అనువాద నవల

రాజ్ఞి – ఆరవభాగం [SHE BY Sir H.Rider Haggard]

అక్టోబర్ 2015


(గతసంచిక తరువాయి)
స్తేన్ ఆ విచిత్రనృత్యం చేయటాన్ని తిలకించినవారెవరైనా విస్మరించటం అసాధ్యం. ఆమె మాటల్లో రాగల దాని నీడలేవో వినిపించించి అదొకలాంటి భీతితో ఒళ్ళు గరిపొడిచింది మాకందరికీ. ఆ మర్నాడు మా గౌరవార్థం విందు ఏర్పాటైందని తెలిసింది. మేము సాదా సీదాగా బతికేవాళ్ళమనీ అటువంటి హడావిడులేమీ వద్దనీ చెప్పి చూశాను- వాళ్ళ మొహాల్లో ప్రసన్నత మాయమైంది ..నోరు మూసుకున్నాను.

సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా- అంతా సిద్ధమైందని ప్రకటించారు. నేనూ , జాబ్ – గుహ దగ్గరికి వెళ్ళాము. లియో యథాప్రకారం ఉస్తేన్ తో కలిసి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏదో షికారు నుంచి వస్తున్నట్లున్నారు- అప్పటివరకూ విందు సంగతి తెలియదు వాళ్ళకి. ఆ విషయం వింటూనే , చక్కని ఉస్తేన్ మొహం వివర్ణమైంది. అటుగా వెళుతున్న ఒక మనిషిని చేయి పుచ్చుకు ఆపి, గద్దిస్తూ ఏదో అడిగింది . అతని సమాధానం ఏ చెప్పాడో గాని కొంచెం శాంతించినట్లు కనిపించింది – పూర్తి ఉల్లాసం గా మాత్రం లేదు. ఆ తర్వాత అతనితో వాదించి నచ్చజెప్పాలని చూసింది. అతను కోపగించుకుని ఆమెని నెట్టేసి వెళ్ళిపోబోయి, మళ్ళీ ఏమనుకున్నాడో, ఆమెని తీసుకుపోయి నెగడు చుట్టూ గుండ్రంగా కూర్చున్నవాళ్ళ లో కూర్చోబెట్టాడు.

ఆ రోజున గుహలో వేసిన నెగడు బాగా పెద్దది. చుట్టూ కూర్చున్నవారిలో ముప్ఫై అయిదుగురు పురుషులు, ఇద్దరు స్త్రీలు. ఉస్తేన్ కాక మరొకామె జాబ్ ని ప్రేమించబోయి భంగపడిన మనిషే. మగవాళ్ళు వాళ్ళ అలవాటు ప్రకారం మౌనంగా ఉన్నారు. అక్కడి నేల లో అందుకోసమే తొలిచి ఉన్న చిన్న చిన్న గుంటలలో వాళ్ళ ఈటెలని నిలబెట్టుకున్నారు. ఇద్దరు ముగ్గురు , కులీనతను సూచించే పసుపు రంగు నూలు బట్టలను పైన కప్పుకుని ఉన్నారు- తక్కినవారందరికీ నడుము చుట్టూ పులి చర్మం తప్ప మరే ఆచ్ఛాదనా లేదు.

” ఏమవుతుందో ఏమిటో ”- జాబ్ కంగారుపడ్డాడు – ” అదిగో, నన్ను ప్రేమించబోయిన ఆవిడ కూడా అక్కడే ఉంది, నాకేమిటో దడ పుడుతోందయ్యా ! మహమ్మద్ ని కూడా విందుకి పిలిచారండోయ్..ఆ ‘ ఆవిడ ‘ అతనితో ఇచ్చకాలాడుతోందిలా ఉంది. అయినా నాకెందుకులెండి, నన్ను కాకపోతే చాలు ”

ఆవిడ మహమ్మద్ ని దగ్గరుండి తీసుకొస్తోంది. అతను భయం తో వణుకుతూ అల్లాని స్మరిస్తున్నాడు. ఇన్ని రోజులూ విడిగానే భోజనం పెట్టారు , ఈ కొత్త మర్యాద అతనికి రుచిస్తున్నట్లు లేదు. అయినా వచ్చాడు, ఆవిడ కోసం కాదు బహుశా, అన్ని ఈటె లని ఒకేసారి చూసిన బెదురుతో.

నేను అన్నాను – ” నాకూ ఇదేమంత బాగున్నట్లు లేదు..కాని వెళ్ళక తప్పదు కదా. మీ రివాల్వర్ లు దగ్గరే ఉన్నాయికదా, గుళ్ళు ఉన్నాయా వాటిలో ?”

” నాది ఉందయ్యా ” జాబ్ తన జేబు మీద చరిచి చూపించాడు- ” లియో దగ్గర మటుకు వేటకత్తి ఒకటే ఉంది..పెద్దదేగా, సరిపోతుందిలెండి ”

సరిపోయినా సరిపోకపోయినా- ఇప్పుడు వెళ్ళి లియో రివాల్వర్ ని తెచ్చే వ్యవధి లేదు – అంచేత ధైర్యంగా వెళ్ళి గుహ గోడ వారగా , వరసగా కూర్చున్నాం.

మేమంతా కూర్చోగానే పెద్ద మట్టి కూజాలో నింపిన సారాని అందరికీ వరసగా ఇస్తూ పోయారు. దాని రుచి ఒక మోస్తరు బాగానే ఉంది , ఏదో ధాన్యం నుంచి తయారైనట్లుంది. ఇలాంటి కూజాలని , రక రకాల పరిమాణాలలో – ఈ అమహగ్గర్ మనుషుల దగ్గర చూశాను. నాకు తెలిసినంతవరకూ వాటిని తయారు చేసింది వీళ్ళు కాదు, అవి ఇప్పటి కాలానివీ కాదు. వందల, వేల సంవత్సరాల కిందటివై ఉండాలి. ఈజిప్షియన్ లు సమాధుల్లో మరణించినవారి ‘ ఉపయోగం ‘ కోసం దాచబెడతారు ఇటువంటివాటిని – ఇవీ సమాధుల లోపలినుంచే వచ్చి ఉంటాయి. నల్ల గా, కాస్త బరకగా ఉన్న మట్టి తో చేయబడిఉన్నాయి. రెండువైపులా పట్టుకుందుకు పిడులు, పైనంతా చాలా సొగసుగా చెక్కిన చిత్రాలు. వాటిలో ప్రేమ దృశ్యాలూ వేట దృశ్యాలూ నాట్యాలూ కూడా ఉన్నాయి. వేటదృశ్యాలలో ఒకదానిలో ఒక తెల్లజాతి మనిషి ఏనుగుని బల్లెంతో పొడుస్తున్నట్లుగా ఉంది.

నెగడు మండేందుకు చితుకులు వేస్తుండటం, సారా కూజా అందరికీ తిరుగుతూ వెళ్ళటం తప్పించి ఒక గంటపాటు ఇంకే కదలికా లేదు, ఎవ్వరూ పెదవి విప్పలేదు. మాకు ఎదురుగుండా పెద్ద చెక్కపళ్ళెం, నెగడుకి అటూ ఇటూ పెద్ద పెద్ద ఇనప పట్టకార్లు. వాటితో ఏం చేయబోతారోనని మాకు జడుపు. నిజానికి వీళ్ళగురించి మాకేం తెలుసని..అనుకున్నదాని కన్నా వీళ్ళు మంచివాళ్ళూ కావచ్చు, చెడ్డవాళ్ళూ అవచ్చు. ఇంతకూ ఇదొక ఊహల విందు లాగా ఉంది, ఎందుకంటే తినేదేదీ అక్కడ లేదు.

మాకు అవతలి వైపునుంచి ఒక మనిషి అడిగాడు – ” మనం తినటానికి మాంసం ఎక్కడ ? ”

జవాబుగా అందరూ ఒకేసారి కుడి చేతులు నెగడు వైపుకి చాచి, ఏక కంఠం తో ” వ- స్తుం- ది ” అని పలికారు.

” అదొక మేక అవుతుందా ? ” ఆ మనిషే మళ్ళీ అడిగాడు.

” కొమ్ములుండవు – మేకను మించినది వస్తుంది, మనచేతుల్లో చచ్చేందుకు ” మళ్ళీ అంతా ముక్తకంఠం తో. ఈసారి వాళ్ళ వాళ్ళ ఈటెలని ఒక్కసారి అందరూ పట్టుకు వదిలారు.

” అది ఒక ఎద్దు అవుతుందా ? ”

” కొమ్ములుండవు, ఎద్దును మించినదే వస్తుంది – మనచేతుల్లో చచ్చేందుకు ”

కాసేపు నిశ్శబ్దం. నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆవిడ మహమ్మద్ ని కౌగలించుకుని ముద్దాడటం మొదలు పెట్టింది. ఇది మరీ భీతావహం గా ఉంది, ముఖ్యంగా లియోకి. ఆవిడ కదలికలు మహమ్మద్ ని ఒక పాము పెనవేసుకుంటున్నట్లు కనిపించాయి.

[ తర్వాత తెలిసింది.. ' ప్రశాంతంగా, సంతోషంగా ' చచ్చేందుకు , చచ్చేవాడి మీద అలా ప్రేమ కురిపించబడుతుందని. ]

” మాంసం సిద్ధమేనా ? ”

” సిద్ధమే !!! సిద్ధమే !!! ”

” వండేందుకు కుండ వేడెక్కి ఉందా ? ”

” ఉంది !! ఉంది !! ”

” భగవంతుడా !!! పరదేశుల తలల మీద మండే కుండలు బోర్లిస్తారు వీళ్ళు అని రాసి ఉంది కదా ఆ మట్టిపలకమీద ”

- లియో.

ఆవిడ మహమ్మద్ మెడకి ఉచ్చు బిగించింది. పక్కన ఉన్న మగవాళ్ళు మహమ్మద్ కాళ్ళు పట్టుకున్నారు. ఇద్దరు వెళ్ళి ఇనప పట్టకారులు మంటలో కాల్చి తీశారు. ఇంకొందరు మంట అడుగునుంచి అతి ఎర్రగా కాలి ఉన్న కుండని బయటికి తీసి ఒక్క లిప్త లో మహమ్మద్ తన్నుకుంటూ ఉన్న చోటికి తీసుకెళ్ళారు. మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తూన్నా , విడిపించుకునేందుకు మహమ్మద్ రాక్షస ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇంకొక్క క్షణం లో ఈ నికృష్టులు , ఈ పిశాచాలు – అతని తలమీద ఆ మండే కుండను బోర్లిస్తారనగా-

నేను అరుస్తూ, ఒక్క ఉదుటున లేచి ఆవిడ కి గురిపెట్టి రివాల్వర్ పేల్చాను. వీపులోంచి గుండు దూరిపోయి తక్షణం ఆమె చచ్చిపోయింది. ఆమెని అలా చంపగలిగినందుకు ఈ రోజుకీ నాకు సంతోషమే. ఆమె పడిపోతూండగా నాకొక ఘోరమైన నిజం తెలిసింది. మహమ్మద్ తనని పట్టుకున్నవాళ్ళ చేతు ల్లోంచి జారి, ఆమె శవం మీద వాలిపోయాడు, అతనూ మరణించాడు. దౌర్భాగ్యం కొద్దీ – ఆమె వీపులోంచి వెళ్ళిన గుండు అతని గుండెని చీల్చింది. కొన్ని వందల రెట్లు భయంకరమైన మృత్యువు నుంచి అతను తప్పించుకుని తేలిగ్గా చనిపోయాడు , అంతవరకే.
ఒక్క నిమిషం పాటు ఎవరికీ ఏమీ తోచలేదు. అమహగ్గర్ వాళ్ళు ఇదివరకెప్పుడూ తుపాకులు చూడలేదు – వాళ్ళకి భయం పుట్టింది. అయితే , వాళ్ళలో ఒకడు త్వరగానే తేరుకుని దగ్గరగా ఉన్న లియోకి ఈటె గురిపెట్టాడు.

” పరిగెత్తండి ” – కేక పెట్టి నేను కాళ్ళకి బుద్ధి చెప్పాను. మా చుట్టూ , ద్వారం దగ్గరా ఉన్న జనం వల్ల గుహ బయటికి వెళ్ళే వీలు అసలు లేదు – అందుకని కనబడుతూన్న రాతిమెట్లెక్కి పైకి ఉరికాము. తమ మనిషి చచ్చిపోయిన కోపం తో పిచ్చెక్కిన నరమాంసభక్షకులు మా వెంటపడ్డారు. గుహ పైభాగం లో ఒక ఎత్తైన అరుగు లాంటిది ఉంది. దానికి రెండు పక్కలా పెద్ద దివిటీ లు వెలుగుతున్నాయి. ఆ అరుగు సహజంగా ఏర్పడినదో లేక మానవ నిర్మితమో తెలియదు. ముగ్గురం దానిపైకెక్కి కూర్చుండిపోయాము. కిందికి చూస్తే చీకట్లో వాళ్ళ ఈటెలు మెరుస్తున్నాయి , వాళ్ళు అంత క్రోధం లోనూ నిశ్శబ్దంగానే ఉన్నారు. లియో కళ్ళు వింతగా ప్రకాశించాయి, మొహం రాయిలా బిగుసుకుంది. కుడిచేత్తో వేట కత్తిని గట్టిగా పట్టుకుని ఎడమచేత్తో నన్ను దగ్గరికి తీసుకుని అన్నాడు.

” ఇక సెలవు అంకుల్…ప్రియాతిప్రియమైన మిత్రుడా …నా తండ్రికన్నా ఎక్కువ నువ్వు నాకు. మన పని అయిపోయింది. వాళ్ళు మనల్ని వదలరు..చంపేస్తారు, తినేస్తారు. నేనే నిన్ను ఇందులోకి లాగాను. నన్ను క్షమించు, క్షమించగలిగితే ”

” ఎలా రాసిపెట్టిఉంటే అలా జరుగుతుందిలే ” అన్నాను. ఈ లోపు జాబ్ రివాల్వర్ గురిపెట్టి ఒకడిని కాల్చాడు..తను గురిపెట్టినవాడిని కాదు, పక్కవాడిని. జాబ్ గురి అలాంటిది.

వాళ్ళు మామీదికి దండెత్తారు. నేను చక చకా రివాల్వర్ పేల్చాను. కొందరు పోయారు, ఇంకొందరు బాగా గాయపడిఉంటారు. మళ్ళీ గుళ్ళు నింపుకునే వ్యవధి లేకపోయింది. వాళ్ళు ఏమీ లక్ష్యపెట్టకుండా ముందుకి వస్తూనే ఉన్నారు. ఒక బలిష్ఠుడు మా అరుగు మీదికి ఎక్కాడు- లియో ఒక్క దెబ్బతో వాడిని పడగొట్టాడు.

నేనూ ఇంకొకడిని అలాగే పడగొట్టగలిగాను , కాని మరొకడి మీద జాబ్ ప్రయత్నం విఫలమై అతను జాబ్ ని నడుము పట్టుకు కిందికి విసిరేశాడు. అదృష్టవశాత్తూ జాబ్ ఒక శవం మీద పడ్డాడు. పెద్దగా దెబ్బలు తగిలిఉండవుగాని కదలకుండా పడుకుండిపోయాడు, అదొక రక్షణగా. నా మీదికి ఇద్దరు దిట్టమైన మనుషులు వచ్చారు- నేనెప్పుడూ పోరాడినవాడిని కాను, వయసూ మళ్ళిపోయింది – అయినా పిచ్చి బలం తో వాళ్ళని ఎదుర్కొన్నాను. మెడలు పట్టుకు నొక్కి ఉంచాను, వాళ్ళు విడిపించుకోలేకపోవటం ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆ తర్వాత చూస్తే , లియోని అందరూ చుట్టు ముట్టి ఉన్నారు.

తోడేళ్ళ మంద మధ్యన అతను అడవి దుప్పిలాగా ఉన్నాడు, తెగించి పోరాడుతున్నాడు. వాళ్ళందరి కన్నా పైగా, బంగారు రంగు జుట్టు కప్పిన అతని తల కనిపిస్తోంది[ అతని ఎత్తు ఆరడుగుల రెండంగుళాలు ] . ఎంతో మందిని పడగొట్టాక అతనూ నేల కూలాడు. నరభక్షకులు అతని కాళ్ళూ చేతులూ పట్టుకుని కేకలు పెట్టారు -

” ఈటె గుచ్చండి గొంతులోకి, గిన్నె తెండి రక్తం పట్టటానికి ”

నేను నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నాను..నా చేతుల్లో ఉన్నవాళ్ళు ఇంకా పూర్తిగా చావలేదు, నేను వదుల్తూనే నన్ను చంపేస్తారు..లియో కి నేనేమీ చేయలేను….

ఉన్నట్లుండి పెద్ద కలకలం. కళ్ళు విప్పి చూశాను. ఉస్తేన్ లియో మీద నిలువునా పడి అతన్ని కప్పేసింది. ఆమెని పక్కకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు..ఆమె అతన్ని చుట్టేసుకుంది, చెట్టుని తీగ అల్లుకుపోయినట్లు అతని కాళ్ళని తన కాళ్ళతో పెనవేసుకుంది, వాళ్ళు విడదీయలేకపోయారు. పక్కనుంచి పొడిచి చంపాలని చూశారు..ఆమె దాన్నీ అడ్డుకోగలిగింది- అతనికి గాయాలు మటుకే అయాయి.

వాళ్ళకి ఓర్పు నశించింది. ” ఇద్దరిలోకీ గుచ్చండి ఈటెలు, ఇలా పెళ్ళి చేయండి వాళ్ళకి ”

ఆ పని చేయబోయేవాళ్ళు ఈటెలు సవరించుకున్నారు ..నేను మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకుంటున్నాను.

అప్పుడు ఉరుములాగా ఒక గొంతు వినిపించింది , కొండల్లో లోయల్లో ప్రతిధ్వనిస్తూ-

” ఆపండి ”

నేను చచ్చిపోతున్నాననిపించింది – స్పృహ పోయింది.

***

నాకు తెలివి వచ్చేసరికి నెగడు కి కాస్త దూరంగా ఒక జంతు చర్మం మీద పడుకుని ఉన్నాను. ఈ పక్కన లియో , ఇంకా స్పృహ రాని స్థితిలో. అతని మీదికి వంగి ఉస్తేన్ అతని గాయాలను శుభ్రం చేస్తోంది. ఆ వెనక, గోడకి ఆనుకుని జాబ్- ఎక్కువ గాయపడినట్లుగా లేడు గాని, వణుకుతున్నాడు. నిన్నటి యుద్ధం లో మరణించిన వారి శరీరాలు వరసగా పడుకోబెట్టి ఉన్నాయి..దురదృష్టవంతుడైన మహమ్మద్ కాక నరభక్షకులు మొత్తం పన్నెండు మంది మరణించారు. ఆ పక్కన గాయపడిన వారికి కట్లు కట్టే కార్యక్రమం నిర్లిప్తంగా సాగుతోంది. అధికారపూర్వకంగా అటూ ఇటూ తిరుగుతూ పర్యవేక్షిస్తున్నది – బిలాలీ.

నే ను లేవటం చూసి నన్ను అతి గౌరవంగా పలకరించాడు- నా పరిస్థితి గురించి. ఒళ్ళంతా చితకగొట్టినట్లుండటం తప్ప నాకెలా ఉందో, ఏమైందో – నాకే తెలీదని జవాబిచ్చాను.

అతను వంగి లియోకి పార్శ్వం లో అయిఉన్న పెద్ద గాయాన్ని పరీక్షించాడు.

” గట్టి దెబ్బే ఇది – కాని లోపలి అవయవాల దాకా వెళ్ళలేదు, కోలుకుంటాడు ”

” మీరు వచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు తండ్రి గారూ ! ఇంకొక నిమిషం ఆలస్యమై ఉంటే , మా అనుచరుడి లాగే మేమూ అంతమైపోయేవాళ్ళం ” – మహమ్మద్ ని చూపించాను.

ఆ వృద్ధుడు కోపంగా పళ్ళు నూరాడు , కళ్ళలో నేనెప్పుడూ చూడని ఆగ్రహం .

” భయపడకు బిడ్డా ! మీకు హాని చేసినవారి మీద ప్రతీకారం తీర్చుకోబడుతుంది, వింటేనే ప్రాణాలు కడబట్టేంత ఘోరంగా. మీరు రాణి దగ్గరికి వెళ్ళబోతున్నారు, అంతా ఆవిడే చూసుకుంటుంది, తన ఘనత కి తగినట్లుగా ! ” – మహమ్మద్ వైపు చూపించి అతను ఎలా చనిపోయాడని అడిగాడు.

నాలుగు ముక్కల్లో వివరం చెప్పుకొచ్చాను.

” ఊ. ఈ పిశాచాలు కొత్తవాళ్ళకి ఇలాగే మండే కుండ బోర్లించి మర్యాద చేస్తుంటారు ” – పెదవి విరిచాడు.

” అంతా తలకిందులుగా ఉంది. మా దేశం లో కొత్తవాళ్ళు వస్తే వాళ్ళకి భోజనం పెడతాము…వీళ్ళు వాళ్ళనే భోంచేస్తున్నారు ” – అన్నాను.

” అది ఆచారం ” – అతను బుజాలెగరేశాడు , ” చెడ్డదే అనుకోండీ.. బురద నేలల్లో తిరిగి వచ్చే కొత్తవాళ్ళ మాంసం నాకైతే పెద్ద రుచించదు కూడా. ఈమెని చంపి మంచి పనే చేశారు – ఇదే అంతటికీ కారణం. మిమ్మల్ని రక్షించమని రాణి ఆదేశించింది, ఈ నల్లవాడి గురించి ఏమీ చెప్పి ఉండలేదు , అందుకని ఇతన్ని చంపబోయారు వీళ్ళు . నరమాంసం మీద గొప్ప మోజు వీళ్ళందరికీ. మిమ్మల్ని గాయపరచి చంపబోయిన సంగతి రాణికి తెలిస్తే వీళ్ళ శిక్షలు ఎంత భయంకరంగా ఉండేవో మీరు ఊహించలేరు , మీరే చంపేయటం వీళ్ళకి చాలా మేలు చేసినట్లు ”

” గొప్ప వీరోచితంగా పోరాడారు మీరు ” – కొనసాగించాడు – ” మీ మటుకు మీరు చూస్తే ఏమంత శక్తిమంతులుగా లేరు, ఇద్దర్ని మీచేతులతోనే చంపగలిగారు. అతను..ఆ యువసిం హం – ఎంత పరాక్రమం అతనిది !! మంచి యుద్ధాన్ని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేను నేను. అవునూ, అలా శరీరం లో రంధ్రం చేసి ఎలా చంపగలరు మీరు ? పెద్ద శబ్దం కూడా వస్తోంది అప్పుడు ? ”

వీలైనంత క్లుప్తంగా అతనికి తుపాకి మందు గురించి వివరించాను , ఎక్కువ చెప్పే ఓపిక లేదు. మమ్మల్ని రక్షించిన కృతజ్ఞత మాత్రమే నన్ను మాట్లాడిస్తోంది గాని, బొత్తిగా శక్తి లేదు ఒంట్లో. వాళ్ళ చెరసాలలో బంధించి ఉన్న వాళ్ళలో ఒకడి ని తుపాకి పేల్చి చంపి చూపించమని అడిగాడు. ఆ పని నేను చేయలేనని చెప్పాను. మా దేశం లో మనుషులని శిక్షించే బాధ్యత చట్టానిదీ ఆ పైన దైవానిదీ అని విని అతను ఆశ్చర్యపోయాడు. నేను కోలుకోగానే అతన్ని వెంటబెట్టుకుని వేటకి తీసుకెళ్ళి నేర్పిస్తానని వాగ్దానం చేశాను. అతను చిన్నపిల్లాడిలాగా సంబరపడిపోయాడు.

సరిగ్గా అప్పుడే లియో కళ్ళు విప్పాడు. మా దగ్గర కొద్దిగా మిగిలి ఉన్న బ్రాందీని జాబ్ అతని గొంతులోకి రెండు గుక్కలు పోశాడు. లియోకి సగం స్పృహ మాత్రమే వచ్చింది. అందరం కలిసి అతన్ని గుహలోపలి గదిలోకి మోసుకుపోయి పక్క మీద పడుకోబెట్టాము – తలా ఒక చేయి వేశామే గాని , బరువు మోసింది ఉస్తేన్ మటుకే. నా లియోని రక్షించిన ఈ అమ్మాయి మీద విపరీతమైన ప్రేమ వచ్చింది నాకు – దగ్గరికి తీసుకుని తలమీద ముద్దు పెట్టుకుందామనుకున్నాను…కాని ఏమనుకునిపోతుందోనని ఊరుకున్నాను. నా చిన్న గదిలో నేనూ నడుము వాల్చాను – ఈ మధ్య కాలం లో ఎన్నడూ ఎరగని నిశ్చింతతో. ఇప్పుడు ఆ గది నాకు సమాధిలాగా అనిపించటం లేదు, రక్షిత ప్రదేశం లాగా ఉంది. మృత్యువు కి అతి దగ్గరగా వెళ్ళి వెనక్కిరాగలగటాన్ని అనుభవించాల్సిందేగాని మాటల్లో చెప్పటం కష్టం.

కానీ , నాకు మామూలుగానే గాఢ నిద్ర పట్టదు – ఆ రాత్రి బీభత్సమైన కలలు వెంటాడాయి. మహమ్మద్ ని చంపబోయే దృశ్యం రకరకాలుగా కనిపిస్తూనే ఉంది. ఆ నేపథ్యం లో ఒక నీడ..ఒక రూపం..ఒకసారి మహా సౌందర్యవతి అయిన స్త్రీగా , ఇంకొకసారి అస్థిపంజరంగా …ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి రాత్రంతా , తెలిసీతెలియని అర్థం తో -
” మృత్యువు ను ఎరిగీ జీవించే ఉంటారు , మరణించినా అంతమైపోరు – ఎన్నటికీ నశించరు. ప్రాణచక్రపు భ్రమణం లో జననమరణాలకి అర్థం లేదు . అన్నీ శాశ్వతంగా జీవించే ఉంటాయి..ఒక్కొక్కప్పుడు నిద్రించినా, విస్మృతమైనా ”

ఎట్టకేలకి తెల్లవారింది. మెలకువ వచ్చిందేగానీ కాలు కిందపెట్టగలిగే పరిస్థితిలో లేను. జాబ్ కుంటుతూ లోపలికి వచ్చాడు – మొహం బాగా కమిలిపోయిఉంది పాపం. లియో బాగానే నిద్రపోయాడనీ కాకపోతే బాగా నీరసంగా ఉన్నాడనీ చెప్పివెళ్ళాడు. ఆ తర్వాత బిలాలీ వచ్చాడు [ జాబ్ ఇతన్ని బిలాలీ మేక అంటుండేవాడు – ‘Billy the goat ‘ మాదిరిగా ] . నిద్ర నటిస్తూ రెప్పల సందుల్లోంచి బిలాలీనీ అతని నిడుపాటిగడ్డాన్నీ పరికించాను. లండన్ లోని ఏ ప్రసిద్ధికెక్కిన మంగలి దుకాణానికైనా , ప్రకటనలకి భేషుగ్గా పనికొస్తుంది ఈ గడ్డం.

అతను తనలో తను మాట్లాడుకోవటం [ ఈ అలవాటు బిలాలీ కి బాగా ఉంది ] వినిపించింది – ” నిద్రపోతున్నాడు…ఎంత వికారంగా ఉంటాడో , మర్కటం లాగా. అతను ఎంత అందగాడో ఇతను అంత వికారి. కాని మంచివాడు..నచ్చుతున్నాడు నాకు. ఈ వయసులో ఒక మనిషి నాకు నచ్చటం ఆశ్చర్యమే. ‘ మనుషులెవరినీ నమ్మకు, బొత్తిగా నమ్మని వారిని వధించు, స్త్రీ కి దూరంగా పారిపో ” అన్న నానుడి ఉందే మరి ! ఇంతకూ ఈ మర్కటం ఆ తుపాకీ విద్యలన్నీ ఎలా నేర్చుకున్నాడో ! రాణి ఇతన్ని ఏమీ చేయకుండా ఉంటే బావుండును….నిద్ర చెడుతుందేమో, వెళ్ళిపోతాను ”

శబ్దం చేయకుండా , మెల్లగా మునివేళ్ళమీద నడుస్తూ వెనుదిరగబోతూ ఉంటే అప్పుడు పిలిచాను

” తండ్రిగారూ ! మీరేనా ? ”

” అవును బిడ్డా. ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను. మిమ్మల్ని చంపబోయినవాళ్ళని రాణి తీసుకు రమ్మంది, ప్రయాణిస్తున్నారు వాళ్ళు. మీ ప్రయాణానికి కొంచెం వ్యవధి ఉంది ”

” అలాగే తండ్రి గారూ, కోలుకున్న తర్వాతే వెళతాం. కాని నన్ను కొంచెం బయటికి , సూర్యకాంతి పడేచోటికి – తీసుకువెళ్ళగలరా ? ఇక్కడే ఉండాలని లేదు ”

” అవును ” అతను అన్నాడు . ” ఈ గుహల్లో వాతావరణం దిగులు పుట్టిస్తుంది…చనిపోయినవారి నివాసం కదా మరి. నేను కుర్రవాడుగా ఉండగా, నువ్వు పడుకున్న చోటనే చాలా అందమైన స్త్రీని పడుకోబెట్టి ఉంచారు. ఆమె మరణించి ఎంతో కాలమైపోయిఉంటుంది, రాణి కొందరు శరీరాలని అలా పదిలం చేయిస్తుంది. చందమామలాంటి ముఖం, పాదాల వరకూ జీరాడే జుట్టు..ఆమె నిద్రిస్తున్నట్లే ఉండేది. రోజూ వచ్చి చూడకుండా ఉండలేకపోయేవాడిని… జీవితం ఎంత అశాశ్వతమో ఇక్కడే అర్థమైంది నాకు. ఆశ్చర్యం ఏమిటంటే అది తెలిశాకనే ఆ స్త్రీ ని ప్రేమించటం మొదలుపెట్టాను. పాలరాతి ముక్కల వంటి ఆ నుదురునీ బుగ్గలనీ ముద్దు పెట్టుకునేవాడిని. మా అమ్మ కి అనుమానం వచ్చి ఒకరోజున నన్ను వెంబడించింది ఇక్కడికి. చూసి, ఆ స్త్రీ శరీరాన్ని నిలబెట్టి ఆమె జుట్టుకి నిప్పు అంటించింది..ఆమె కాలిపోయింది, అలా భద్రపరచినవాళ్ళు తేలిగ్గా దగ్ధమైపోతారు ”

తెచ్చి చూపించాడు నాకు – ” ఇదిగో, ఇది మిగిలింది, చూడు ”

అది ఆ స్త్రీ పాదం . దీపం వెలుగులో ముట్టుకుని చూశాను..నాకు కలిగింది భయమో, జుగుప్సో, ఆశ్చర్యమో, అద్భుతమో – చెప్పలేను. ఈజిప్షియన్ మమ్మీ ల లాగా అది కుంచించుకుపోయి లేదు…నున్నగా ఘనీభవించి ఉంది అంతే , కొంత పాలిపోయి..నిప్పులోంచి తప్పించి తీసిన జాడలు కనిపిస్తూ. ఎన్ని వేల ఏళ్ళనాటిది…ఏ ప్రాచీన నాగరికతా వైభవం లోంచి నడచివచ్చింది…కేరింతలు కొట్టే శిశువుగా, సిగ్గు చిందే కన్యగా, పరిపూర్ణమైన స్త్రీ గా ? ధైర్యంగా ఏ ధూసరిత పథాలలోంచి మృత్యు సమీపానికి చేరింది ? అంతకు ముందర ఏ అర్థరాత్రి ఎవరికోసమని రహస్యంగా కదిలివెళ్ళింది ? ఆ అడుగు చప్పుడుకి ఏ చెవులు ఎదురు చూశాయి ? తన సౌందర్యానికి తలవంచిన ఏ జగజ్జెట్టి మెడ మీద ఆనింది ఈ పాదం..ఏ ఆరాధకుల పెదవులు భక్తితో ఆనినాయి ఇక్కడ ?

ఆమె వస్త్రాలే అయిఉంటాయి, వాటిలో ఒక పాత బట్టలో దాన్ని చుట్టేసి పక్కన పెట్టేశాను. బిలాలీ సాయంగా లియో ని చూసేందుకు బయల్దేరాను. తెల్లని అతని శరీరమంతా దెబ్బలతో నీలంగా కమిలిపోయి ఉంది. బాధ వలనా , రక్తం పోయీ నీరసంగా కనిపిస్తున్నాడు- కానీ చాలా ఉత్సాహం గా ఉన్నాడు, ఉదయపు ఫలహారం కావాలని అడుగుతున్నాడు. ఒక డోలీ తయారు చేసి అందులో అతన్ని మోసుకుని జాబ్, ఉస్తేన్ – గుహ ముఖద్వారం దగ్గరికి మోసుకువచ్చారు. అంతకు ముందరి బీభత్సపు అవశేషాలన్నీ దాదాపుగా తొలగించబడి ఉన్నాయి. అందరమూ ఫలహారం చేశాము. ఆ తర్వాతి రెండు రోజులూ అలాగే ప్రశాంతంగా గడిచాయి.

మూడో రోజు ఉదయం రాణి ఉండే చోటుకి- ‘ ఖో ర్ ‘ అనేది దాని పేరు , బయల్దేరాము. నేనూ జాబ్ బాగానే కోలుకున్నాం గానీ లియో గురించి ఆదుర్దాగా ఉండింది నాకు – అతని గాయం ఇప్పుడే చెక్కు కడుతూ ఉంది, ప్రయాణపు కుదుపుకి రేగుతుందేమోనని భయం. కాని బిలాలీ పట్టు పట్టాడు – మేము ఇంకా అక్కడే ఉంటే ఇంకేవో ప్రమాదాలు ఎదురవవచ్చుననేది అతని సూచన – అది గ్రహించి ఒప్పుకున్నాను.

[ ఇంకా ఉంది ]