కవిత్వం

నవ్వే నక్షత్రాలు

ఆగస్ట్ 2015

చీకట్లో ముఖాలు ఎలా కనపడతాయి
నక్షత్రాలే కనపడతాయి
సుదూర తీరాలలో ఉన్నా సరే మెరుస్తూ
నట్ట నడి గోదారిలో ఎదురీదుతున్న చేపపిల్లలా
రోడ్డు పై సాగిపోతున్నప్పుడు
ముఖానికి కట్టిన ముఖ్మల్ దుప్పట్టా
ఊపిరాడనివ్వని స్థితిలో
ఏ సిగ్నల్ దగ్గరో ఆగినప్పుడు
కవ్వింపుగా విసిరేయబడిన కామెంట్లు కొన్ని
ముఖానికి కాకపోయినా
మనసుకి కొన్ని మరకల్ని అంటిస్తాయి
కనపడే ముఖాలన్నీ దాయబడిన
వాటిని గుచ్చి గుచ్చి చూస్తుంటాయి
వాస్తవమేదొ ఉందని
ఊహకందనిది మనకెందుకని వదిలేయలేని
ఆలొచనలకు వేయాలికదా అసలు ముసుగు
అటూ ఇటుగా ఓ అయిదొందల నిముషాల తర్వాత
ఇంటిముంగిట విదిలించిన దుపట్టాలోంచి
రాలిన కవ్వింపుల మాటలన్నీ నవ్వు తెప్పిస్తాయి
చెవుల్దాకా చేరిన మాటలన్నీ మనసుకి చేరవు కదా
నవ్వుతున్న ముఖాలే రాత్రి వేళలో
నింగిలో నక్షత్రాలై మెరుస్తాయి