కవిత్వం

ట్రాన్సిషన్

జూలై 2015

మాట్లాడుకోవాలి మనం
సౌష్టవాల సంకీర్ణతలను
బద్దలైన అద్దాలపై కూర్చొని
అర్థాలు లేకపోయినా
అదేపనిగా మాట్లాడుకోవాలి మనం.

ఏదీ మొదలు కాని చోటకూడా
అప్పటికే కొన్ని పూర్తయ్యే వుంటాయని,
సమస్తం సర్వనాశనమయిన చోటకూడా
తలలెత్తే చివుర్లుంటాయని
తెలుసుకోవాలి మనం.

కప్పుకున్న కవి తోళ్లు విప్పుకొని,
దిగ్భ్రమ దేహ దుఃఖాన్ని ఆస్వాదించాకన్నా,
విషమ గందరగోళ
సాహీతీ నిషా గరళాలు
పూర్తిగా దిగిపోయాకన్నా
తేడా తెలుసుకోవాలి మనం

కవిగా ఎదగడానికి,
కవిత్వంగా మారడానికి మధ్య.

ఎప్పటిలాగానే
అతను చెబుతూనే వున్నాడు.