హోకా హే

పీటర్ లఫార్జ్

డిసెంబర్ 2015

క్కోసారి ఇక్తొమి రావడానికి వెళ్లిపోవడానికి దారితీసే పరిస్థితులు ఏవైనా, క్షణకాలపు తన ఉనికిలో అడుగడుగున ఎదురయ్యే వివక్షను ధిక్కరించి లోకం గుండెలో మాసిపోని ముద్రవేసి వెళ్తుంది. ఉన్నంత కాసేపూ ప్రపంచం బాధను తన బాధ చేసుకుని ముందు తరాలకు మార్గదర్శి అవుతుంది. అలాంటి ఒక ఇక్తొమి పీటర్ లఫార్జ్.

దాదాపు పదిహేనేళ్ల క్రితం, నేను ఒకరోజు రేడియోలో పాటలు వింటున్నప్పుడు హఠాత్తుగా పాటకు బదులు ఒక పిలుపు వినిపించింది. “ఐ..రా హేయ్స్! ఐ.. రా… హే… య్స్” అంటూ ఐరా హేయ్స్ ను అతడి సమాధి లోంచి కుదిపి లేపుతున్నట్టున్న, ఆర్తి నిండిన ఆ పిలుపు వినగానే నా మెడమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. తరువాతి నాలుగు నిమిషాలు గిటార్ ను కాదు గుండె తంత్రులను మీటుతూ “బాలడ్ ఆఫ్ ఐరా హేయ్స్” అంటూ ఐరా హేయ్స్ అసలు కథ వినిపించాడు మన ఇక్తొమి, పీటర్ లఫార్జ్. ఐరా హేయ్స్ ఎవరు అంటారా? రెండవ ప్రపంచ యుద్ధం చివరి దినాల్లో బ్యాటిల్ ఆఫ్ ఇవో జిమా (Battle of Iwo Jima) సమయంలో ఇవో జిమా మీద అమెరికా జెండ ఎగరవేసిన వాళ్లలో ఒకడు ఐరా హేయ్స్.

పీటర్ జీవితం గురించి చాల కథనాలున్నాయి. ఏది సరైనదో తెలియదు. తెలిసినంతవరకు, 1931 లో న్యూ యార్క్ నగరంలో ఆలివర్ లఫార్జ్, వాండెన్ మాథ్యూస్ లఫార్జ్ దంపతులకు జన్మించాడు. 1935 లో ఆలివర్ కు విడాకులు ఇచ్చి పీటరును, కూతురు పావీ ని తీసుకుని వాండెన్ కొలరాడొ రాష్ట్రానికి తరలివెళ్లింది. పీటరు కొలరాడొలోనే పెరిగాడు. హైస్కూల్ చదువు వదిలేశాడు. కొరియన్ యుద్ధంలో పాల్గొన్నాడు. నేవీ విభాగంలో బాక్సర్ అనే ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లో మూడేళ్లు వున్నాడు. ఒకసారి బాక్సర్ లో పేలుడు సంభవించింది. పీటర్ కు శారీరకంగా గాయాలేవి తగలలేదు కానీ మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. మిలిటరి సర్వీసు తరువాత రోడియో(గుర్రపు స్వారీ, దూడల మెడలో తాడువెయ్యడం వంటి భాగాల్లో కౌ బాయ్స్ మధ్య పోటీలు), బాక్సింగ్ వంటి ఆటలతో కొన్నేళ్లు గడిపి, చికాగోలోని గుడ్ మన్ స్కూల్ ఆఫ్ థియేటర్లో చేరాడు. అటు తరువాత షేక్స్పియర్ నాటకాల్లో సహాయ నటుడిగా పని చేశాడు. ఆ సమయంలో సూసన్ బెకర్ అనే అమ్మాయిని 1958 లో పెళ్లిచేసుకున్నాడు. వాళ్లకు కారెన్ వాండెన్ అని ఒక పాప.అదంతా సరే, ఇంతకు పీటర్ ను ఇక్తొమిగా ఎందుకు పరిగణిస్తున్నాం?

నేటివ్ అమెరికన్ సమస్యలు, చరిత్ర, యూరో ఎకనామిక్స్ పై ఎంతో అవగాహనతో పీటర్ తన పాటలకోసం ఎంచుకున్న అంశాలు తెలిసిన వాళ్లు 1950లలో చాల తక్కువ. యుద్ధంలో పాల్గొని, అమెరికా జెండా ఎగరవేసిన ఐరా హేయ్స్ గురించి చాలామందికి తెలుసు కానీ, అతని తెగ ప్రజలు వ్యవసాయం చేసుకోవడానికి వీలు లేకుండా నీళ్లపై వారి హక్కులను హరించిన సంగతి చాలా కొద్దిమందికే తెలుసు. హైస్కూల్ చదువు మధ్యలో వదిలేసిన పీటర్ కు ఈ విషయాలు తెలియడం ఆశ్చర్యమే. అంతేకాదు, పర్యావరణ విప్లవం (Environmental Revolution) అనేది1963లో రేచల్ కార్సన్(Rachel Carson) రాసిన “ద సైలెంట్ స్ప్రింగ్” (The Silent Spring) అనే పుస్తకంతోనే మొదలైందని అంటారు. కాని, “పర్యావరణం” అనే మాట పుట్టక ముందే 1932 లో “బ్ల్యాక్ ఎల్క్ స్పీక్స్” (Black Elk Speaks) అనే పుస్తకంలో, 1950లలో పీటర్ రాసి పాడిన పాటల్లో… పర్యావరణానికి సంబంధించిన విషయాలున్నాయి.

“కయోటీ, నా చిన్ని తమ్ముడా” (Coyote, my little brother) అనే పాటలో “ఆకాశాన్ని విషపూరితం చేశారు, కొండలను విషపూరితం చేశారు… అయినా మిగిలిన కయోటీలు పాడుతున్నారు, మానవాళిని హెచ్చరిస్తున్నారు… పాట వినడానికీ, పాట పాడడానికి ఇకముందెవరూ వుండరు. వసంతం ఇక ఎప్పటికీ రాదు.” అంటాడు పీటర్. రేచల్ కార్సన్ పుస్తకం పేరు “ద సైలెంట్ స్ప్రింగ్” కు ఈ కవిత మూలం అయితే ఆశ్చర్యం లేదు.

“రేడియోఆక్టివ్ ఎస్కిమో” (Radioactive Eskimo) అనే పాటలో… విషం ప్రపంచం మారు మూలలకు ఎలా పాకిందో చెప్తాడు: “హురే! రేడియోఆక్టివ్ అమ్మ, రేడియోఆక్టివ్ చెల్లి, రేడియోఆక్టివ్ అన్న వున్న నేను రేడియో ఆక్టివ్ ఎస్కిమోను.. నువ్వు చాలా బాగున్నావు, నిన్ను చులకన చెయ్యాలని లేదు. కానీ మాలో వున్నంత రేడియోఆక్టివ్ కౌంట్ ఇంకే ఊరిలోనూ వుండదు…. నా భార్య మా పిల్లలకు పాలివ్వలేదు. పాలు క్యాన్లలో రావలసిందే. నా భార్య రేడియోఆక్టివ్ మరి…“

“టేక్ బ్యాక్ యువర్ ఆటం బాంబ్ “ (Take Back Your Atom bomb) అనే పాటలో “మీ ఆటం బాంబు మీరు వెనక్కి తీసుకోండి, మా బాణాల్ని మాకిచ్చెయ్యండి, దేవుడి కన్ను న్యూట్రాన్ మీద వుంది, పిచ్చుక మీద కూడా వుంది … విషపదార్థాలతో బరువెక్కిన మీ వానను మీరు వెనక్కి తీసుకోండి/ మా ఆకాశాన్ని మాకు ఇచ్చెయ్యండి/ స్వచ్చమైన ఆకాశం మాకు ఇష్టం. మాకిప్పుడిప్పుడే గుడ్ బై చెప్పాలని లేదు” అని అర్థిస్తాడు.

పీటర్ లో నేటివ్ అమెరికన్ రక్తం వుందని అంటారు. అది ఎంత వరకు నిజమో తెలీదు. నర్రగాసెట్ తెగకు చెందినవాడని కొందరు, పీమా తెగకు చెందినవాడని కొందరు అంటారు. ఏది ఏమైనా, తనలో నేటివ్ అమెరికన్ రక్తం వుందని పీటర్ కూడా నమ్మాడు. తనలాంటి వాళ్లను ఇటు తెల్ల ప్రపంచం, అటు నేటివ్ అమెరికన్ ప్రపంచం ఎలా దూరం పెట్టి బాధ పెడతాయో కొన్ని పాటల్లో చెప్తాడు. అందులో ఒకటి “వైట్ గర్ల్” (White Girl) అనే పాటలో కేవలం తనో నేటివ్ అమెరికన్ అయినందుకే తనను వదిలివెళ్లిపోయిన ఒక తెల్ల అమ్మాయి గురించి చెప్తాడు, “బంగారు రంగు జుట్టు గల ఆ అమ్మాయి నా ఇంటికి వచ్చింది. ఆమెను ప్రేమించొద్దని మా వాళ్లు చెప్పినా నేను వినలేదు…. వెళ్లిపోయేముందు ఆమె నాదగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది. నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను బాధపెట్టలేను గాని, నిన్ను ఒక ఇండియన్ను పెళ్లిచేసుకోనని చెప్పింది, తన చెయ్యి అడిగినందుకు కృతజ్ఞతలు తెలిపింది. నేను చచ్చిపోయుండకూడదూ” అని బాధపడతాడు.

అప్పటివరకు ఎవరూ పట్టించుకోని సమస్యల పట్ల అవగాహన వుండి ధైర్యంగా పాటలు రాసి, పాడడమే కాక ఫయిర్ (ఎఫ్. ఎ. ఐ. ఆర్ – Federation of American Indian Rights) అనే సంస్థను అర్గనైజ్ చేసినందుకు ఎఫ్.బి.ఐ పీటర్ను వెంటాడి వేటాడింది. పీటర్ చనిపోవడానికి కొన్ని నెలల ముందు ఎఫ్.బి. ఐ. ఒక అర్థరాత్రి న్యూ యార్క్ లోని అతని అపార్ట్మెంట్ ను వెతికే మిష మీద పీటర్ రాసుకున్న కాగితాలను చెల్లాచెదురు చేసి, చించేశారు.

పీటర్ అక్టోబర్ 27, 1965 లో 34 వ ఏట చనిపోయాడు. అతని మరణానికి ఎన్నో కారణాలు చెప్తారు. స్ట్రొక్ వల్ల అని, తాగుడు వల్ల అని, డ్రగ్ ఓవర్ డోస్ వల్ల అని, మణికట్టు కోసుకొని… ఇలా ఎన్నో కారణాలు, ఏది నిజమో తెలియదు. ఒక వాగ్గేయకారుడిగా తన చుట్టూ జరుగుతున్న సంఘటలను పాటలు కట్టి పాడాడు. పీటర్ చనిపోయిన తరువాతనే అతని పాటల్లో ప్రస్తావించిన అంశాలపై అనేక చర్చలు జరిగాయి, పరిశోధన పుస్తకాలు ప్రచురితమయ్యాయి. అంతగా చదువుకోని అయనకు ఇన్ని విషయాలపై అంతలోతైన అవగాహన వుండడం అశ్చర్యకరం.

జానీ క్యాష్ (Johnny Cash), బాబ్ డిలాన్ (Bob Dylan), పీట్ సీగర్ (Pete Seager) వంటి హేమాహేమీలు పీటర్ రాసిన ‘బాలడ్ ఆఫ్ ఐరా హేయ్స్ “ పాట విని, నేటివ్ అమెరికన్ సమస్యల పట్ల ఆసక్తి చూపి వారి గురించి పాటలు పాడారు. ఈ పాటనే కాక పీటర్ రాసిన ఎన్నో పాటల్ని పాడారు. కానీ పీటర్ గొంతులో వున్న బలం ఇంకెవరి గొంతులోనూ వుండదు. పాటలోని మాటను హైలైట్ చెయ్యడం పీటర్ ప్రత్యేకత. దాదాపు అదే కోవకు చెందినవాడు జానీ క్యాష్. ఇద్దరి గొంతుల్లో అదే ఆర్తి. పీటర్, జానీ క్యాష్ ను ఎంతగానో ప్రభావితం చేశాడు. జానీ క్యాష్ , ఐరా హేస్ తల్లిని కలిసి పీమ తెగ గురించి ఇంకా లోతుగా తెలుసుకున్నాడు. “బిట్టర్ టియర్స్” అనే ఆల్బమ్ లో పీటర్ వే ఐదు పాటలు పాడాడు. కానీ నేటివ్ అమెరికన్ సమస్యల పట్ల ఆ కాలంలో ఎంత అసహనం వుండేదంటే జానీ నంబర్ వన్ గాయకుడిగా వున్న ఆ సమయంలో కూడా ఆల్బంలో ఆయన పాడిన “బాలడ్ ఆఫ్ ఐరా హేయ్స్” ను వినిపించడానికి ఏ రేడియో స్టూడియో ముందుకు రాలేదు. కానీ తానే స్వయంగా DJ లతో ప్రమోట్ చేయించి ఈ పాటను మ్యూజిక్ చార్ట్స్ లో మూడవ స్థానానికి, ఆల్బమ్ ను రెండవ స్థానానికి లాక్కెళ్లగలిగాడు. ఆ పాట, ఆ ఆల్బమ్ అంత ముఖ్యమని ఆయన అనుకున్నాడు మరి.

జానీ క్యాష్ నే కాక ఎంతో మందికి దారి చూపిన పీటర్ రాసిన “బాలడ్ ఆఫ్ ఐరా హేయ్స్” కు స్వేచ్చానువాదం:

ఐరా హేయ్స్! ఐరా హేయ్స్!

తాగుబోతు ఐరా హేయ్స్ అని పిలిచి చూడు
పలకడు
తాగుబోతు ఇండియన్ అన్నా, లేక
యుద్ధానికి వెళ్లిన సైనికుడన్నా పలకడు

రండి, ఇలా దగ్గరికి వచ్చి వినండి, మీకో కథ చెబుతాను
ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన ఒక యువ సాహసి గురించి చెబుతాను
అరిజోనా లోని ఫీనిక్స్ లోయను
దున్నిన ఘనమైన పీమా తెగకు చెందినవాడతడు

కుంటల్లో నీళ్ళు వేల సంవత్సరాలుగా
ఐరా జనాలకు పంటలు పండించాయి
తెల్లవాడు వచ్చి నీటిపై హక్కులు హరించాడు
ఆ నీళ్ల తళ తళ ఆగిపోయింది

అప్పుడు ఐరా తెగ ఆకలికి అలమటించింది
వాళ్ల నేలలో కలుపు మొక్కలు మొలిచాయి
యుద్ధం వచ్చినప్పుడు, ఐరా యుద్దంలో చేరాడు
తెల్లవాడి అత్యాశను మరచిపోయాడు

ఇవో జిమా కొండ మీద యుద్ధం చేశారు
రెండువందల యాభై మంది వీరులు
చివరికి ఇరవై ఏడుగురు మాత్రమే
ప్రాణాలతో కొండ దిగి వచ్చారు

యుద్ధం ముగిసిన తరువాత
విజయపతాకాన్ని ఎగరేసినప్పుడు
దాన్ని ఆకాశానికి ఎత్తిపట్టుకున్నా వాళ్లలో
ఉన్నాడొక ఇండియన్, అతనే ఐరా హేయ్స్

ఐరా వీరుడిగా తిరిగివచ్చాడు
ప్రజలంతా పొగిడారతన్ని ఘనంగా
అతని గురించి ఉపన్యసించారు, గౌరవించారు
అందరూ అతనితో కరచాలనం చేశారు

కానీ అతనొక మామూలు ఇండియన్
నీళ్లు లేవు, పంటలు లేవు, ఆశ లేదు
ఇండియన్లు చివరిసారి ఎప్పుడు నృత్యం చేశారో
ఇంటి దగ్గర ఐరా ఏం చేశాడో ఎవరికీ పట్టింపు లేదు

ఇక ఐరా తాగుబోతయ్యాడు
ఎన్నోసార్లు జైలే అతని ఇళ్లయింది
జెండాను ఎత్తి దించనిచ్చారతన్ని
కుక్కపిల్లకు ఎముక ముక్క విసిరినట్లు!

తాను యుద్ధం చేసి కాపాడిన నేలలో
ఒక పొద్దుటిపూట తాగుతూ చచ్చిపోయాడతను ఒంటరిగా
రెండు అంగుళాల మేరకు నీళ్లు నిండిన గుంట
ఐరా హేయ్స్ సమాధి అయ్యింది

సరే, తాగుబోతు ఐరా హేయ్స్ అనే పిలవండి
అతను తిరగాడిన నేల మాత్రం ఎండిపోయే వుంది
ఐరా చనిపోయిన గుంటలో పడివుంది అతని ఆత్మ
ఎడతెగని దాహంతో

**** (*) ****