కథ

గూడు రిక్షా

డిసెంబర్ 2015

రాత్రి పదకొండు దాటింది. పరిషత్ పోటీలలో ఆఖరినుంచి రెండో నాటకం మొదలైంది. ఓపెన్ గ్రౌండ్. జనం పల్చగా ఉన్నారు. మంచు కూడా పలచగా రాల్తోంది.గ్రౌండ్ బయట ఒక గూడు రిక్షాలో కూర్చుని నాటకాన్ని చూస్తున్నాడు వీరయ్య. అసలు అతను ఈ పాటికి రోజూ ఇంటికి వెళ్ళి పోయి పడుకునే వాడే కానీ, అతనికి చదువు లేకపోయినా సంగీతం, పద్యాలు పాటలు అంటే కొంచం ఇష్టం. దాని వల్ల ఇంట్లో లచుమమ్మకి చెప్పి ఇక్కడ కూర్చుని నాటకాన్ని చూస్తున్నాడు.పెద్దగా ఏమి సాగటం లేదు, నాటకం నాటకీయంగానే ఉంది అంతా. వీరయ్య గట్టిగా నిట్టూర్చి, జేబులోంచి సగం కాల్చిన బీడి తీసి, రెండు చేతులతో బాగా నలిపి, వేడి చేసి వెలిగించే ప్రయత్నం చేస్తున్నాడు.

మొత్తానికి నాటకాలన్నీ పూర్తయ్యాయి. సమయం సరిగ్గా పన్నెండు. మెల్లిగా మరో బీడి తీసి వెలిగించి, రిక్షా బ్రేకుకున్న బ్రేక్ రబ్బర్ తీసి ముందుకి పోనిచ్చాడు మెల్లిగా. ఉన్న కొంత మందీ వెళ్ళి పోతున్నారు, వీరయ్య ఇంకా అక్కడే నిలబడి చూస్తున్నాడు.

ఈ లోగా హార్మోనియం పెట్టెలు , నాలుగైదు ట్రంకు పెట్టెలు మోసుకుంటూ ఒకతను వచ్చి “ హైవే దాకా వెళ్ళాలి వస్తావా?” అని అడిగాడు.

“ఎంతమంది?”

“నలుగురం, ఈ సామాను. కిరాయి ఎంతో చెప్పూ” అన్నాడు.

వీరయ్య అతనివంక చూసి, “వెల్దాం, నలుగురికి యాభై రుపాయిలవుద్ది” అన్నాడు.

“సరే” అని సామానంతా సర్దడం అయ్యాక రిక్షా బయలుదేరింది.

“ఇంటికి పోకుండా ఇప్పటిదాకా ఆగి చుశావా నాటకాలు?ఎలా ఉన్నాయ్?” అని అడిగాడు బేరం కుదుర్చుకున్న కళాకారుడు.

“బానే ఉన్నాయి. నాటకాల మీద ప్రేమ కొంతా , కిరాయి డబ్బులమీద ఆశకొంత. పైగా ఈ దారిలోనే మాఇల్లు. అందుకే ఒప్పుకున్నా, లేకుంటే ఇంతసేపు ఉండే వాడినేకాదు” అన్నాడు వాళ్లని దింపేసి మెల్లిగా ఇంటికి వెళ్ళాడు వీరయ్య.

ఇంటికి వెళ్ళి మెల్లగా తడిక తలుపు తీసి అలికిడి రాకుండా అడుగు పెట్టాడు , లచ్చుమమ్మ నిండా దుప్పటి కప్పుకుని మునగదీసుకుని పడుకుంది , నిట్టాడికి వేలాడదీసిన రేడియో కట్టేయ లేదనుకుంటా గుయ్ మని శబ్దం చేస్తో౦ది ,వీరయ్య మెల్లగా రేడియో కట్టి లచ్చుమమ్మ పక్కనే పడుకున్నాడు.

“రేపు పొద్దున్నే అయిదింటికే లెగాలి మామా , పేడ తెచ్చి ఇల్లంతా అలకాలి , కట్టెలు తెచ్చి కాసిన్ని అరిసెలు వండాలా ? పిల్లలు పండక్కి వస్తున్నారు కదా” అని చెప్పి మళ్ళీ పండుకుంది లచ్చుమమ్మ.

ఎంతో ప్రశాంతంగా అప్పటిదాకా చూసొచ్చిన నాటకాన్ని నెమరేసుకుంటున్న వీరయ్య ఒక్కసారిగా తేరుకున్నాడు.

“ఎంత పిచ్చిది. ఉన్నది ఒక్కగానొక్క కూతురు , మొన్ననే పెళ్ళై వెళ్ళిపోయింది. అల్లుడికిది తొలి పండగ. వచ్చేది వాళ్ళిద్దరే కాని పిల్లలు వస్తున్నారు అంటుంది అల్లుడిని కొడుకనుకుంటుందేమో” అని గాఢంగా నిట్టుర్చి నిద్రలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

కాని నిద్ర పట్టడం లేదు.. మొన్ననే ఉన్న కాస్త జాగా అమ్మి పెళ్ళి చేసేశాడు తన వద్ద ఉన్న డబ్బుకి కొంచం ఘనంగానే పెళ్ళి చేశాడు. ఇప్పుడు అల్లుడు మొదటి పండక్కి వస్తున్నాడు , వస్తే పర్వాలేదు కాని ఏదైనా కొనిమ్మని అంటే ఎలాగా ఆలోచిస్తున్నాడు. ఈ గూడు రిక్షా తప్పా మరే ఆదాయ వనరు లేదిక తనకి. అలాగే ఆలోచిస్తూ కలతగానే నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి ఏవో అరుపులు, కేకలు తన్నుకున్నట్టు ఏడుపులు, అన్నీ తెలిసిన గొంతులు లాగనే ఉన్నాయి. కానీ రాత్రంతా నిద్ర లేకపోవడం వలన లేవలేకపోయాడు. కాసేపాగినాక లేవక తప్పలేదు.

“ఏంటమ్మా? నాన్న ఇంకా లేవలేదు, రాత్రి పడుకోలేదా ? పొద్దున్నే బండికి వెళ్ళడం లేదా ? పొద్దున్నే బడిపిల్లని తీసుకెళ్లాలిగా?” అని గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలమీద ప్రశ్నలేస్తునే ఉంది పార్వతి.

ఒక కాలు విరిగిన కుర్చీ కింద రాయి పెట్టి సరిచేసి అల్లుడిని అందులో కుర్చోమని చెబుతో౦ది లచ్చుమమ్మ. ఇంక లేవక తప్పింది కాదు వీరయ్యకి . ముందు కూతురిని చూసి కళ్లతోనే పలకరించి , లుంగీ సరిచేసుకుంటూ బయటకి వచ్చి
“ఏం బాబు, బాగున్నారా ? అమ్మ నాన్నా అందరు బాగున్నారా?” అని పలకరించి, “రాత్రి నాటకాల పోటీ చూడడానికి వెళ్ళానమ్మా, ఈ మూడు రోజులు పిల్లల బడులకి సెలవలు”అని చెప్పి ఒక వేప్పుల్ల విరిచి రంగారావు టీ కొట్టు వైపు నడిచాడు అల్లుడిని తీసుకుని.

ఇద్దరు తిగొచ్చేసరికి తల్లీ కూతుళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి. వాళ్ళకి తెలిసిన విషయమే అల్లుడు తనకి ముందే చెప్పడం తో మెల్లిగా కూతురి తల నిమిరి లోపలికి వెళ్లాడు వీరయ్య. అతని వెంటే లచ్చుమమ్మ వెళ్ళి, “ఏమయ్యో మనమ్మాయి…” అని చెప్పెంతలోపే, “తెలుసు” అని మౌనంగా తలాడించాడు.

“ఏంటయ్యా, ఒక సంతోషం లోకూడా నవ్వవు” అని కసిరి తన పనిలో నిమగ్నమైంది.

వీరయ్య కి లోపల్లొపల చాలా సంతోషంగానే ఉంది కాని ఆ సంతోషాన్ని అల్లుడు అడగబోయే కోరిక అణిచేస్తూ౦ది. మెల్లిగా రిక్షా తీసుకుని రోడ్డెక్కాడు. కొంచం దూరం వెళ్ళగానే ఇస్మాయిల్ ఎదురయాడు.

వీరయ్యని ఆపి, “వీరయ్యా అలా బ్యాంకు దాకా పొనీ, పించను వచ్చిందేమో చూడాల” అన్నాడు.

“ ఎక్కండి” అని చెప్పి బ్యాంక్ దాకా వెళ్లారు ఇద్దరూ. ఇస్మాయిల్ దిగి ఒక అయిదు కాయితం వీరయ్యకి ఇవ్వబోయాడు. “అదేంటి ఇస్మాయిల్ గారు?ఈ కొంచం దూరానికే అయిదు రూపాయలా? ఏమివద్దులే “అని నవ్వుతూ వెళ్ళి పోయాడు వీరయ్య.

“ఈ పూట బేరం బాగానే ఉంది ,కాని…” కూతురూ అల్లుడూ వచ్చారని కొన్ని పూలు , కొన్ని స్వీట్లు తీసుకుని ఇంటికి వచ్చేశాడు… ఇంటికొచ్చేసరికి అరిసెలు వండడం పూర్తయింది అనుకుంటా, అల్లుడుకి రుచి చూపిస్తున్నారు.

వీరయ్య కూడా ఓ రెండు తిని అల్లుడితో కబుర్లాడుతున్నాడు.

ఈ లోగా లచ్చుమమ్మ “మామా ఓ సారి ఇటొచ్చిపో” అని కేకేసింది. అతను లోపలికి వెళ్ళడం, కూతురు బయటకి రావడం ఒకే సారి జరిగాయి. మనసేదో కీడుని శంకించింది.

“ఏంటే అమ్మాయి ఏం చెప్పింది?” అంటూ ఆరా తీశాడు గుమ్మంలో నుంచే. “మరీ… మరీ…” అంటూ లచ్చుమమ్మ నసగ సాగింది.

వెంటనే వీరయ్య “చూడు ఏదైనా సరే నాకు చెప్పు ఆర్చాల్సింది , తీర్చాల్సింది నేనే కదా” అని అనే సరికి పార్వతి సరాసరి లోపలికి వచ్చి
“ఏమీ లేదు నాన్నా, ఈయన ఇంటినుంచి ఫ్యాక్టరీకి వెళ్ళడానికి సైకిల్ బాగా ఇబ్బంది పెడుతూ౦ది అందుకని ఒక టీవీయెస్ కొనుక్కుంటాను, అంటున్నారు.

కొత్తదేం కాదు పాతదే, కాని దానికి ఆయన దగ్గర ఒక అయిదు వేలు తగ్గాయి అందుకే మిమ్మల్ని అడగమన్నాడు” అని చెప్పేసి వెంటనే బయటకి వెళ్ళి పోయింది.

వీరయ్యకి విషయం అవగతమైంది. తాను “ఎప్పుడా, ఎప్పుడా “ అని ఎదురుచూసిన ఘడియ వచ్చేసింది. ఇప్పుడు తనముందున్న లక్ష్యం మూడు రోజుల్లో అయిదు వేలు, వెంటనే కుతురుని పిలిచాడు.

“ఏమ్మాఇప్పుడే కావాలా? నాలుగు రోజులు ఆలస్యం అయినా పర్వలేదా?” అని అడిగాడు.

“అదికాదు నాన్నా, మీరు పండగలోపు ఇస్తే, ఇక్కడే ఒకటి కొనుక్కుని దానిమీదనే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పారు ఈయన” అని అంది. గుండె కలుక్కు మంది వీరయ్యకి.

వీరయ్యది చిన్నప్పటినుండి కొంచం మెతక మనస్తత్వం. ఊరకనే కోపం రాదు, మాటపడలేడు, రాజీ అంతకన్నా పడలేడు. అందుకే ఇంతవరకు ఎక్కడా అప్పుపడ్డ దాఖలాలు లేవు. మాటంటే నిక్కచ్చి. అందుకే అతనంటే ఆ కాలని వాళ్ళకి కొంచం నమ్మకం. కాని నమ్మకాలమీద , నిజయితిమీద నడిచేకాలం కాదు కదా ఇది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నప్పుడే ఆ మాటకి విలువ ఉంటుంది ఇచ్చిన వ్యక్తికి వ్యక్తిత్వం ఉంటుంది అని నమ్మే వ్యక్తి వీరయ్య. ఇప్పుడు ఇంక బుర్ర నిండా ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి. తనకి రోజూ ఆదాయం ఎంతా ? ఇంట్లో ఖర్చు ఎంతా ? అని ఆలోచిస్తూ పైకి చూసాడు.

సూరీడు కంట్లో పడ్డాడు ఇల్లు కప్పించాల్సిన పరిస్తితి ఉంది. వానొస్తే కురవకుండా ప్లాస్టిక్ పట్టాఒకటి ఇంట్లో కట్టి ఉంచాడు. వానొచ్చినప్పుడు కట్టడం , లేనప్పుడు మడతపెట్టి పక్కన పెట్టడం. ఈ తంతు ముగించి కప్పాలంటే కనీసం ఒక మూడు వేలవుద్ది. తాటాకుకి కప్పిన కూలీలకి కలిపి ఇవన్నీ ఒక పక్క, కూతురు కోరిక ఒక పక్కా. ఆ పూట మధ్యానం అన్నంకూడా తినకుండా బండి తీసుకుని రోడ్డెక్కాడు.

సాయంకాలానికి ఒక అయిదొందలు సంపాదించాడు. ఈ రోజు ఆఖరు రోజు నాటకాలకి. అన్ని అయిపోయి బహుమతులు అందుకున్న వాళ్ళు, రాక తిట్టుకుంటూ వెళ్ళి పోతునవాళ్ళు అందరిని చుస్తూ, ఏమైనా కిరాయి గిడుతుందేమో అని ఎదురు చూశాడు. ఏమంత ఆశాజనంకగా లేదు పరిస్తితి. కొంచం దూరం వెళ్ళగానే నైటు రిక్షా వేసే దుర్గా రావు ఎదురొచ్చి, “ఏంటి మామా అణ్ణానికి కూడా పోకుండా ఉన్నావంటా ? అక్క నిన్ను వస్తే గుడి కాడికి రమ్మంది. అణ్ణం ఆడకే తెత్తానంది. అయినా ఏంది మామ అన్ని తెల్సినోడివి ఆ ఇల్లు అట్టా వదిలేత్తే ఎట్టా సెప్పు? మొన్నొచ్చి జూసినా. పైనుండి నుసి రాల్తా ఉండాది. ఒక మూడు వేలు యాడా నీకు అప్పు పుట్టలేదా? ఏందో పెద్ద పిల్ల పెళ్ళిజేయంగనే నీ బరువు తీరిందని సంబరపడమాక. ముందు ఆ ఇల్లు సంగతి కూడా కాస్త జూడు. ఏ ఇల్లో ఏమో! మూడో మనిషి కాళ్ళ జాపుకోవాడనికి లేని ఇల్లు. ఎవుళ్ళన్న వత్తే, మీరు ఈడ గుళ్ళో, ఆళ్లేమో ఆడ మీ ఇంట్లో” అంటూ విసురుగా వెళ్ళి పోయాడు దుర్గారావు. తనని హెచ్చరించాడో, తిట్టాడో అర్ధం కాలేదు వీరయ్యకి. పాపం లచ్చుమమ్మ కుతురుకి ,అల్లుడికి అన్ని సిద్దం చేసి గుళ్ళో పడుకోవడానికి వెళ్ళుంటుంది. తనెళ్లేదాకా అన్నం తినదు. ఓ మారు కనపడదామని గుడి వైపు పోనిచ్చాడు బండి. గుడంతా నిశబ్దంగా ఉంది. రెండు స్థంభాల ఓరగా లచ్చుమమ్మ పడుకుని ఉంది, తలగడ దగ్గర అణ్నం క్యారేజి ఉంది. కడుపు తరుక్కు పోయింది వీరయ్యకి. కన్నీళ్ళు పై గుడ్డతో తుడుచుకుని వెళ్ళి లేపాడు.

“ఏంది మామా ఇది? యాడికి పొయినావు తిండి తిప్పలు లేకుండా. అయినా కూడు మానితే డబ్బులొత్తయా ?” అని అన్నం మూతలో పెట్టింది.

కాసేపయాక “ఏందిమామా, యాడైనా దొరికే జాడుండాదా డబ్బులు?” అని అడిగింది. వీరయ్య మౌనంగానే ఉన్నాడు.

“రేపు గురువారం వడ్డీలకిచ్చే వాళ్ళ దగ్గర తీసుకుందామా” అని “వద్దులే, పొద్దున్నే పెద్ద గొడవయింది ఇత్తానన్న డబ్బులు ఇయ్యలేదని తన్ని పోయారు కొమరయ్యని” అని చెప్పింది. పొద్దున గొడవకి కారణం అదేనని అప్పుడు అర్ధమయింది వీరయ్యకి.

“ఒక అయిదు వేలడుగు మాలచ్చిమిని రేపు పొద్దున్నే, గడువు ఒక మూడు నెల్లు పెట్టు. ఈలోగా ఎలగోలాగా తీర్చేద్దాం” అన్నాడు.

“అట్టాగే ఇంక పండుకో మామా తెల్లారి ఆలోచిద్దాం కాని” అంది.

గర్భ గుడిలో దేవుడి వంక చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు వీరయ్య.

పొద్దున్నే అన్నీ అనుకున్నట్టే జరిగాయి. డబ్బులు దొరికాయి. బజారుకి వెళ్ళి ఒక సెకండ్ హ్యాండ్ టీవీయెస్ కొనుకొచ్చారు. వస్తూనే దానికి పూజలూ , పులదండలూ వేసేసారు. చూస్తునే పండగ పుర్తయింది. అల్లుడు కూతురూ , కళ్ళముందే బండి మీద వెళ్ళి పోయారు.

పండగైతే అయిపోయింది కాని, బాకీ మిగిలిపోయింది వీరయ్య కి. అదొక్కటే దిగులైంది. తాను రోజూ సంపాదించేది ఇంట్లోకి సరిపోతుంది. కాని ఎలా ఇంకో రెండునెలల్లో తను ఆబాకి తీర్చాలి? తీరిస్తే కొత్త బాకి పుట్టుద్ది. ఇల్లు కప్పించుకోవచ్చు. లాభం లేదు ఇలా బతికితే అని ఆలోచిస్తూ ఉండేవాడు.

ఒకానొక అర్ధరాత్రి తలుపు కొడుతున్నారెవరో, తడిక తలుపు మీద శబ్దం. ఎక్కడో లోతుగా వినబడుతో౦ది. వీరయ్య దిగ్గున లేచి బయటకి వచ్చాడు. అప్పటికే ఎవరో వెళ్ళిపోతున్న అలికిడి విని “ఎవరూ?” అని అడిగాడు.

ఇస్మాయిల్ కొడుకు వీరయ్య, “అంకుల్ అక్కకి నొప్పులు మొదలయ్యాయి. ఇప్పుడు గాడీ ఎక్కడా దొరకలేదు. నాన్న మిమ్మల్ని తెమ్మని పంపాడు” అని చెప్పాడు. వెంటనే బండి తీశాడు వీరయ్య.

అక్కడికి వెళ్లేసరికి పరిస్తితి కొంచం విషమంగానే ఉంది. ఇస్మాయిల్ కంగారుగా ఉన్నాడు. వీరయ్య రెండు చేతులు పట్టుకుని “నీవే దిక్కు” అన్నాడు.

వెంటనే వీరయ్య వాళ్ళని తీసుకుని ఆసుపత్రికి బయలుదేరాడు. మొత్తానికి క్షేమ౦గానే వెళ్ళారు. అందరూ ఆనందంలో ఉన్నారు. ఇస్మాయిల్ వీరయ్య దగ్గరకి వచ్చి “ వీరయ్యా, నువ్వు లేకపొతే ఈ నవ్వు లేదు చూడు, మళ్ళీ ఒక మనిషి మా కుటుంబంలోకి వచ్చింది. కోట్లు సంపాదించినా మా కుటుంబాలలో ఆనందం ఉండదు. ఆ అల్లా చెప్పినట్టుగా ఒక ప్రాణి పుడితే మాకు చాలా సంతోషం. అల్లా చెప్పింది కుడా అదే. భూమిని నింపమని. కాబట్టి ఈ ఆనందానికి అవధులు లేవు” అని చెప్పి ఒక యాభై రుపాయల నోటు వీరయ్య జేబులో పెట్టాడు.

వీరయ్య ముఖం లో నవ్వు లేదు. ఏదో పోగొట్టుకున్న దిగులు అగపడుతో౦ది. ఇస్మాయిల్ కి అనుమనం వచ్చి “ వీరయ్యా ఏమైనా ఇబ్బందా?” అని అడిగాడు అది…. అది….. అని నసుగుతూనే “యాభై చాలవు భాయి, కిరాయి రెండొందలు ఇప్పించండి” అన్నాడు.

ఇస్మాయిల్ ఆశ్చర్యపోయాడు. “వీరయ్యా నువ్వేనా అడిగేది?” అని చూసి మళ్ళీ జేబులోంచి డబ్బు తీసి ఇచ్చేశాడు.

వీరయ్య మెల్లిగా అక్కడ నుంచి వచ్చేశాడు. మెల్లిగా కిరాయి రేట్లు పెంచసాగాడు. రూపాయి దగ్గర మూడు రూపాయలు తీసుకుంటున్నాడు. వారం వారం అనుకున్న సమయానికి వడ్డీ డబ్బులు ఇచ్చేస్తున్నాడు. వారాలతనికి ఇతనిమీద నమ్మకం కుదిరింది.

“పొనీలే వీరయ్య మూడునెలలు కాకపొతే ఇంకో రెండునెలలు తీసుకో, ఏముంది మొత్తం ఒకేసారి ఇచ్చెసెయ్” అన్నాడు. ఆ మాటతో వీరయ్యకి కొంత బలం చేకూరింది. తెల్సినవాళ్ళనిలేదు, తెలీని వాళ్ళనిలేదు. ఎక్కడైనా ఒకటే కిరాయి చెప్పేస్తున్నాడు. అదేమని అడిగితే “ఇష్టముంటే రండి. లేకుంటే లేదంటున్నాడు” మొత్తానికి అనుకున్న సమయానికి ఒక నాలుగువేలు పోగుపడ్డాయ్. “హమ్మయ్యా” అనుకున్నాడు. ఇంకా కొంత డబ్బు జమేస్తే అప్పుకి పోగా మరి కొంత ఇంటికి పనికొస్తుందని ఆశగా అధిక కిరాయి చెప్పడం మొదలెట్టాడు. హటాత్తుగా జనం కిరాయికి వీరయ్యని పిలవడం మానేశారు. కిరాయి ఎక్కువ అని, తల పొగరు పెరిగిందని, తలో రకంగా మాట్లాడు కోవడం మొదలెట్టారు. వీరయ్య కళ్ళముందే ఇస్మాయిల్ ఇంకో రిక్షా మాట్లాడుకుని వెళ్లడం వీరయ్య చూశాడు కూడా. కానీ తన అవసరం తనది అని సర్ది చెప్పుకున్నాడు. అలా రోజులు వెళుతున్నాయి.

ఒక రోజున స్కూల్ పిల్లల్ని దింపేసి వచ్చేదారిలో, రిక్షా గోతిలో పడింది. వెనక చక్రం బెండ్ వచ్చింది. ఏదో చిన్న రీపెయిర్ చేయిద్దాం అని సైకిల్ షాప్ కోసం వెదికాడు. ఎక్కడా అగపడలేదు. తలెత్తి చూస్తే నల్లటి ఆకాశం భయపెడుతో౦ది. మెల్లిగా అలాగే తొక్కడం మొదలెట్టాడు. ఇక్కడే వదిలేసి వెళితే మళ్ళీ రేపు ఉదయం ఇబ్బంది. కాని ఓ మూడు కిలోమీటర్లు వెళితే కాని సైకిల్ షాప్ లేదు. అలాగే తొక్కుతున్నాడు. ఈ లోగా వర్షం మొదలైయింది. చుట్టూరా చీకట్లు. ఏమీకనపడడం లేదు. వెంటనే టార్చ్ లైట్ తీసి కాసేపాగుదాం అని చుట్టుపక్కల చూశాడు. ఎక్కడో ఒకచోట బస్టాప్ కనబడి౦ది. “హమ్మయ్యా” అక్కడికి వెళితే చాలనుకుని మెల్లిగా అలగే తడుస్తూ రిక్షా తొక్కడం మొదలెట్టాడు. ఈ లోగా మరోసారి బండి గోతిలో పడింది. ఈ సారి తనొక్కడే లేపలేనంత గొయ్యిలో పడింది. వానకి గండి పడి పడ్డ గొయ్యి అది. ఇరుసేదో విరిగిన శబ్దం వినపడింది. మొత్తానికి బండి అక్కడే వదిలేసి బస్టాప్ కి చేరుకున్నాడు. టైం ఎంతో తెలీడం లేదు కాని, చాలా పొద్దుపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకో గుండే గాబరా పడడం మొదలయింది. లచ్చుమమ్మ ఎలా ఉందో? వానకి ఇల్లు ఎంతకారుతో౦దో? పైన పట్టా తీసి కప్పడం కుదిరిందో లేదో? ఏమైనా తిన్నదో లేదో?, నాకోసమే చూస్తుందేమో సవాలక్ష ప్రశ్నలు అతని మెడడుని తొలుస్తున్నాయి. ఓ అర్ధగంటకి వాన తెరపిచ్చింది. వెంటనే వెళ్ళి, దారిన పోయే వాళ్ళ సాయం తో బండిని పైకి లేపుకుని నడిపించుకుంటూ చౌరస్తా దగ్గరకి వచ్చేశాడు.
అప్పుడే షాప్ కట్టేయబోతున్న ఓ షాప్ లో బతిమాలి తన అవస్త వివరించి బండి చూడమన్నాడు. లైట్లు కూడా ఆర్పేశాం, మా వల్లా కాదన్నారు. కాదని బతిమాలి మళ్ళీ లైట్లు వేయించి పని మొదలెట్టించాడు. చల్లగా ఉంది వాతావరణం.

ఇప్పటిదాకా నేనేమి చేయలేదన్నట్లుగా ఉంది ఆకాశం. మెల్లిగా అడుగు జోబులో దాచుకున్న బీడి కట్ట ని తీసి రెండు చేతులతో నలిపి ఒక బీడి తీసి ఎలగోలాగ వెలిగించి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నాడు. టైం తొమ్మిదే కాబట్టి ఎక్కడైనా కాసింత టీ దొరుకుతుందేమో అని చుట్టూ చూస్తూ అలా కొంచం ముందుకు వెళ్ళబోతుంటే సైకిల్ షాప్ కుర్రవాడు వచ్చి “ మేస్త్రి పిలుస్తున్నాడని” చెప్పాడు. “హమ్మయ్యా, బండి అయిపోయిందని” చెప్పి హుషారుగా అటేపుకెళ్ళాడు.

“ ఏమయ్యా బండి వాడడమేనా? దాని బాగోగులు పట్టిచుకోవా అసలు? ఏముందని బాగుచేయాలి దీన్ని?” అని ఇంతెత్తున లేచాడతను.

“ఏమంది?” అని ఆశ్చర్య పోతూ అడిగాడు.

“ ఏమిలేదులే కాని, ఈ బండి ఇప్పుడు బాగవదు. ఒక వారం పడుతుంది. మొత్తం బేరింగులు మార్చాలి , రెండు రిమ్ములూ పొయాయి. కొత్తవి వెయ్యాలి , ఊచలూ మార్చాలి టైర్లు , ట్యూబులు మార్చాలి మొత్తానికి ఒక మూడు వేలవుతాయి ఉంటే చూసుకో లేకపొతే ఈడనే వదిలేసి రెప్పొద్దున్నే వచ్చి తీసుకుపో అని తేల్చి చెప్పేశాడు. దిమ్మత్రిరిగిపోయింది వీరయ్యకి.

ఇంకో మూడువేలా అలాకాదు ఇప్పటికే ఈ డబ్బులు సంపాదించడానికే నేను పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు అని ఆలోచిస్తూ మౌనం గా ఉండి పోయాడు. ఏదో ఒకటి చెబితే నేను షాప్ కట్టేసుకుంటా అని అతను కసురుతున్నాడు , సరే మేస్త్రి రేపు పొద్దున్నే వచ్చి చూద్దాం లే అని బండి అక్కడే వదిలి ఇంటివైపు వెళ్ళసాగాడు , ఏదో వెలితిగా ఉంది అతనికి కొన్న తరువాత ఇదే మొదటిసారి బండి వదిలేసి ఉండడం. కూతురు పెళ్ళై వెళ్ళి పొయినాక కూడా ఇంత దిగులుపడలేదు బహుశా , కడుపు తీపికన్నా, కడుపు బాధ తీర్చే సాధనం అని కాబోలు, మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ, ఆ బీడి ప్యాకెట్ మొత్తం కాల్చుకుంటూ మెల్లిగా ఇంటి దరిదాపులకి చేరుకున్నాడు , ఒక్కసారిగా ఏదో అలజడి జరుగుతున్నట్టుగా అనిపించి వేగం పెంచాడు. నిజమే తన ఇంటి చుట్టుపక్కలంతా జనం అందరూ తనని వింతగా చూస్తున్నారు ఏమయిందో ఏమి అర్ధం కావడం లేదు తనకి. ఎవరో అక్కడ ఏడుస్తున్నారు చేతిలో బీడి వదిలేసి అటువైపుగా చుశాడు, అతను చూసిన వైపు ఏదో శూన్యం కనపడుతో౦ది అక్కడ ఏదో ఉండాలి. అర్థమై పోయింది. కళ్ళు, మెదడు సహకరించుకుని కన్నీళ్ళు వస్తున్నాయి, హటాత్తుగా లచ్చుమమ్మ జ్ఞప్తికి వచ్చింది. లచ్చుమమ్మా అని పిలిచాడు ఇంకెక్కడ లచ్చుమమ్మా రాత్రి కురిసినవానకి ఇల్లు కురుస్తుందని ప్లాస్టిక్ పట్టా కప్పబోతూ విరిగిన నిట్టాడి కింద పడి సచ్చిపొయింది. ఈ లోగా దుర్గా రావు అక్కడికి వచ్చాడు ఈసడింపుగా ఓ చూపు చుశాడు దానికర్ధం ఇది నువ్వు చేసిన పాతకమే అని …ఇళ్ళ పక్కనోళ్ళ నోళ్ళు పనిచేయడం మొదలెట్టాయి,నడమంత్రపు సిరి వస్తే ఇంతేనని, కళ్ళు నెత్తికెక్కితే ఇలాగే జరుగుతుందని, నరం లేని నాలుకలు అలా సాగుతునే ఉన్నాయి. వీరయ్య నిస్తేజం అయిపొయాడు. ఎక్కడినుండి ఎక్కడికి దిగిపొయాడు. చివరికి తనకంటూ మిగిలిన ఒకేఒక సర్వస్వం లచ్చుమమ్మని కోల్పోయాడు. తెల్లారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఒక వారం పాటు ఎవరితో ఏమీ మాట్లాడలేదు వీరయ్య ఈలోగా బడి ఖాతాలున్న వాళ్ళు వేరే బళ్ళు మాట్లాడేసుకున్నారు.

ఇంత విషాదం అలుముకున్నాక వీరయ్య బండి విషయం ఆలొచించనే లేదు. చివరికి మెకానిక్ కుర్రాడు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు కూలిపొయిన ఆ ఇంటికి ఒక ప్లాస్టిక్ పట్టా కట్టుకుని కూర్చుని దిగాలుగా అగపడ్డాడు వీరయ్య. అతడిని చూడగానే “మేస్త్రీ, ఒకప్పుడు నాకు నా రిక్షానే ప్రాణం. నా కూతురు పెళ్ళై వెళ్ళిపోయినా నాకు బాధ కలగలేదు కాని బండి లేకపొతే నాకు కాలు చేయి ఆడేది కాదు. ఇప్పుడు నాకంటూ తోడుండే నా లచ్చుమమ్మకూడా వెళ్ళిపోయింది పాపం పిచ్చిది. నాతో పాటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేది. “మామా అప్పులు తీరకపొతే పాచి పని చేస్తాని కుడా అని౦ది. కాని ఇప్పుడు నన్నొదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నావొంట్లో సత్తువ లేదు బండి తొక్కే ఓపికాలేదు. నాకూతురి దగ్గరకి వెళ్ళేఉద్దేశము లేదు. ఇక్కడే ఉండిపోతాను. నా బండి లెక్కగట్టు. ఎంతొస్తే అంతిచ్చెయ్. ముందు ఆ వారాలోళ్ళ అప్పు తీర్చాలి. ఇంకా నాకంటూ ఏమిలేదు కదా, ఇక్కడొక ఇల్లుకట్టాలి. దాన్లో లచ్చుమమ్మ ఫోటో పెట్టుకోవాల, బతుకుతా, ఆ ఒక్క కోరిక కోసమైనా బతుకుతా.” అంటూ గట్టిగా ఏడ్వసాగాడు.

మెకానిక్ సాయంత్రం వస్తానంటూ వెళ్లి పోయి సాయంకాలం ఒక నాలుగు వేలు తెచ్చి ఇచ్చి ఇదే నీ బండి ఖరీదు అని వెళ్ళిపోయాడు.

తెల్లారి వారాలతనికి డబ్బుకట్టేశాడు. “తొందరేముంది వీరయ్యా, అసలే బాధలో ఉన్నావ్ ఉంచు” అని అనబోయాడు. “కాదు” అని ఒక దండం పెట్టేసి మౌనంగా ఉండిపోయాడు.

**** (*) ****