హోకా హే

జాన్ ట్రుడెల్

సెప్టెంబర్ 2015


దిగో అటు చూడు…, అవును చిరుజల్లుల్లో తడుస్తున్న మిట్టపల్లాల పొలం, దూరాన కొండలపై ఇంకా చివుర్లు తొడగని చెట్ల మధ్య నెమ్మదిగా సాగుతున్న ఒక పల్చని మేఘం. నిజమే చాలా అందంగా వుంది దృశ్యం.

కానీ అదికాదు, నేను చూడమంటున్నది. మరీ అంత దూరం ఆకాశంలోకి కాదు, ఆ కొండల కాళ్ల దగ్గర, ఎర్రని చివికిపోయిన పైకప్పున్న ఇల్లు చూడు. చూడు, ఓ పక్కకు ఎలా ఒరిగిపోతోందో.

విరిగిన ఇంటి తలుపుల్లోంచి, పగిలిన అద్దాల్లోంచి, పెద్ద చిల్లు పడ్డ పైకప్పులోంచి పొడుచుకొచ్చి ఆ ఇంటిని కబళిస్తూ బలిసిన కొమ్మలున్న ఆ చెట్టు చూడు. సన్నటి గాలి తెమ్మెరలో మెల్లగా వూగుతున్న ఆ కొమ్మలు చెక్క గోడలమీద‘హోకా హే’ అంటున్న గుసగుసలు నీకూ వినిపిస్తున్నాయా?

ఎన్నేళ్లు ఆ ఇంటి పునాదులకింద విత్తనంగా దాక్కుందో, అదును చూసి ఇంటి అణువణువులోంచి చీల్చుకొచ్చిన ఆ చెట్టును చూస్తుంటే నాకు ప్రపంచ ఆదివాసి తెగలు గుర్తొస్తున్నాయి.
పోలిక వింతగా వుంది కదూ. ఇక్కడ ప్రకృతి తన స్థానాన్ని రిక్లైమ్ చేసుకుంటుంటే, ఆదివాసీ తెగలు తమ అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటాలు గుర్తొస్తున్నాయి. మీడియాలో సరిగ్గా కనిపించకపోయినా ఆదివాసి ఉద్యమాలు ఈ నిమిషమూ నివురు గప్పిన నిప్పులా రాజుకుంటూనే వున్నాయి. ఇంతకీ ‘హోకా హే’ అన్నది 1860ల్లో తెల్ల సైన్యం గుండెల్లో మారుమోగిన తాషుంక వీట్కో(Tashunka-Wiko: Crazy Horse) అనే లకోటాట వీరుని రణన్నినాదం.

అమెరికాలోని నల్లవారి హక్కుల ఉద్యమం గురించి తెలిసినంతగా ఆదివాసితెగల పోరాటాల గురించి బయట ప్రపంచానికి సరైన అవగాహన లేదు. ఒక సమూహం చేసిన/చేస్తున్న ఉద్యమం గురించి మనకు తెలియకపోవడం బాధాకరమైన విషయం కదూ. ఒక పోరాటం గురించి తెలుసుకోవాలంటే సాహిత్యానికి మించిన సాధనం లేదు. అందులో పాట/కవిత్వం పోరాటాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ దోహదం చేస్తాయి. ప్రతినెల ఒక ఆదివాసి తెగకు చెందిన కవి – త్వం…

మొట్టమొదట ఎవరి గురించి చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. చాయిస్ అలా వుంది మరి. ఐదు వందల ఏళ్ల నుంచి నడుస్తున్న పోరాటాలు. ఎక్కడినుంచి,ఎవరినుంచి మొదలెట్టాలి? పోనీ, ఇప్పుడు ఆకాశాన్ని మనతో పంచుకుంటున్న ఒక వీరుడి నుంచి మొదలెడితే? …సరే మరీ, buckle up!

***

జాన్ ట్రుడెల్ (John Trudell)

కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్ ఫ్ర్యాన్సిస్కో నగరం దగ్గర గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పక్కనే అల్కట్రాజ్ అనే ద్వీపం వుంది. ఈ ద్వీపం మీద వున్న జైలును ప్రభుత్వం మూసివేసిన తరువాత మొదట(1943) కొన్ని చిన్ని ఆదివాసి గుంపులు ద్వీపాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాయి. తమ పూర్వీకులకు ప్రభుత్వం చెల్లించిన మూల్యం, అక్షరాలా తొమ్మిది డాలర్ల నలభై సెంట్లు ఇప్పుడు తిరిగి చెల్లించేస్తామని కొంత మంది ముందుకు వచ్చారు. ఇందులో ఒక గుంపు ఒక బోటులో ద్వీపం దరిదాపులకు వెళ్లి,అక్కడినుంచి ఈదుకుంటూ ద్వీపాన్ని చేరుకుని, ఆ ద్వీపాన్ని‘కనుక్కున్నామ’ని ప్రకటించారు. ఆ ఆక్రమణ తొందర్లోనే ముగిసినా, 1969 లో “Indians of All Tribes Occupation of Alcatraz” ఆక్రమణ 19 నెలలు సాగింది. కొంతమంది విద్యార్థులు మొదలుపెట్టిన ఈ ఆక్రమణలో క్రమేణా పాల్గొన్న ప్రముఖుల్లో, ‘అల్కట్రాజ్ స్వరం’గా పేరుపొందిన జాన్ ట్రుడెల్ ఒకడు.

1973 నుంచి 1979 దాకా ‘ఎయిమ్’ AIM (American Indian Movement) అనే సంస్థలో నేషనల్ చైర్మన్ గా పనిచేశాడు ట్రుడెల్.‘ఎయిమ్’ పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో చెబుతూ, “ప్రభుత్వం మాతో యుద్ధం చేసింది. మమ్మల్ని వేటాడింది. హత్యలు చేసింది, జైల్లో పెట్టింది, సర్వనాశనం చేసింది.” అంటాడు.

ప్రభుత్వం మొదలెట్టిన ఆ యుద్ధం 1979లో జాన్ ట్రుడెల్ ఇంటికే వచ్చింది. ఫిబ్రవరి 11న వాషింగ్టన్ డి.సి లోని FBI హెడ్ క్వార్టర్స్ కి సాగించిన కవాతుకు జాన్ నాయకత్వం వహించాడు. ఈ సంఘటనలో అమెరికన్ జెండా తగలబెట్టబడింది. దాదాపు 12 గంటల తరువాత,తెలవారుతుండగా, నెవాడ రాష్టృంలోని షషోని పెయూట్ రిజర్వేషన్లో వున్న జాన్ ట్రుడెల్ ఇల్లు ‘ప్రమాదవశాత్తు’ తగలబడిపోయింది. అతని భార్య టీనా, ముగ్గురు పిల్లలు, టీనా తల్లి ఆ అగ్నిప్రమాదానికి బలయ్యారు. కుటుంబాన్ని పోగొట్టుకుని తాను పిచ్చివాడైపోకుండా బతికించింది పాటలే అంటాడు జాన్ ట్రుడెల్.

కొలంబియా దేశానికి చెందిన ఉవ (U’wa) తెగ ప్రజలు తమ పూర్వీకుల స్థలాల్లో ఆయిల్ డ్రిల్లింగ్ కు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటును సమర్థిస్తూ జాన్ ట్రుడెల్ కవిత (మొదటి భాగం) ఇదిగో, తన మాటల్లోనే –
నిజంగా మాటల్లోనే! అతడిది చాలా వరకు మాటల కవిత్వం, రాతల కవిత్వం కాదు.

(ఈ కవితలో ఇక్తోమి అనే పదం. లకోటా తెగ పురాణాల్లో యుక్తులతో శత్రువును బోల్తాకొట్టిస్తూ, అందరికీ తగిన గుణపాఠం చెప్పే ‘సాలీడు’)

మనిషి అంటే

డేగలతో కలిసి ఎగిరాను
గూడునుంచి పడిపొయ్యేదాక
తోడేళ్లతో కలిసి పరిగెట్టాను
తప్పిపోయాను గుంపునుంచి
రోజు రోజుకు పిచ్చివాణ్ణవుతున్నాను
కొన్ని రోజులు మరీ తొందరగా గడిచిపోతాయ్
ఎప్పుడూ స్వర్గంలోనికి తప్పిపోలేదు నేను
నరకం దాటి వెళ్లడం కష్టమే మరి
నేను మనిషి చావు పుట్టుకల గుండా
అవతలికి ప్రయాణించాను
నేను ‘ఇక్తోమి’ ని
ఊహల్లోంచి పారిపోవడాన్ని ఊహించు
అధికారమే శక్తి అని భ్రమపడుతూ
జీవన స్వేచ్ఛాకాంక్షను
అదుపుల చట్రంలో ఇముడ్చుతూ

చెప్పిందంతా విన్నాను
అయినా ఇంతవరకు విన్నదేమీ లేదు
సాయం సంధ్యకు చీకటికి మధ్య సూక్ష్మ రేఖపై
తారాడుతుంటుందొక అబద్ధం
ఆత్మతో పడుపువృత్తి
ఎవరైనా చెయ్య గలరా, లేదా
నేను కొన్ని రస్తాల్లో నడిచాను
అవి నన్ను నడిమధ్యలో ఆపేశాయి
నేను ‘ఇక్తోమి’ని

ఇతర్లు తమను తాము చూసుకోవడానికి
నేనొక అద్దమయ్యాను
ఎలాంటి అండనివ్వని ప్రేమ తెలుసు నాకు
అయినా ప్రేమా, నేను చాలా దగ్గరివాళ్లం
నొప్పి మిగిల్చే ప్రేమ అది

డేగలతో కలిసి ఎగిరాను
గూడునుంచి పడిపొయ్యేదాక
తోడేళ్లతో కలిసి పరిగెట్టాను
తప్పిపోయాను గుంపునుంచి

క్యూలో నా స్థానం నుంచి
పక్కకు తొలగాను
నేను ఇక్కడ వున్నాను
కాదు, అక్కడ వున్నాను
అన్ని చోట్లా వున్నాను
ఎక్కడా లేను
వస్తాను నేను మళ్లీ
నేను ‘ఇక్తోమి’ని

ఎన్నో యథార్థాల్లోని
ఒక యదార్థం
మనం చూస్తున్నది ఎలా చూస్తున్నామన్న
దాన్ని బట్టి ఉంటుంది
యథార్థం యొక్క మంచీ చెడు

మనం భూమికీ ఆకాశానికీ పుట్టిన పిల్లలం
అత్యంత పూర్వీకుడి జన్యు పదార్థ వారసులం
మానవుడొక భౌతిక రూపమున్న ఆత్మ
రక్త మాంసాల, అస్తికల ఆత్మ
లోహాల, ఖనిజాల, జలాల ఆత్మ

మనం ఏదో ఒక స్థలకాలాల్లో వున్నాం
కానీ స్థలకాలాల అవతల నుంచి వచ్చినవాళ్లం
గతం వర్తమానంలో ఒక భాగం
భవిష్యత్తూ వర్తమానంలో ఒక భాగం
జీవము ఉనికి కలగలిసిపోయాయి

మనమే భూమి, చంద్రుడు, గ్రహాల, నక్షత్రాల జన్యుపదార్థం
విశ్వ సృష్టికర్త సృష్టించిన సృష్టికి
మనం బంధువులం
ఆత్మ, స్పష్టతనిచ్చే ఎరుక
అవి మానవీయం, మానవ శక్తిలో బాగం

పరిణామ క్రమం యొక్క జ్ఞాపకాల్లో మనమూ భాగం
ఆ జ్ఞాపకాల్లో జ్ఞానం వుంది
ఆ జ్ఞాపకాల్లో మన అస్తిత్వం వుంది
జాతి, లింగ, కుల, వయో భేదాల కింద
పౌరసత్వం, వ్యాపారమూ, మతాలు వీటన్నిటి కింద
మనం మనుషులం
ఈ జ్ఞాపకాలు
చెబుతున్నాయి
మనిషీ,
లే,
మనమెవరమో గుర్తు చేసుకునే
సమయం ఆసన్నమయ్యింది.

***

జాన్ ట్రుడెల్ తెగ అయిన లకోటా పురాణాల్లోని ఇక్తోమి (సాలీడు) కేవలం పురుగు కాదు. అది శోకం శ్లోకమయిన కవి. లోక దుఃఖం తనదయిన విప్లవకవి. సొంత జీవితం ఎంత నష్టమయినా సరే పోరాటం ఆపని, లోకాన్ని ప్రేమించడం మానని ప్రజా వీరుడు.

వచ్చే నెల మరో ‘ఇక్తోమి’ కబుర్లు …

**** (*) ****