నీళ్లకు సుగంధం అంటిందనిపించిందతనికి. చుక్కలు పొదిగిన ఆకాశం కిందుగా అతడు ఏపియా పట్టణంలోకి వెళ్లిపోయాడు. అప్పుడు ప్రపంచం పట్ల అతని మనసులో ఎటువంటి అసంతృప్తీ చోటు చేసుకోలేదు.

అప్పట్నుంచి లాసన్ ప్రతి సాయంత్రం ఆ కొలను దగ్గరికి వెళ్లి ఎతెల్ ను చూడసాగాడు. ఆమెపట్ల అతనికున్న బెరుకు కొన్నాళ్ల తర్వాత మాయమైంది. ఆమె కూడా స్నేహంగా, సఖ్యతగా ఉండసాగింది. నీళ్లు వేగంగా పారే చోట ఉన్న బండలమీదా, అక్కణ్నుంచి కనపడే వంతెన మీదా వాళ్లిద్దరు పక్కపక్కన కూర్చుని మార్మికతను నింపుకున్న సూర్యాస్తమయాన్ని చూశారు. వాళ్లిద్దరు ఒకరినొకరు కలుసుకోవటం అందరికీ తెలియక తప్పలేదు. ఎందుకంటే ఆ ద్వీపంలో అందరి వ్యక్తిగత విషయాలు అందరికీ తెలుస్తాయి. లాసన్ తాను వుంటున్న హోటల్లోని వ్యక్తులచేత చాలా వ్యంగ్యపూరితమైన పరాచికాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్లు ఏమన్నా అతడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. వాళ్ల సూటిపోటి మాటల్ని, మోటు సరసాల్ని తిప్పికొట్టాలనిపించలేదతనికి. అతని మనసులోని భావాలు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. చంద్రుణ్ని ఒక కవి ఎట్లా ఆరాధిస్తాడో ఎతెల్ ను అతడు అట్లా ప్రేమించాడు. ఆమెను ఒక మామూలు స్త్రీగా కాక, ఈ ప్రపంచానికి చెందని పరలోక దివ్య సుందరిగా భావించాడు. అతని దృష్టిలో ఆమె ఆ కొలను తాలూకు చైతన్యం.

లాసన్ ఒకరోజు హోటల్లోని బార్ లోంచి పోతూ ముసలి బ్రెవాల్డ్ ను చూశాడు. ఆ వృద్ధుడు యెప్పటిలాగే మాసిపోయిన దుస్తుల్లో అక్కడ నిలబడి వున్నాడు. అతడు ఎతెల్ కు తండ్రి కనుక లాసన్ అతనితో మాట్లాడాలనుకున్నాడు. అతనిదగ్గరికి పోయి తల వూపి, మద్యానికి ఆర్డరిచ్చాడు. తర్వాత యధాలాపంగా అన్నట్టుగా అతనివైపు తిరిగి, తనతో కలిసి డ్రింకు తాగవలసిందిగా ఆహ్వానించాడు. కొన్ని నిమిషాల పాటు వాళ్లు స్థానిక విషయాలను చర్చించారు. బ్రెవాల్డ్ తనను మరీ పరిశీలనగా చూస్తుంటే లాసన్ ఇబ్బందికి గురయ్యాడు. అతడు మాట్లాడిన తీరు లాసన్ కు నచ్చలేదు. అందులో అనవసర ప్రశంస ఉన్నప్పటికీ విధితో పోరాడి చితికిపోయిన ఆ వృద్ధుని నంగి మాటల వెనకాల ఒక వైరుధ్యభావం దాగి వుంది. బ్రెవాల్డ్ ఒకప్పుడు బానిసలను తరలించే వ్యాపారంలో ఓడలోని క్యాప్టెన్ గా పని చేశాడనీ, సాల్మన్ ద్వీపవాసులతో జరిగిన పోరాటంలో తగిలిన గాయం కారణంగా అతని ఛాతీలో ఒక పెద్ద హెర్నియా ఏర్పడిందనీ గుర్తుకు తెచ్చుకున్నాడు లాసన్. అంతలోనే లంచ్ కోసం గంట మోగింది.

“ఇక నేను వెళ్లాలి” అన్నాడు లాసన్.

“ఒకసారి మా యింటికి రావాలి మీరు. నా యిల్లు అంత గొప్పగా యేం వుండదు. అయినా మీకు ఇదే నా స్వాగతం. ఎతెల్ మీకు తెలుసు కదా” అన్నాడు బ్రెవాల్డ్.

“సంతోషంగా వస్తాను”

“ఆదివారం మధ్యాహ్నమైతే బాగుంటుందేమో”

ఆ వృద్ధుని బంగళా వైలిమాకు పోయే రోడ్డునుండి కొంచెం లోపలికి, కొబ్బరితోటల మధ్య మట్టికొట్టుకుని పోయి, మాసిపోయి వుంది. ఆ యింటి చుట్టూ చెట్లు దట్టంగా పెరిగి వున్నాయి. చిరిగిపోయిన ఆకులతో ఆ చెట్లు చింపిరి గుడ్డల్లో ఉన్న అందమైన స్త్రీ తాలూకు విషాదాన్ని తలపింపజేస్తున్నాయి. ప్రతిదీ అపరిశుభ్రంగా, పట్టించుకోకుండా వదిలిపెట్టినట్టుగా వుంది. చిన్నచిన్న నల్లని పందులు మట్టిని పెళ్లగిస్తున్నాయి. చెత్తా చెదారాన్ని కెలుకుతున్న కోడిపిల్లలు చప్పుడు చేస్తూ తిరుగుతున్నాయి. ముగ్గురు నలుగురు స్థానిక వ్యక్తులు వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

బ్రెవాల్డ్ గురించి అడగ్గానే ఆ ముసలాయన ఇంటి లోపల్నుంచే బొంగురు గొంతుతో సమాధానమిచ్చాడు. సిటింగ్ రూమ్ లోకి పోయిన లాసన్ కు అక్కడ బ్రెవాల్డ్ కూచుని చుట్ట తాగుతుండటం కనిపించింది.

“కూర్చోండి. ఎతెల్ మేకప్ చేసుకుంటోంది” అన్నాడు బ్రెవాల్డ్.

అంతలోనే ఎతెల్ ఆ గదిలోకి వచ్చింది. ఆమె బ్లౌజూ స్కర్టూ తొడుక్కుని వుంది. తల వెంట్రుకల్ని యూరోపియన్ తరహాలో దువ్వుకుంది. కొలను దగ్గర కనిపించిన వనదేవత లాగా కాక కొంచెం సాదాసీదాగా ఉండటం వల్ల, ఆమెను చూసినవాళ్లకు ఇప్పుడు బెరుకు అనిపించదు. లాసన్ తో చేయి కలిపింది ఎతెల్. అతనికి అది ఆమెను తాకిన మొదటి సందర్భం.
“మీరు మాతో కలిసి టీ తాగుతారని ఆశిస్తున్నాను” అన్నదామె. ఆమె మిషనరీ స్కూల్లో చదివిందని లాసన్ కు తెలుసు. కాబట్టి ఆమె తనకోసం మర్యాదగా ప్రవర్తిస్తున్నందుకు పొంగిపోయాడు. టేబులుమీద టీ కప్పులూ సాసర్లూ పెట్టి ఉన్నాయి. అంతలోనే బ్రెవాల్డ్ నాలుగో భార్య ఒక పెద్ద టీ పాత్రను తీసుకొచ్చింది. ఆమె స్థానిక జాతికి చెందిన అందమైన స్త్రీ. నడి వయసులో ఉంది. కొంచెంకొంచెం ఆంగ్లభాషను మాట్లాడింది. పడీపడీ నవ్వింది. పుష్కలమైన బ్రెడ్డూ, వెన్నా, రకరకాల కేకులూ ఇచ్చారు వాళ్లు. సంభాషణ మామూలుగా సాగింది. అంతలోనే ఒక ముసలావిడ ఆ గదిలోకి వచ్చింది. ఆమె చర్మం ముడుతలు పడి వుంది.

“ఈమె ఎతెల్ కు నాయనమ్మ” అని కాండ్రించి తుపుక్కున నేలమీద ఉమ్మి వేశాడు బ్రెవాల్డ్.

ఆమె ఒక కుర్చీ అంచు మీద ఇబ్బందిగా కూచుంది. నేలమీద కూచోవటమే ఆమెకు సౌకర్యంగా వుంటుందని లాసన్ కు తెలిసిపోయింది. వంటగది వెనకాల ఒకతను పాశ్చాత్య సంగీత వాద్యాన్ని వాయిస్తుంటే ఇద్దరుముగ్గురు మనుషులు ప్రార్థనాగీతాన్ని పాడుతున్నారు. కాని వాళ్లు భక్తిభావంతో కాక, కేవలం స్వరాలకోసమే పాడుతున్నారు.

లాసన్ తన హోటలుకు తిరిగివెళ్లాక, అతని మనసులో విచిత్రమైన సంతోషం కదలాడింది. వాళ్ల అస్తవ్యస్తమైన జీవన విధానం అతడిని కదిలించింది. బ్రెవాల్డ్ తన జీవితంలో సాధించిన విజయాలు, అతని భార్య నవ్వులోని మంచి స్వభావం, మెరిసే ముసలావిడ కళ్లలోని మార్మికత – ఇవన్నీ అతనికి అసాధారణమైన విషయాలుగా, సమ్మోహనకరంగా తోచాయి. వాళ్లది చాలా సహజమైన జీవితం అనీ, అది స్నేహం నిండిన సారవంతమైన భూమిని తలపిస్తోందనీ సంతోషించాడతడు. ఆ క్షణంలో అతనికి నాగరికత పట్ల విముఖత కలిగింది. అనాది తత్వం గల ఆ మనుషులతో కేవలం కొంతసేపు గడిపినందుకే అతడు యెంతో స్వేచ్ఛను అనుభవించాడు.

తనకు విసుగు తెప్పించిన ఆ హోటలును వదిలినట్టూ, సముద్ర తీరానికెదురుగా వున్న రోడ్డు పక్కన ఒక చిన్న తెల్లని అందమైన యింట్లో భార్యతో ఉంటున్నట్టూ ఊహించుకున్నాడు. ఆ సముద్రపు నీళ్లలోని రంగుల వైవిధ్యం అతనికెంతగానో నచ్చుతుంది. ఆ ద్వీపాన్ని అతడు చాలా ప్రేమించాడు. లండన్ పట్లా, ఇంగ్లండ్ పట్లా బాంధవ్యం తగ్గినట్టనిపించింది. తన శేషజీవితాన్ని ఆ మారుమూల ప్రాంతంలో హాయిగా గడపటం తృప్తినిస్తుందనుకున్నాడు. ఎన్ని అడ్డంకులొచ్చినా ఎతెల్ ను వివాహం చేసుకోవాలనుకున్నాడు.

కాని, ఏ అడ్డంకులూ రాలేదు. బ్రెవాల్డ్ యింటికి ఎప్పుడు పోయినా లాసన్ కు స్వాగతం దొరికింది. ఆ వృద్ధుడు ఎప్పుడూ వినయంగా, మర్యాదగా మాట్లాడాడు. అతని భార్య ఆగకుండా నవ్వింది. ఆ యింట్లో ఆ జాతికి చెందిన కొందరు మనుషులు ఉండటం గమనించాడు లాసన్. ఒకసారి ఒక ఎత్తైన యువకుడు కనిపించాడు. లావాలావా అనే డ్రెస్సును తొడుక్కున్నాడతడు. అతని శరీరం మీద పచ్చబొట్లున్నాయి. వెంట్రుకల మీద తెల్లని సున్నంపొడి ఉండటంతో అవి తెల్లగా ఉన్నాయి. అతడు బ్రెవాల్డ్ పక్కన కూచుని ఉండటం లాసన్ గమనించాడు. ఆ యువకుడు బ్రెవాల్డ్ అన్న కొడుకని లాసన్ కు చెప్పారు వాళ్లు. కాని ఆ మనుషులు చాలా వరకు లాసన్ కు కనిపించకుండా ఉండటానికే ప్రయత్నించారు. లాసన్ తో ఎతెల్ ఆహ్లాదంగా వుంది. తనను చూసినప్పుడు ఆమె కళ్లలో కనిపించిన మెరుపు అతనికి పారవశ్యాన్ని కలిగించింది. ఆమె చాలా ఆకర్షణీయంగా, అమాయకంగా ఉందనుకున్నాడు. తనూ తన అక్కచెల్లెళ్లూ చదివిన మిషనరీ స్కూలు గురించి ఎతెల్ చెప్పినప్పుడు అతడు మంత్రముగ్ధుడై విన్నాడు. అతడు ఎతెల్ తో కలిసి ప్రతి పదిహేను రోజులకొకసారి ఆ వూళ్లో ఆడే సినిమాకు వెళ్లి, దాని తర్వాత జరిగే డాన్సు కార్యక్రమంలో ఎతెల్ తో పాటు నృత్యం చేశాడు. ఆ ఉత్సవానికి ద్వీపంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. స్థానిక జనం పాశ్చాత్య దేశాల దుస్తుల్ని, బూట్లను తొడుక్కుని అక్కడికి వస్తారు. అక్కడంతా హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. తనను వదలకుండా ఎప్పుడూ వెంట తిరిగే తెల్లజాతీయుడైన లాసన్ ను ఎతెల్ తన స్నేహితురాళ్లకు పరిచయం చేస్తూ ఎంతో ఆనందించింది. లాసన్ త్వరలోనే ఎతెల్ ను పెళ్లి చేసుకుంటాడనే వార్త అంతటా పాకింది. ఎతెల్ పట్ల ఆమె స్నేహితురాళ్లు అసూయను చూపారు. ఎందుకంటే ఒక స్థానిక సంకరజాతి స్త్రీ తెల్ల జాతీయుణ్ని పెళ్లాడటం వాళ్లకు గొప్ప విషయం. పెళ్లి చేసుకోకున్నా అతనితో కలిసి తిరగటమన్నది ఏమీ లేనిదాని కంటె నయమే అనుకున్నారు వాళ్లు. కాని అట్లా చేస్తే ఎటువంటి పర్యవసానం ఏర్పడుతుందోననే భయం కూడా ఉంది వాళ్లకు. లాసన్ చేస్తున్న ఉద్యోగం బ్యాంకు మేనేజరు కావటం వల్ల, పెళ్లి చేసుకోవటానికి అతణ్ని మంచి అర్హత ఉన్న వ్యక్తిగా ఎంచారు వాళ్లు. ఎతెల్ ను తాను పెళ్లి చేసుకోవాలనుకోకపోతే ఎందరో ఇతర యువతులు తనపట్ల ఆసక్తిని చూపేవారని లాసన్ కు తప్పక తెలిసేది. అప్పుడు తెల్ల జాతీయులైన స్త్రీలు గుమిగూడి తనగురించి ఎంతగా మాట్లాడుకునేవారో తెలిసేది అతనికి.

తర్వాత ఒకరోజు హోటల్లో కొందరు విస్కీ తాగుతుంటే “లాసన్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట” అన్నాడు నెల్సన్.

“అయితే అతడొక అవివేకి” అన్నాడు మిల్లర్.

మిల్లర్ నిజానికి జర్మన్ తండ్రికీ అమెరికన్ తల్లికీ పుట్టినవాడు. ముల్లర్ అనే తన చిన్నప్పటి పేరును మిల్లర్ గా మార్చుకున్నాడు. అతడు పెద్ద శరీరంతో లావుగా ఉంటాడు. బట్టతలా, నున్నగా షేవింగు చేసుకున్న గెడ్డమూ వుంటాయతనికి. పెద్ద గోల్డ్ రిమ్డ్ కళ్లద్దాలు పెట్టుకుంటాడు. అవి అతడిని కొంచెం సాత్వికుడుగా కనిపింపజేస్తాయి. అతడు తొడుక్కునే ప్యాంట్లు ఎప్పుడూ తెల్లగా, శుభ్రంగా వుంటాయి. మిల్లర్ విపరీతంగా మద్యం తాగుతాడు. ఇతరులతో కలిసి రాత్రంతా తాగటానికి అతడు యెప్పుడూ సిద్ధమే కాని, ఎంతగా తాగినా ఎప్పుడూ ఔటవడు. అతడు ఉల్లాసంగా స్నేహంగా ఉంటాడు కాని, చాలా తెలివైనవాడు. అతని వ్యాపారాన్ని ఏదీ అడ్డుకోజాలదు. సాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక కంపెనీ తరఫున స్టాక్ బ్రోకర్ గా వుంటూ ఆ ద్వీపంలో గుడ్డలు, యంత్రాలు మొదలైన ఎన్నో వస్తువుల్ని అమ్మే వ్యాపారం చేస్తాడు. ఆ వ్యాపారంలో ఉండటం వల్లనే అతడొక కలుపుగోలు మనిషి అయ్యాడు.
“తానేం చేస్తున్నాడో లాసన్ కు తెలియటం లేదు. ఎవరైనా అతనికి నచ్చజెప్పి, సరైన మార్గంలో పెట్టాలి” అన్నాడు నెల్సన్.

“నీది కాని వ్యవహారంలో తల దూర్చవద్దని నా సలహా. ఒక వ్యక్తి మూర్ఖమైన గట్టి నిర్ణయం తీసుకున్నాక అతడిని యెవరూ ఆపలేరు” అన్నాడు మిల్లర్.

“అమ్మాయిలతో సరదాగా తిరగటం నాకూ యిష్టమే. కాని పెళ్లి చేసుకోవడం మంచి విషయం కాదు. లాసన్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఈ మాటను లోకానికంతటికీ బాహాటంగా చెప్పగలను నేను”

అంతలోనే చాప్లిన్ వచ్చాడక్కడికి. “చాలా మంది ఆ విధంగా చేయటం చూశాను నేను. అదేమంత మంచిది కాదు” అన్నాడతడు.

“చాప్లిన్, నువ్వు లాసన్ తో మాట్లాడాలి. మా అందరికన్నా నీకే అతడు ఎక్కువ తెలుసు” అన్నాడు నెల్సన్.

“ఆ విషయాన్ని వదిలేయాలని చాప్లిన్ కు నా సలహా” అన్నాడు మిల్లర్.

లాసన్ ఎవరో ఆ రోజుల్లో ఆ ద్వీపంలోని ఎక్కువ మందికి తెలియదు కాబట్టి, యెవరూ అతని గురించి పట్టించుకోలేదు. చాప్లిన్ భార్య ఆ విషయం గురించి ఇద్దరుముగ్గురు పాశ్చాత్య స్త్రీలతో ఫోన్ మీద మాట్లాడింది. వాళ్లు పాపం అని జాలి చూపారే తప్ప, ఇంకేమీ చేయలేదు. ఎతెల్, లాసన్ ల పెళ్లి జరగటం ఖాయం అని చాప్లిన్ తన భార్యతో చెప్పేసరికి అప్పటికే చాలా ఆలస్యమైపోయి, ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

పెళ్లయ్యాక ఒక సంవత్సరం దాకా లాసన్ ఆనందంగా వున్నాడు. ఏపియా పట్టణ శివారులో సముద్ర తీరానికి ఆనుకుని వున్న ఒక గ్రామంలో బంగళా తీసుకున్నాడతడు. అది కొబ్బరిచెట్ల మధ్య ఆహ్లాదకరంగా నక్కి వుంది. దానికెదురుగా నీలంరంగు నీళ్లతో పసిఫిక్ మహా సముద్రం. ఆ చిన్న యింట్లోకి వెళ్లిన ఎతెల్ చాలా ఆనందాన్ని అనుభవించింది. వాళ్లిద్దరూ రోజూ హాయిగా నవ్వుకున్నారు. లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు హోటల్లోని ఒకరిద్దరు మిత్రులు ఆ యింటికి వస్తారు. ఆదివారాల్లో తరచుగా లాసన్ ఎతెల్ కలిసి ఊరవతల ఉన్న స్నేహితుల ఫామ్ హౌస్ కు వెళ్లి, ఒకరోజు గడిపి వస్తారు. ఆ స్నేహితులు స్థానిక యువతులను పెళ్లి చేసుకున్న వాళ్లే అయి వుంటారు. మధ్యమధ్య, ఏపియాలో దుకాణాన్ని కలిగిన మిత్రులు – ఎతెల్ జాతికి చెందినవాళ్లు – యిచ్చే విందుకు ఇద్దరూ కలిసి వెళ్తారు. ఆ మిశ్రమ జాతీయులు లాసన్ తో మునుపటికన్న పూర్తి భిన్నంగా
వ్యవహరించసాగారు. ఎతెల్ ను పెళ్లి చేసుకున్నందుకు అతడిని తమలో ఒకడిగా భావించడమే కాక, బెట్టీ అనే పేరును యిచ్చారతనికి. అతని చంకల్లోంచి చేతుల్ని దూర్చి, వీపు మీద చేతితో చిన్నగా కొట్టడం మొదలెట్టారు. అటువంటి విందుల్లో ఎతెల్ వుండాలని లాసన్ కోరిక. ఎందుకంటే ఆ సందర్భాల్లో ఆమె కళ్లు మెరుస్తాయి. ఆమె హాయిగా నవ్వుతుంది. ఆమె అట్లా ఆహ్లాదంగా ఉండటం లాసన్ కు చాలా తృప్తిని కలిగిస్తుంది. అప్పుడప్పుడు ముసలి బ్రెవాల్డ్, అతని తల్లి, అతని అన్నకొడుకు మొదలైన ఎతెల్ తరఫువాళ్లు లావాలావాలు తొడుక్కుని, ఎర్రరంగు వేసుకున్న వెంట్రుకల్తో ఒళ్లంతా పొడిపించుకున్న పచ్చబొట్లతో వస్తారు. అతడు బ్యాంకునుండి తిరిగొచ్చే వరకు కూడా వాళ్లు తన యింట్లోనే సమయాన్ని గడుపుతారు. అతడు సహనంతో నవ్వుతాడు.

“వాళ్లకు ఎక్కువగా భోజనాలు పెట్టకు” అన్నాడొకసారి లాసన్.

“వాళ్లు నా వాళ్లు. వాళ్లు అడిగినప్పుడు నేను తిండి పెట్టకుండా ఉండలేను” అన్నది ఎతెల్.

ఒక తెల్ల జాతీయుడు స్థానిక జాతికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటే ఆమె బంధువులు అతని డబ్బును బాగా ఆశిస్తారని లాసన్ కు తెలుసు. అతడు ఎతెల్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, ఎర్రగా వున్న ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు. తనకు పెళ్లి కాకముందు బొటాబొటిగా కన్న కొంచెం యెక్కువగా వచ్చిన జీతంతో ఇప్పుడు భార్యాభర్తలిద్దరికీ, ఇంకా ఇల్లు నడపడానికీ సరిపెట్టుకోవాలనే సంగతి పాపం ఎతెల్ కు తెలియదు అని అకున్నాడేమో. తర్వాత కొన్నాళ్లకు ఎతెల్ ఒక కొడుకును కన్నది.

మొదటిసారిగా బాబును తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు లాసన్ హృదయంలో అకస్మాత్తుగా ఒక బాధాకరమైన తీపు కదలాడింది. బాబు మరీ అంత నల్లగా పుడతాడనుకోలేదతడు. ఆ బాబులో కొంత మాత్రమే స్థానిక జాతి రక్తం వుంటుంది కనుక, పిల్లవాడు ఇంగ్లీషువాళ్ల లాగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది కదా అనుకున్నాడు. కాని, తన చేతుల్లో ఒదిగివున్న ఆ శిశువు నల్లని తలవెంట్రుకల్తో, నల్లని పెద్ద కళ్లతో కనిపించడం వల్ల అతడు స్థానికజాతికి చెందిన పిల్లవాడే అనిపించాడు. తన పెళ్లి తర్వాత ఆ వూళ్లోని తెల్లజాతి స్త్రీలు తనతో ముభావంగా ఉన్నారు. తన మిత్రులైన తెల్లజాతి పురుషుల్ని కలిసినప్పుడు వాళ్లు తమ తత్తరపాటును కప్పిపుచ్చుకోవటం కోసం మరీ నహృదయతతో మెలగసాగారు.
“మిసెస్ లాసన్ బాగుందా? నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎతెల్ చాలా అందంగా వుంటుంది” అనేవారు వాళ్లు.

కాని, వాళ్లు తమ భార్యలతో తన యింటికి వచ్చినప్పుడు ఆ స్త్రీలు ఎతెల్ ను ఆరాధన పూర్వకంగా చూసి ఎబ్బెట్టుగా ఫీలయ్యేవాళ్లు. అప్పుడు లాసన్ నవ్వేవాడు.
“వాళ్లందరూ మురుగునీళ్ల వంటి వారు. రోత పుట్టించే తమ విందులకు నన్ను పిలవకపోతే నేనేం పెద్దగా బాధ పడిపోను” అనేవాడు లాసన్.

కాని ఇప్పుడతనికి కొంచెం చిరాకు కలుగుతోంది. తన కొడుకు కళ్లు చిలికించి చూసినప్పుడు, వీడు నా కొడుకు అనుకున్నాడు లాసన్. ఏపియా పట్టణంలో వున్న సంకరజాతి పిల్లల్ని తల్చుకున్నాడు లాసన్. వాళ్లందరూ పాలిపోయిన ముఖాలతో జబ్బుపడ్డ మనుషుల్లాగా ఉంటారు. చిన్నతనంలోనే వయసు ముదిరిన లక్షణాలు కనిపిస్తాయి వాళ్ల ముఖాల్లో. ఒకసారి అటువంటి పిల్లలంతా న్యూజీలాండుకు వెళ్లే పడవ యెక్కి బడికి పోతుంటే చూశాడతడు. వాళ్లు ఒకరిమీద ఒకరు పడిపోతూ సిగ్గుమాలిన వారిలాగా కనిపించారు. కాని మళ్లీ భయస్తుల్లాగా కూడా ఉన్నారు. వాళ్లలోని లక్షణాలు తెల్లజాతి వాళ్ల లక్షణాలకు పూర్తిగా భిన్నంగా వున్నాయి. తమ మాతృభాషలోనే మాట్లాడుకున్నారు వాళ్లు. పెరిగి పెద్దయ్యాక వాళ్ల జీతాలు తెల్లవాళ్ల జీతాలతో పోల్చి చూస్తే తక్కువగా ఉంటాయి. అమ్మాయిలను తెల్లవాళ్లెవరైనా పెళ్లి చేసుకుంటారేమో కాని, అబ్బాయిలకు మాత్రం అటువంటి అవకాశం ఉండదు. తన కొడుకును అటువంటి అవమానరకమైన జీవితానికి దూరంగా తీసుకుని పోవాలని నిశ్చయించుకున్నాడు లాసన్. ఎట్టి పరిస్థితిలోనైనా తను ఇంగ్లండుకు వెళ్లిపోవాలనుకున్నాడు. మంచంలో బలహీనంగా పడివున్న ఎతెల్ చుట్టూ మూగిన స్థానికజాతి స్త్రీలను చూసినప్పుడు అతని దృఢసంకల్పం మరింత బలపడింది. ఆమెను ఇంగ్లండులోని తనవాళ్ల మధ్య వుంచితే అప్పుడు ఎతెల్ పూర్తిగా తనదైపోతుంది అనుకున్నాడు. అతడామెను యెంతగా ప్రేమించాడంటే, తమ యిద్దరి దేహాలూ ఆత్మలూ ఒకటైపోవాలని కోరుకున్నాడు. ఆమె ఇక్కడే స్థానికజాతి ప్రజల మధ్యన వుంటే, ఆ జీవనవిధానపు వేర్లు గట్టిగా పాతుకునిపోయి ఆమె తనది కాకుండా పోతుందని భయపడ్డాడు.

[ఇంకా ఉంది] 

Picture Credit: Somerset Maugham by Alfred Eisenstaedt, 1942