పుస్తక పరిచయం

దాసరి సుబ్రమణ్యం కథలు

ఆగస్ట్ 2015

జ్ఞాత రచయితగా ఎన్నో పిల్లల నవలలు రాసి చందమామలో కొడవటిగంటి కుటుంబరావు గారికి కుడిభుజంలా వ్యవహరిస్తూ యాభై ఏళ్ళ పాటు ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉంటూ దాదాపు అనామకంగా మరణించిన వ్యక్తి దాసరి సుబ్రమణ్యం గారు. ‘ఇన్ని దశాబ్దాలపాటు ఒకే ఇంట్లో అద్దెకి ఉన్నది భూమండలం మీద నేనొక్కడినేనేమో!’ అనేవారుట.

ఈయన రాసిన పెద్దల కథల సంకలనాన్ని వాహినీ బుక్ ట్రస్ట్ వారు 2011 లో దాసరి సుబ్రమణ్యం కథలు అనే పేరుతో తెచ్చారు. కథల్లో వాక్య నిర్మాణం చాలా చోట్ల అచ్చు గుద్దినట్లు కొ.కు గారిదే. ఇంక కథనం, శైలి, జాన్రా మాత్రం చాలా వరకు కొమ్మూరి సాంబశివరావు (ఉవ్వి) గారిదీ, కొంతవరకు కొ.కు గారిది. ఏ కథలోనూ ఎక్కడా ఒక్క పదం కూడా ‘నసగదు’. చురుకుగా కథను కదిలించే ఉవ్వి డిటెక్టివ్ రచనా శైలి. ఏదో ఒక చమక్కునీ, విషయాన్ని నూతనంగా చెప్పాలనే ధోరణినీ, ఆంధ్ర సమాజంలో అప్పుడప్పుడే ఆధునిక విద్యావంతులలో కలుగుతున్న నవీన భావజాలాన్నీ ఈ కథల్లో చూపించడానికి ప్రయత్నించారు దాసరి సుబ్రమణ్యం గారు. ఈ లక్షణం కొ.కు తొలి రచనల్లో కూడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. మరీ కొన్ని కథలు అయితే కొ.కు నే రాశారా అన్న భ్రమని కలుగచేస్తున్నాయి.

‘చందమామ’ లోని కథన శైలి కనిపిస్తూనే ఉంది. కాబట్టి ‘ఏనుగుల్ని గుండెల మీద ఎక్కించుకున్నంత చందమామ ఎడిటింగ్ పని’ లో ఈయనకీ ప్రముఖపాత్ర ఉండి ఉంటుంది.

దా.సు. గారు కొన్ని కథల్ని మారు పేర్లతో రాశారు. వీటిల్లో కె.కె. దాసు, కామినీ కాంచన దాసు అన్న కలం పేర్లలోని కకారాలు కొ.కు ని గుర్తు చేసేందుకే పెట్టారా అని అనిపించక మానదు. ఇంకా సుశీలాదాసు, దాసు, సుజాత అన్న పేర్లు కూడా ఈయన వాడారు. ఈయన ఎంత ‘కీన్ ఐ’ ఉన్న ఎడిటరో చెప్పడానికి ఒక ఉదాహరణ – తన కథల ప్రతులన్నింటినీ కారా మాష్టారు గారి ‘కథానిలయం’ కి పంపిస్తూ ఓ కథ పేరు అచ్చుప్రతిలో ‘శతృత్వం’ అని ఉంటే దానిని ‘శత్రుత్వం’ అని మార్చి పంపారట.

ఈ పుస్తకం లోని కథలకి సంబంధించి కొన్ని విశేషాలు -

‘తాడు-బొంగరం’ కథలోని శైలి ముమ్మూర్తులా కొ.కు గారిదిలానే ఉంది. కలం పేరు కామినీ కాంచనదాసు. కథలో యువతీయువకులిద్దరికీ పరిచయం కావడానికి థియేటర్ లో త్రిడి సినిమాని చూడటం అనే సందర్భాన్ని వాడుకున్నారు దా.సు. గారు – పంతొమ్మిది వందల నలభైల్లోనే! త్రిడి కళ్ళజోళ్ళు పెట్టుకుని సినిమా చూస్తూ, పిక్చర్లో కర్రో కత్తో విసరబడినప్పుడల్లా ‘ముందున్న అమ్మాయి సుందరి కుర్చీ పట్టుకోబోయి ఒకటి రెండు సార్లు ఆమె జడ అందిపుచ్చుకున్నాడట శేఖరం’. ఔరా, కథకుని చాతుర్యం! అని ఆధునిక పాఠకుడికి అనిపించకమానదు ఈ కథ చదువుతుంటే.

ఆ తర్వాత వచ్చే సంఘటనలు ముఖ్యంగా సుందరి ఇంట్లో ముసలాయన డైలాగులు కొ.కు కలం నుంచి ఊడిపడినట్లున్నాయి.

ఇక ‘లైంగికేయుడు’ అన్న కథ చలం గారి మీద సెటైర్ లా ఉంది. కొ.కు కి, ఉవ్వికి చలం అంటే గిట్టనట్లే దా.సు. గారికి కూడా గిట్టనట్లుంది. చలం గారి పోలికలు తెలిసేలాగా ఓ రచయితని సృష్టించి ఆ పాత్రని ఓ ఇడియట్ లా చిత్రించారు దా.సు. గారు. కథ చివర్లో సింబాలిక్ గా ఆ రచయిత కలం పాళీ మొద్దుబారిపోయినట్లు చూపించారు. ఈ కథ రాసింది 1950 జనవరిలో. (అప్పుడే చలం గారు రమణాశ్రమానికి చేరుకుంటున్నారు).

‘జర్నలిజం అంటే నాకు చర్మం ఒలవడం అని వినబడుతుంటుంది’ అని ఒక పాత్ర చేత అనిపించడం బావుంది – అవ్యక్తం కథలో
ఒక కథకి పేరు ‘కనువేదురు’ అని పెట్టారు దా.సు. గారు. దీనికర్థం నిఘంటువులో ‘తొలి చూపులో కలిగే ఉన్మాదం లాంటి వలపు పిచ్చి’ అని ఉంది.
కళవెళపడటం, ప్రాణగొడ్డము లాంటి పదాలు కథల్లో చదవడం సరదాగా ఉంది. మొత్తం మీద ఆసక్తిగా చదివించే పుస్తకం.

దా.సు. గారి www.kathanilayam.com కి వెళ్ళి ‘కథలు’ శీర్షికలో రచయిత పేరుతో వెతికితే పన్నెండు కథలు దొరుకుతాయి. ఇవన్నీ తెలుగు స్వతంత్ర, అభిసారిక పత్రికలలో 1949 – 1951 మధ్య ప్రచురించబడినవి.

***** (*) *****