కథ

హోమ్ రన్

ఫిబ్రవరి 2013

“ ఇవాళ గేమ్ వుంది తెలుసుగా. తొందరగా తయారవు. ఏం తింటావు?”

స్కూల్  నుంచి అప్పుడే వచ్చిన క్రిస్  కి గబ గబా చెప్పేస్తోంది సుచిత్ర.

“ ఐ నో.ఐ నో మామ్. “ గట్టిగా అరిచినట్లు తల్లి కి  చెప్పేసి గేమ్ కి రెడీ అయ్యేందుకు తన రూమ్ లోకి వెళ్లిపోయాడు.

ఆ గొంతు తో క్రిస్  మాట్లాడితే వీపు మీద ఒక్క దెబ్బ ఇవ్వాలనిపిస్తుంది సుచిత్ర కి. కానీ గేమ్ ముందు వాడి మూడ్,తన మూడ్ రెండు చెడగొట్టుకోవటం ఆమెకు ఇష్టం లేదు. ఇవాళైనా తాను అనుకున్నది జరిగితే బావుండు అనుకుంటూ గోడ మీద వున్న ఇష్ట దైవం వైపు చూస్తూ మరో నమస్కారం చేసేసుకుంది.

“ బోలోనీ శాండ్ విచ్ చేయమంటావా? “ క్రిస్  గది తలుపులు నెమ్మదిగా తీసి లోపలకు వెళ్లింది.

“ మమ్మీ. ఎన్ని సార్లు చెప్పాలి? తలుపులు వేసి వున్నాయంటే లోపలకు రాకూడదని అర్థం.  నువ్వు లోపలకు రావాలనుకుంటే తలుపు కొట్టి రావాలి ” వందో సారి తల్లికి ఆ విషయం చెపుతూ తల్లికి కనిపించకుండా పక్కకు తిరిగి గబగబా బట్టలు  వేసుకోవడం మొదలుపెట్టాడు క్రిస్ .

“ ఓకే. ఓకే. నేను అమ్మను రా..నేను చూస్తే తప్పులేదు. పైగా చూడకపోతే నీకు ఎలాంటి సమస్యలు  వున్నాయో నాకేలా తెలుస్తుంది?” అంటూ గబగబా బెల్ట్ పెట్టుకోవడం లో సహాయ పడింది సుచిత్ర.

“   అండర్వేర్ లో ‘ కప్’ పెట్టుకున్నావా? సరిగ్గా వుందా? టైట్ గా వుందా?” అంటూ అక్కడ చెయ్యి పెట్టి చూడబోయింది.

షాక్ తగిలినట్లు క్రిస్  దూరం జరిగాడు. కళ్ళల్లో ఆ పదేళ్ళ పసివాడి కోపం చూసినా సుచిత్ర ఏమాత్రం జంకలేదు. వాడి భావాల్ని పట్టించుకోలేదు కూడా.

“ టింకూ. నేను అమ్మను రా. నేను అన్నీ తెలుసుకోవాలి. నువ్వు అది సరిగ్గా పెట్టుకోలేదనుకో. అక్కడ బాల్ కానీ తగిలితే ఎంత ప్రమాదమో తెలుసా?” ఆ విషయం వందో సారి మళ్ళీ చెప్పింది సుచిత్ర.

“ కాల్ మీ క్రిష్ ….నన్ను టింకూ అని పిలవొద్దని చెప్పాను గా! ” విసుగ్గా మొహం పెట్టి అన్నాడు క్రిస్ .

” ఆ( అది బైట అందరూ పిలిచే పేరు. నువ్వెప్పటికీ నా టింకూ నే !” అంటూ టింకూ ని ముద్దుగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టబోయింది సుచిత్ర.  అలా చేయద్దన్నట్లు తల్లికి దూరం గా జరిగాడు టింకూ.

“నేను తెలుగు లో మాట్లాడమంటే నువ్వు వింటున్నావా? నేను తెలుగు లో మాట్లాడటం, నువ్వు ఇంగ్లీష్ లో సమాధానం చెప్పటం….” అన్నది సుచిత్ర.

“ Mom, don’t start again . I’m talking in Telugu”  విసురుగా మళ్ళీ ఇంగ్లీష్ లోనే చెప్పాడు క్రిస్.

“  శాండ్ విచ్ లో ఏం పెట్టమంటావు? బోలోనీ ? హేమ్?”

“హేమ్ ” అని తల్లికి చెప్పేసి గబగాబా బేస్ బాల్ క్లీట్స్ వేసుకోవటం మొదలుపెట్టాడు.

క్రిస్  తయారవుతుండగా గబగబా శాండ్ విచ్ , గ్లాసు తో పాలు తీసుకొచ్చి తానే తినిపించటానికి సిద్ధమయింది సుచిత్ర.

“ నేను తింటాను” అంటూ ఆ ప్లేట్ పట్టుకొని కౌచ్ మీద  కూర్చొని టీవీ ఆన్ చేశాడు.  ESPN ఛానెల్ పెట్టుకొని MLB గేమ్ చూస్తూ శాండ్ విచ్ తినడం మొదలుపెట్టాడు.

ఈ లోగా సుచిత్ర వాటర్ బాటిల్, ఐసు పాక్, స్నాక్స్  అన్నీ బేస్ బాల్ బాగ్ లో పెట్టి సోఫా లో  క్రిస్  పక్కన కూర్చుంది. “ వెళ్ళేముందు దేవుడికి దణ్ణం పెట్టుకో. ఈ సీజన్ కి ఇది ఆఖరి గేమ్ .ఇవాళ హోమ్ రన్ చేయాలి. చేస్తావు కదూ!  క్రిస్ క్రాఫ్ ని సరి చేస్తూ లాలనగా అడిగింది సుచిత్ర.

లీనమై పోయి టీవీ లో బేస్ బాల్  గేమ్ చూస్తున్న క్రిస్  అలాగే అన్నట్లు తల వూపాడు.

తొందరగా తిను అని మరో సారి క్రిస్  ని హెచ్చరించి తాను కూడా తయారవటం మొదలుపెట్టింది సుచిత్ర . క్రిస్  హోమ్ రన్ చేస్తే ఆ మధుర క్షణాలను భద్రంగా తీసి పదిలపర్చుకోవటానికి గాను  కెమెరా ను, కామ్ కార్డర్ ని కూడా సిద్ధం చేసుకుంది.  తమను తీసుకెళ్ళటానికి ఆనంద్ వస్తున్నాడో లేదో అన్నట్లు మరో సారి అతనికి కాల్ చేసింది. అయిదు నిముషాల్లో ఇంట్లో వుంటాను అని ఆనంద్ చెప్పటం తో అమ్మయ్య అనుకుంది

*************

కారు లో వెళ్తున్నంత సేపూ క్రిస్  కి  స్ట్రెస్ లేకుండా రిలాక్సింగ్ గా ఆడమని, ,  పిచింగ్ చేసి వచ్చాక భుజాల దగ్గర మర్చిపోకుండా  ఐస్ ప్యాక్ పెట్టుకోమని, ఇలా రకరకాల సలహాలు ప్రతి గేమ్ ముందు చెప్పేవే ఇంకో సారి విసుగు లేకుండా చెప్తోంది. చెప్పటానికి సుచిత్ర కి విసుగు లేకపోయినా ఆ క్లాస్ వినటం అటు ఆనంద్ కి, ఇటు క్రిస్  కి ఇద్దరికీ చిరాకు.

“ మమ్మీ. అక్కడ గేమ్ చూసే వాళ్ళల్లో నీకొక్కదానికే ఆ బేస్ బాల్ తెలియదు. కానీ అన్నీ తెలిసినట్లు మాట్లాడతావు”  తన మనసు లో మాట నిర్భయం గా చెప్పాడు క్రిస్.

తల్లి తండ్రులంటే కొంచెం కూడా భయం లేకుండా వాడు అలా మాట్లాడటం , తాము మాట్లాడనివ్వటం రెండు కూడా సుచిత్ర, ఆనంద్ లకు ఇప్పటికీ ఆశ్చర్యమే. మొదట్లో వాడి మాట తీరు కి బాధ పడేవారు. కానీ ఇప్పుడు కొంచెం అలవాటై పోయింది. ఇక్కడ పిల్లలకు అలా సూటిగా, ధైర్యం గా మాట్లాడటం స్కూల్లోకి వెళ్ళాక అలవాటు అవుతుంది. ఇక దాన్ని మార్చటం అనేది కొంచెం కష్టం అన్న సంగతి అర్థం చేసుకొని తామే తమ పద్ధతులను నెమ్మదిగా మార్చుకోవటం మొదలుపెట్టారు వాళ్ళు . తమ తల్లితండ్రులతో ఇప్పటికీ కూడా తాము అంత సూటిగా మాట్లాడలేమన్న సంగతి వాళ్ళకు తెలుసు.

*****

గేమ్ మొదలయింది. క్రిస్ వాళ్ళది  హోమ్ టీం. విజిటర్స్ టీం బ్యాటింగ్ మొదలుపెట్టింది. క్రిస్ పిచింగ్ చేస్తున్నాడు. మొదటి ఇన్నింగ్ లో ఒక ఇద్దరు ప్లేయర్ లను ఔట్ చేశాడు.ఇంకొక్కరినీ ఔట్ చేయగలిగితే ఆ ఇన్నింగ్ అయిపోతుంది. కానీ క్రిస్ ఎంత ప్రయత్నించినా అవతలి జట్టు ఆటగాళ్ళు  బాగా ఆడుతున్నారు . స్ట్రైక్ ఔట్ చేయాలని క్రిష్ ప్రయత్నిస్తున్నాడు కానీ క్రిస్ పిచ్ చేసే బాల్స్ ని  ప్లేయర్స్ సరిగ్గా బాట్ చేసి రన్స్ తీస్తున్నారు. అయిదు రన్స్ స్కోర్ చేయటం తో ఆ ఇన్నింగ్ అయిపోయింది. తర్వాత క్రిస్  టీం బ్యాటింగ్ మొదలుపెట్టింది.

సుచిత్ర ఏ క్షణాన తన కొడుకు హోమ్ రన్ చేస్తాడో  అన్నట్లు కేమ్ కార్డర్ ఆన్ చేసి రికార్డ్ చేయటానికి సిద్ధంగా ఉంది. క్రిస్ బాటింగ్ ని  ఫోటో తీయమని కెమెరా ఆనంద్ చేతికి ఇచ్చింది.

“ ఇవాళైనా చేస్తాడంటావా? సీజన్ లో ఇది చివరి గేమ్.  ఆ తర్వాత ఛాంపియన్ షిప్ గేమ్స్ వుంటాయి కానీ క్రిస్ టీం ఛాంపియన్  షిప్ దాకా వెళ్తుందో లేదో తెలియదు కాబట్టి ఇదే చివరి ఛాన్స్ అన్నట్లు టెన్షన్ గా చూస్తూ మధ్య మధ్యలో తన చేతికి వున్న దేవుడి వుంగరానికి  దణ్ణం పెట్టేసుకుంటోంది సుచిత్ర.

సుచిత్ర టెన్షన్ ఆనంద్ కి అర్థమవుతోంది. చిరాకేసింది కూడా.

“  ఇంత చిన్న దానికి  కూడా దేవుడి కి దణ్ణాలా? యు ఆర్ టూ మచ్ సుచిత్ర” .

ఆనంద్ వంక కోపంగా చూసింది సుచిత్ర. నీకసలు పిల్లవాడు గొప్పవాడు అవ్వాలని లేదు అన్న భావం అందులో కనిపిస్తోంది .

బేసెస్ ఆర్ లోడెడ్. నౌ “ క్రిస్ ..కింగ్ ఆఫ్ స్ప్రింగ్”  ఈజ్ బాటింగ్ అంటూ అనౌన్స్ చేయగానే సుచిత్ర లో ఇంకా టెన్షన్. ఇది హోమ్ రన్ కి బెస్ట్ టైమ్. బేసెస్ అన్నీ లోడ్ అయి వున్నాయి. ఇప్పుడు క్రిస్  స్ట్రైక్ జోన్ లో వచ్చిన బాల్ ని గురి చూసి దూరంగా బౌండరీలు దాటేలా కొట్టి  హోమ్ రన్ చేస్తే చాలు. అటు టీం కి, ఇటు క్రిస్ కి కూడా బావుంటుంది. మొదటి బేస్ నుంచి మొదలుపెట్టి మూడు బేస్ లు .

చివరకు ఎక్కడ నుంచి బాటింగ్ చేశాడో ఆ హోమ్ దగ్గరకు వచ్చేస్తే చాలు. అదే హోమ్ రన్.  తన ఇంటికి తాను తిరిగి రావటం.

ఇప్పుడు కనుక క్రిస్  ఆ హోమ్ రన్ చేస్తే , మూడు బేసెస్ దగ్గర వున్న ముగ్గురు ఆటగాళ్లు హోం కి వచ్చి ఒక్కో రన్ స్కోర్ చేస్తారు. క్రిస్ చేసే హోమ్ రన్ తో ఇంకో రన్ వస్తుంది. క్రిస్ ఇప్పుడు సరిగ్గా ఆడితే అటు టీం కి నాలుగు రన్స్ ఒకటే సారి వస్తాయి. ఆ గ్రాండ్ స్లామ్ హోమ్ రన్ చేయటం ఇటు క్రిస్ కి కూడా బావుంటుంది అనుకుంటూ ఆ మధుర క్షణం ఎప్పుడు ఎలా వస్తుందో అనుకుంటూ టెన్షన్ గా చూస్తోంది.

కానీ..సుచిత్ర ఒకటి ఎదురు చూస్తుంటే అక్కడ మరొకటి జరిగింది. ఎవరూ వూహించనట్లు క్రిస్ స్ట్రైక్ ఔట్ అయ్యాడు. అప్పటికే ఆ ఇన్నింగ్ లో ఇద్దరు ప్లేయర్స్ ఔట్ అయి ఉండటం తో బేసెస్ అన్నీ లోడ్ అయి , టీం కి రన్స్ వస్తాయని అందరూ ఆశ గా ఎదురు చూస్తున్న సమయం లో క్రిస్ స్ట్రైక్ ఔట్ అయ్యాడు. దాంతో ఆ ఇన్నింగ్ అయిపోయింది. బేసెస్ లోడ్ అయి వున్నది వృధా అయిపోవటం తో ప్లేయర్స్ మొహాల్లో చికాకు స్పష్టం గా కనిపిస్తోంది.

మొదటి ఇన్నింగ్ లోనే హోమ్ రన్ చేసేస్తాడేమో అని సుచిత్ర ఆశపడితే అసలు ఒక్క రన్ కూడా చేయకుండా  స్ట్రైక్ ఔట్ అయి వస్తున్న కొడుకుని చూడగానే సుచిత్ర మనసు బాధతో మూలిగింది.

క్రిస్ ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు, తిరిగి డగ్ ఔట్ లోకి వచ్చేటప్పుడు కూడా అతను బ్లీచర్స్  లో తల్లి తండ్రులు కూర్చున్న వైపు చూడకుండా జాగ్రత్త పడుతున్నాడు.

దిగులుగా మొహం వేలాడేసుకోని డగ్ ఔట్ లోకి వెళ్తున్న క్రిస్ ని చూసి  క్రిస్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ  “ ఇట్స్ ఓకే బడ్డీ” అంటూ క్రిస్ కి వినపడేలా అరిచింది .” ఇట్స్ నాట్ ఓకే.  బాగా ఆడకపోయినా  ఓకే ఓకే అంటూ భుజం చరిస్తే ఇక వాళ్ళకు కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కడ నుంచి వస్తుంది? అని మనసు లో అనుకుంటూ సుచిత్ర ఆమె వైపు తిరిగి థాంక్ యు అన్నది .

.” యు నో . సమ్ టైమ్స్ ఇట్ హేపెన్స్. క్రిస్ ఈజ్ గుడ్ ప్లేయర్. గుడ్ ఎసెట్ టు ది టీం ” అన్నది అవతలి అమెరికన్ తల్లి.

క్రిస్ ని అలా పొగిడేసరికి సుచిత్ర మనసు లో ఆనందం. నాకు తెలుసు. అందుకే కదా..ఆ హోమ్ రన్ కోసం వాడిని అంతగా బతిమిలాడుతోంది.కొంచెం పుష్ చేస్తే  వాడు ఆ హోమ్ రన్ చేయగలడని తనకు తెలుసు. అదేమిటో పిచింగ్ చాలా బాగా చేసే క్రిస్ బాటింగ్ లో ఆ హోమ్ రన్ మాత్రం ఇంతవరకు చేయలేకపోయాడు. ఈ సీజన్ కి ఇదే ఆఖరి గేమ్. వాడు హోమ్ రన్ చేస్తే, మొత్తం వాడి టీం లోని ప్లేయర్స్ అంతా ఫీల్డ్ లోకి వచ్చేసి చప్పట్లు చరవడం, బ్లీచర్స్  లో వున్న పేరెంట్స్ కూడా అంతా లేచి నిలబడి  “ గో క్రిస్ , గో “ అంటూ అరవటం అదంతా సుచిత్ర వూహించేసుకుంటోంది. . ఆ మొత్తాన్ని వీడియో తీసేసి “ My son’s first  home run” అని యూట్యూబ్ లో వీడియో  అప్ లోడ్ చేసేసి , ఫేస్ బుక్ లో స్టేటస్ అప్ డేట్ చేసి, మొత్తం ఇండియా లో వున్న చుట్టాలందరికీ లింక్ పంపించేయాలని తెగ ఆరాట పడిపోతోంది సుచిత్ర. సుచిత్ర ఎంత తొందరపడుతోందో అది అంత వెనక్కు వెళ్లిపోతోంది. ఆ హోమ్ రన్ ఒక్కటీ క్రిస్  చేయలేకపోతున్నాడు. అది అటు క్రిస్ కి, ఇటు సుచిత్ర కి ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది. తల్లి పదే పదే అడుగుతున్న కొద్దీ అది వెనక్కు వెళ్తున్నట్లు క్రిస్ ఫీల్ అవుతున్నాడు. అసలు ఆ ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే బావుండు అని ఆశపడుతున్నాడు. కానీ క్రిస్ మనసు లోని వొత్తిడి ని అర్థం చెసుకోలేకపోతోంది సుచిత్ర. ఆనంద్ కి అర్థమై ఒకటి రెండు సార్లు సుచిత్ర ని వాడిని అలా వొత్తిడి చేయవద్దని హెచ్చరించాడు కానీ సుచిత్ర దాన్ని పెద్ద విషయం గా పట్టించుకోలేదు.

క్రిస్ బాటింగ్ కి వెళ్ళిన ప్రతి సారీ “ గో క్రిస్. గో” అని అరవటం, ఫస్ట్ బేస్ కో, సెకండ్ బేస్ కో వెళ్ళగానే సుచిత్ర  లేచి నిలబడి చప్పట్లు కొట్టడం చేయటం చూసిన ఆనంద్,  ఆమె కు  చెప్పినా వినదన్నట్లు చూసి ఊరుకున్నాడు.

మొత్తానికి ఆ గేమ్ అయిపోయింది. ఎప్పుడూ బాగా ఆడే క్రిస్ టీం ఒక్క పాయింట్ తేడా తో ఆ సీజన్ లో చివరి గేమ్ ఓడిపోయింది.  టీం ప్లేయర్స్, పేరెంట్స్, కోచెస్ అందరి మొహాల్లో ఒక చిన్న బాధ కనిపించినా వెంటనే సర్దుకొని స్పొర్ట్స్ లో గెలుపుఓటములు మామూలే కాబట్టి గుడ్ గేమ్ అంటూ ఒకరినొకరు కరచాలనం చేసుకుంటున్నారు. ఏడవలేక నవ్వుతూ సుచిత్ర కూడా అందరినీ విష్ చేస్తోంది.

గేమ్ అయిపోయిన తర్వాత జట్టు లోని ప్లేయర్స్ అందరిని ఒక చోట కూర్చోబెట్టి కోచ్ మాట్లాడటం  మొదలుపెట్టాడు. గేమ్ లో ఎవరెవరు బాగా ఆడారో, ఛాంపియన్ షిప్ టోర్నమెంట్స్ ఎలా జరుగుతాయో,  తమ జట్టు ఎవరితో ఎప్పుడు ఆడబోతోంది అన్నది ఎలా నిర్ణయిస్తారో ఆ విధానం  అంతా చెప్తున్నాడు.  సీజన్ లో చివరి గేమ్ కావటం తో అందరికీ కప్ కేక్స్ అందిస్తోంది కోచ్ మామ్.

*****

కారు లో మౌనం గా కూర్చున్నాడు క్రిస్. తల్లి మళ్ళీ ఆ హోమ్ రన్ ప్రస్తావన తీసుకు రాకపోతే బావుండు అన్నట్లు వుంది ఆ పిల్లవాడి మొహం. . ఇక ఆ విషయం వాడితో ఎత్తవద్దని ఆనంద్ గట్టిగా హెచ్చరించటం తో సుచిత్ర కూడా మౌనంగానే వుంది.

“ సమ్మర్ లో బేస్ బాల్ ఆడతావా? బాస్కెట్ బాల్ నా?” తండ్రి అడిగిన ప్రశ్నకు “ బాస్కెట్ బాల్ ఆడతాను. బేస్ బాల్ ఒక సీజన్ ఆపేస్తాను డాడీ “ అన్నాడు క్రిస్.

“ అదేమిటి? రెండు కేంప్స్  లో చేరు . బేస్ బాల్ ఇంత బాగా ఆడుతున్నావు, సమ్మర్ లో ప్రాక్టీస్ లేకపోతే మళ్ళీ ఫాల్ కి అంతా మొదటికి వస్తుంది. నా మాట విని సమ్మర్ లో కూడా బేస్ బాల్ ప్రాక్టీస్ చేయి.”

సుచిత్ర చెప్పినది విని “ ఐ హేట్ బేస్ బాల్. నీ హోమ్ రన్ గొడవకు భయపడే నేను బేస్ బాల్ వద్దు అంటున్నాను.ఐ హేట్ దట్” అన్నాడు క్రిస్ కోపంగా.

“ నేను చెప్తూనే వున్నాను. చూడు నువ్వేం చేసావో?” అంటూ ఆనంద్ కూడా సుచిత్ర మీద చిరాకు పడ్డాడు.

తానేం చేసినా అది క్రిస్ మంచి కోసమే కదా, అది ఎవరూ ఎందుకు అర్థం చేసుకోరు అనుకోగానే సుచిత్ర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మారు మాట్లాడకుండా తల పక్కకు తిప్పుకొని రోడ్డు వంక చూస్తూ కూర్చుంది.

ఆ సెమిస్టర్ తో స్కూల్ , బేస్ బాల్ సీజన్ అయిపోయింది.

****

వేసవి సెలవు లు మొదలు  కావటం తో మళ్ళీ తెలుగు పుస్తకాలు ముందేసి  క్రిస్ ని కూర్చోబెట్టింది సుచిత్ర.

‘రెడ్డొచ్చే మొదలాడే ‘ అన్నట్లు క్రిస్ తెలుగు నేర్చుకోవటం ప్రతి వేసవి లో  మొదలవుతుంది. క్రిస్  కి తెలుగు లో మాట్లాడటం వచ్చు. కానీ మాట్లాడడు. రోజంతా స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడి, ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ లోనే మాట్లాడే క్రిస్ కి ఇంట్లో కూడా అప్రయత్నంగానే ఇంగ్లీష్  వస్తుంది. తల్లి తండ్రులు పోరు పెడితే అప్పుడప్పుడు తెలుగు లో సమాధానాలు చెప్పినా అది ఆ కాసేపే. తెలుగు మాట్లాడటమే కాదు, చదవటం, రాయటం కూడా బాగా వచ్చి ఉండాలని సుచిత్ర తాపత్రయం. స్కూల్ వున్నప్పుడు సాధ్యం కాదు కాబట్టి వేసవి సెలవులు రాగానే తెలుగు పుస్తకాలు బయటకు తీసి మర్చిపోయిన తెలుగు ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. క్రిస్ కి అక్షరాలు, గుణీంతాలు అన్నీ వచ్చు. కానీ అలవాటు లేకపోవడం తో కొన్ని వత్తులు అవీ మర్చిపోతాడు. మొదటి పది రోజులు కష్టపడి గుణించుకొని చదువుతాడు. ఈ లోగా కేంప్  ల హడావిడీ తో నెమ్మదిగా ఆ తెలుగు నేర్చుకోవటం మూలపడుతుంది. ఎలాగోలా తెలుగు భాషతో కొడుక్కి  అనుబంధం కొడుక్కి ఉండాలని సుచిత్ర నానా తంటాలు పడుతుంటుంది.

నోట్ బుక్ మీద తేదీ, సంవత్సరం, ఊరు అన్నీ రాసి తన పేరు కూడా క్రిస్ అని చక్కగా రాసుకున్నాడు.

“క్రిస్ కాదు , కృష్ణ అని నీ అసలు పేరు రాయి “ సుచిత్ర చెప్పినది విని క్రిష్ణ అని రాశాడు. “ ఊహూ,  అలా కాదు “ కృష్ణ అని రాసి “ ఇలా రాయాలి, ఇది కరెక్ట్”  అని చూపించింది సుచిత్ర.

“అది క్రుష్ణ కదా, ఎలా పలుకుతామో అలాగే రాయాలి కదా.”

క్రిస్ అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో సుచిత్ర కి తెలియదు.

క్రావడి ని రాసి దీన్ని ఏమంటారు? అని అడిగాడు.

క్రావడి అన్నది సుచిత్ర.  మరి దీన్ని ఏమంటారు?అని వట్రసుడి ని రాసి చూపించాడు. వట్రసుడి అని చెప్పింది .

“ ఇదెప్పుడు రాయాలో, ఇదెప్పుడు రాయాలో? ఎలా  తెలుస్తుంది? “ క్రిస్  అడిగిన దానికి ఎలా సమాధానం చెప్పాలో సుచిత్ర కు తెలియలేదు.

“ ఎందుకు? అన్నది నాకు తెలియదు. ఏది ఎలా రాయాలో నాకు చిన్నప్పుడు నేర్పించినప్పుడు నేను ఇన్ని ప్రశ్నలు వేయలేదు. వేసినా ఎవరూ చెప్పేవాళ్లు కాదు. నోరు మూసుకొని పెద్ద వాళ్ళు ఎలా రాయమని చెపితే అలా నేర్చుకున్నాము.  నీకు ఒక పాఠం చెప్పాలంటే నా తలప్రాణం తోకకొస్తుంది. యక్ష ప్రశ్నలు వేస్తావు, నాకేమో వాటికి సమాధానాలు తెలియవు. “  తనకు తెలియదని కొడుకు కి చెప్పాల్సి రావడం లోని చికాకును మాటల్లో వ్యక్త పరిచింది సుచిత్ర.

“ నీకే  తెలియనప్పుడు నాకెందుకు నేర్పించడం?” అంటూ పుస్తకం తీసి అవతల పడేసి అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు క్రిస్ .

“ వెధవ కి నిండా పదేళ్ళు లేవు. నోటికి ఎంత వస్తే అంత అనేస్తాడు. ఈ దేశం లో పిల్లలని కొట్టడం నేరం, అవసరమైతే పిల్లలే 911 కి కాల్ చేసి పోలీసులను పిలుస్తారని భయపడి వీలైనంత నోరు మూసుకొని కూర్చోవటం కానీ , ఇదే ఈ పాటికి ఇండియా లో ఉండి వుంటే వీడికి రోజూ వీపు విమానం మోత మోగిపోయేది “ అనుకుంది సుచిత్ర.

తెలుగు నేర్చుకోవటం దగ్గరకొచ్చేసరికి  అమ్మా కొడుకులిద్దరికీ ఏదో ఒక గొడవ వస్తుంది. అక్కడితో ఆ తేలుగు క్లాస్ కాస్తా  మూలపడుతుంది. ఇలా అయితే వీడికి తెలుగు చదవటం, రాయటం పూర్తిగా ఎప్పటికీ వస్తుందో! అసలు వస్తుందో , రాదో  అనుకుంటూ ఉండిపోయింది సుచిత్ర.

కాసేపటికి తన తప్పు తెలుసుకున్నట్లు, ఏదో అర్థమయినట్లు  వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు క్రిస్ .

“ మామ్. నాకో డౌట్?”

మళ్ళీ ఏం ప్రశ్న రా బాబు అన్నట్లు క్రిస్  వంక  చూసింది సుచిత్ర.

“ నేను అమెరికన్ ని కానా?మిగతా అమెరికన్స్ లాగా కాకుండా  నేనెందుకు తెలుగు నేర్చుకోవాలి?” అనడిగాడు.

“ నువ్వు కేవలం అమెరికన్ వి కాదు.ఇండియన్ అమెరికన్ వి. నా మాతృ భాష తెలుగు. నీ మాతృ భాష కూడా అదే. ఒకవేళ నువ్వు ఇంగ్లీషే నీ మాతృ భాష అనుకుంటే కనీసంరెండో భాష గా అయినా తెలుగు నేర్చుకోవాలి. “

“ రేపు నాకు పిల్లలు పుడితే వాళ్ళకు తెలుగు ఎలా వస్తుంది? వాళ్ళకు తెలుగెవరు నేర్పిస్తారు?  నువ్వు నేర్పిస్తావు కదూ ? “ అంటూ అమాయకంగా అడుగుతున్న క్రిస్  మొహం చూసి సుచిత్ర కు నవ్వాగలేదు.

“ నేనెందుకు నేర్పించటం? ఇప్పుడు నువ్వు నా దగ్గర తెలుగు నేర్చుకుంటే నువ్వు నీ పిల్లలకు నేర్పిస్తావు. నేను కూడా ఇండియా లో ఇంగ్లీష్ మీడియం లోనే చదివాను. కానీ మా అమ్మా, నాన్న పట్టు బట్టి ఇంటి దగ్గర తెలుగు లో చదవటం, రాయటం నేర్పించారు. నాకొచ్చినదే నీకు నేర్పించాలని చూస్తున్నాను. నా దగ్గర నేర్చుకొని నువ్వు నీ పిల్లలకు నేర్పిస్తావు. అలా మనం అమెరికా లో వున్నా,  ఇండియా వెళ్లినప్పుడు అందరితో నువ్వు హాయిగా తెలుగు లో మాట్లాడగలవు. అమ్మమ్మకు, నానమ్మ కు ఉత్తరాలు రాయగలవు. వాళ్ళు రాసిన ఉత్తరాలు చదవగలవు. ఇండియా నే మన అసలైన హోమ్. ఎప్పటికైనా అదే మన ఫస్ట్ లాంగ్వేజి.  “  క్రిస్  కొంచెం ఉత్సాహంగా ఉన్నప్పుడే  తెలుగు పట్ల శ్రద్ధ చూపించినప్పుడే అన్నీ చెప్పేయాలని ఉత్సాహపడింది సుచిత్ర.

“ మరి నేను డౌట్స్ అడిగితే నువ్వు సరిగ్గా క్లారిఫై చేయటం లేదుగా. నువ్వు మీ అమ్మ దగ్గర సరిగ్గా నేర్చుకోలేదా?” క్రిస్ అడిగినది విని “ మేం తెలుగు ఈ పద్ధతి లో నేర్చుకోలేదు. ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ ఎలా నేచురల్ గా నేర్చేసుకున్నావో, నేను తెలుగు అలాగే నేర్చేసుకున్నాను. ఏ అక్షరం ఎలా రాస్తారో  తెలుసు కానీ అలాగే ఎందుకు రాయాలో నేనెప్పుడూ దృష్టి పెట్టలేదు . అమ్మమ్మ ని కానీ, నానమ్మ ని కానీ ఫోన్ లో అడిగి రేపు చెప్తానే” నెమ్మదిగా కొడుక్కి సర్ది చెప్పింది సుచిత్ర.

తల్లి చెప్పినది విని ,  అంత క్రితం అవతల పడేసిన  తెలుగు టెక్స్ట్ బుక్ తీసి తల్లి చేతిలో పెట్టాడు.. “ డిక్టేషన్ చెప్పు” అంటూ రాయడానికి నోట్ బుక్ తీశాడు.

దాంతో సుచిత్ర కళ్ళు వెలిగిపోయాయి.

హోమ్ రన్ అన్నది సుచిత్ర.

ఆ పదం వింటూనే క్రిస్  ఆశ్చర్యం గా తలెత్తి చూశాడు.

“ అవును అదే. ఇప్పుడు  నువ్వు చేసినదే హోమ్ రన్. మన ఇంటి దగ్గరకు మనం రావటం. మన మాతృ భాష దగ్గరకు రావటం. బేస్ బాల్ హోమ్ రన్ కన్నా నాకు ఈ హోమ్ రన్ చేయటమే బావుంది ” అంటూ క్రిస్  ని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ప్రేమ గా ముద్దు పెట్టుకుంది.

హోమ్ రన్ అంటూ ముచ్చటగా అందమైన దస్తూరి తో క్రిస్  రాసే తెలుగు అక్షరాలను మురిసిపోతూ చూసింది సుచిత్ర.

******