యెల్లో రిబ్బన్...

ఇట్లు మీ… (12)

డిసెంబర్ 2015

కార్తీకమాసమంతా శీతలవుదయాల ప్రభాత రశ్మిని అదే పనిగా చూడటం భలే సంతోషాన్నిస్తుంది. దైనందిన జీవితంలో కొన్ని క్షణాలని మనం మన కోసం మాత్రమే అట్టి పెట్టుకుంటాం. మన కోసం జీవిస్తాం. ఆ రశ్మి తనువులోని ప్రతి అణువుని స్పర్శిస్తుంటే, అప్పుడే పుట్టిన తన బిడ్డ వొళ్లంతా తడిమి తోటి మానవుల స్పర్శని తల్లి ఆ పసిప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టు, ఆదిత్యుడు మరలమరల లేత వెచ్చదనంతో మనకి జీవధాతువుని పరిచయం చేస్తున్నట్టు వుంటుంది. అస్సలు విసుగు పుట్టని ఆ సంతోషానుభవపు తీగకి పూసిన చిరునవ్వుల కాంతుల్లో నిశ్చింతగా రోజువారి పనులు మొదలు పెడతాను. నువ్విక్కడుంటే వో ముద్దుని నీ కుడి అరచేతిపై పూయించి స్టాట్ట్యు అని చెప్పి పనికి వెళ్ళిపొతే నువ్వు యిక రోజంతా మరేం పని చెయ్యకుండా ఆ చేతినే చూస్తుండేవాడివి కదా తిరిగి నేను పని నుండి వచ్చే వరకు. :-)

కిక్కిరిసిన రోడ్స్ పై నుంచి కడుతున్న మెట్రో పనుల పక్కగా ఆ ట్రాఫిక్కే వొత్తైన పూలవనాలు అనుకొంటూ కార్ లోని యేసీనే వూటీ చల్లదనంగా భావిస్తూ ఆఫీస్ కి వచ్చేసాను. అప్పాయింట్మెంట్స్ యేమున్నాయో పి. యెస్. చెపుతుంటే ఆమె ఫోన్ మోగింది. సైలెంట్ లో పెడతారు యెప్పుడు. పెట్టటం మరచిపోయారో లేదా ముఖ్యమైన కాల్ మిస్ కాకూడదని అలానే వుంచిందో కాని ఆ కాల్ ని చూడగానే ఆమె కళ్ళల్లో కదిలిన తళక్కు తుళ్ళింత నా చూపులని దాటిపోలేదు. ఆ కాల్ ఆమెకి ముఖ్యమైనదని నాకు స్ఫురించేక ఆమె ఆ కాల్ మాటాడటానికి వీలుని కలిపిస్తూ మళ్ళి పిలుస్తాను యిక తను వెల్లొచ్చు అని చెప్పాను. ఆమె ఫోన్ బటన్ మీద ప్రెస్ చేస్తూనే చటుక్కున బయటకి వెళ్ళింది. మాటాడుతోంది.

నా గది ట్రాన్స్పెరెంట్ గాజు అద్దాల్లోంచి ఆమె హావభావాలు స్పష్టంగా కనిపిస్తూనే వున్నాయి. ప్రేమలు వ్యక్తపరచటానికైనా అందుకోటానికైనా టైం అండ్ స్పేస్ చాల ముఖ్యం కదా. వయ్యస్సుతో నిమిత్తం లేకుండా యెవరి మనస్సుల్లో నైనా నిరంతరం దుమికే నయాగరా జలపాతం ప్రేమ కదా! లేచి నా రూమ్ విండో దగ్గరకి వచ్చి బయటకి చూస్తుంటే కనుచూపు మేరంతా ట్రాఫిక్. యిప్పుడే వెంటనే నిన్ను చూడాలనిపించింది. వొక తుంటరి పిల్లవాని యీలపాటలా యిష్టపడిన వారి నుంచి వచ్చే పలకరింపు బిజీబిజీగా వున్నప్పుడు వస్తుందనుకొంటాను. స్కైప్ లో నిన్ను చూడాలి అనుకున్నాను. నువ్వేమో బిజీ . అలాంటప్పుడు యీపని యీ ప్రోడక్టివిటి అంతా నిరర్ధకం అనిపిస్తుంది. వొక తలపు మనల్ని తొలుస్తున్నప్పుడు మొత్తం సమయమంతా ఆ వొక్క భావనకే వుండాలనిపిస్తుంది. ఆ వొక్క మనిషే ప్రపంచం అనిపిస్తుంది. జీవన సార్ధకత అక్కడే వుందనిపిస్తుంది.

నాకు అప్పుడప్పుడు సిటీల్లో అమ్మాయిలు అబ్బాయిలు యెక్కడ మాటాడుకొంటారు అనే సందేహం వస్తుంటుంది. వుదయం లేచిన దగ్గర నుంచి అనేక పరుగుల జీవితంలో కాసింత సమయం చిక్కించుకొని పార్క్స్ లో, షాపింగ్ మాల్స్ లో, మల్టీప్లెక్స్ ల్లో, రెస్టారెంట్స్ లో, గుడి దగ్గరో, యిరుకు సందుల్లో, రద్దీ కూడల్లో నిలబడో, ఐస్ క్రీమ్ తింటునో, కాఫీ తాగుతునో, సినిమా చూస్తూనో కాసిన్ని మాటలు చూపులు కలబోసుకుంటూ అనేక స్వప్నాల్ని నిజం చేసుకొనే రోజు కోసం చూస్తుంటారు. ఆ సమయంలో వారిని అనేక కళ్ళు నిశ్శబ్ధంగా గమనిస్తుంటాయి. యీ అమ్మాయిలు అబ్బాయిలపై వారివారి మానసిక స్థితిగతులకు అనుగుణంగా వారివారి మనస్సుల్లో అభిప్రాయాలని యేర్పర్చుకుంటారు. అవకాశం కల్పించుకొని యెక్కడో చోట కాలమెలా మారిపోయిందోనని వ్యాఖానిస్తారు కూడా. యెవరికి తోచింది వారు మాటాడేసుకుంటారు. పట్టించుకోదు అనుకుంటారు కానీ నగరపు యిరుగుపొరుగు తమతమ పొరుగువారిని చాల పట్టించుకొంటుంది. మనుష్యులు తెలియని నగరప్రవాహంలో యీదుకొంటూ వెళుతున్నప్పుడు సహసమాజం చూపు పక్క వాళ్ళపై వుంటుంది కాని యిక్కడ ముఖం పైనే వ్యాఖ్యానించరు యెవరో తెలియనితనం వల్ల. అదే చిన్ని వూర్లలో అయితే యెవరుయెవరి పిల్లలో తెలియటంతో వెంటనే మాటాడతారు. రకరకాలుగా యీ అమ్మాయిల అబ్బాయిల ప్రేమ గురించి మాటాడుకొంటారు. యిలా కలుసుకొనే స్థలాలు చాల తక్కువ వుంటాయి.

రవ్వంత తీరిక కాసింత యేకాంతం మాత్రమే సరిపోదు మన ప్రేమలు పంచుకోడానికి. టెక్నాలజి చాల ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. యెక్కడికైనా వెళ్ళగానే వైఫై వుందా లేదా అన్నది ముందు చూసుకుంటున్నాం కదా. ఫోన్ కి నిరంతరం ఫుడ్ పెడుతునే వుంటున్నాం. స్మార్ట్ ఫోన్, అనేక రకాల యాప్స్ లేకపోతే మన ప్రేమల వ్యక్తీకరణ భలే చిన్నబోతోంది. మొత్తానికి ప్రేమ మొగలిరేకుల్లో పొదిగే అక్షరాల సుగంధం మాత్రమే కాదు యింటర్నెట్ కనెక్టివిటి విన్యాసం కూడా.

యెన్ని సాధనాలు వున్నా, యెంత రద్దీ రోడ్లే కానీ, లేదా తామిద్దరే వున్న పూలతోటే కాని, వొకరినొకరు చూడగానే యిద్దరి కళ్ళలో వొక్కసారే చమక్కుమనే మెరుపుని చూడటంలో వున్న మ్యాజిక్కే వేరు. ఆ కిక్కే వేరు :-)