కవిత్వం

వర్షపు కళ్లాపులు

నవంబర్ 2015

ర్రెర్రని సూరీణ్ణి పలకరించేందుకు ఎదురెళ్లే ప్రొద్దుటి నడక,
పోగేసిన కబుర్లతో వెంటాడే అల్లరి గాలి,
జీవనానందమే నాదైన మతం అయినప్పుడు
ఉచ్చ్వాశ, నిశ్వాసల్ని మరిచి తపస్సమాధిలోకి వెళ్ళడమే!

దారివెంట బారులుతీరిన ఆకుపచ్చని నేస్తాలు
నావంక చూసి
అప్పుడప్పుడో ఆకునో, పూవునో రాలుస్తూనే ఉన్నాయి.
ప్రాపంచిక వ్యామోహాల్ని గుప్పిట్లో దాచిపెట్టేసిన నన్ను
రహస్యంగా మోహపుదారాలు అల్లుకుంటూనే ఉన్నాయి.

నా మటుకు నేను
రాత్రి మోసి తెచ్చిన కలల్ని విప్పి
ఆకాశం క్రింద చల్లుతూనే ఉన్నాను.
అవన్నీ నాతో నడిచే సెలయేళ్ల నంటి మొలిచి పలకరిస్తూనే ఉన్నాయి.
ఋతువు వెనుక ఋతువై సమస్త ప్రపంచాన్ని ఆలింగనం చేసుకుంటూనే ఉన్నాయి.

చిక్కని మబ్బుసందేశాన్ని పంపుతూ ఆకాశం ఉరుముతూనే ఉంది.
కురవలేని నిస్సహాయత్వాన్నీ మాత్రం ఆనక కాస్త ఆలస్యంగా ఆవిష్కరిస్తూనూ ఉంది.
బీటలువారిన వాకిళ్లన్నీ వర్షపు కళ్లాపుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.
క్షణం నిలవలేని కాల యవనికపై హేమంత శిశిరాలు వాలుతూనే ఉన్నాయి.

అయినా చిత్రంగా…
తెలవారి వేయబోయే క్రొత్త అడుగుల స్ఫూర్తితో
ఏ రాత్రీ కలలు కనటం మానలేదు.