గల్పిక

కృష్ణాష్టమి

అక్టోబర్ 2015

‘ఉన్న పళంగా ఇంటికి రండి.’

‘అదేవిటి, ఇంకా ఇక్కడ బిల్లేయించాలి, పిండి మరలో బియ్యం పట్టించాలి. ఉన్న పళంగా ఎలా?’ సూపర్ మార్కెట్ లోంచి శంకర్.

‘ఆ బిల్లూ గిల్లూ, గిర్నీ వొద్దు. ఇంకేవీ కొనద్దు. వొచ్చేయండి.’ ఫోనులో జమున హడావుడి వింటే శంకర్ కి ఏం కొంప ములిగిందోనని ఓ క్షణం ఏం అర్ధం అవలేదు.

“కాశీ లో అమ్మా నాన్నా ఏమైనా… ఏమైందిప్పటికిప్పటికి? ఇంతవరకూ కృష్ణాష్టమీ, పూజా, అరిసెలూ, అప్పాలూ, పోకుండలూ అని నన్ను పరిగెట్టించి… ఈ జమునకి ఆ పేరెవరు పెట్టేరో కానీ, అందాన్నటుంచితే, అట్టహాసానికేం తక్కువ లేదు.”

బైకు స్టాండు వేసి శంకర్ ఇంట్లోకి వస్తూండగానే ముందు గదిలో గట్టిగా జమున గొంతు, కొడుకు ఆనంద్ అర్ధింపు కలగలిసి.. టీ కప్పు లో చిన్న తుఫానేదో వచ్చినట్లుంది.

‘అమ్మా, ఈ డ్రెస్ వేసుకుని ఫోటోలు ఫేస్బుక్ లో పెడితే ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వుతారమ్మా…’

ఇంట్లో వేరేదో అడావుడి చూసి కాశీ నుంచి ‘యమ’ ర్జంట్ ఫోన్లేవీ రాలేదని స్థిమిత పడుతూ ‘డ్రెస్సేంటి ? ఫేస్బుక్కేంటి ?’ అన్నట్లు కొడుక్కేసి చూసి కళ్లెగరేసేడు శంకర్.

‘చూడు నాన్నా, అమ్మ ఈ డ్రామా కంపనీ డ్రెస్ లో ఫోటో దిగమంటోంది. ఫేస్బుక్ కోసం. ఇప్పటికే సీనియర్స్ నవ్వుతున్నారు నాన్నా, నా పంచశిఖల ఫోటోలు చూసి. ఆమధ్య అమ్మ ఫోన్ చేసి సతాయిస్తోందని రాత్రి సంధ్యావందనం చేస్తోంటే అక్కల్ట్ చేస్తున్నానని వార్డెన్ కి కంప్లైంట్ చేసేరు నాన్నా, మీకేం తెల్సు?’ కొత్తగా బిట్స్ లో చేరి వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి కల్సి వచ్చేయని హాస్టల్ నించి ఇంటికొచ్చిన ఆనంద్ గొంతులో ఏడుపొక్కటే తక్కువ.

‘జమునా, కాస్సేపట్లో పూజుంటే, ఈ గోలేంటి?’ గట్టిగా అడిగేడు శంకర్.

‘మీరుండండి. మీకేం తెలీదు.’ విసవిసా లోపలికి వెడుతూ జమున.

‘నువ్వు సరిగ్గా చెప్పరా’ అని ఆనంద్ కేసి చూసేడు శంకర్.

‘పొద్దున్న ఫేస్బుక్ చెక్ చేసుకున్నప్పటి నుంచి అమ్మకీ కృష్ణుడి వేషం పిచ్చి పట్టింది నాన్నా,’ వాపోతూ ఆనంద్ ఇంకేదో అనబొతోంటే, జమున అడ్డుకుని వెనక్కొచ్చి, ‘నువ్వుండరా, పిచ్చి నాకా వాళ్ళకా ? తెల్లారి లేచేసరికి ఎఫ్ బీ నిండా కృష్ణుడి గెటప్ లో “మా వాడు, మా పిల్ల, మా పిశాచం” అంటూ ఒకటే ఫోటోలు… ఎప్పటెప్పటివో పెట్టేస్తున్నారు. జనాలకింకేం వుంది వేలం వెర్రెత్తి నట్లు లైకులే లైకులు.’ ఆగకుండా మాట్లాడుతూ జమున.

‘ఆ గిరిజైతే మరీ అన్యాయం. ఈమధ్యే షష్టిపూర్తి పీటలెక్కిందా, నిన్న రాత్రి నాచిన్ని కృష్ణుడంటూ బడ్డు లాంటి ముప్ఫై ఏళ్ళ కొడుక్కి వేషం వేసి ఎఫ్ బీ లో పెట్టింది. ఇంక చూస్కోండి. భాద్రపదం రాకుండానే శ్రావణం లోనే లైకుల వాన. ఇదేం కృష్ణాష్టమి?’ కోపంతో జమున చరచరా వెళ్లి కిటికీ పరదాలు ఒక్క సారిగా మూసేసింది.

ఆ మసక వెలుతుర్లో జమున ఫోర్స్ చూసి కధ ఎక్కడికో పోతోందని భయమేసి శంకర్ నెమ్మదిగా, ‘వాళ్ళ సంగతలా వుండనీ, మొదట మన వంటా, పూజా అవనీ జమునా.. ‘

‘నాకు తెల్సు మీరేదో విధంగా దాటేద్దామని చూస్తున్నారు. మనం పూజా, జాగారాలు చేసుకుని నైవేద్యాలు వొండుకు తింటే ఎవరు చూసేరు? ఓ పది లైకులా అరడజను కామెంట్లా? ఎందుకొచ్చిన పూజ?’ కస్సుమంది జమున.

‘అమ్మ కాశీ వెళ్తూ “అరవై ఏళ్ళ ఉడిపీ-కృష్ణ ప్రతిమ, అష్టమి పూజ ఆనవాయితీ తప్పించకురా” అంది కదా,’ నెమ్మదిగా నసిగేడు శంకర్.

‘ఐతే ఏంటి? నిన్న వరలక్ష్మీ వ్రతానికి కిందా మీదా పడి తొమ్మిది పిండి వంటలూ చేసేనా, పూజా, ధ్యానం, విధానం అని మీరు నా ప్రాణం తిన్నారు. అష్టోత్తరం టీకా తాత్పర్య సహితంగా కంఠతా రావడం వినా ఏమైనా వొరిగిందా? పనికి నా నడ్డి మాత్రం విరిగింది.’ పుల్ల విరిచి పొయ్యిలో పెట్టింది జమున.

‘కిందటి వారం ఆ కోమలి పూనా లో ఇంట్లో కుర్చీలకీ పరదాలకీ పూలు కట్టేసి, లాకర్లో వున్న నగలన్నీ అమ్మవారికి తగిలించి ఫోటోలు తీసి తెల్లారేసరికి “మా వరలక్ష్మంటూ” ఫేసుబుక్కు లో పెట్టిందో లేదో లైకులే లైకులు.

దానికి తోడు, ఫ్లికర్ లో అప్పచ్చులు ఫోటో షాప్ చేసి “మా నైవేద్యాలంటూ” పెట్టింది పుష్పలతైతే మరీనూ. ఇంక పనేం ఉందీ. మధ్యాహ్నమైయే సరికి అందరూ టిప్పు టాపు గా తయారైయి “అష్ట లక్ష్ములం మేము” అంటూ వరసకీ నిలబడి సినిమా క్యూ టైపు ఫోటోలు, ఓ డజను మందిని ట్యాగ్ చేస్తూ. ఇంకేం వుంది సాయంత్రానికి ఫేసుబుక్కంతా విస్తరిస్తూ వీళ్లే.

భక్తీ, ధ్యానం అంటూ మీరు నన్ను ఒక్క ఫోటో కూడా తియ్యనియ్య లేదు. పోనీ కదాని రాత్రో ఫోటో తీసి పెడితే దానిలో లైకులు కాదు కదా వాడిపోయిన పువ్వులు పడ్డాయి,’ ఆక్రోశంతో జమున కళ్ళు జలపాతాలైయ్యేయి.

జమున వాగ్ధాటి ఆగేటట్లుగా లేదు.

‘ఒకళ్లని చూసి ఒకళ్లు మొదలెట్టేరు మా ఫ్రెండ్స్ అంతా. అబ్బాయిలూ మొదలెట్టేరు. అలంకారం చూడండనొకడూ, ఆరగింపు చేసేమనొకడూ. ఫోటోలూ, వీడియోలూ. ఓ ఇరవై మందిని ట్యాగ్ చెయ్యడం. చదివింది సైన్సా? సామవేదమా? అనిపించేటట్లు. అప్లోడ్ అయిన అరగంటకే వందల్లో లైక్స్, యాభైల్లో కామెంట్స్.

దుబాయ్ లో వాసవైతే మొన్నో అడుగు ముందుకేసి, వాళ్ళ అత్తగారు చీర పెడుతున్నపుడు ఫోటో తీసి ‘బంగారు అత్త’ అని కాప్షన్ పెట్టి అత్తనీ ఆడబడుచుల్నీ, మరుదుల్నీ కలిపి ట్యాగ్ చేసేసింది. సాయంత్రానికి పడ్డ కామెంట్ల ప్రవాహంలో ఆ అత్తగారు తడిసి ముద్దయి ఫేసుబుక్కు సాక్షిగా రాత్రికి రాత్రే నవరాత్రికి వాసవికి వడ్డాణం అనౌన్సు చేసేసింది.’ గుక్క తిప్పకుండా చెబుతోంటే జమున ముక్కుపుటాలదురుతున్నాయి. ఊపిరి ఎగపీల్చిన వేగానికి గుండెలు ఎగసి పడుతున్నాయి.

గభాల్న ముక్కు చీదితే మీదెక్కడ పడుతుందోనని టేబులు మీదున్న టిష్యూ పేపరు బాక్సందించేడు శంకర్.

‘ఏమిటీ వాసవికి వడ్డాణమే?’ నూట ఎనభై పౌనుల వాసవి గజమధ్యాన్ని ఊహించుకుని జడుసుకుంటూ శంకర్.

‘మరీ అంతేమీ అవదు లెండి. ఇపుడు ఫేస్బుక్ వడ్డాణాలని చేస్తున్నారుట. ముందంతా బంగారం, రాళ్ళూ, వెనక తట్టంతా పట్టుదారం.’ ముక్కు తుడుచు కుంటూ కొనసాగించింది జమున.

‘మొన్న మావగారు నాకు రవ్వల ముక్కు పుడక తెచ్చిచ్చినపుడు చెప్పేను, “ఫోటో తియ్యండీ” అని. విన్నారా మీరు? లేకపోతే ఈపాటికి ఎంత లేదన్నా ఓ జత వంకీ లైనా వచ్చుండేవి.’ నిష్టూరంగా జమున.

‘ఊరుకో జమునా ఎవరితోనో పోలిక మనకెందుకు? మన పూజ కానిద్దాం ముందు,’ అనునయంగా శంకర్, అమ్మ అసహనం చూసి విస్తుపోతూ ఆనంద్.

‘మీ కెప్పుడూ మీ ఇంటి ఆనవాయితీల గోల, నేనెందుకూరుకోవాలి?’ విసవిసా నడుస్తూ ఆనంద్ కేసి తిరిగి,

‘ఒరే ఆనంద్, నువ్వు కదిలి తయారవ్వు, మేకప్ మాన్ నగలు తీసుకుని పదయ్యేసరికి వస్తానన్నాడు.’

బెడ్ రూమ్ లోకి వెళ్ళబోతున్నదల్లా గబుక్కున వెనక్కి తిరిగి శంకర్ కేసి చూస్తూ, ‘ఈ సారి మనవేం అష్టమి పూజ చెయ్యట్లేదు. నేను అప్పచ్చులసలే వొండట్లేదు. ఇంకో గంటలో స్వగృహ వాడు షాపు తీస్తాడు. ఆనంద్ కి ఇష్టమని ఓ అర కిలో పకోడీలు, కరకజ్జం ఇంటికే పంపమని ఫోన్ చేసేను.’ ఇంకేమీ చెప్పడానికి లేనట్లుగా లోపలికి నడిచింది జమున.

‘పోనీ నన్నూ, ఆనందునీ చెయ్యనీ పూజ’, ‘ఈ సారికి పాలూ బెల్లం తో కానిచ్చేద్దాం లేరా,’ ఓ అడుగు వెనక్కి వేస్తూ జమునకి వినపడేట్టుగా ఆనంద్ తో శంకర్.

‘అదేం కుదరదు! మీరూ తయారవ్వాలి. మీకో కృష్ణుడి డ్రెస్ తెప్పించేను.’ తెగేసి చెప్పింది జమున.

‘నేనా???’ ఠారెత్తి పోతూ శంకర్. ‘నాకసలే క్లయింట్ మీటింగ్స్ వున్నాయి వొచ్చేవారం నుంచి. ఎవరైనా చూస్తే బావుండదు జమునా,’ బతిమాలు తున్నట్లుగా శంకర్.

‘ఏమీ పర్లేదు, మీ క్లైంట్స్ హిందువులయితే మీరేం చెప్పక్కరలేదు. హిందువులు కాక పొతే మీ ఫోటోల్తో మనం కృష్ణాష్టమి ఎంత ఘనంగా జరుపుకుంటామో చెప్పచ్చు. ఐస్ బ్రేకర్లా మీటింగ్ కి ముందు.’ కర్తవ్య బోధ చేస్తున్నట్లుగా అల్టిమేటం జారీ చేసింది జమున.

‘త్వరగా తయారవండిద్దరూ, ఫోటోగ్రాఫర్ గంటకంటే ఆలస్యమైతే ఎక్కువ చార్జి అన్నాడసలే.’ బాత్రూం లోకి జరజరా నడిచింది జమున.

‘కృష్ణ కృష్ణా,’ తల పట్టుకున్నారు, ఆనంద్, శంకర్ ఫేసుబుక్కులో కృష్ణ (విశ్వ) రూప ప్రదర్శనకి బుక్కయి పోయి.

**** (*) ****8 Responses to కృష్ణాష్టమి

 1. Balaji Macherla
  October 1, 2015 at 8:29 am

  గుడ్ వన్ మాధవి.

  • మాధవి
   October 2, 2015 at 8:22 pm

   థాంక్స్ బాలాజీ.

 2. udaya bhaskar
  October 3, 2015 at 1:42 pm

  Chaka bagundi. Hearty congratulations

  • Madhavi
   October 7, 2015 at 5:43 pm

   థాంక్స్ ఉదయ భాస్కర్ గారు.

 3. October 12, 2015 at 5:12 pm

  ఉత్తినే కామెంట్ రాస్తే ఎవరికి తెలుస్తుంది… ఇక్కడ ఫస్ బుక్ టాగ్ ఆప్షన్ లేదు. కామెంట్ పెట్టేం లాభం :) ))

 4. October 14, 2015 at 4:00 pm

  :) :D

 5. indrakanti venkateswarlu
  October 17, 2015 at 5:38 pm

  మంచి వ్యంగం ఉండమ్మా, మీలో. కొన్ని చోట్ల శ్రీరమణగార్ని తలపించావ్. మా ఇంటి ఆడపడచువైనన్దుకు గర్విస్తున్నాను.
  హృదయపూర్వక శుభాకాంక్షలు.

 6. మాధవి Indraganti
  November 17, 2015 at 2:47 am

  జ్యోతిర్మయి గారూ, రాధ గారూ,
  వెంకటేశ్వర్లు గారూ
  నమస్తే.
  మీ అభిప్రాయం తెలియ చేసినందుకు చాలా చాలా థాంక్స్.

Leave a Reply to indrakanti venkateswarlu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)