గెస్ట్ ఎడిటోరియల్

ఈ కాలపు శ్రుతీ స్మృతి: జర్నలిజం

డిసెంబర్ 2015

త్రికలు ఎక్కువైపోయాయి. విలువలు పల్చబడ్డాయి. పత్రికలే ఎక్కువ కానక్కర్లేదు. ఇవాళ్రేపు ఎన్ని దారుల్లేవు. మునుపు ఊరికొక రచ్చ బండ. ఇప్పుడు గల్లీ గల్లీకి ఒకటి. ఫేస్ బుక్ పోస్టులుగా, ఆపై పలకరింతలుగా కూడా పంచాయతీలు చెయ్యొచ్చు. రాసి పారెయ్యొచ్చు వార్తలూ వదంతులూ.ఎక్కడైనా ఇక్కడే. ఎప్పుడైనా ఇప్పుడే.

స్థలం, కాల పరిమితులు సడలడం బాగుంది.

మనుషులు మాట్లాడుకోవడం మరీ ఎక్కువైంది. మౌనానికి ధ్యానానికి సమయం లేదు. మెలకువలో పరుగు. నిద్దట్లో పరుగు.

ఎక్కడికి పోతున్నమో, ఎక్కడున్నమో ఎవరు చెప్పాలి. జర్నలిజం. ఔను, వదంతి కూడా జర్నలిజంలో భాగమే.

బుక్ అంటే భక్తి మనకు. రాయబడిన దాని మీద అమిత గౌరవం. ఈ కాలపు శ్రుతీ, స్మృతి జర్నలిజం.

అందుకే. భలే గ్లామరు జర్నలిజానికి. మునుపు మరీనూ. అక్షరాన్ని ప్రేమించే వాడికి ఆనందం, అన్నం రెండూ దొరికేవి. చెప్పొద్దూ. మరీ ఇంత రాజీ అవసరముండేది కాదు. వ్యాపారం ఇంత విశ్వరూపం ధరించింది కాదు. క్రయ విక్రయాల తొలి/మలి రోజులవి. సంతలో కొన్ని ఖాళీ మూలలుండేవి. కొన్ని ‘సందులుం’డేవి. సీమ్స్ వుండేవి. అంగళ్ల మధ్య సందులు. అక్కడ చిన్ని చిన్ని నిజాలు గూళ్లు కట్టుకునేవి. అమ్మకం అవసరం లేకుండా వస్తు-మార్పిడి జరిగేది. ‍మనుషులు ఆడుకునే వారు, పాడుకునే వారు. ముఖాముఖి వుండేది చాల వరకు. మందలో ఒకరుగా కాకుండా.

అప్పుడు కాలానికి కన్నం వేసి కొన్ని క్షణాల్ని దొంగిలించి మన కిష్టమైనట్టు బతకడానికి వీలుండేది. ఇప్పుడు కాలం ఒక పేద్ద దిమ్మె. ఎక్కడా కన్నం పడదు. ఇప్పడు రాబిన్ హుడ్ లు బతకలేరు. హెల్దీ దొంగతనం కుదరదు. దొంగిలిస్తే మొత్తం ఇంటినే దొంగిలించాలి. ఊరినే/దేశాన్నే దొంగిలించాలి. అట్టా దొంగిలించినోడిదే అధికారం. నువ్వు నేను లాంటి చిల్లరి దొంగలకు ఏమీ మిగిలి లేదు, గజదొంగల కోసం పని చెయ్యడం తప్ప. మనం దొంగతనానికి ప్రయత్నిస్తో దొరికితే, ఏకంగా మరణ శిక్షే. శిక్ష పడిందని,మన మెడను చుట్టినది పూదండ కాదు వురి తాడని తెలియదు, పూర్తిగా బిగుసుకునే వరకు.

నువ్వూ నేనూ ఒక పత్రిక పెట్టగలమా, చతుర్లు కాకపోతే. నువ్వు నేను వేర్వేరుగానే కాదు, ఇద్దరం పోనీ ముగ్గురం కలిస్తే పెట్టగలమా? లేం. పత్రిక కావాలంటే నువ్వు వున్నట్టుండి ఊళ్లను దోచి వున్నోడివైపోవాలి. లేదా వున్నోడి మ్రోల వ్రాలి, వాడికి నీ తపః ఫలమిచ్చి అనగా నీ మంచితనమంతా కట్ట గట్టి ఇచ్చి కొంచెం బతుకును లీజ్ తీసుకుని నివసించాలి. ‘ఎందుకిలా ఎప్పుడూ ఎవరో నన్ను తరుముతున్న చప్పుడు/ ఎందుకిలా ఎప్పుడూ ఇంకెవరి శరీరంలోనో అద్దెకు వుంటున్న ఫీలింగ్’ … అని నీకు నువ్వొక విషాదాశ్చర్యమైపోవాలి. పొడుపు కథను ఎంజాయ్ చేసే తీరిక కూడా లేకుండా, ఎడారి ఓడవై పరుగులు తీస్తూనే వుండాలి, ఇంకెవరిదో అంతు లేని దాహాన్ని మోస్తో.

వాడి దాహం తీరదు. తీరేది కాదు.

నిజాలు వుండవు. అవి నిర్మించబడతావు. ఎవడో తనకు పనికొచ్చే నిజాలు నిర్మించుకోడానికి రాళ్లు ఎత్తే కూలీవి నువ్వు. రేపు మళ్లీ రాస్తావు పద్యాలు… షాజహాన్ ఎంత గొప్పవాడో, వాడి ఎన్నోదో పెళ్లాం మీద వాడి ప్రేమ ఎంత సుందరమో చెబుతావు. నీ అక్షరాల్ని వాడి వెన్నెట్లో ఆడుకునే ఆడపిల్లల్ని చేస్తావు.

ఒకటి చెప్పు. హైదరాబాద్ టాంక్ బండ్ చెరువు మధ్య భారీ విగ్రహం ఎవర్ని గుర్తు చేయాలి? ఎన్టీ వోడినా, దాన్ని అక్కడికి చేర్చుతో దాని కింద నలిగి చనిపోయిన ఆరుగురు కూలీలనా? ‘ఓరీ, గౌతమ వంశాధమా’ అని తిట్టాలని అనిపించడంలేదా మహనీయడు బుద్ధుడిని.

ఆశ్రయించడానికి ఏమీ మిగిల్చరు నీకూ నాకూ. ఇంకేమీ మిగలక వాళ్లనే ఆశ్రయించాలి. వాళ్ల వద్ద భారీ ఆశ్రమాలుంటాయి, వెళ్లు.

నిజం చెప్పావో నీ పే స్లిప్ వేయి ముక్కలవుతుంది. వేతన బానిసకు శిరసు కన్న జీతం-కాగితం మిన్న యన విన లేదా కొత్త వేమనా? బుష్ గారన్నట్టు బాగ్దాద్ లో రసాయనాల్లేవని తెలీని అమెరికన్ జర్నిలిస్టు ఆయాల ఎవరైనా వుండి వుంటాడా? ఉండరు. అయినా యుద్ధ రీతుల, రక్తపాతాల, బంకర్ బస్టర్ల వర్ణనలే గాని వాళ్ల నోళ్ల నుంచి నిజం నువ్వు విన్నావా, చదివావా; సద్దాం పూర్తిగా వురి తీయబడే వరకు?

కొత్తాంద్రప్రదేశ్ ఎన్నికలవగానే చిత్తూరి నాయకుడు ఫట్ మని బెజవాడకెళ్లి కూర్చున్నాడు. ఆ వూరు అప్పటికే రాజధాని అయిపోయినట్టు మాటలు/పనులు సాగాయి. అలాగని ఎప్పుడు ఏ ప్రజలు నిర్ణయించారని ఒక్క పాత్రికేయుడైనా వాయి విడిచి అడిగాడా?

అంతా బిజీ బిజీ;

ఇట్టాంటప్పుడు జర్నలిజం ఎట్టా వుండాలో అట్టాగే వుంది. మనమే దానికి తగినట్టు మారినట్టు లేం. ఎట్టాగూ ఊళ్లు ఊళ్లుగా వుండవు. ఉంచాలనుకోడం వృథా ప్రయాస. అంతర్జాలం అనగా ప్రపంచపు వల లోపలే ఈదాలి ఇక అన్ని చేపలూ.

వల లోపలి ఈత నేర్చేసుకుందాం. లేకుంటే మునకే. వల లోనే ప్రేమించుకుందాం. మాట్లాడుకుందాం. ఎక్కడైనా ఎప్పుడైనా మనుషుల మధ్య ప్రేమ లోంచే, మనుషుల మాటల్లోంచే ఏదయినా జరిగింది. మనం మన మెత్తని నోళ్లతోనే అంతర్-వల తాళ్లు తెంచే కళ తెలుసుకోవాలి. స్నేహ వలయాల్ని పెంచుకుని, నిబంధించే తాళ్లను తుంచుకుని కొత్త బంగారు లోకం తయారు చేసుకోవాలి. దానికి పనికి రావొచ్చు జర్నలిజం. అంతర్జాల జర్నలిజం కూడా దానికి పనికి రావొచ్చు. ఇందులో అప్పుడే పురుగుల లుకలుకలు కనిపిస్తున్నాయి. చేసే ఈ కాస్త శ్రమను ఎంత ఖరీదుకు అమ్ముకుందామా అని ఎత్తులు వేసే జర్నలిస్టులు మన మధ్య లేరని చెప్పలేం. తస్మాత్ జాగ్రత.

భారతాంతాన చేతులు బార్లా చాచి వ్యాసుడు ‘ఏది సత్యం ఏదసత్యం’ అని ఆక్రోశించాడట. మాకు అన్నమే కాదు అన్నీ కావాలి, గులాబీలు కూడా కావాలని ఫ్రెంచి విద్యార్థులు గోడల మీద గోల చేశారట. ఇప్పుడే పెన్సిల్ పట్టుకుంటున్న జర్నలిస్టులం, కవులం, కథకులం ఆ ఆర్తిని అందుకుంటామా?! కొత్తగా విస్తరించిన స్పేస్ ని ఆ పనికి వాడుకుంటామా?!

**** (*) ****